home
Shri Datta Swami

 11 Mar 2025

 

జీవుడు మరియు నాలుగు అంతఃకరణములు

Updated with Part-2 on 12 March 2025


Part-1   Part-2 


Part-1

[11-02-2003] ‘ఆత్మానం రథినం విద్ధి’, ‘శరీరం రథమేవ చ’, ‘బుద్ధిం తు సారథిం విద్ధి’, ‘మనః ప్రగ్రహమేవ చ’, ‘ఇంద్రియాణి హయా నాహుః’ అనగా జీవుడు రథముపై కూర్చున్న యజమాని. శరీరము రథము. బుద్ధి సారథి. మనస్సు పగ్గములు. ఇంద్రియములు గుర్రములు. ఇందులో బుద్ధి సారథిగా ఉన్నది. ‘నిశ్చయాత్మికా బుద్ధిః’ అన్నారు. అనగా ఒక విషయమును నిర్ణయము చేయునది బుద్ధి. ‘సంకల్ప, వికల్పాత్మకం మనః’ అన్నారు. అనగా ఒక విషయమును ఒక విధముగా భావించి, దానిని కాలాంతరమున మరియొక విధముగా భావించునది మనస్సు. మనస్సు చేత తనలో చర్చ జరుగును. ఆ చర్చ సాయముతో బుద్ధి ఒక నిర్ణయమునకు వచ్చును. ఆ నిర్ణయమును అనుసరించి మనస్సు తుది సంకల్పమును చేయును. ఈ తుది సంకల్పమే రాజశాసనము వంటిది. దీనిని అనుసరించి ఇంద్రియములు అను గుర్రములు కదులును.

బుద్ధికి, ఇంద్రియములకు అనుసంధానము చేయునదే మనస్సు. కావున బుద్ధి యొక్క తుది సంకల్పము అను పగ్గమును అనుసరించి ఇంద్రియములు ప్రవర్తించును. ఈ ఇంద్రియముల ప్రవర్తనను అనుసరించి శరీరము అను రథము చలించును. ఈ చలనమే కర్మ అని అందురు. ఇంకనూ స్పష్టముగా చెప్పవలయునన్నచో ఈ కర్మను శారీరక కర్మయందురు. ఈ మొత్తము స్వరూపమును త్రికరణములుగా కూడా విభజించినారు. త్రికరణములు అనగా మనస్సు, వాక్కు, శరీరము. ఇచ్చట మనస్సు క్రిందకి బుద్ధి కూడా చేరిపోవుచున్నది. ఏలననగా మనస్సు, బుద్ధి, నాలుగు అంతఃకరణములలోనివి. ఈ అంతఃకరణములు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ అహంకారమునే ‘జీవుడు’ లేక ‘ఆత్మ’యందురు.

కావున మనస్సు పరిధిలోనికే ఆత్మ, బుద్ధి కూడా చేరుచున్నవి. ఈ మూడును చైతన్యము చేత నిర్మించబడినవి. ఈ చైతన్యమే చిత్తము. చిత్తము ఒక విషయమును గుర్తుకు తెచ్చుచున్నది. కావుననే ‘చితీ – స్మరణే చ’ అన్నారు. కావున చైతన్యము విషయములను ధారణచేయుట చేత ‘చిత్తము’ అనబడుచున్నది. ఇదే చైతన్యము అని చెప్పబడినది. ఒక విషయమును గ్రహించునప్పుడు చైతన్యము అనబడుచున్నది, కావుననే, ‘చితీ – సంజ్ఞానే’ అన్నారు. కావున ఒకే చైతన్యము విషయములను గ్రహించునప్పుడు ‘చైతన్యము’ అనబడి, విషయములను ధారణ చేసి గుర్తుకు తెచ్చినప్పుడు మాత్రము ‘చిత్త’మనబడుచున్నది. చైతన్యమునే ‘చిత్’ అని అనుచున్నారు. ఎట్టి విషయములను గ్రహించక తన్ను తాను గ్రహించు కర్మ చేయునప్పుడు ఆ చైతన్యమే ‘అహంకారము’ అనబడుచున్నది. ఇట్టి చైతన్యమును ‘శుద్ధచైతన్యము’ అందురు. ఇట్టి అహంకారమును ‘సాత్త్వికాహంకారము’ అందురు. సాత్త్వికాహంకారము అనగా సత్త్వగుణము యొక్క అహంకారము.

Swami

సత్త్వము అనగా సారము అని అర్థము. అన్నము యొక్క సారమే సత్త్వము. ఈ సాత్త్వికాహంకారము కేవలము ‘నేను’ అను శుద్ధచైతన్యమునకు మాత్రమే పరిమితమై యుండును కావున దీనిని ‘అస్మత్ప్రత్యయ గోచరము’ అని శంకరులు అన్నారు. ‘అన్నాత్ పురుషః’ అను శ్రుతి అన్నము నుండి జీవుడు సంభవించుచున్నాడని చెప్పుచున్నది. ఇచ్చట జీవుడు అనగా శుద్ధ చైతన్యము. ఈ శుద్ధ చైతన్యము అన్నము యొక్క సారమైయున్నది. అనగా అన్నము యొక్క సత్త్వమై ఉన్నది. కావుననే అన్నము అను కారణము నుండి పుట్టిన కార్యమైయున్నది. మరి ఇట్టి శుద్ధచైతన్య స్వరూపుడగు జీవుని యందు పూర్వకర్మ వాసనలు ఎట్లు ప్రవేశించినవి? వాసనలు అనగా భావ స్వరూపములైన గుణములు. భావము చైతన్యము యొక్క కర్మస్వరూపము. కావున కర్మవాసనలు కూడా చైతన్యము యొక్క స్వరూపమే కదా. అనగా పైలోకము నుండి జీవుడు ధాన్యపుగింజ లోనికి ప్రవేశించి ఆ ధాన్యపుగింజ ద్వారా పురుషుని ద్వారా గర్భస్థ పిండములోనికి జీవుడు ప్రవేశించినాడు అన్నప్పుడు జీవునకు, అన్నమునకు కార్యకారణ సంబంధము పొసగదు.

అనగా నీవు అన్నము తిన్నావు. అన్నము లోనికి బయటి నుండి ఒక క్రిమి ప్రవేశించినది. అన్నము ద్వారా ఆ క్రిమి నీ లోనికి ప్రవేశించినది. ఇచ్చట అన్నము నుండి క్రిమి పుట్టలేదు. క్రిమికిని, అన్నమునకును కార్యకారణ సంబంధము లేదు. ఈ విధముగా జీవుడు పై లోకము నుండి అన్నము ద్వారా పురుషునిలో ప్రవేశించినప్పుడు జీవునకు అన్నము కారణము కాదు. అన్నము కేవలము జీవునకు ఒక వాహనము అగుచున్నది. కావున అన్నము కన్నా భిన్నమైన జీవుడున్నాడా? అను ప్రశ్న వచ్చుచున్నది. మరియొక శృతి ‘పురుషః అన్నరసమయః’ అని చెప్పుచున్నది. అనగా పురుషుడు అన్న రసముతో చేయబడినవాడు అను అర్థమును చెప్పవచ్చును. లేక అన్నరసముతో కూడిన వాడు అని కూడా చెప్పవచ్చును.

 

Part-2

దీని సారాంశమేమనగా అన్నము నుండి జడశక్తి (inert energy) పుట్టి, ఆ జడశక్తి నాడీమండలము (nervous system) లోనికి ప్రవేశించి చైతన్యముగా మారుచున్నది. ఈ చైతన్యము గర్భము లోనికి ప్రవవేశించిన జీవచైతన్యమును బలపరచుచున్నది (strengthening). అనగా, ఈ జీవచైతన్యము గర్భము లోనికి ప్రవేశించుటకు ముందే చైతన్యస్వరూపమై ఉన్నది. అట్టి జీవచైతన్యము కూడా అన్నము నుండి పుట్టినదేయని ‘అన్నాత్ పురుషః’ అను శ్రుతి చెప్పుచున్నది. అట్లు ప్రవేశించిన జీవచైతన్యము అన్నరసమునుండి పుట్టిన చైతన్యముచే పుష్టి చెందుచున్నది. అనగా, ఈ జీవచైతన్యము మొదటిప్రాణి యొక్క నాడీమండలము లోనికి ప్రవేశించిన అన్నజాతమైన (born from food) జడశక్తి పరిణామమైన చైతన్యమే అని సిద్ధించుచున్నది. ఈ ప్రథమప్రాణి శుద్ధచైతన్యము ‘వాసన’లతో మిళితమై క్రమముగా ‘సంస్కారము’లుగా మరియు చివరిదశలో ‘గుణము’లుగా మారుచున్నది. ఈ గుణసముదాయమే జీవుడు. ఈ శుద్ధచైతన్యమే (pure awareness) దాదాపు జడశక్తి వంటి తత్త్వముతో సుమారుగా ఆత్మ శబ్దమునకు దాదాపు అర్థముగా పిలువబడుచున్నది. నిజముగా, వ్యక్తిగతమైన జడశక్తియే (individual inert energy) విశ్వజడశక్తి (inert cosmic energy) అగుచూ ఈ జడశక్తియే ఆత్మ శబ్దమునకు సరియైన అర్థమగుచున్నది. కావున, ఆత్మ సూక్ష్మముగానూ, స్థూలముగానూ స్వీకరించబడుచున్నది. గుణసంఘాతరూపమైన (form of bundle of qualities) జీవుడు మాత్రము సూక్ష్మదశలోనే వ్యక్తిగతముగా పరిగణింపబడుచున్నది. చైతన్యమునకు ఇట్టి సూక్ష్మ-స్థూలదశలలో ఏకత్వముతో ఉండుటకు సాధ్యము కాదు. అయితే, శుద్ధచైతన్యము కూడా కర్తృత్వ (doer), భోక్తృత్వములు (enjoyer) లేకుండా ఉన్నందున జడశక్తితో మిక్కిలి సారూప్యమును పొందుచున్నందున, జడశక్తి నిర్దిష్టమైన ఆత్మశబ్దమునకు శుద్ధచైతన్యము కూడ దాదాపు అర్థమగుచున్నది. ఆత్మశబ్దము వ్యక్తిగా (నరావతారముగా) అవతరించిన పరమాత్మయందునూ వాడబడుచున్నది. ఇట్లు ఆత్మశబ్దము భగవంతుని సూచించుట చేత, ఆత్మనుండి ఆకాశము పుట్టినది అను వేదవాక్యము కూడా భగవంతుని నుండి ఆకాశము సృష్టింపబడినది అను అర్థమును సమన్వయించుచున్నది. చైతన్యము నరశరీరములో వ్యాపించినందున దేహము ఆత్మగా (అతతి ఇతి ఆత్మా) చెప్పబడును. ఇట్టి ఒకానొక నరశరీరమునందు అనూహ్యబ్రహ్మము (unimaginable God) ఆవేశించినందున పరమాత్మ నరశరీర శబ్దార్థమగు ఆత్మగా పిలువబడుచున్నాడు.

క్రైస్తవ, ముస్లిము మతములలో ఒకే గ్రంథము ప్రమాణమై (authority) ఉండగా హిందూమతములో ప్రస్థానత్రయమని మూడు గ్రంథములు ప్రమాణములుగా ఏల ఉన్నవి అని సందేహించరాదు. వేదము లేదా ఉపనిషత్తుల వివరణ గ్రంథమే బ్రహ్మసూత్రములు. వేదము యొక్క సారాంశగ్రంథమే గీత. ఇతర పురాణాది గ్రంథములన్నియూ వేదార్థము యొక్క కథారూపమైన సులభ వ్యాఖ్యానములే కావున హిందూమతములో కూడా ఒకే వేదగ్రంథము మూలప్రమాణమై యున్నది

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch