home
Shri Datta Swami

 07 Mar 2025

 

కర్మ, వికర్మ, అకర్మ మరియు కర్మయోగము

Updated with Part-3 on 10 March 2025


Part-1   Part-2   Part-3


Part-1

కర్మణోహ్యపి బోద్ధవ్యమ్’, ‘కిం కర్మ కిమకర్మేతి’, ‘కర్మయోగేన యోగినామ్’, ‘కర్మణ్యే వాధికారస్తే’ అను గీతా శ్లోకములలో కర్మ, వికర్మ, అకర్మ, కర్మయోగము అను నాలుగు శబ్దములు వాడబడినవి. సామాన్యమైన అర్థములో కర్మ, వికర్మ, కర్మయోగము అను మూడును ‘కర్మ’ అను శబ్దము క్రిందకే వచ్చును. ఏలననగా ఈ మూడింటిలోను పనిచేయుట అను ‘కర్మ’ వున్నది. ఇట్టి సామాన్యార్థము కర్మ శబ్దమునకు వ్యుత్పత్తి పరముగా వున్నది (దీనినే యోగము లేక యౌగికార్థము అనెదరు). అయితే కర్మకాండలో వాడుక (దీనినే రూఢము అనెదరు) పరముగా స్వార్థముతో చేసే (కర్మ) పనికే ఈ అర్థము వ్యవహారములో వాడబడినది.

  1. కర్మ: (వ్యవహారములో వాడుకగా వచ్చిన అర్థము) అనగా, నీ కొరకు, నీ కుటుంబము కొరకు శరీరయాత్ర నెరవేర్చుటకు కావలసిన దానికై చేయు పని (శరీరయాత్రాపి చ తే) అని గీత. వేదము కూడా దీనినే ‘కుర్వన్నేవేహ కర్మాణి’ అని చెప్పుచున్నది.
  2. వికర్మ: అనగా శరీరయాత్రకు మించి అంతములేని భోగముల వరకు అనంతముగా నిరంతరముగా పనిచేయుట. ఇదే కామ్యకర్మ అనగా పాపకర్మ. ఈ కామ్యకర్మను చేయనివాడే సంన్యాసి. ఇదే అర్థము ‘కామ్యానాం కర్మణాం న్యాసమ్’ అను శ్లోకములో చెప్పబడినది. అనగా సంన్యాసియు శరీరయాత్ర కొరకు కర్మ చేయవలయుననియే తాత్పర్యము.
  3. కర్మయోగము: అనగా భగవత్కార్యములో పాల్గొని పనిచేయుట. ఈ కర్మయోగము చేయువాడే యోగి. ఇట్టి యోగియే సర్వోత్తముడని గీత కర్మిభ్యశ్చాధికో యోగీ’ ‘జ్ఞానిభ్యోఽపి మతోఽ ధికః’ ‘ తపస్విభ్యోఽధికో యోగీఅని శరీరయాత్ర కొరకు చేయు కర్మ కన్నను, జ్ఞానము కన్ననూ, భక్తి కన్ననూ కర్మయోగమే గొప్పది అనియు గీత చెప్పుచున్నది.
  4. అకర్మ: i) శరీరయాత్ర కొరకు కర్మ చేయవలసిన అవసరముండగా సోమరితనము చేత అట్టి కర్మను చేయకపోవుట, ii) శరీరయాత్ర కొరకు కర్మ చేయగా మిగిలిన సమయములో కర్మయోగము చేయకపోవుట, iii) శరీరయాత్ర కొరకు దైవానుగ్రహము చేత అవసరమైనవి ఏర్పడియుండగా, మొత్తము సమయము కర్మయోగము చేయకపోవుట ఈ మూడును అకర్మ క్రిందకే వచ్చును.

కావున సంన్యాసి ఎవడు? ‘న కర్మణామ్ అనారమ్భాత్’ తయోస్తు కర్మసంన్యాసాత్’ అను శ్లోకములలో కర్మ యోగమును సదా చేయువారే సంన్యాసులు అని చెప్పిరి. అయితే శరీరయాత్రకు కర్మ చేయవచ్చును. అయితే శరీరయాత్రకు కావలసినది సిద్ధమైయుండగా భగవత్పరమైన కర్మను చేయుట కర్మయోగమే అగును. కాని, ఎట్టి పరిస్థితులలోను వికర్మ చేయరాదు. ‘నహి కశ్చిత్ క్షణమపి అను శ్లోకములో ఈ విధముగా చెప్పబడినది – అందరూ కర్మలు చేయుచున్నారు. అయితే వారి కర్మ i) అవసరమైన దానిని చేయకపోవుట, ii) అనవసరముగా చేయుట, అను రెండు దోషముల నుండి విముక్తమై యుండవలెను. కావున సంన్యాసికి కర్మయోగము నిరంతర కర్తవ్యము. అకర్మ, వికర్మలు పూర్తిగా నిషిద్ధము. అవసరము లేనిచో కర్మయు నిషిద్ధమే. కావున కర్మయోగము చేయు యోగియు, సంన్యాసియు ఒక్కరే అని ‘నహి అసంన్యస్త సంకల్పో’ అని గీత చెప్పుచున్నది. దీని సారాంశము i) కర్మయోగమును చేయకుండా పూర్తి కర్మసంన్యాసమును (ఇచ్చట కర్మసంన్యాసమనగా భగవత్సేవా రూపమైన కర్మను చేయుట మరియు కర్మఫలత్యాగమనగా తన కర్మఫలమును భగవంతునికి సమర్పించుట.) చేయరాదు. ii) నిరంతరము కర్మయోగము చేయుచు అవసరమైనచో కర్మను చేయవచ్చును. iii) ఎట్టి పరిస్థితులలో వికర్మను చేయరాదు.

Swami

అయితే ధనుస్సు నుండి వదలబడిన బాణమువలె వెనుక చేసిన వికర్మకు శిక్ష తప్పదా? భగవత్ప్రాప్తి లేదా? అని ధనికులు భయపడనవసరము లేదు. క్రీస్తు ధనికులను గురించి సూది బెజ్జములో నుండి ఒంటె దూరునేమోగాని, ధనికుడు భగవంతుని చేరజాలడని చెప్పెను. అయితే, ఆయన ఆ మాట ఎప్పుడు చెప్పెను? తాను చెప్పిన త్యాగమార్గమును ఆచరించలేక వెనుకకు తిరిగిపోయిన ఒక ధనికుని గురించియే కదా? దిద్దుకొనలేని ధనవంతులను గురించి ఈ వాక్యము. నిజముగా ధనవంతుడు సోమరితనముతో ధనమును సంపాదించని వాని కన్నను అదృష్టవంతుడు. ఏలననగా వాడు చేసిన కర్మ అంతయును ధనరూపమున వాని వద్దయున్నది. ఆ ధనమును త్యాగము చేసినచో ఆ ధన నిమిత్తము చేసిన కర్మయంతయు భగవంతుని సేవలో చేసినట్లేయగును. అనగా వాని పాపకర్మయగు వికర్మ మొత్తము శాశ్వత పుణ్యకర్మయగు కర్మయోగముగా మారినది. సోమరిపోతు ఎట్టి కర్మ చేయక కాలమును వ్యర్థము చేసినవాడు. కావున,  ధనమును త్యాగము చేయలేడు కావున వాని అకర్మ కర్మయోగముగా మారు అవకాశము లేదు. భగవత్సంబంధము లేక కేవలము ధనమును మానవసేవకే అర్పించినాడు. అట్టివాని దానము అశాశ్వత పుణ్యకర్మ యగును. దానివలన వాడు స్వర్గలోకమునకు పోయి ఆ ఫలభోగము పూర్తికాగానే, భగవంతుని త్యజించిన వాడు కావున మరల క్రిందకు వచ్చి పశుపక్ష్యాది జన్మలందు పడును. వాడు మరల పుణ్యకర్మ చేయు అవకాశము కూడా లేదు. కనుక నాస్తికుడు ఎంత దానము చేసినను అధోగతియే. ఏలననగా భగవంతుడు లేడు అను పాపమును కొట్టి వేయగల పుణ్యకార్యము ఈ సృష్టిలోనే లేదు.

 

Part-2

భగవంతుని పర్యవేక్షణ లేకుండా మోసగించబడి, పొరపాటుపడి అపాత్రదానము చేసినచో అది మరియొక పాపమై ‘వికర్మ’ పాపమునకు తోడగును. ఒకడు పాపకర్మచే సంపాదించిన ధనమును త్యాగము చేసి ఆ పాపమును పోగొట్టుకొనుటకు బదులు, అపాత్రదానము ద్వారా మరియొక పాపమును కొనితెచ్చుకున్నాడు. కావున అవతార పురుషుడు సర్వజ్ఞుడు కావున అతడి పర్యవేక్షణలో దానము చేయువాడు ఏ విధముగను మోసపోడు గనుక పాత్రదానమే జరిగి వానికి సత్ఫలము లభించును. కావున లోకసంగ్రహమగు సేవ భగవంతుని ఆదేశము లేనిదే స్వతంత్రముగా చేయరాదని శ్రీ రామకృష్ణులు చెప్పినారు. ఎంత పాపకర్మయైనను కర్మఫలత్యాగము చేత నశించిపోవును అని ‘అపి చేత్ సుదురాచారో’ అను శ్లోకములో గీత చెప్పుచున్నది. తిన్నడు పాపకర్మ ఫలమగు వేటమాంసమును భగవంతునకు సమర్పించినందున సాధుప్రాణి హింసయగు ఆ పాపము నశించినది. ఏలనన వాని వికర్మలో స్వార్థము లేదు. కర్మఫల త్యాగము, జ్ఞానము కన్నను, భక్తి కన్నను గొప్పదని గీత ‘ధ్యానాత్ కర్మఫలత్యాగః’ అని చెప్పుచున్నది. ‘మత్కర్మ పరమో భవ’ ‘మదర్థమపి’ ఇత్యాది శ్లోకములు కర్మసంన్యానము అనగా భగవంతుని కొరకు కర్మలు చేయుటను బోధించుచున్నవి.

త్యక్త్యా సంగమ్’ ‘ముక్తసంగః’ ఇత్యాది శ్లోకములు సంసారబంధ-సంగ-వ్యామోహములచే వికర్మలు చేయవలదని ఆజ్ఞాపించుచున్నది. కర్మయోగము చేయక వికర్మ చేయువాడు దొంగయని ‘స్తేన ఏవ సః’ అను గీతాశ్లోకము చెప్పుచున్నది. ఈ విషయమునే వేదము కూడా ‘మా గృథః కస్య స్విత్ ధనమ్’ అని చెప్పినది. అనగా “ఈ జగత్తు ఈశ్వరధనము. శరీరయాత్రకు కావలసినది తీసుకో. ఎక్కువ తీసుకొంటే ఈశ్వరుని అనుమతి లేదు కావున తిరిగి ఈశ్వరునికే ఇచ్చివేయుము” అని చెప్పుచున్నది. ‘యస్తు కర్మఫలత్యాగీ’, ‘సర్వకర్మఫలత్యాగీ’ ఇత్యాది శ్లోకములు కర్మసంన్యాసము (భగవత్కర్మను బాగుగా ఆచరించుట) తోపాటు పూర్వ పాపమును పోగొట్టుకొను ప్రాయశ్చిత్తమైన కర్మఫలత్యాగమును ఏకైక మార్గముగా చెప్పినవి. వేదము కూడా ‘ధనేన త్యాగే నైకే’ అని కర్మఫల త్యాగము చేతనే పూర్వ పాపమునకు విముక్తియగు ఏకైక మార్గము ఏర్పడునని చెప్పుచున్నది. ధర్మశాస్త్రాలలో చెప్పిన దానాలు ప్రాయశ్చిత్త దక్షిణల అంతరార్థమిదియే. ఈ కర్మ సంన్యాసము కర్మఫలత్యాగము కలిపి కర్మయోగమనబడును. ఇదియే భగవత్సేవ. ముందు శంకరులు జ్ఞానాన్ని, తరువాత వచ్చిన రామానుజులు భక్తిని బోధించారు. చిట్టచివరలో మధ్వులు వచ్చి సేవను బోధించినారు.

ఆధ్యాత్మికప్రగతికి జ్ఞానము మూల కారణము. భక్తి ప్రాప్తి కారణము. ‘భక్త్యా త్వనన్యయా లభ్యః’ అని గీతా వాక్యము. భక్తి యొక్క నిజమైన నిరూపణమే సేవ. భక్తియనగా పాటలు పాడుట, భావములు వ్యక్తము చేయుట, కన్నీరు కార్చుట కాదు.  వీటిని బజారులో అమ్మినచో పైసయును రాదు. ఏ విలువలేని వాటిని స్వామికి ఇచ్చి భగవద్వంచన (cheating the God) చేసినామని మురిసిపోవుచున్నామే గాని చివరకది ఆత్మవంచనయే (cheating oneself). ఇట్టి సాధన దాదాపు సున్నాయని దీనిలో నిష్ణాతులైన భారతీయులు ముఖ్యముగా గ్రహించవలెను. గురువైన నారదుల నుండి కృష్ణుని గురించిన జ్ఞానమును పూర్ణముగా రుక్మిణి పొందినది. కృష్ణుని పొందవలయునన్న వేదనయగు భక్తి జనించి వృద్ధి చెందినది. ఆ భక్తి చేత కృష్ణుని పొందినది. తన భక్తిని నిరూపించుచు నిరంతరము పాదసేవలు చేసినది.

జ్ఞానము, భక్తి సంవత్సరమంతయు చదివిన చదువు వంటిది. సేవయే సంవత్సరాంత పరీక్ష. ఈ పరీక్షపై ఆధారపడియే మార్కులు, డిగ్రీ. సంవత్సరమంతయు ఎంత చదివినామన్నది కాదు. ఎంత వంట పట్టినది అన్నది పరీక్షలో తేలును. జ్ఞానములో, భక్తిలో నీవు చూపించిన ఆర్భాటము లెక్కకు రాదు. జ్ఞానమునకు గీటురాయైన పరీక్షలో నీ అసలైన రంగు తేలును. దీనినే ఇట్లును చెప్పవచ్చును. జ్ఞానము డిగ్రీ, దానితో సాధించిన ఉద్యోగమే భక్తి. అయితే, ఈ రెండింటి చేత నీకు జీతము రాదు. ఆ ఉద్యోగములో పనిచేసినప్పుడే జీతము వచ్చును. ఆ పనియే కర్మయోగము లేక కర్మ. అదియే ఫలమును నేరుగా తెచ్చునది అని ‘కర్మణైవ హి సంసిద్ధిమ్’ అని గీత చెప్పుచున్నది. ద్రౌపది ఎంత ఏడ్చి బాధపడినదో కృష్ణుడు అంత ఏడ్చి బాధపడినాడు. నీ చర్యయే నా ప్రతిచర్యయని ‘యే యథా మామ్’ అని గీత చెప్పుచున్నది.

వాక్కులకు వాక్కు, మనస్సుకు మనస్సు, క్రియలకు క్రియయే ప్రతిచర్య. పాపకర్మఫలము క్రియాత్మకమగు త్యాగముతో పోవునేగాని జపములు, మాటలు, పాటలు, తపనతో గూడిన భావములు దానిని పోగొట్టజాలవు. కర్మను కర్మయే ఖండించగలదు. వజ్రమును వజ్రమే కోయగలదు. కావున కృష్ణుని వ్రేలు కోసుకున్నప్పుడు ద్రౌపది తన చీరను చించి కట్టిన సేవాకర్మయే నిజమైన సేవ. కృష్ణుడు దానికి ఫలముగా ద్రౌపదికి అత్యంత అవసరమైన సమయములో అనంతములైన చీరల నిచ్చినాడు. కావుననే, భగవంతుడు ఆవిడ చేసిన చిన్నసేవకు మెచ్చి అనంతములైన ఫలము ఇవ్వగలిగినాడు. అదే ద్రౌపది చేసినది భగవత్ రహితముగ చేసిన పుణ్యకర్మ అయినచో తను సమర్పించిన చీరముక్కకు వడ్డీగా మరియొక చీరముక్కను మాత్రము ఈయగలదు. అపుడు అట్టి కర్మ అనిత్యమైన, పరిమితమైన స్వర్గాది ఫలములను మాత్రమే ఇచ్చును. కావున భగవంతునికి సంబంధించి, భగవంతుని ద్వారానే నేరుగా త్యాగము చేయుట ఉత్తమము.

రోజుకు నూరుపుట్ల బంగారమును ప్రసవించు శమంతకమణి సత్రాజిత్తు వద్దనున్నది. అతడు ధనకీర్తి కొరకు అహంకారముతో దానములను చేయుచున్నాడు. వాటిలో దోషములు వచ్చుననియే ఆ శమంతకమణిని తనకు ఇమ్మని కృష్ణుడు సత్రాజిత్తుకు బోధించినాడు. కాని కృష్ణునికి కీర్తి వచ్చునను భావముతో సత్రాజిత్తు ఈయక మణిని పోగొట్టుకొని దుఃఖమును పొందినాడు. కావున కర్మఫలత్యాగమునకు అత్యుత్తమ పాత్రుడు భగవంతుడైన అవతార పురుషుడు మాత్రమే. దేశ, కాలముల కన్నను పాత్రయే గొప్పది. దీనినే ‘దేశే కాలే చ పాత్రే చ’ అని గీత చెప్పుచున్నది. భగవంతుని తరువాత పరమార్థమును అర్థించు భక్తుడగు అర్థార్థియు, జ్ఞానమును గోరు జిజ్ఞాసువును అర్హులు. చిట్టచివర ఆర్తుడగు బిచ్చగాడు అర్హుడు. ఏలనన, వాడు తన పాపకర్మకు దైవముచే శిక్షింపబడుచున్నవాడు. శిక్ష అనెడిది అపరాధి మనసులో మార్పు తెచ్చుట కొరకు చేయబడినది. అట్టివానిని నీవు కనికరించినచో దైవమును విమర్శించినట్లే. జైలులో పడిన దొంగను కనికరించుట ప్రభుత్వమును, కోర్టును విమర్శించుట అయితే, అట్టివానికి దానము చేసి, వానికి జ్ఞానమును బోధించి, భక్తునిగా మార్చినచో అది అట్టివానిలో మార్పు తెచ్చుటకు చేసిన ప్రయత్నము కావున అది దైవసమ్మతమే. కావున మాధవుని సంబంధము లేకుండా, చేసెడి కేవలమైన మానవసేవ దైవము యొక్క ఆగ్రహమునకు కారణమగును.

 

Part-3

కర్మఫలత్యాగము మరియు కర్మసంన్యాసము ఎవరికి చేయుట వీలగును? నీ పిల్లలకు స్నానము చేయించుట, వారికి వస్త్రములు ధరింపచేయుట, స్కూలుకి తీసుకొనిపోవుట మొదలగు పనులు కర్మసంన్యాసము అని సామాన్యార్థములో అనబడును. వారికి అన్నము పెట్టుట, ఆస్తిని ఇచ్చుట కర్మఫలత్యాగము. నీ నిజమైన ప్రేమ వారియందే ఉండుట వలన వారికి ఈ సేవలు చేయుచున్నావు. కావున ఈ రెండు పనులు (కర్మసంన్యాసము, కర్మఫలత్యాగము) చేయుటకు మనకెదురుగా చేతనమైన మానవరూపమే ఉండవలెను. నీవు బజారు నుండి కొనితెచ్చిన బొమ్మలకు ఈ పనులు చేయుట లేదు. అట్లే విగ్రహాదులకునూ నీవు సేవలు చేయలేవు. ఇట్టి సేవలను నీవు చేసినప్పుడు, ఆ విగ్రహములను ముందు పెట్టుకొని వ్యాపారులు నీ ధనమును కాజేయుచున్నారు. (టెంకాయల వ్యాపారి, నూనె వ్యాపారి, ఊదివత్తుల వ్యాపారి మొదలగువారు). ఇందులో అర్చకుడు కూడా నీ పాప వ్యాపారములో భాగస్థుడే కాని వ్యాపారులు అత్యంత ధనమును పొందుచున్నా వాడు మాత్రము అత్యల్పధనము పొందు దురదృష్టవంతుడు.

నిజముగా అర్చకుడు అర్థము తెలియని మంత్రములను చదువుటకు బదులు గీత, వేదములను బోధించి జ్ఞాన, భక్తులను ప్రసాదించినచో ఈ వ్యాపారులు దోచుకున్న ధనమును వానికి గురుదక్షిణగ ఇచ్చినను తప్పు లేదు. అతడు చేయవలసిన పని చేసియున్నచో భగవంతునకు భక్తునకు అనుసంధానము చేసెడి అర్చకుడే గురువు అయెడివాడు. ఇదే గీతలో ‘ఉపదేక్ష్యంతి తే జ్ఞానమ్’ అని చెప్పబడుచున్నది. అర్చకుడు కేవలము శబ్దములను టేపురికార్డు వలె ఉచ్చరించుచు తను ఉచ్చరించే వేదము చేతనే “దేవపశువు” (దేవానామ్ పశురహహ) అని అపహసింపబడుచున్నాడు. ‘అనర్థః పాఠకాధమః’ అనియూ అధమునిగా చెప్పబడుచున్నాడు. వేదశబ్దమునకే ‘జ్ఞానము’ అని అర్థము. పూర్వకాలములో గ్రంధముద్రణము లేదు. కావున ఎవ్వరును సొంత కవిత్వమును చేర్చకుండా రక్షించుటకై వేదము వల్లెవేయబడినది. ఇప్పుడు వేదములు ముద్రించబడి రక్షింపబడుచున్నవి. కావున అర్చకులు బట్టీ కొట్టుట మాని దేవాలయములను జ్ఞాన, భక్తి ప్రసారాల ప్రచారకేంద్రములగా దిద్దవలయును.

అర్చకుడు గురుస్థానమును వహించవలెను. వాని కర్తవ్యము అతడు చేయనప్పుడు, కుక్క మొరగనిచో, దాని బదులు గాడిద ఓండ్ర పెట్టినట్టు, ఊదివత్తి తాను భగవంతునికి భక్తునికి అనుసంధానమగుచున్నది. ఓ అర్చకుడా! నీవు పది రూపాయలు మాత్రమే ఫీజు తీసుకొని వందరూపాయలు మందుల దుకాణమునకు అర్పింపచేసి ఆ మందుల వలన రోగమును పెంచు డాక్టరుగా మారిన కాంపౌండరువలె ఉన్నావు. నీవు వైద్యవిద్యను పూర్తిగా అభ్యసించి సరియైన డాక్టరు అగు గురువుగా మారుము. నీవే వంద రూపాయలు తీసుకుని వారికి పది రూపాయల మందు రాసినచో రోగము పూర్తిగా పోవుచున్నది. కావున దేవాలయములో వ్యాపారులు ఈ వ్యాపారమును ఆపవలెను. విగ్రహములు ‘ద్రష్టవ్యః’ ను వేదము ప్రకారము కేవలము దర్శనయోగ్యములే. విదేశములలో ఉన్న నీ పుత్రుని ఫోటో చూచుట వరకే ఉపయోగపడును. దాని ప్రయోజనము అంతవరకే. విగ్రహములకు సేవ చేసినచో వాటివలె నీవును జడముగా పుట్టుదువని ‘భూతేజ్యా యాంతి భూతాని’ అని గీత చెప్పుచున్నది. విగ్రహములలో ఈశ్వరుడు లేడని ‘న తస్య ప్రతిమా అస్తి’ అని వేదము చెప్పుచున్నది. కావున సేవకు విగ్రహములు యోగ్యములు కావు. ఇక నిరాకారమైన భగవంతుని ఆరాధించినచో ‘అవ్యక్తా హి గతి ర్దుఃఖమ్’ అని గీత చెప్పుచున్నది. ‘మాం తు వేద న కశ్చన’ అను గీతా శ్లోకము పరమాత్మ ఊహాలకు సైతము అందడని చెప్పుచున్నది.

వేదము కూడా ఈ విషయమును అనేక మంత్రములలో ఘోషించుచున్నది. అట్టి పరమాత్మ దర్శన, స్పర్శన, సహవాస, సంభాషణలను అనుగ్రహించుటకై మన సేవలను పూర్తిగా అందుకొనుటకై ‘మానుషీం తను మాశ్రితమ్’ అను గీతా శ్లోకము పరమాత్మ కేవలము నరాకారములోనే వచ్చును అని చెప్పుచున్నది. మత్స్యకూర్మాది అవతారములు తాత్కాలికములే కాని సేవాయోగ్యములు కావు, కావున వాటి విషయములు గీతలో చెప్పబడలేదు. పరమాత్మ మనుష్యశరీరమును ఆశ్రయించినపుడు ఆయన బాహ్యరూపము ‘నావలె’, ‘నీవలె’, ‘వాని వలె’ ఉండును అని బ్రహ్మసూత్రములలోని మొదటి మూడు మహావాక్యములకు అర్థము. అంతస్స్వరూపుడగు పరమాత్మ ఎవ్వరును చెప్పలేని విశేష జ్ఞానముతో కూడి ఉండునని నాలుగవ మహావాక్యము చెప్పుచున్నది. అంతస్స్వరూపుడు సత్యమైన, అనంతమైన జ్ఞానస్వరూపుడని వేదము, మరియు ‘జ్ఞానే’... అని గీతయును చెప్పుచున్నది. ఆనందోబ్రహ్మ అను వేదము ప్రకారముగా అతడు బోధించు జ్ఞానము పండితులవలె తలనెప్పిని పుట్టించకుండా ఆనందమును కలిగించును. అతడు అష్టసిద్ధులను కలిగియున్నను అహంకారముతో, కీర్తి కొరకు జనాకర్షణకై ప్రదర్శించడు. ఆయన సొమ్ముల వంటి అష్టసిద్ధులను రాక్షసులు ప్రదర్శించినను ఋషులు పరమాత్మ తత్త్వముగా వాటిని అంగీకరించలేదు. ఇట్టి గుర్తులచే మానవరూపమున నున్న మాధవుని గుర్తించి సేవించి ఆయన కార్యమున కర్మసంన్యాసము ద్వారా పాల్గొని ఆయన కార్యమున కర్మఫలత్యాగము చేయుటవలన పూర్వపాప ఫలములను పోగొట్టుకొని తరించవలెను.

నారాయణుడు నరుడుగా వచ్చుననియే ఈ నాలుగు మహావేద వాక్యముల సారాంశమైన జ్ఞానము. అనగా, ఈశ్వరుడు జీవునిగా అవతరించుటయే తప్ప వేరొకటి కాదు. ‘సంభవామి యుగే యుగే’ అన్నపుడు యుగశబ్దమునకు ‘మనుష్యతరము’ అని అర్థము. ఆయన ఒక తరమునకు అవతరించి వచ్చి మరియొక తరమునకు రాకున్నచో ఆయనకు పక్షపాత దోషము వచ్చును. అందుకే, పైన చెప్పిన అర్థమును తీసుకొనవలయును. ముందు చెప్పిన మహావాక్యములు వంటబట్ట వలయునన్నచో చిత్తశుద్ధి కావలయును. అహంకారము, అసూయ పోగొట్టుకొనుటయే చిత్తశుద్ధి. సాటి నరావతారమును అంగీకరించుటకు అహంకారము, అసూయ అడ్డు వచ్చును. జ్ఞానాహంకారమే ‘సాత్త్వికాహంకారము’. దేహబలము యొక్క అహంకారమే ‘రాజసాహంకారము’. దేహ, బంధువుల యొక్క అహంకారమే ‘తామసాహంకారము’.

ఈ మూడు లేనివాడే ‘అత్రి’. అసూయ లేనివాడు ‘అనసూయ’. ఇదే పరిపూర్ణ చిత్తశుద్ధి. అప్పుడే లోకమునకు ‘నరాకారమున దత్తమైన వాడు’ అంటే లోకమునకు లభించినవాడు, అతనికి లభ్యమగును. అనగా అతడు ఆ నరాకారమును గ్రహించి ఉపాసించును అని అర్థము. విద్యుత్ తీగె లోనికి ప్రవహించునపుడు తీగె యొక్క సన్నగా ఉండుట మొదలగు ధర్మములు విద్యుత్ప్రవాహము ద్వారా పోవు. అలానే పరమాత్మ ఆశ్రయించిన మానవదేహము సృష్టి, స్థితి, లయములను త్రిగుణములతో ఉండుననుటయే దత్తరూపమునకు ఉన్నమూడు శిరస్సులు సూచించును. ఆ మానవదేహమునకు ఉన్న ఆరు వికారములు (ఉండుట (existence), పుట్టుట, పరిణామము చెందుట (change), వృద్ధి చెందుట (growth), క్షీణించుట (decay), నశించుట) అను ఆరు చేతులు కలిగి ఉండుటయే అంతరార్థము. ఇట్లు ‘దత్త’ శబ్దమునకు అర్థము, దత్తరూపమునకు అంతరార్థము తెలిసికొనుటయే దత్త తత్త్వము.

ధ్యానము కూడా మనస్సుతో చేయు కర్మయే. కాని అత్యల్పము. అట్లే వాక్కుతో కూడ చేయు కర్మ అత్యల్పము. ఈ రెండింటి ఫలముపై మనకు వ్యామోహము లేదు. కేవలము బాహ్య కర్మఫలము పైననే వ్యామోహమున్నది. కావున బాహ్యకర్మలను వాటి ఫలములను స్వామికి సమర్పించినపుడే భగవద్వ్యామోహము నిరూపిత మగుచున్నది. కావున, మనస్సును భగవంతునిపై ఉంచి, సంసార కర్మలను చేయుము అనుమాట దొంగమాట, తమ నిజమైన వ్యామోహమును కప్పిపుచ్చుకొని, తనపై వ్యామోహము ఉన్నది అని అది మనము భగవంతుని భ్రమింపచేయు మాట. కాని భగవంతుడు అట్లు భ్రమింపడు. నరావతారమును గుర్తించిన హనుమంతుడు, రాముని తలచుచు తన సంసార కర్మలను చేయలేదు. స్వామి కర్మలనే చేసినాడు. తన సంసార కర్మ లేనే లేదు. శంకరులును అట్లే జ్ఞానప్రచారమను దైవకర్మను చేసినాడే తప్ప, సంసారకర్మలను చేసుకొనుచు దైవధ్యానము చేయలేదు. నీవు గృహస్థువైనచో, కొంత సంసారకర్మ అను శరీరయాత్రను చేసుకొని, కొంత కర్మను దైవమునకు చేయుము. మొత్తము సమయము సంసారకర్మను చేయుచూ మనస్సులో ధ్యానింతుననుట సంసారమునకు 100 రూపాయలను యిచ్చి భగవంతునికి పైసా ఇచ్చుటయే. నీవు అట్టి ముష్టి పైసా దానము చేయనక్కరలేదు. నీ వందరూపాయలలో ఒక్క రూపాయిని ఇచ్చి భగవంతుని సేవించుము, అనగా బాహ్యముగా చేయుకర్మలో కొంతభాగము దైవకర్మగా చేయుము.

తొలుత విగ్రహారాధనలో శిల్పములుగా ఉన్న వాటిని ఆరాధింపచేయుట నరరూపమును ఆరాధింపమని సూచించుచున్నది. నీకు మదమాత్సర్యములు తొలగువరకు ఆ నరరూపములను ఆరాధించుట అను దానిని అభ్యసించుము. నీకు సేవ (షోడశోపచారములను) చేయు సంకల్పమును కలిగినపుడు, ఆ జడమైన విగ్రహమునకు ప్రాణప్రతిష్ఠ చేయుచున్నావు. అట్టి ప్రక్రియ చేత ప్రాణసహిత నరాకారమే ఆరాధనకు సిద్ధించుచున్నది కాని జడమైన విగ్రహములోకి ప్రాణము ప్రవేశించలేదు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch