19 Feb 2025
స్వామి సమాధానము: లోకములో కర్మఫలములను అనుభవించుచున్న జీవులను చూసినప్పుడు మనకు వారిపై ఎంతో సానుభూతి కలుగును. ఏలననగా వాని కర్మఫలానుభవమును చూచుచున్నామే గానీ వాడు వెనుక చేసిన కర్మలను చూడలేదు. ఒక హంతకుని ఉరితీయుట చూసినప్పుడు దీనముగా ఏడ్చుచున్న వానిని చూసి జాలిపడుదుము. ఆ ఉరిశిక్ష వేయు అధికారులు కఠినులని భావించి నిందించుదుము. కారణము ఆ హంతకుడు చేసిన అనేక దారుణహత్యలను మనము కన్నులతో చూడలేదు. ఈ లోకములో కష్టములను పడుచున్న జీవులను చూచి సానుభూతితో భగవంతుని కూడా దయాహీనుడిగా భావించి నిందించుచున్నవారు కలరు. కారణము వారి కష్టములను చూచుచున్నామే కానీ ఈ కష్టములకు కారణములైన వారు చేసిన పూర్వకర్మలను చూడకపోవుటయే. కానీ సర్వసాక్షియగు స్వామిదృష్టికి వాని పూర్వకర్మలు కూడా కనపడుచుండును. కావున స్వామి వారిపై ఎట్టి సానుభూతిని చూపడు. పైగా నీ కన్నను స్వామి ఎంతో దయామయుడు. వాడు 99 హత్యలు చేసిననూ ఓర్పుతో క్షమించి వాడిని దిద్దుటకు స్వామి ఎంతో ప్రయత్నించినాడు. వాటినన్నింటినీ నీవు చూసినచో వాడు చేసిన మొదటి హత్యకే నీవు ఉరిశిక్ష వేయుదువు. శిశుపాలుడు 99 తిట్లు తిట్టిననూ స్వామి సహించి ఊరకుండుటలో అంతరార్థమిదే.
ఏకలవ్యుడు పూర్వజన్మలో ఒక రాక్షసుడు. వాడు బ్రాహ్మణ వేషములో ఇంటింటికీ తిరిగి భిక్షలను అందుకొనెడివాడు. భోజనము చేయునప్పుడు చిట్టచివరిలో పెరుగు అన్నము తినునప్పుడు వాడు తన రాక్షసరూపమును ధరించెడివాడు. పెరుగును వడ్డించుచున్న ఆ గృహిణి బొటనవేలును తన వ్రేళ్ళతో తుంచెడివాడు. ఇది భలే ఊరగాయ ముక్క అని పెరుగు అన్నములో నంచుకుని తినెడివాడు. ఆ తరువాత ఆ గృహిణిని తన గోళ్ళతో చీల్చి రక్తమాంసములను భుజించెడివాడు. దుర్యోధనుడు కూడా ఒక మహారాక్షసుని అవతారమే. కావుననే చివర భారతయుద్ధములో ఏకలవ్యుడు తన సేనతో దుర్యోధనునితో చేరి యుద్ధము చేసినాడు. కావున స్వామియగు కృష్ణుని యొక్క ప్రేరణ చేతనే ద్రోణుడు ఆ పనిని చేసినాడు. అది చేయకున్నచో వానిని ఓడించుట అసాధ్యము. అట్లే కర్ణుడును రాక్షసుని అవతారమే. కావుననే స్వామి ఇంద్రుని ప్రేరేపించి కవచకుండలములను హరింపచేసినాడు. ఇది అంతయు భూత భవిష్యత్ వర్తమానములను తెలిసిన స్వామి యొక్క సంకల్పమేనని మనము గ్రహించవలెను.
పరిమితదృష్టి, అవివేకముతో కూడిన జ్ఞానము కలవారు ధర్మాధర్మములను నిర్ణయించుటలో సమర్థులు కారు. వారు చేయు విమర్శలు పరిమితమైన మిడిమిడి జ్ఞానముతో కూడినవి. వీరికి వర్తమానము తెలియదు. భూత, భవిష్యత్ కాలములు తెలియవు. కావున త్రికాలజ్ఞుడగు స్వామి చేసిన నిర్ణయమే ధర్మము.
★ ★ ★ ★ ★