13 Nov 2024
కాలభైరవుని వద్ద, హనుమంతుని వద్ద ఉన్నన్ని సిద్ధులు ఈ సృష్టిలో ఏ జీవుని వద్దను లేవు. కాని ఆ ఇరువురు సర్వదా దత్తుని పాదదాసులై తాము చేయుచున్న మహిమలన్నియును దత్తుడే చేయుచున్నాడనియు, తాము ధరించిన సొమ్ములన్నియు దత్తుడు ఇచ్చినవేయనియు ఎల్లప్పుడు ప్రపత్తిభావముతో చెప్పుదురు. అంతే కాదు, సిద్ధులను సొమ్ములను పొందినంత మాత్రమున ఆయననుండి వేరు చేయలేని ఆయన స్వరూపమును పొందలేమని నిరూపించుచు ఆయన స్వరూపముకన్న భిన్నమైన కుక్క, కోతి రూపములలో ఉన్నారు. కుక్కకు, కోతికి ఎప్పటికి నరరూపము రాదు. అట్లే జీవుడెప్పుడు దేవుడు కాడని, జీవుడు సదా దేవుని దాసుడే యనియు బోధించుచున్నారు. హనుమంతునికి సృష్టికర్త, భర్త, హర్త అను సర్వాధికారములు ఇచ్చినను, కాలభైరవునికి భయపడుచు అతడు చెప్పినట్లు వివిధ అవతారములందు స్వామి నడచు కొనుచున్నను, హనుమత్, కాలభైరవులు స్వామికి ఎల్లప్పుడును దాసులుగనే ఉందురు.
కావున స్వామి కైవల్యము నిచ్చినను ఆ మత్తులో పడక వీరు సత్యముపై నిలచియున్నారు. రాజు తన పుత్రునిపై ప్రేమతో వాని నెత్తిపై కిరీటము పెట్టి వాని చేతికి రాజదండమునిచ్చి సింహాసనముపై కూర్చుండ చేసినాడు. ఆ బాలుడు అజ్ఞానముతో నేనే రాజునని చెప్పుచుండగా, చూచి రాజు ఆనందించుచున్నాడు. ఇంతవరకు ఫరవాలేదు. కాని ఆ బాలుడు దుష్టుడై ఆ రాజదండముతో ఇతరులను హింసించినచో రాజు వెంటనే లాగుకొని వానిని దండించును. అట్లు కాక ఆ బాలుడు రాజువలె చక్కగా తీర్పులను ఇచ్చుచున్నచో వానికి అభిషేకము చేసి వానిని నిజముగనే రాజును చేయును. అట్టివాడు రాజు అయిన తరువాత కూడా తన తండ్రి యిచ్చిన అధికారమే ఇదియని ప్రపత్తిభావముతో రాజుకు నమస్కరించును. ఇదే విధముగా అష్టసిద్ధులను దత్తుడు భక్తులకు ఇచ్చి వాటిని ప్రదర్శించుచు ‘నేనే దత్తుడను, నేనే దత్తుడను’ అని వారు పలుకుచుండగా వానిని చూచి దత్తుడు నవ్వుకొని ఆనందించును. కాని వారు ఇతర భక్తులను హింసించినచో దత్తుడు వారి సిద్ధులను లాగుకొని వానిని దండించును. హిరణ్యకశిపునకు అష్టసిద్ధులను ఇచ్చినవాడు దత్తుడే. వాడు నేనే దత్తుడనన్నను దత్తుడు కోపగించలేదు. కాని ప్రహ్లాదుని హింసించగా వానిని దండించెను. విష్ణుదత్తుడు ఆ సిద్ధులను లోకకళ్యాణమునకు వినియోగించగా తనంతవానిగా చేసెను.
★ ★ ★ ★ ★