14 Nov 2024
[18.11.2002, కార్తిక సోమవార సందేశము] మనస్సులో వచ్చు ఆలోచనలన్నియును, ఇంతకు ముందు నీవు దుస్సంగములో విన్న లౌకిక వాక్యముల ప్రభావమే. ఈ ప్రభావము అనగా ఆలోచన. నీవు మాటలాడు లౌకికవాక్యముల చేతను, మరియును నీవు ఇంకనూ విను లౌకికవాక్యముల శ్రవణము చేతను బలపడుచున్నవి. నీ రక్తములో ఉన్న చక్కెర ఇంత వరకు నీవు ఆరగించిన తీపిపదార్థముల ప్రభావము. నీవు వైద్యుని వద్దకు వెళ్ళగనే మొట్టమొదట ఏమి చెప్పును? “నీవు ఇంక తీపి పదార్థములను తినవద్దు” అని చెప్పును. ఆ తర్వాత ఇంతవరకు తినిన వాటి ప్రభావమైన రక్తములోని చక్కెరను తగ్గించుటకు మందులనిచ్చును. అట్లే నీవు శ్రీదత్తసద్గురువును ఆశ్రయించినప్పుడు మొట్ట మొదట:
1) లౌకిక వాక్యములను వినవద్దు అని ఆదేశించును.
2) ఆ తర్వాత జ్ఞానము, భక్తి అను ఔషధములనిచ్చుట (medicines) ద్వారా నీ మనస్సు నుండి ఆలోచనలను తొలగించును.
3) ఒక్కొక్కసారి ఇంజక్షన్ చేయవలసి వచ్చును గూడా. అదియే మహిమల (miracles) ప్రదర్శనము.
ముందే ఇంజక్షన్ ఇవ్వరాదు. ముందే ఇంజక్షన్ ఇచ్చినచో ప్రతిసారి ఆ ఇంజక్షన్ ఇవ్వవలసి వచ్చును. మందులు పని చేయవు. పథ్యము (diet control) చేయకుండా మందులు వాడుట వ్యర్థము. దుస్సంగమును నిగ్రహించుటయే పథ్యము. సత్సంగములో పాల్గొనుటయే ఔషధసేవ. అన్నింటికంటెనూ అతి ముఖ్యమైనది ఏది? వైద్యునియందు గురి, విశ్వాసము. అయితే గురువుని మార్చరాదు అందురు. ఇది సరి కాదు. ఒక వైద్యుని వద్ద రోగము తగ్గనపుడు మరియొక మంచివైద్యుని ఆశ్రయించుట తప్పుకాదు. మొదటి వైద్యుని యందే గురి పెట్టుకొని వాని చేతిలో మరణించుట అవివేకము.
ఏ గురువును పొందిన తర్వాత మరియొక గురువుని పొందనవసరములేదో అతడే శ్రీదత్తుడు. ఆయన నరావతారము (human incarnation) ద్వారా మనకు అందివచ్చుచున్నాడు. ఆయన నరశరీరములోని సర్వ అవయవములందును తన అవయవములను ఇముడ్చుకొని లీనమగుచున్నాడు. దీనినే శ్రుతి, “కన్నులలో కన్నులు”, “చెవిలో చెవి”, “ముక్కులో ముక్కు” అని కేనోపనిషత్తులో చెప్పుచున్నది. కావున శ్రీదత్తబ్రహ్మము సాకారము.
బ్రహ్మము నిరాకారమా? సాకారమా?
శంకరులు బ్రహ్మమును నిరాకారమన్నారు (formless). రామానుజ, మధ్వులు సాకారమన్నారు (formful). “న సన్దృశే, న చక్షుషా అరూపమ్” ఇత్యాది శ్రుతులును, “అరూపమేవ హి” అను బ్రహ్మసూత్రము బ్రహ్మము నిరాకారమనుచున్నవి. “ఆత్మానమైక్షత్”, “పరిపశ్యంతి”, “తనూం స్వామ్” ఇత్యాది శ్రుతులు బ్రహ్మ సాకారమనుచున్నవి. కావున సమన్వయము ఎట్లు చేయవలెను?
సమన్వయము: ఈశ్వరుడు సాకారుడనియు, మనస్సు నిరాకారమనియు, నిరాకార శ్రుతులన్నియు ఈశ్వరుని చిత్తమునకు, సాకార శ్రుతులన్నియు ఈశ్వరునకును సమన్వయించవచ్చును. లోకములో ప్రతిశక్తికి ఆధారమైన ద్రవ్యమున్నది. కాంతికి సూర్యచంద్ర దీపాదులు ఆధారము. ఉష్ణమునకు (heat) అగ్ని ఆధారము. శబ్దమునకు పరస్పరము ఢీకొను పరమాణువులు (atoms) ఆధారము. చైతన్యమునకు ప్రాణి ఆధారము. ఇట్లు ఆధారము లేని శక్తి లేదు. కావున నిరాకారమైన శక్తికి సాకారమైన ద్రవ్యము ఆధారముగా ఉన్నది. ఈ ఆధారములనే శ్రుతి “పుచ్ఛము, ప్రతిష్ఠా” అను శబ్దములచే చెప్పుచున్నది. “బ్రహ్మ పుచ్ఛం ప్రతిష్ఠా” అను తైత్తిరీయ శ్రుతి అయితే, తేజస్సు ఘనీభవించియే సూర్యునిగా కనపడుచున్నాడు. కావున తేజస్సే అసలు పదార్థమైనపుడు నిరాకారమే పరమాత్మతత్త్వమా? ఈ విషయము ఆర్ధము చేసుకొనుటకు విజ్ఞానశాస్త్రము ఎంతో అవసరము. విజ్ఞానశాస్త్రమేమని వచించుచున్నది? ఈ శాస్త్రము ప్రకారముగా సూర్యుడు ఒక వాయువు యొక్క అణువుల సంఘాతము. ఈ అణువులు మధ్యనున్న బంధములు శక్తిస్వరూపము. కుండలోని మట్టి మధ్యనున్న అణువుల బంధము కూడా శక్తిస్వరూపమే. ఈ బంధనముల శక్తి వల్లనే కుండ యొక్క ఆకారము ఏర్పడుచున్నది. అణువులతో పోల్చి చూచినప్పుడు ఈ బంధన శక్తి అత్యల్పము. ఒక ద్రవ్యము యొక్క గుణములు కూడ అణువులను ఆశ్రయించి యున్నవే కానీ బంధనశక్తిని (binding energy) ఆశ్రయించి లేవు.
ఉదాహరణకు పంచదార పొడిగా యున్నను బంధనశక్తులచేత చిలకగా ఏర్పడినను, తీపి గుణములో మార్పులేదు. అనగా పంచదార కణముల మధ్య బంధము ఏర్పడి చిలుకగా మారిననూ, బంధములు లేక పంచదారగా యున్ననూ తీపిగుణములో తేడాలేదు. అనగా పంచదార కణములనాశ్రయించియే తీపిగుణము ఉన్నది. ఈ బంధనశక్తుల వల్లనే రూపము ఏర్పడుచున్నది. ద్రవ్యపరమాణువులతో పోల్చినప్పుడు బంధనశక్తులు అనగా రూపము అత్యల్పమై అభావము అనగా లేనిది అగుచున్నది. అనగా ఉండియూ లేనట్లే. దీనినే 'మిథ్య' అన్నారు శంకరులు. మిథ్య అనగా బొత్తిగా లేనిది అని కాదు, ఉండియును లేనిదిగా పరిగణింపబడదగిన అత్యల్పము. కావున నిరాకారమైన ద్రవ్యములో ఉన్న ఆకారము ఉన్నను లేనట్లే కాన నిరాకారమే సత్యము. మరీ నీలగతీసినచో అత్యల్పమైనను ఆకారము ఉన్నది కావున సాకారము సత్యమే. కావున బ్రహ్మము నిరాకారమైనను సాకారమే అనుటలో అన్యోన్యవిరోధము లేదు.
★ ★ ★ ★ ★