12 Feb 2025
[10.03.2000 ఉదయము 5 గంటలకు] కాలభైరవుడు స్వామిగా కల కాపాలికమతము చాలా పవిత్రము. దానిలో శవభక్షణము అనగా ఏ ప్రాణియైనను సహజముగా మరణించిన తరువాత తినుట అనునది సాధారణము. సంవత్సరాంతమున మొక్కలు పండి ఎండుచున్నవి. అవి శవములు. వాటిని కోయుట పాపము కాదు. మాంసాహారము దోషము కాదు. ఏ ప్రాణియైనను బలవంతముగా వధింపబడుట దోషము. సహజముగా మరణించిన ప్రాణిలో రోగములుండవచ్చును గదా అన్నచో, వధించిన ప్రాణిలోను అట్టి రోగములు ఉండవచ్చును. ఒక ప్రాణి రోగముతోనే మరణించవలయునను నియమములేదు. సహజ వార్ధకదశలో మరణించవచ్చును. ప్రమాదము వలన మరణించవచ్చును. కాపాలిక మతములో నరభక్షణము కలదు. అయితే నరుని పట్టి వధించుట కాదు. మరణించిన నరులను తిందురు. నరుని శవము మరణానంతరము అగ్నిలోనే దహించబడవలయునను నియమము లేదు. సంన్యాసుల శరీరములను భూస్థాపితములు చేయ క్రిమికీటకాదులు భక్షించుచున్నవి. కొందరు గంగాది పుణ్య తీర్థములలో శవములను నిమజ్జనము చేయుదురు. వాటిని జలచరాది ప్రాణులన్నియును భక్షించుచున్నవి. ఏ విధముగా చేసిననూ శరీరములోని పంచభూతములు పంచభూతములలోనే చేరుచున్నవి. అగ్నిలో దహించబడిన తరువాత ఆ భస్మము నదులలో నిమజ్జనము చేయగా, ఆ జలమును మీనము, ప్రాణులు, వృక్షములతో పాటు త్రాగుచున్నవి. తుంచబడిన ఆకులు, ఫలములు కూడ శవములే. కావున సర్వ ప్రాణులును కాపాలికులే. అందరికినీ గురువు శ్రీ కాలభైరవుడే. అహింసయే కాలభైరవ మతములోని అంతరార్థము. ప్రాణిని చంపి తినువాడు కాపాలికుడు కాడు. ప్రాణిని వధించువాడు కాలభైరవుని చేత తీవ్రముగా దండించబడును.
★ ★ ★ ★ ★