home
Shri Datta Swami

 15 Feb 2025

 

మనకు స్వామిపై గల ప్రేమయే గాయత్రి

[25.07.2001] గాయత్రి అనగా భజనయే. అల్పమైన సంగీతములో భగవంతుని గుణగణముల ప్రాధాన్యతను సూచించు శబ్దములతో, ఆ శబ్దములనే త్వరత్వరగా పలికి, ఆ శబ్దార్థములైన భగవంతుని గుణముల మీద ఆసక్తితో, ఆ శబ్దముల మధ్య వచ్చు సంగీతశాస్త్రపు కసరత్తులతో గల దీర్ఘరాగములపై దృష్టిలేక, పాడు నారదీయ పద్ధతినే గానము – భజన – కీర్తన అందురు. ఇట్లు ఋషులును వారి మాతృభాషయైన సంస్కృతములో భజన చేసిరి. దానినే సామవేదము అన్నారు. ‘వేదానాం సామవేదోఽస్మి’ అని గీత. స్వామి ఇట్టి సామప్రియుడు. అయితే ఈ గానములో సంగీతప్రేమ కాక, స్వామి పైగల గుణప్రేమ ప్రాధాన్యతను పొందినవుడు ఇది గాయత్రి అగును. ‘గాయన్తం త్రాయతే’ అను వ్యుత్పత్తి ననుసరించి కీర్తన చేయువానిని స్వామి రక్షించును. త్యాగరాజు, మీర, సూరదాసు మొదలగు భాగవతోత్తములందరు సామవేదమైన నారదీయమగు ఈ కీర్తనల మార్గము ద్వారా, గాయత్రీ అనుష్ఠానము చేసి తరించిన పరమపావనులు.

గాయత్రీ అనగా ఒక ఛందస్సు. ‘గాయత్రీ ఛందః’ అని చెప్పబడి ఉన్నది గదా. ఛందస్సుతో కూడిన వాక్యమే రాగమునకు బాగుండును. ఈ ఛందస్సే ఋగ్వేదము. కావుననే సామవేదము ఋగ్వేదముపై ఆధారపడి యున్నది. ‘త్రిపదా గాయత్రీ’ అన్నపుడు అట్టి అర్థమును ‘త్రిపాదస్యామృతం దివి’ అను శ్రుతితో సమన్వయించవలెను. అనగా త్రిపాదాత్మకమైన త్రిమూర్తి స్వరూపమైన శ్రీదత్తపరబ్రహ్మము గురించి ఈ కీర్తనలుండవలెను. అనగా ఏ దేవతా భజనలైనా, ఆ దేవతల వేషములందు నటుడగు శ్రీదత్తుని స్ఫురణము ఉండవలెను. త్రిమూర్త్యాత్మకమైన పరబ్రహ్మము యొక్క స్ఫూర్తినే త్రిగుణములతో కూడిన జందెము సూచించును. గుణము అనగా ‘పోగు’ లేక ‘సత్త్వా’ది గుణమనియు రెండు అర్థములున్నవి. రజోగుణ – సత్త్వగుణ – తమోగుణ ప్రతీకలగు బ్రహ్మ, విష్ణు, శివుల త్రిగుణముల ఏకీకరణమైన, మూడు వేషములందునున్న పరమాత్మయగు దత్త పరబ్రహ్మమే ఇచట దేవత.

Swami

సవితా దేవతా’ అని చెప్పినపుడు సవిత అనగా ప్రాణిప్రసవమును చేయు బ్రహ్మదేవుడే. ఆ వేషాంతర్గతుడగు దత్తుడే. సృష్టికర్త ఎవడో అతడే సృష్టిభర్త, సృష్టిహర్త గాన, బ్రహ్మదేవుడనగా ఆయన విష్ణు, శివులను అనుసరించియే ఉండును. జగత్ సృష్టి, స్థితి, లయాత్మకమగు ఈ శక్తి స్వామి యొక్క అత్యుత్తమమైన శక్తి కావున, దీనినే బ్రహ్మలక్షణముగా వేదము ధృవీకరించినది. ఇదే బ్రహ్మోపదేశము అందురు. ఇట్లు దత్తుని వద్దకు చేరుటయే ఉప = సమీపమునకు, నయనము = చేరుట. తత్త్వమును తెలియక పురుషబ్రాహ్మణులు తాము చేయునదియే గాయత్రి అని అహంకరించరాదు. పరమాత్మనుపాసింప సర్వజీవులకును అధికారము కలదు. అందరును ఆయన బిడ్డలే. అందుకే, ‘అహం బీజప్రదః పితా’ అని గీతావచనము.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch