home
Shri Datta Swami

 18 Feb 2025

 

స్వామి దివ్యదర్శనము కలిగితే మనకు మోక్షము కలిగినట్లేనా?

[అర్జునుడు ఏకలవ్యుని చూచి అసూయ చెందినాడు అట్టివానికి విశ్వరూపమును చూపి స్వామి ముక్తి నొసగినాడు. ఇది స్వామికి తగునా?]

స్వామి సమాధానము: స్వామి అర్జునుడికి విశ్వరూపమును చూపుటయే ముక్తి అని నీకు నీవే నిర్ణయించినావు. విశ్వరూపమును ధృతరాష్ట్రునికి కూడా చూపినాడు. కానీ ధృతరాష్ట్రుడు ముక్తుడైనాడా? స్వామి యొక్క దర్శనము చేత కానీ, స్పర్శనము చేతగానీ, సహవాసము చేతగానీ, సంభాషణము చేతగానీ ముక్తి లభించదు. ఆయన యొక్క అనుగ్రహము చేతనే ముక్తి లభించును. రావణుడు శివుని దర్శించెను. కానీ శివాగ్రహమునకు గురియై పుత్ర, కళత్ర, మిత్ర సమేతముగా అకాల మరణము నొందినాడు. రాముడు శివుని దర్శించలేదు. కానీ శివానుగ్రహమును పొంది విజయమును చేకొన్నాడు. అర్జునుడు మరల తిన్నడుగా జన్మించి సర్వార్పణము చేసి ముక్తుడైనాడే తప్ప ఆ జన్మలో ముక్తుడు కాలేదు. బోయవాడగు ఏకలవ్యుని చూసి అసూయపడినాడు కావుననే అర్జునుడు మరల బోయవానిగనే పుట్టెను. ఎవడిని తక్కువ జాతివాడని చులకనగా చూచినాడో అతడు అదే తక్కువ జాతిలో పుట్టినాడు.

అందుకే, ‘నీవు ఏది విత్తుదువో అది కోసుకుందువు’ అని చెప్పినారు. ఏకలవ్యుని ఆచారములను చూసి అర్జునుడు చీదరించుకొన్నాడు. కాని తాను తిన్నడుగా జన్మించినప్పుడు ఆ హీనమైన ఆచారముల ద్వారానే భగవత్ర్పీతిని గావించినాడు. పచ్చిమాంసమును నివేదించి, శివునిచేత కైవల్యమును ఇప్పించుకొనకలిగినాడు. కావున విశ్వరూప దర్శనము చేత అర్జునుడు ముక్తుడైనాడనుట నీ భ్రమ. క్షత్రియుడైన అర్జునుడు బోయవాడుగా జన్మించుట ముక్తి కాదు కదా కనీసము పుణ్యఫలము కూడా కాదు. విశ్వరూప దర్శనము చేత పార్థుని యొక్క కర్మఫలము మారలేదు. కావున భగవంతుని నిజరూపదర్శనము ముక్తి అనుకొనుట వెర్రితనము. అట్లే స్పర్శనము కూడా ముక్తి కాదు. కప్ప గంగాజలముతో నిత్య స్పర్శనము కలిగియుండును. కానీ ప్రయోజనమేమి? యాదవులందరూ కృష్ణుని బంధువులే. నిత్యము దర్శన, స్పర్శన, సహవాస సంభాషణములను పొందియున్నవారే. బృందావనము నుండి ద్వారకకు తరలివచ్చి నిత్యమూ స్వామితో కలసియున్నవారే. కానీ మద్యపానము చేయవలదని స్వామి యొక్క ఆజ్ఞను తిరస్కరించి మద్యపానము చేసి అంతమైనారు. రాధ బృందావనములోనే యుండి దర్శన, స్పర్శన, సహవాస, సంభాషణములను జీవితాంతము కోల్పోయినది. కానీ స్వామి సృష్టించిన ‘గోలోకమునకు’ రాణియైనది.

Swami

ఇంతకూ స్వామి విశ్వరూపమున చూపినదేమి? ‘దివి సూర్య సహస్రస్య’ అను గీతా శ్లోకము ప్రకారముగా అనేక సూర్యుల తేజస్సును చూపినాడు. తేజస్సు పంచభూతములలో ఒకటియగు అగ్నియనబడు భూతమే. అది సృష్టియే. సృష్టికర్త కాదు. మామూలుగా ఒక సూర్యుని తేజస్సును చూచుచున్నావు. దాని బదులు స్వామి ఇచ్చిన శక్తిచేత అనగా దివ్యనేత్రముల చేత వేయి సూర్యుల తేజస్సును చూచినావు. ఇంత మాత్రమున ఒరిగినదేమి? ఇంటిలో దీపమును నీ కన్నులతో చూసినావు. బయిటకు పోయి ఎండాకాలములో మింట మండుచున్న సూర్యుని నల్ల కళ్ళద్దములు కన్నులకు పెట్టి చూచినావు. కళ్ళు దెబ్బతినకుండా సూర్యుని చూడగలుగునట్లు చేసిన ఈ నల్ల కళ్ళజోడే ‘దివ్యదృష్టి’. దివ్యదృష్టి అనగా నేత్రములు దెబ్బ తినకుండా స్వామి యొక్క సహస్ర సూర్యతేజస్సును చూడగలిన స్వామి దయాదత్తమైన శక్తియే. కావున ఇంటిలోని దీప తేజస్సుకు బయట మండుచున్న సూర్యతేజస్సుకు తత్త్వములో ఎట్టి తేడానూ లేదు. రెండూ సృష్టిలోని భాగములే. రెండూ సృష్టించబడిన తేజస్సులే కానీ సృష్టికర్త కాదు.

సృష్టికర్తను ఈ నేత్రములతో కాదు, కనీసము మనస్సుతో కూడా చూడలేము. చివరకు బుద్ధితో కూడా ఆయన యొక్క నిజతత్త్వమును ఊహించలేము. కావున అర్జునుడు విశ్వరూపమును చూచినంత మాత్రమున ఒరిగినది ఏమియునూ లేదు. సృష్టిలోని భాగమగు జీవుడు సృష్టిలోని మరియొక భాగమును చూడగలడే కానీ సృష్టికి అతీతమైన దానిని ఎట్లు చూడగలడు? రావణుడు శివుని దర్శించినప్పుడు కూడా ఆ శివస్వరూపము కూడా ఒక తేజోరూపమే. తేజస్సు యొక్క దర్శనము చేత ముక్తి లభించదు. ఆ తేజోరూపమునందు లీనమై ఆ తేజోరూపము నఖశిఖపర్యంతము వ్యాపించియున్న దత్తుని నీవు చూడలేకపోయిననూ ఆ తేజోరూప దర్శనము దత్తదర్శనమే. కానీ దర్శనము వలన ముక్తి రాదు. యుద్ధము చేయునప్పుడు రాముని అనేక రాక్షసులు ప్రత్యక్షముగా చూచినారు. అట్లే కృష్ణుని కౌరవులు చూచినారు. దర్శనమే మోక్షకరమైనచో వారు ముక్తులు కావలసినదే కదా! అంధుడగు సూరదాసు కృష్ణుని చూడలేదు. కానీ కృష్ణానుగ్రహము చేత ముక్తుడైనాడు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch