home
Shri Datta Swami

 19 Mar 2025

 

శ్రీదత్తుడు పరబ్రహ్మయా? దేవతయా? మహర్షియా?

శ్రీదత్తభగవానుడు పరబ్రహ్మమని చెప్పినపుడు ఆ మాట నోటితో చెప్పుటకు, చెవులతో వినుటకు మాత్రమే పనికి వచ్చును. ఏలననగా పరబ్రహ్మము ఊహించుటకు సైతము వీలు కానిది. కావున ‘దత్తుడు బ్రహ్మము’ అను వాక్యమునకు అర్థము దత్తుడు ఊహకు అందడనియే, మరి ఊహకు అందని దత్తుడు అత్రి మహర్షి యొక్క కన్నులకు ఎట్లు గోచరించినాడు? దేవతలు కాని, ఋషులు కాని పరబ్రహ్మమును తర్కించుటకు సైతము చేతకాని వారు గదా. అయితే "దేవతలును ఋషులును యుగ యుగముల కాలము తర్కించి, తర్కించి ఆయనను గురించి ఒక్క విషయమును మాత్రమే తెలుసుకున్నారు" అన్నాడు యమధర్మరాజు నచికేతునితో. అప్పుడు నచికేతసుడు ఎంతో ఆశతో "అమ్మయ్యా! కనీసము కొంతయైనను తెలుసుకున్నారు గదా అది ఏమిటి? వెంటనే నాకు తెలియచేయమ”ని ఎంతో ఉత్సాహముతో అడిగినాడు యమధర్మరాజును.

అప్పుడు యమధర్మరాజు "యస్యామతం తస్య మతమ్" అన్నాడు. అనగా "ఆయనను గురించి ఏమియు తెలుసుకొనలేము అను ఒక్క విషయమును మాత్రము తెలుసుకున్నాము" అని అర్థము. కావున పరబ్రహ్మము కన్ను మొదలగు ఇంద్రియములకు గాని, వాక్కునకు గాని, మనస్సునకు గాని, బుద్ధికి గాని, తర్కమునకు గాని, ఎట్టి ఊహలకు గాని అందడు అని వేద మంత్రములు ఘోషించుచున్నవి. "న చక్షుషా, యతో వాచః, అప్రాప్య మనసా సః, న మేధయా, నైషా తర్కేణ" ఇత్యాది శ్రుతుల అంతరార్థమిదియే. భగవద్గీతలో కూడ "మాం తు వేద న కశ్చన" అనగా నిర్గుణపరబ్రహ్మమైన నన్ను ఎవరు తెలియజాలరు అని అర్థము. నిర్గుణము అనగా సృష్టికి అతీతమైనది. గుణము అనగా సృష్టి. గుణము గుణిపై ఆధారపడియుండును. ఉదాహరణకు ‘నీలి కలువ’ అన్నారు. కలువ ద్రవ్యము అనబడు గుణి. నీలిరంగు గుణము. నీలిరంగుతో కూడిన కలువ సగుణమైన ద్రవ్యము. అట్లే జగత్తుతో కూడిన బ్రహ్మము సగుణ బ్రహ్మము. నీలిరంగును వదలిన కలువ నిర్గుణ ద్రవ్యము.

అట్లే ఈ సృష్టి ప్రారంభించక ముందు ఉన్న బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము. అయితే అత్రి చూచినది ఈ నిర్గుణ బ్రహ్మమునా? కానే కాదు. ఊహకు కూడా అందని నిర్గుణ బ్రహ్మము నేత్రములకు ఎట్లు గోచరించును? ఐతే అత్రి చూచినది ఏమిటి? ఒక దివ్య శరీరము అను గుణమును దర్శించిన సగుణ బ్రహ్మము అత్రికి గోచరించినది. ఇదియే దేవతా స్వరూపము. దేవ శబ్దమునకు అర్థము ప్రకాశించు తేజస్సు అని. దేవతలందరును తేజోరూపము కలవారు. కావున అత్రి నేత్రములకు నిర్గుణ బ్రహ్మము ఒక తేజో రూపము ద్వారా దత్తమైనది. కావున దత్తుడనబడుచున్నాడు. ఐతే ఆ తేజోరూపమున ఆపాదమస్తకమును నిర్గుణ పరబ్రహ్మము వ్యాపించియుండును.

Swami

ఒక తీగె యొక్క మొదలును చివర లోపల వెలుపల అంతయును ఎట్లు విద్యుత్తు వ్యాపించి యుండునో, అట్లే ఆ దేవతా రూపమంతయును నిర్గుణ పరబ్రహ్మము వ్యాపించి యుండును. దీనినే శ్రుతి “అంతర్బహిశ్చ తత్సర్వమ్” అని చెప్పుచున్నది. కావున అదే దేవతా రూపమునకు నిర్గుణ పరబ్రహ్మమునకు ఎట్టి భేదము లేదు. ఇదే అద్వైతము. ఈ దేవతా స్వరూపము కూడా అవతారమే. ఏలనన సృష్టికి అతీతమైన బ్రహ్మము, సృష్టి లోనికి వచ్చి, సృష్టిలో నున్న ఒక భూతముతో (తేజస్సు) ఏకీభవించి దర్శనమిచ్చినది. ఇంత కన్న వేరు మార్గము లేదు.

సృష్టి యొక్క మొట్టమొదటి తత్త్వమే ఆకాశము. ఆకాశము యొక్క ధర్మము పరిమాణము. ఇది పొడవు, వెడల్పు, ఎత్తు అని మూడు దిశలతో కూడియున్నది. జీవుని మేధాశక్తి ఈ ఆకాశ ధర్మమగు పరిమాణము దాటిపోలేదు. అయితే అసలు బ్రహ్మమును అత్రి చూడలేదని అనుమానించ వలదు. అద్వైతము వలన అత్రి చూచిన ఆ తేజోమయమైన దేవతా స్వరూపము నూటికి నూరుపాళ్ళు అసలు బ్రహ్మమే. ఆ తరువాత ఆ తేజోరూపము వారి ప్రార్థన వలన అనసూయా గర్భములోనికి ప్రవేశించి అచట ఉన్న పంచభూతమయమైన మరియొక రూపము ఆక్రమించినది. మరల ఆ పంచభూతమయమైన శరీరమునకు ఆ తేజోమయ రూపమునకు అద్వైతమే.

ఒక తీగె లోనికి విద్యుత్తు వ్యాపించినది. ఆ విద్యుత్తు తీగెను మరియొక ఇనుప గొట్టములో ఉంచినాము. ఇప్పుడు ఈ ఇనుప గొట్టము అంతయును విద్యుత్తు వ్యాపించినది. నిర్గుణ బ్రహ్మము (కరెంటు) యొక్క "అనూహ్య తత్త్వము" అను ధర్మము (షాక్‌ కొట్టుట) దేవతా రూపము (తీగె) లోను, పంచభూత శరీరము (గొట్టము) లోను కనబడుతుంది. ఆ ధర్మము వల్లనే దేవతరూపము పంచభూత శరీరము ద్వారా మహిమలను చేయుచున్నది. అనసూయా మాత పాలిచ్చి, లాలించి, ముద్దాడి పెంచుటకు తేజోమయ శరీరము కుదరదు. తేజోరూపము దర్శన, సంభాషణల వరకే పరిమితము. వాక్కు కూడ శక్తి రూపమే కావున, తేజో రూపమే కావున సంభాషించును. కాని ఆలింగనాది స్పర్శకు, ముద్దాడుటకు తేజోరూపము వీలుకాదు. కావున దర్శన, సంభాషణములకు అందివచ్చిన తేజోరూపమైన ఆ దేవతారూపము దత్త పరబ్రహ్మమే; పోషించి, లాలించి, పెంచుటకు అందివచ్చిన ఈ భౌతికస్వరూపము కూడ దత్త పరబ్రహ్మమే. ఇనుప తీగెయు, ఇనుప గొట్టము రెండూ కరెంటే. ఈ పంచభూత శరీరమైన దత్తుడు ఒక మహర్షి. కావున దత్తుడు పరబ్రహ్మము, దేవతయు, మహర్షియు అయి యున్నాడు.

దత్తుడు త్రిమూర్తుల యొక్క అంశయనియు, దత్తుడు త్రేతాయుగమున మొట్టమొదట గోచరించినాడు కావున సృష్టికి ముందున్న ఆదిదేవుడు కాడనియు కొందరు బాలురు భావించుచున్నారు. త్రిమూర్తుల యొక్క అంశయే దత్తుడు, దత్తుడు ఆదిదేవుడు కాదనుట సరి కానే కాదు. త్రిమూర్తులు దత్తుని వేషములే. బ్రహ్మదేవుడే ఆదిదేవుడనియు, ఆయన ప్రత్యేకముగా ఉన్నాడనుకొనుట కూడా సరికాదు. బ్రహ్మదేవునకు కేవలము సృష్టి అధికారము మాత్రమే యున్నది. స్థితి, లయాధికారములు లేవు. ఏలననగా ఆయనతో సమానులైన స్థితిలయాధికారులగు విష్ణువు, శివుడు వేరే యున్నారు. కాని వేదము ఏమి చెప్పుచున్నది? సృష్టి, స్థితి, లయాధికారములు గల ఒకే ఒక స్వరూపమే బ్రహము. కావున త్రిముఖములతో ఈ మూడు పనులను చేయు ఒకే స్వరూపమైన దత్తుడే పరబ్రహ్మము అని నిరూపించబడినది గదా. సృష్టికి ముందే పరబ్రహ్మము ఉండితీరవలయును. మబ్బు బాగా పట్టిన ఒకరోజు మధ్యాహ్నము సూర్యుడు కనపడినాడు. అంతమాత్రమున ఆ రోజు ఉదయమున తూర్పుదిక్కునందు సూర్యుడు లేడా? కావున సృష్టికి ముందే ఉన్న దత్త పరబ్రహ్మము కృతయుగ మంతయు తపస్సు చేసి అర్హత సంపాదించిన ఋషులకు త్రేతాయుగమున దర్శనము నిచ్చినది. ఇదే రహస్యము.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch