home
Shri Datta Swami

Posted on: 12 Sep 2024

               

దత్తుడు ఏక ముఖుడై రెండు చేతులతోనే ఉన్న మానవ శరీరమునే ఆశ్రయించి యున్నాడు

[దత్త జయంతి సందేశము 07.12.2003] దత్తుడనగా భక్తులకు దర్శన, స్పర్శ, సహవాస, సంభాషణలు అనుగ్రహించుటకు; భక్తుల దుష్కర్మ ఫలములను ఆకర్షించుకొని, అనుభవించి, వారలను కష్ట విముక్తులను చేసి వారి సాధనలను నిర్విఘ్నముగా జరుపుకొనుటకును నరాకారమున అందించబడిన అవతారము. ఏ రాముడో, కృష్ణుడో మాత్రమే దత్తుడు అంటే కుదరదు. ఏలననగా  ఒక మనుష్య తరమునకే దత్తుడు పరిమితమైనచో మిగిలిన మనుష్య తరములకు సమానమైన న్యాయము కలుగదు. కావున ప్రతి మనుష్య తరమునకు, ప్రతి దేశమునకు, ప్రతి మతమునకు దత్తుడు రావలసిందే. లేకున్నచో మరల ఆయనకు పక్షపాత దోషము అంటును. ఒకే మతమున, ఒకే ప్రాంతమున మాత్రమే వచ్చినచో ఆ ప్రాంతమునకు స్వామి దర్శనమునకు బీదవారు రాలేరు. అయితే ఒకే ప్రాంతమున వివిధ స్థాయిలకు చెందిన జీవులు ఉన్నారు గదా. ఆయా జీవులకు ఆయా స్థాయిలకు తగిన అవతారములు కళావతారములు, అంశావతారములు, ఆవేశావతారములుగా రావలయును. ఈ అవతారములన్నియు ఆ మతము యొక్క సంప్రదాయములు, ఆ భాషావ్యవహారములతో ఉండును. ఈ అవతారములను మరియొక దేశమున ఉన్న మరియొక మతము వారు అంగీకరించరు. కావున ఆ దేశమున ఆ మతమునకు సంబంధించిన వివిధ స్థాయిలలో కల జీవులకు అచ్చట మరల వివిధ స్థాయిలలో అవతారములు రావలయును. ఈనాడు ఒకే దేశములో అనేక మతములు కూడ ఉన్నవి. కావున దీనిని అంతయు దృష్టిలో పెట్టుకున్నచో అవతారముల సంఖ్య లక్షలకు పైన రావలసియున్నది. కావున అట్లు వచ్చుటకు పరమాత్మకు ఎట్టి కష్టము లేదు. శ్రుతులు "సహస్ర శీర్షా పురుషః" "సహస్ర శీర్షం దేవం" అని చెప్పుచున్నది. సహస్రము అనగా అనంత సంఖ్య అని అర్థము. సర్వ శక్తిమంతుడైన పరమాత్మకు అసాధ్యము కానప్పుడు దీనిని నిరాకరించు అధికారము ఎవరికినీ లేదు. ఎవ్వరైననూ నేనొక్కడినే దత్తావతారమును అని ప్రగల్భములు పలికినచో అట్టి వాడు దత్తుడు కానేరడు. అట్టివాడు రాజసుడు, తామసుడు అగు మానవ రూపమున ఉన్న దానవుడే. అతడు కేవలము మహిమలపై ఆధారపడి అట్లు పలుకుచుండును. మహిమలు ఆయన సొమ్ములు మాత్రమే. ఆయన సొమ్ములను ధరించినంత మాత్రమున కనీసము ఆయన శరీరకాంతిలో ఒక్క కిరణము కూడ రాలేదు. కావున అట్టివాడు కనీసము కళావతారము కూడ కానేరడు. అట్టివారిని గురించి బైబిల్‌ లో భగవానుడు "ఓ దుష్టులారా! పొండు, మీరెవరో నేనెరుగను" అని వచించి యున్నారు. ఆయన స్వరూప లక్షణములు జ్ఞానము, ఆనందము, ప్రేమ యని వేదము "సత్యం జ్ఞానమ్ అనంతం బ్రహ్మ" "ఆనందో బ్రహ్మ" "రసో వై సః" అని తెలుపుచున్నది.

Swami

జ్ఞానము బ్రహ్మ నామము గల రజోగుణము. ప్రేమ విష్ణు నామము గల సత్త్వగుణము. ఆనందము సర్వమూ మరచిన శివ నామము గల తమోగుణము. అనగా ప్రతి దత్తావతారము త్రిగుణాత్మకమై యుండునని అర్థము. త్రిగుణములే త్రిమూర్తులు. భగవంతుడు ఒక్కడే తప్ప ముగ్గురు భగవంతులు లేరు. కావున బ్రహ్మ, విష్ణు, శివులను త్రిమూర్తులు లేరు. కావున దత్తునకు మూడు ముఖములు లేవు. ఇది బాలుర వంటి అజ్ఞానుల కోసము కల్పించబడిన ఒక కల్పనయే. మానవ రూపమున ఉన్న దత్తుడు ఏకముఖుడే. ఆరు చేతులు కూడ శరీరము యొక్క ఆరు వికారములు. షడూర్ములు. ఇవియే 1) అస్తి (ఉన్నది), 2) జాయతే (పుట్టుచున్నది), 3) వర్ధతే (పెరుగుచున్నది), 4) విపరిణమతే (మారుచున్నది), 5) అపచీయతే (బలహీనమగుచున్నది), 6) క్షీయతే (నశించుచున్నది). అనగా భక్తులకు దత్తమైన మానవ శరీరములో త్రిగుణములు ఉండుటయే మూడు శిరస్సులు. ఆ శరీరమునకు జనన, మరణాది షడ్వికారములు ఉండుటచే ఆరు చేతులు. ఈ మానవ శరీరమున పరమాత్మ ఆవేశించి భక్తులకు దత్తమై దత్తుడు అనబడుచున్నాడు. ఒకనిని ముఖము చేత గుర్తించ గలము. కాని చేతుల చేత కాదు. ఈ పరమాత్మ జ్ఞానానంద ప్రేమలను మూడు గుణములలో చేరి యున్నాడు. కావున మూడు గుణములు పరమాత్మకు సంబంధించినవి.  ఆరు వికారములు ఆయన ఆశ్రయించిన శరీరమునకు సంబంధించినవి. ఈ మూడు గుణములు కలసి మాయ లేక ప్రకృతి అనబడును అనియు,

పరమాత్మ ఎల్లప్పుడును ఈ మాయతో కలసి ఉండుననియు గీత "మాయాం తు ప్రకృతిం విద్ధి", "మాయినం తు మహేశ్వరమ్‌" అని చెప్పుచున్నది. ఈ మూడు గుణములు (సత్త్వ, రజ, స్తమోగుణములు) వివిధ ప్రమాణములలో కలసి ముఖ్యముగా పదునారు కల్యాణ గుణములుగను కారుణ్య, సౌజన్య, ఔదార్య, గాంభీర్య, సౌందర్య, సౌరభ్య, ధైర్య, వీర్య, జ్ఞాన, బల, యోగ, తేజో, విలాస, విభూతి, సామర్థ్యాది అనంత గుణములు. ఇంకను అనంత కల్యాణ గుణములుగను ప్రకాశించుచున్నవి. కావున అనంత కల్యాణ గుణములతో అనంత ముఖములలో సహస్ర శీర్షుడై, విశ్వరూపుడై పరమాత్మ ఉన్నాడు. ఇట్టి పరమాత్మ స్వరూపమైన కల్యాణ గుణములు దానవుల యందు లేనందున తనకు వారికిని ఎట్టి సంబంధము లేదన్నాడు. కావున దత్తుడు ఏక ముఖుడై రెండు చేతులతోనే ఉన్న మానవ శరీరమునే ఆశ్రయించి యున్నాడు. కుడి ప్రక్కన ఉన్న చేతితో జ్ఞానబోధను చేయు చిన్ముద్రలో ఉన్నాడు. ఎడమ చేతిలో అష్టసిద్ధులను కలిగియున్నాడు. కావున దక్షిణ భాగము గురుస్వరూపము వామభాగము భగవత్‌ స్వరూపము అయియున్నది. దక్షిణ భాగమున ఉన్న శంఖము, డమరుకము, జపమాల జ్ఞానమును సూచించును. శంఖము, ఢక్కా శబ్ద స్వరూపములు. ఆ శబ్దము అక్షరములుగా ఏర్పడి, ఆ అక్షరముల మాలయగు వాక్యమును జపమాల సూచించుచున్నది. వాక్యముల ద్వారా జ్ఞానబోధ జరుగును. ఎడమవైపున ఉన్న చక్ర శూలములు కమండలములోని మంత్రజలము శక్తిని సూచించుచూ అష్టసిద్ధులను చెప్పుచున్నది. పరమాత్మ యొక్క జ్ఞానానంద ప్రేమలు అనంతములు. కావున ఆయన స్వస్వరూపములో ప్రకటించుకొన్నచో జగత్తే మాయమగుచున్నది. జగత్తులో ఉన్న నీవు కూడ అదృశ్యమైపోవుచున్నావు. కావున ఆయనను నేరుగా దర్శించి, అనుభూతి పూర్వకమైన జ్ఞానమును పొందుట అసంభవము. కావున బ్రహ్మజ్ఞానము నేరుగా కలుగుట బ్రహ్మమునకే సాధ్యమని శ్రుతి "బ్రహ్మవిత్‌ బ్రహ్మైవ భవతి" అని చెప్పుచున్నది.

గీత కూడ పరమాత్మను నేరుగా ఏ జీవుడు తెలియజాలడని "మాం తు వేద న కశ్చన" అని పలుకుచున్నది. ఇట్టి పరమాత్మ భక్తులకు తన యొక్క అనుభవ పూర్వకమైన జ్ఞానమును అందించుటకు ఒక ఏర్పాటును చేసియున్నాడు. అదే గీతలో "మానుషీం తను మాశ్రితమ్" అను చెప్పబడినది. అనగా ఒక నర శరీరమును ఆశ్రయించి తన జ్ఞానానంద ప్రేమలను వ్యక్తము చేయుట, నర శరీరమునకు బదులు ఏ జడ విగ్రహమునో, ఏ పశువునో, ఏ పక్షినో ఆశ్రయించరాదా! అన్నచో అట్లు ఆశ్రయించినచో ఆ జడ వస్తువుగానీ, పశువుగానీ, పక్షిగానీ భక్తులకు తన జ్ఞానానంద ప్రేమలను ఎట్లు వ్యక్తము చేయగలదు? జడ విగ్రహములు, జడపటములు తన మూడు గుణములలో ఏ ఒక్క గుణమునైననూ వ్యక్తము చేయునపుడు ఇక అవతార ప్రయోజనము ఏమి? ఇక పశు పక్ష్యాదులు కొన్ని చేష్టలతో ఆనంద ప్రేమలను వ్యక్తము చేయునే గానీ జ్ఞానమును వ్యక్తము చేయలేవు గదా. ఆనంద ప్రేమలు కూడ మనలో కలిగించవలయును గానీ వాటిలో వ్యక్తము అగుట లక్ష్యము కాదు గదా. కనుక అట్టి ఆనంద ప్రేమలు ఆ జ్ఞానమునే అనుసరించి రావలయును. జ్ఞానము అను బ్రహ్మ తరువాత, ప్రేమయను విష్ణువు, ఆనందమను శివుడు రావలయును. అట్టి పరమాత్మ జ్ఞానము పండితుల నుండి గాని, గ్రంథముల నుండి గాని లభించదు. అట్టి జ్ఞానము తలనొప్పిని పుట్టించునే గాని ప్రేమానందమయము కాదు. పరమాత్మ వద్ద ఉన్న అనన్య సాధ్యమైన అట్టి విశేష జ్ఞానమే "ప్రజ్ఞానము" అని శ్రుతి "ప్రజ్ఞానం బ్రహ్మ" అని చెప్పుచున్నది. ఇట్టి విశేష జ్ఞానము మానవ రూపము ద్వారానే సాధ్యము గానీ పశు పక్షి పాషాణాల ద్వారా సాధ్యము కాదు. అట్టి విశేష జ్ఞానమును ఆ నరావతారము నుండి శ్రవణము చేసి ఆయనను సేవ ద్వారా ప్రేమించి ఆయనచే ప్రేమించబడి అఖండానందమును పొందుటయే నిజమైన మోక్షము, జీవన్ముక్తి. కొందరు కేవలము ప్రేమానందములను మాత్రమే ప్రకటించు చున్నప్పుడు, మూడు తత్త్వములు లేనందున వారు దత్తావతారులు కారు. మరికొందరు ఏవో నోటికి వచ్చినది వచించిచూ వాటినే జ్ఞానముగా బోధించు చుందురు. ఇది జ్ఞానము కానే కాదు. దత్తుడే వేద కర్తయు, గీతా బోధకుడు. కావున వారి జ్ఞానమును ఉపనిషత్తులు, గీతలను ప్రమాణములుగా చూపుచూ శాస్త్ర సమ్మతమై ఉండవలయును.

వేదముల మహావాక్యములు పరమాత్మ మనుష్యాకారమున ఉండి విశేష జ్ఞాన సంపన్నుడై ఉండునని చెప్పుచున్నవి. ఇవే మహా వాక్యములు "తత్త్వమసి" "అహం బ్రహ్మాస్మి" "అయమ్ ఆత్మా బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ”. బ్రహ్మ నా వలె ఉన్నాడు. బ్రహ్మము నీ వలె ఉన్నాడు. బ్రహ్మము వాని వలె ఉన్నాడు. “వలె” అనునది లుప్తమైనది. ఇదే ‘లుప్త ఉపమాలంకారము’. కనుక బ్రహ్మము నరరూపములో ఉంటాడని సూచించుచున్నది. అంటే మానవ రూపంలో ఉంటాడనియే గదా. ఇదే "మానుషీం తను మాశ్రితమ్‌" నకు అర్థము. అయితే అందరు మానవులు బ్రహ్మమేనా? కాదు. కాదు. "ప్రజ్ఞానం బ్రహ్మ" ఇతర జీవులకు సాధ్యము కానిదే ప్రజ్ఞానం. పరమాత్మను గుర్తించటానికి ఈ ప్రజ్ఞానమే గుర్తు. త్రేతాయుగములో శ్రీ రాముడు, ద్వాపరంలో శ్రీ కృష్ణుడు పరబ్రహ్మలు. ప్రజ్ఞానము నుండి ప్రేమయు, ప్రేమ నుండి ఆనందము పుట్టుచున్నవి. కావున అట్టి విశేష జ్ఞానమే అనగా ప్రజ్ఞానమే దత్తుని యొక్క ప్రధాన లక్షణము. అది ఉన్నచో ప్రేమానందములు తప్పక జన్మించును. కావున ఆ రెండింటిని గురించి ప్రత్యేకముగా చెప్పనక్కరలేదు. దత్తుడనగా దానము లేక త్యాగము చేయువాడు. కావున అట్టి త్యాగము లేక జీవులు దత్తస్వరూపులు కాలేరు.

కావున బ్రహ్మత్వము పూర్ణముగా సిద్ధించదు. అట్టి త్యాగము తాను పొందిన జీవన్ముక్తి సర్వజీవులు పొందవలెనని చేయు ప్రచార కర్మయే. మానవరూపుడైన పరమాత్మ యొక్క సర్వజీవోద్ధరణమైన లోక కల్యాణ కర్మయును జ్ఞాన ప్రచార కార్యక్రమములో పాల్గొనుటయే కర్మయోగము లేక సేవ. కర్మసంన్యాసము, కర్మఫల త్యాగము కలసినపుడే కర్మయోగము అగును. అదియే సేవ. కర్మ సంన్యాసమనగా కొంత పనిని స్వామి కార్యములో పాల్గొనుట, చేయుట. కర్మ ఫల త్యాగము అనగా తాను కర్మలను చేసి సంపాదించిన ధనము నుండి కొంత స్వామి కార్యమునకు అర్పించుట. ఇట్లు హనుమంతుడు చేసి సాక్షాత్తుగా బ్రహ్మ పదవినే పొందియున్నాడు. వాల్మీకి రామాయణానుసారముగా అతడు ఎట్టి పూజలు, జపములు, ధ్యానములు చేయలేదు. కేవలము క్రియాత్మకమైన సేవ ద్వారానే పరమాత్మ పదవిని పొందినాడు.  భగవద్గీత చెప్పిన కర్మ ఫల త్యాగము పారాయణాది కర్మల ఫలముల యొక్క త్యాగము కాదు. కేవలము వాక్కులకునూ, కేవలము భావములైన మనస్సుకునూ, భావోద్రేకములో కార్చు కన్నీటికినీ సేవ లేనిచో వెనుక సంఖ్యలేని సున్నాల వలే వ్యర్థములే అగును. ఏలననగా వేదము ధన త్యాగమే కర్మఫలత్యాగమని "ధనేన త్యాగేనైకే " అని చెప్పుచున్నది. ఆ కర్మ ఫలత్యాగమే దత్త పరీక్ష. సంవత్సరమంతయూ చదివిన చదువు ఎంత వంట బట్టినది అని నిర్ణయించు పరీక్ష యొక్క ఫలితముపై ఆధారపడి డిగ్రీని ఇత్తురు గానీ నీవు సంవత్సరమంతయు చదివిన చదువుకు కాదు. కావున కర్మఫలత్యాగములో ఓడిపోయిన వాడు ఎంత ధ్యానము, జపము, భజన, పారాయణము పూజలు చేసిననూ పరీక్ష వ్రాయని సంవత్సర కాలపు చదవువలె వ్యర్థమే అగును. కర్మఫలత్యాగము ఎంత మహిమ గలది అన్న, తిన్నడు వేటాడిన వేటయను పాపకర్మ కూడా, దాని కర్మఫలమగు మాంసము స్వామికి సమర్పించగా ఆ వేటయను పాపకర్మము సైతము లెక్కింపబడక తిన్నడికి మోక్షము లభించెను.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch