05 Apr 2025
[27.10.2003] ‘జ్యోతి’ అనే శబ్దము పరమాత్మనే సూచిస్తుంది కాని ఈ జ్యోతులు, జ్యోతులు కావు. ‘పరంజ్యోతి’, ‘జ్యోతిశ్చరణాభిధానాత్’ అనెడి బ్రహ్మసూత్రములలో జ్యోతి అనగా పరమాత్మయేనని వ్యాసభగవానుడు నిశ్చయించియున్నాడు.
ఆ రోజులలో ఇంగువతైలముతో ఆశ్రమములలో దీపములను వెలిగించెడివారు. ఆనాడు కిరసనాయిలుగాని కరెంటుగాని లేవు. ఆనాడు దీపములు రాత్రి సమయమున వెలిగించుట అత్యవసరమై యుండెను. దానినే ‘సంధ్యాదీపమ’న్నారు. ఆ దీపకాంతిచే చీకటి తొలగుచుండెను. అది జ్ఞానము చేత అజ్ఞానము పోయినట్లు గోచరించును. కావున అదే సమయములో ఆ దీపమునందు పరమాత్మ భావన చేసెడివారు.
‘దీపంజ్యోతి పరంబ్రహ్మ దీపంజ్యోతి పరాయణమ్,
దీపేన హరతే పాపం సంధ్యాదీపం సరస్వతి’.
కాని ఈనాడు పట్టపగలు దీపములను వెలిగించుచున్నారు. రాత్రులలో కరెంటులైట్లు ఉన్ననూ, ప్రత్యేకముగా దీపారాధన చేయుచున్నారు. అగ్ని మూడురూపములలో ఉన్నది.
భౌతికాగ్నినే ‘లౌకికాగ్ని’ అని అందురు. ఇదే మనము వెలిగించు నూనె దీపము.
ఇక విద్యుత్తుతో వెలిగించు దీపము వైద్యుతాగ్ని. ఈ రెండును జడస్వరూపములు. వీటిలో చైతన్యము లేదు. వీటిలో దైవత్వము కల్ల. వీటియందు దైవత్వమును భావరూపముగా ఆరోపించుచున్నారు. దీనినే ‘ప్రతీకారాధనము’ అందురు. ప్రతీకము అనగా ప్రతినిధి. ఒక జండాను దేశమునకు ప్రతినిధిగా పెట్టినారు. ఆ జండాను భారతదేశమునకు ప్రతినిధిగా భావించి దానికి నమస్కరించుచున్నారు. కాని ఆ ప్రతీకయైన జండా భారతదేశము కాదు. అట్లే దీపము పరమాత్మ కాదు. దీపము అనగా అగ్ని. అగ్ని అనగా పంచభూతములలో ఒకటి - ‘పృథ్వీ, ఆపః, తేజో, వాయు రాకాశాత్’. పంచభూతములు పరమాత్మ యొక్క సృష్టి. ఆయన సృష్టికర్త. సృష్టి, సృష్టికర్త కాదు. సృష్టి వేరు, సృష్టికర్త వేరు. ఆ రెండూ వేరు వేరు తత్త్వములు. జండా వేరు, భారతదేశము వేరు. కావున అవసరము కొరకు మీరు వెలిగించు కరెంటు దీపమునే పరమాత్మ ప్రతినిధిగా భావించవచ్చును. అదియును వైద్యుతాగ్నియే కదా! అదియు శాస్త్రసమ్మతమే.
ఇక దేవతాగ్ని స్వరూపమైన పరమాత్మయైన దేవతాగ్నిని ఆవేశించి యున్న స్వరూపమే వైశ్వానరాగ్ని. ఇదియే జీవుల కడుపులలో యున్న జఠరాగ్ని అనగా ఆకలి. ఈ విషయము గీత ‘అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః’ అని చెప్పుచున్నది. కనుక, మనము ఆరాధించవలసినది దేవతాగ్ని స్వరూపమునే. ఈ కనపడు జడమైన అగ్ని పరమాత్మ ముందు ఎంత అని దానిని శ్రుతి అత్యల్పముగా పరిగణించి ‘కుతోఽయమ్ అగ్ని’ అను మంత్రములో కొట్టివేయుచున్నది. ఒక మానవుని దైవస్వరూపముగా భావించి వానికి ఆపోసనము వేయుచున్నాము. ఇది ప్రతీకారాధన. ఆ మానవుడు నిజముగా దేవుడు కాడు. అట్లే దీపమూ దైవము కాదు. దీపమునందు దైవభావము ఆరోపించుచున్నాము.
మనకు కనపడు సూర్యుడు కూడ వైద్యుతాగ్నియే. సూర్యుని యందు దైవభావమును ఆరోపించి ఉపాసించుచున్నాము. కాని కనపడు సూర్యుడు దైవము కాదు అని స్పష్టముగా వేదము ‘నేదం తత్’ అని చెప్పుచున్నది. అట్లే దీపములు స్వయముగా దైవము కాదు. మానవులందరు భగవదవతారములు కారు. ఒకానొక మానవుడుగు శ్రీకృష్ణుడు మాత్రమే భగవదవతారము. అనగా అగ్ని స్వరూపములలో కేవలము ‘జఠరాగ్నియే’ వైశ్వానర నామమున దైవస్వరూపమని గీత బోధించుచున్నది. అట్టి వైశ్వానరాగ్నికి తృప్తి కలిగించు ఆహారమును పెట్టుటయే నిజమైన దైవారాధనము. సాక్షాత్తు మానవరూపమున శ్రీకృష్ణభగవానుడే వచ్చియుండగా ఆయనకు భిక్షపెట్టక, ఒక సామాన్య మానవుని పిలచి వానిని దైవస్వరూపముగా భావించి ఆపోసనము వేయనేల?
అట్లే సాక్షాత్తు దేవతాస్వరూపమగు వైశ్వానరుడు ఆరాధనమునకు లభించుచుండగా, సామన్యమైన భౌతికాగ్ని స్వరూపములగు దీపములకు నూనెను, ఆవునేతిని పోయనేల? ఆ నూనెను, ఆవునేతిని ఆహార స్వరూపముగా మార్చి ఆకలిగొన్న అశక్తులగు బిచ్చగాళ్ళ జఠరాగ్నియగు వైశ్వానర రూపమును ఆరాధించినచో నిజమైన దైవారాధనమగును. దీపారాధనము వేదములో లేదు. ప్రాచీన సంప్రదాయము అన్నచో, పిలకలను పెట్టుకొనుట, ధోవతులను మాత్రమే కట్టుట, చొక్కాలను ధరించకుండుట మొదలగు ప్రాచీన సంప్రదాయయులను ఏల పాటించకున్నారు? ప్రాచీనము అంతయు మంచిదే అని అనరాదు అని పండితులే ‘పురాణమిత్యేవ న సాధు సర్వమ్’ ‘తాతస్య కూపోఽయమితి బ్రువాణా’ అని చెప్పుచున్నారు కదా. అనగా మా తండ్రి తవ్వించిన బావి అని మూర్ఖుడు దానిలోని ఉప్పు నీటినే త్రాగును అని అర్థము. గీతలో సత్యమే జ్ఞానమనీ, జ్ఞానమే ప్రకాశమని చెప్పబడుచున్నది. కావున జ్ఞానమే నిజమైన దీపము. ఆ జ్ఞానదీపము వెలిగించినచో సత్యమంతయు బోధపడును.
★ ★ ★ ★ ★