19 Jan 2025
Updated with Part-2 on 20 Jan 2025
ప్రేమ వేరు మోహము వేరు. ప్రేమ యనగా నీ పుత్రునకు కష్టపడి చదువు చెప్పుట, చదివించుట. ఆ చదువుతో వాడు పరీక్ష వ్రాసి ఉత్తీర్ణుడగుట. మోహమనగా చదువు చెప్పిననూ వానికి వంటబట్టక పోయినపుడు వానికి కాపీలు అందించి వానికి బదులు నీవు పరీక్ష వ్రాసి కాని వానిని ఉత్తీర్ణుడుగా చేయుటకు ప్రయత్నించుట. ప్రేమ కర్తవ్య స్వరూపమైన జ్ఞానము. మోహము మోసముతో కూడిన అజ్ఞానము. తుకారాం తన భార్యకు ప్రతిరోజూ భగవంతుని గురించి బోధించినపుడు ఆ బోధలపై ఆమె నిజముగా లగ్నము చేసినచో తానుయును దివ్య విమానములో వైకుంఠమునకు పోవుటకు యోగ్యత సంపాదించి ఉండెడిది. కాని ఆమె గృహకృత్యముల మీదనే మనసు ఎక్కుగా లగ్నము చేసెడిది. ఆ గృహకృత్యములలో మునిగిపోవుటచేతనే ఆలస్యము జరిగి విమానము ఎక్కుటకు వీలులేకపోయినది. తుకారాం కూడా ఆ విమానంలో ఆమెకు స్థానము ఇచ్చెదనన్నాడు. కాని ఆమెకు అర్హత ఉన్నదా లేదా యని నిర్ణయించువాడు స్వామి. అర్హత గురించి ఆలోచించకుండా తన భార్య గావున విమానములో తుకారాం స్థానమిచ్చినాడు. చిట్టచివరి క్షణమున తుకారాం దైవానుగ్రహమేమిటో తెలుసుకున్నాడు, కావున ఆమె రాకపోయినను విమానంలో వెళ్ళిపోయినాడు. అట్లుకాక ఆమె పైన వ్యామోహముతో ఆమె వచ్చిన కాని తుకారాం ఎక్కకున్నచో తుకారాం ఎక్కకనే విమానము పోయి ఉండెడిది. అంటే ఆమె పై వ్యామోహము వలన తుకారాం కూడా అనర్హుడై ఉండెడివాడు.
కావున జీవుడు ప్రేమతో తన వారు పరాయివారు అను బేధము లేక అందరినీ ఉద్ధరించుటకు సర్వజీవులపై ప్రేమను కలిగియుండవలెను. కాని, కొందరిని మాత్రమే తన వారు అని, వారికి మాత్రమే సాధనలో ఉపదేశము చేయుట కేవలం మోహము అవుతుంది. ఇక వారు అనర్హులైననూ వారికి తనతోబాటు మోక్షమును ఇప్పించవలెనను కోరిక గుడ్డి వ్యామోహము. అత్యున్నత స్థాయి నుండి జీవుని అత్యధమ స్థాయికి దిగజార్చుచున్నది ఈ మోహమే. హనుమంతుడు మరియు శంకరాచార్యుడు ఈ ఇరువురును శివావతారమే. హనుమంతుడెప్పుడూ “దాసోఽహం” అన్నాడు. కాని శంకరులు సోఽహం, శివోఽహం అన్నారు. ఈ తేడా ఎందుకు వచ్చినది? హనుమంతుడు తల్లి బంధముకు లొంగిపోయి స్వామితో యుద్ధము చేసినాడు. శంకరులు స్వామి కొరకు తన తల్లినే త్యజించినాడు. మోహమును త్యజించినపుడు తను సాక్షాత్తు శివుడైనాడు. మోహములో పడి పోయినప్పుడు తాను జీవస్థితిలో దాసుడైనాడు. కావున సాధన అనగా సర్వ సంసార మోహములను తెంచుటయే. స్వామిపై ఏకైక మోహము ఏర్పరచుకొనుటయే. ఇది మనస్సులలో లేక మాటలలో కాదు, ఆచరణములో రావలెను. అయితే సత్యమైన జ్ఞానము లేనిచో ఆచరణము ఎన్నటికీ రాదు. సద్గురువు నుండి సత్యమైన జ్ఞానమును పొందినచో నేడు కాకపోయినను రేపు అయినను ఆచరణము సిద్ధించును. ఏలనననగా మోహమునకు మూలకారణము అజ్ఞానమే.
కావున నారాయణ స్వరూపుడగు సద్గురువు లభించుట చాల దుర్లభము. అట్టి సద్గురువును అన్వేషించుటయే నీవు చేయవలసిన సాధన. అట్టి సద్గురువును గుర్తించి ఆశ్రయించినచో నీవు ఆయన నుండి సత్యమైన వేదార్థమైన బ్రహ్మజ్ఞానమును పొంది ముక్తుడగుదువు. నీవు బ్రహ్మజ్ఞానము చేత ఏ లక్ష్యము పొందుచున్నావో ఆ లక్ష్యమే సద్గురువు యొక్క స్వరూపము. సంసార బంధమోహములను తెంచుకొనుటయే మోక్షము. సద్గురువు పై ఏకైక బంధము నిల్పుకొనుటయే కైవల్యము. ఇదియే నిజమైన జీవన్ముక్తి. కనిపించిన వానిని గుర్తించలేనప్పుడు కనిపించని వానిని ఎలా గుర్తించగలవు? జీవన్ముక్తి పొందని వానికి విదేహముక్తి కూడ రాదు. సద్గురువును పట్టుకొనుటయే సరియైన ఆత్మజ్ఞానము. ఆత్మ శబ్దమునకు నాలుగు అర్థములున్నవి. అవి:
i) పంచభూత శరీరము, ii) త్రిగుణముల మిశ్రమము, iii) శుద్ధచైతన్యము, iv) పరమాత్మ లేక పరబ్రహ్మము.
ఇందులో మొదటి మూడు సృష్టి. నాల్గవది సృష్టికర్త. పరమాత్మ అవతరించునపుడు పంచభూత శరీరమను కవచమును (coat), త్రిగుణమిశ్రమమగు చొక్కాను, శుద్ధచైతన్యమగు బనియను అను మూడింటిని ధరించును. ఇవే స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు. సామాన్య మానవుడు ఈ మూడు శరీరములే స్వరూపములుగా కల్గియుండును. కాని శ్రీకృష్ణునిలో ఈ మూడు శరీరములను ధరించిన పరమాత్మ ఉన్నాడు. అయితే సామాన్య మానవునిలో ఉన్న మూడు శరీరములు కూడ పరమాత్మ పై ఆధారపడి ఉన్నవి కావున పరమాత్మతో స్పర్శను కల్గియే ఉన్నవి కదా అని భ్రమించరాదు. సామాన్య మానవ స్వరూపమగు ఈ మూడు శరీరములు పరమాత్మ యొక్క సంకల్పము అను పరమాత్మ యొక్క మనస్సు పై ఆధారపడి నిలచియున్నవే కాని, పరమాత్మతో నేరుగా స్పర్శను కలిగిలేవు. జీవులతో సహా ఈ విషయము ఆయన మనోరూపములగు ఊహలే.
ఒక ఊహానగరము తగలబడుచున్నను ఊహించువాని శరీరమునకు వేడి కూడా తగులుట లేదు. ఆయన యొక్క మనస్సునే మాయాశక్తి అంటారు. జీవులతో సహా ఈ జగత్తు అంతా మాయ యొక్క పరిణామమే కాని ఆయన యొక్క పరిణామము కాదు. సామాన్య మానవునిలో ఉండు బనియను వంటి శుద్ధచైతన్యము మరియు ఈ మాయాశక్తి, రెండునూ ఒక్కటే. శుద్ధచైతన్యమైన ఈ మాయాశక్తి జడమైన జగత్తుగా పరిణమించి కొన్ని జడరూపములలో ప్రవేశించుట వలన ఆ రూపములు ప్రాణులు అనబడుచున్నవి. కావున అద్వైతులు శుద్ధచైతన్యము వరకు పోగలరు కాని పరమాత్మను ఎవరును అంటుకొనలేరు (cannot touch). ఊహాజగత్తులో (imaginary world) ఊహారూపమైన ఏ ప్రాణియును ఊహించు వాని శరీరమును అంటుకొనలేదు గదా?
కావున ఒక సామాన్య మానవుడు ఆత్మ జ్ఞానము పొందుట అనగా తాను అయిన మూడు శరీరములను పొందుటయే. నేను దేహము కాదు అను కవచమును దాటవచ్చును. నేను గుణము కాను అని త్రిగుణములను చొక్కాను దాటవచ్చును. కాని నేను శుద్ధచైతన్యము అను బనియనును దాటిపోలేరు. శుద్ధచైతన్య స్వరూపమే నీవు అను ఆత్మజ్ఞానము పొందినపుడు, గుణ వికారమగు సుఖ దుఃఖములకు అతీతుడవై పరమాత్మను పొంది శాంతిని పొందెదవు. కాని నీలో ఉన్న శుద్ధచైతన్యమునే నీవు పొందినావు. దీనిచేత అశాంతి అను నష్టము నుండి నిన్ను నీవు రక్షించుకొన్నావు. నష్టమును పొందకుండుట లాభము కాదు. లాభము అనగా నీవద్దలేని దానిని పొందుట. అట్టి లాభము కొరకు నీవు ఆ మూడు శరీరములు ధరించిన పరమాత్మను పొంది ఆయనకు ప్రియుడైనచో నీవు లాభమును పొందినట్లే. బంగారమును పొందినపుడు నీవు లాభము పొందినట్లే. బంగారమును మ్రింగి నీలో ఉండనక్కరలేదు.
పరమాత్మ మూడు శరీరములను ధరించి ప్రతి మనుష్యతరమునను అవతరించుచున్నాడు. ఈ మూడు శరీరములు ఆయన కాదు. ఈ మూడింటికిని అతీతుడు అని తెలుసుకొన్నచో ఆయన పరీక్షలలో నెగ్గి ఆయనను గట్టిగా పట్టుకొనగలరు. ఆకలి దప్పికలు, జనన మరణములు కలిగిన ఆయన స్థూల శరీరమును జూచి సామాన్య మానవుడని భ్రమించినచో మొదటి పరీక్షలోనే త్రప్పిపోవుదురు. ఇక ఆయన యొక్క త్రిగుణములు అను సూక్ష్మ శరీరమును చూచినప్పుడు ఆయన సామాన్య జీవుడని భ్రమించినచో ఆయన యొక్క రెండవ పరీక్షలో త్రప్పిపోవుదురు. ఈ త్రిగుణములలో సద్గుణములనెడి కళ్యాణగుణములనెడి సత్త్వగుణము మాత్రమే కాదు, రజోగుణ, తమోగుణములను దుర్గుణములూ ఉన్నవి. గుణము ఆయన కానప్పుడు ఆయన ప్రదర్శించు ఏ గుణము చేతనూ నీవు భ్రమలో పడరాదు. మూడు రంగుల చొక్కాయే త్రిగుణములు. ఆయన చొక్కా కాడు. చొక్కా ధరించిన వాడు. ఆయన త్రిగుణములతో కూడి ఉన్నాడు అను అర్థమునే ఆయన యొక్క త్రిముఖములు సూచించుచున్నవి. అంతే కాని మూడు తలలతో ఉండు ఒక విచిత్రాకారము గాదు.
బ్రహ్మ రజోగుణము, విష్ణువు సత్త్వగుణము, శివుడు తమోగుణము. త్రిమూర్తులలో (త్రిగుణములు) ముగ్గురూ సమానమే. దుర్గుణములు లేని కేవల కళ్యాణ గుణములను సత్త్వగుణమును విష్ణు ముఖముతో వున్న ఏకముఖ దత్తునిగా కొందరు తలచుచున్నారు. కాని అది సరికాదు. త్రిమూర్తులు ఒక్కరే యని వేదము చెప్పుచున్నది. కావున గుణములందు భేదదృష్టి వుండరాదు. అన్ని గుణములకు అతీతమైన దృష్టి రావలెను. ఆయన సరస్సులో నుండి దిగంబరుడై దిగంబరస్త్రీని ఆలింగనము చేసుకొని బయటకు వచ్చినపుడు గుణభేద దృష్టిగల ఋషులందరు పారిపోయినారు. దత్తుడనగా సద్గురు స్వరూపమున అవతరించి సాధక లోకమునకు దత్తమైనవాడు.
పరమాత్మ యొక్క ప్రతి నరావతారమే అవతారము కాని, స్వర్గలోకాధిపతి ఇంద్రుడు మొదలగు వారివలె ఒక ప్రత్యేక దేవతా స్వరూపము కాదు. కావున ఆయన దుర్గుణములను ప్రదర్శించిననూ, ఆయన గుణాతీతుడని గ్రహించుటయే రెండవ పరీక్షలోని విజయ రహస్యము. ఇక మూడవ పరీక్షలో శుద్ధచైతన్యమైన బనియను ఆయన అని అద్వైత పండితులు భ్రమపడి నేనూ, అవతార పురుషుడు ఒక్కటే అని, ‘అహం బ్రహ్మాస్మి’ అని భ్రమపడుచున్నారు. జ్ఞానము, అష్టసిద్ధులు అను అనూహ్యశక్తులను అవతార పురుషుడు మాత్రమే కలిగియున్నాడు. కావున జీవేశ్వరుల భేదము గుర్తించుటయే మూడవ పరీక్షలో విజయము. రెండు గాజు గ్లాసులున్నవి. ఇవియే పంచభూత శరీరములు. రెండింటిలోను శుద్ధజలమున్నది. ఇదియే శుద్ధచైతన్యము. రెండు జలములలోను పంచదార, ఉప్పు, మట్టి కలసియున్నవి. ఇవియే త్రిగుణములు. కావున శరీరము, త్రిగుణములు, శుద్ధచైతన్యము ఈ మూడు శరీరములు కృష్ణునిలోను, నీలోను సమానములే. కాని కృష్ణునిలో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ నేరుగా కనిపించకున్నను ఆయన యొక్క అనూహ్యమైన జ్ఞానము, అష్టసిద్ధులు కృష్ణునిలో ఉన్నవి. నీలో లేవు. ఈ శక్తుల వలన ఆయన ఈశ్వరుడు, నీవు జీవుడు అను తేడా వచ్చినది. శక్తి స్వతంత్రముగా వుండజాలదు. కావున దానికి ఆధారము ఉండియే తీరవలయును. కావున కృష్ణునిలో అద్భుతశక్తికి ఆధారమైన పరమాత్మ ఉన్నాడు.
శాక్తేయులు కనిపించుచున్న శక్తి వరకే పోగలరు. కావున వారును పరబ్రహ్మమును గుర్తించలేక భ్రమలో పడినవారే. పై రెండు గ్లాసులలో ఒక గ్లాసులో కంటికి కనిపించని వజ్రము ఉన్నది. ఆ వజ్రకాంతి జలమును, గ్లాసును ఆక్రమించి వెలుగుచున్నది. ఈ గ్లాసే కృష్ణుడు. వజ్రమే పరమాత్మ. కాంతియే అనూహ్యమైన మాయాశక్తి. కావున ప్రకృతి ధర్మములు కల శరీరమునే కృష్ణుడు అనుకొనుట మొదటి భ్రమ. ఈ పరీక్షలో ఆయన మనవలె ఆకలితో వెన్న తినుచున్నాడు అని భ్రమలో పడుదురు. ఇక వెన్నను దొంగిలించు తమోగుణమును ప్రదర్శించగా ఈతడు కళ్యాణ గుణస్వరూపుడు కాడని రెండవ భ్రమలో గుణమే పరమాత్మయని భ్రమించుచున్నాడు. ఇక మూడవ భ్రమలో ఆయన నిర్గుణమైన శుద్ధచైతన్యమని భ్రమించి అద్వైత పండితులు నేను కృష్ణుడు ఒక్కటేయని భ్రమలో పడుచున్నారు. ఈ మూడు పరీక్షలను దాటిన గాని అవతార పురుషునిలో ఉన్న పరమాత్మ గోచరించడు. కావున ఆత్మ శబ్దమందున్న నాలుగు అర్థములు అవతార పురుషుని యందు ఉన్నవి. కావున అట్టి సద్గురువును గుర్తించుటయే సరియైన ఆత్మ జ్ఞానము.
కనుక నరావతారుడై అరుదెంచిన శ్రీ దత్తుని గుర్తించి, సేవించి, తరించుటయే మోక్షము – కైవల్యప్రాప్తి.
★ ★ ★ ★ ★