home
Shri Datta Swami

 12 Jan 2025

 

ధర్మజిజ్ఞాస - బ్రహ్మజిజ్ఞాస

Updated with Part-2 on 13 Jan 2025


Part-1   Part-2


Part-1

[16.3.2000 ఉదయం 6 గంటల 20 నిమిషములకు] ధర్మజిజ్ఞాస లేనిదే బ్రహ్మజిజ్ఞాస లేదు. ధర్మము పునాది. బ్రహ్మము ఇంటి కప్పు. ఈ రెండింటిని కలుపు నాలుగు గోడలే నాలుగు వేదములుగా నున్న జ్ఞానము. పునాది, గోడలు, కప్పు – ఈ మూడును ఒకే ద్రవ్యముతో నిర్మించినట్లు యీ మూడింటిలోను ఒకే భగవత్తత్త్వమున్నది.

యజ్ఞోపవీతము, ఉపనయనము, గాయత్రీ మంత్రానుష్ఠానము, వేదాధ్యయనము లేకున్నను బ్రాహ్మణత్వము నిలుచును అను సత్యమును నిరూపించుటకే బ్రాహ్మణులు నా ఆదేశము వలన, తమ కులమున నున్న స్త్రీలకు వీటిని త్యజింపచేసినారు. ‘పురాకల్పే తు నారీణాం మౌంజీ బంధనమిష్యతే’ అను వాక్యప్రకారముగా పూర్వయుగములలో బ్రాహ్మణ స్త్రీలకును ఉపనయనమున్నది. కానీ ఆ యుగములో ఇతర వర్ణముల వారు, సత్యమును తెలిసియున్నారు. బ్రాహ్మణులు వారిని రెచ్చగొట్టలేదు. కానీ కలియుగమున, బ్రాహ్మణులు ఇతర వర్ణముల వారిని రెచ్చగొట్టినారు. ఉపనయనాదులే బ్రాహ్మణత్వమునకు కారణములని చెప్పి, ‘అవి మీకు లేవు కావున మీరు మా కన్న తక్కువ వారు, మీకు వాటి యందు అధికారము లేదు’ అన్నారు. ఈ వజ్రము మాది, మీకు భాగము లేదన్నచో ఎవనికైనను ఈర్ష్యాద్వేషములు రాక మానవు. ఇదే బ్రాహ్మణ ద్వేషమునకు కారణము. ఇట్టి దానిని తొలగించుటకు బ్రాహ్మణస్త్రీలకు వాటిని లేకుండా చేసి వారికిని బ్రాహ్మణత్వము ఎట్లు కలదో, అట్లే మీకును, మాంసమద్యాది (meat, alcohol etc.) త్యాగము వలన, జ్ఞానము వలన బ్రాహ్మణత్వము సిద్ధించగలదు అని బోధించినాను. దీనితో శాంతి వచ్చినది. ఇది కలియుగారంభమున బ్రాహ్మణ పూర్వులు చేసినది. కానీ తరువాత, మధ్యకాల బ్రాహ్మణులు మరల మొదటి వాదమునకే వచ్చిరి. దీనితో మరల బ్రహ్మణ ద్వేషము (hatred) ఆరంభమైనది. సోదరులైనవారు అన్యోన్య ద్వేషముతో నున్నచో తండ్రి ఎట్లు ఊరకుండును? సత్యమును వివరించవలదా?

రజస్వల కాక ముందు చేసెడి వివాహము వలన కన్యకు చండాలత్వము రాదు అను ఒక వాదమున్నది. అదియును అజ్ఞాన జనితమే. పై దోషములన్నియును అక్కడ అంటుచునే ఉన్నవి.

Swami

ఇక ముస్లింమతము వారును, హిందూమతములోని ఆర్యసమాజ, బ్రహ్మసమాజ మతములవారు భగవంతుని నిరాకారముగనే (formless) భావింతురు. సాకారమును (formfull) అంగీకరించరు. ఆర్యసమాజస్థులు ‘న తస్య ప్రతిమా అస్తి’ అను శ్రుతిని ప్రమాణముగ చెప్పుదురు. ఇచ్చట ప్రతిమ అనగా విగ్రహము కాదు. భగవంతుని సమానమైనది లేదు అనియే అర్థము. ‘న తత్సమశ్చాభ్యధికశ్చ వర్తతే’ అని ఇదే విషయము మరియొక శ్రుతిలో చెప్పబడినది గదా. ‘ఆత్మా వివృణుతే తనూం స్వామ్’ అను శ్రుతిలో, భగవంతుడు తన తనువును చూపించును అని చెప్పబడినది. దీని అర్థము ప్రకారముగా ఆయన సాకారమనియే తేలుచున్నది. సాకారుడైనవాడు అనాది–అనంత విశ్వమును ఎట్లు వ్యాపించగలడు? అను సంశయము వలదు. నిరాకారుడై, విశ్వమును వ్యాపించినాడు అనుటలో భగవంతుని సామర్థ్యము బుద్ధికి తర్కమునకు అందుచున్నది. నిరాకారమైన ఆకాశము (ఖాళీస్థలము) ఎట్లు సర్వ జగత్తును వ్యాపించినదో అట్లే భగవంతుడును నిరాకారుడై సర్వజగత్తును వ్యాపించియున్నాడు అనుటలో భగవంతుని ఈ కర్మ తర్కమునకు లొంగియున్నది. కానీ భగవంతుడు తర్కాతీతుడు ‘నైషా తర్కేణ మతిరాపనేయా’, ‘న మేధయా న బహునా శ్రుతేన’ మొదలగు శ్రుతులు భగవంతుని క్రియలన్నియును తర్కాతీతములనియు (beyond logic), ఆయన తత్త్వము అందదని ఘోషించుచున్నవి. కావున మీరు భగవంతుని యొక్క జగద్వ్యాపకత్వమును (all pervading) ఇట్లు తర్కమునకు లొంగతీసినచో, ఆ శ్రుతులకు భంగము కలుగును.

 

Part-2

కావున భగవంతుడు మనవలె పరిమితాకారుడుగా ఉండి, సర్వజగత్తును వ్యాపించినాడని సిద్ధాంతము చేసినచో మిగిలిన శ్రుతులకు భంగము కలుగదు. కాని, ఇంత చిన్నవాడు, ఇంత పెద్ద జగత్తును ఎట్లు వ్యాపించినాడు? అనుటలో అది తర్కమునకు (కార్యకారణ వాదమునకు) అందదు. అప్పుడు భగవంతుడు తర్కాతీతుడు అను ఇతర శ్రుతులు సార్థకములగును. మరియును ‘పరిపశ్యన్తి’, ‘అపరోక్షాద్ర్బహ్మ’ మొదలగు శ్రుతులు భగవంతుని కన్నులతో చూడవచ్చునని తెలుపుచున్నవి. నిరాకారుడైనచో కన్నులకు కనపడడు కదా. అయితే, నిరాకారత్వమును మేము ఖండించి, నిరాకారోపాసకులకు బాధ కలిగించుటలేదు. భగవంతుడు సాకారుడుగ ఉండియును, నిరాకారునిగ ఉండుట–మరల భగవంతుని తర్కాతీత స్థితిని ప్రతిపాదించుచున్నది.

భగవంతుడు అవతరించుట కూడ ఆర్యసమాజ–బ్రహ్మసమాజముల వారు అంగీకరించుట లేదు. దీనికి నా ప్రశ్న ఇది–‘భగవంతుడు సర్వశక్తులు కలవాడని మీరు చెప్పుచున్నారు. ఇదే నిజమైనచో ఆయన అవతరించగల శక్తి కలవాడా? కాడా? శక్తి లేదన్నచో సర్వశక్తిమంతుడు కాడు. ఇది మీ వాదనకు భంగము. అంగీకరించినచో ఆయనకు ఆ శక్తి ఉన్నది కావున అవతరించినాడు. అవతరించుటకు అవసరమున్నది. ఆ అవసరము ఏమి?

భగవంతుడు అవతరించుటకు అనేక అవసరములు ఉన్నవి. లోకంలో ధర్మస్థాపన చేయుట, అధర్మమును ఖండించుట, సత్యమైన జ్ఞానమును ప్రచారము చేయుట, అసత్యములను ఆకర్షణీయములును అగు అజ్ఞానమతములను వాదములతో రూపుమాపుట, తన భక్తులతో సంభాషించి వారి సంశయములను తీర్చుట మొదలగు ఎన్నో అవసరములున్నవి. కావున భగవంతుడు అవతరించుచున్నాడు. ఇవి అన్నియును తన సంకల్పము మాత్రముననే చేయవచ్చును కదా అన్నచో-నిజమే. కానీ భక్తులకు కన్నులకు కనపడు అవకాశము, సంతృప్తి, ఆనందము రావు కదా. కావున తన భక్తులకు తన సందర్శన భాగ్యమును కలిగించుటకై భగవంతుడు అవతరించుచున్నాడు. భక్తుల కోరికను నిరాకరించుట అనుచితము. అవసరమున్నది. అవతరించు శక్తియున్నది. కావున అవతరించినాడు. ఇందులో మీరు ఎందులకు పట్టుదల పట్టుచున్నారో నాకు తెలియుట లేదు. మీ పట్టుదలకు కారణము మీ మెండితనము. మీరు చెప్పినదే సత్యము కావలయునన్న అహంకార మదమే మెండితనమునకు కారణము. దానిని తొలగించి, విచారము చేసినచో సత్యము బోధపడును. శాంతితో విచారము చేసినచో కాని సత్యము బోధపడదు. శమదమాది సాధన గుణసంపత్తి లేనిదే బ్రహ్మజ్ఞానమునకు అధికారము లేదు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch