08 Jan 2025
[07-03-2004 ఉదయము 8 గంటలకు] పథ్యములేని ఔషధము వ్యర్థము. ఏలయనగా ప్రతిదినము ఒక గంట సత్సంగము చేయుచున్నావు. ఇది ఔషధసేవ. ఈ సత్సంగమునకు భిన్నమైన కుటుంబ సంబంధమైన మరియు లోకసంబంధమైన విషయములయందు ఆసక్తి చూపుట అజ్ఞానము. ఔషధమను సత్సంగమును సేవించినావు. మరల అజ్ఞానమును అపథ్యాహారమును సేవించుచున్నావు. జలుబు మాత్ర వేసుకున్నావు. జలుబు కొంత ఉపశమించినది. మరల దినమంతయు ఐస్ నీళ్ళను త్రాగుచున్నావు. రెండవరోజు ఉదయమునకు మరల జలుబు పూర్ణరూపమున ఉన్నది. మరల మాత్ర వేసుకొనుచున్నావు. మరల రోగము కొంత ఉపశమించినది. మరల ఐస్ నీళ్ళు, మరల మాత్ర. దీని వలన రోగికి ప్రయోజనమేమి? కావున అత్యవసరమైన కర్తవ్య విషయములో తప్ప ఇతర లౌకికవిషయములందు సంగమును వర్జించుము. ఎట్లు ఆధ్యాత్మిక వ్యక్తులతో సంగము, సత్సంగము నిచ్చుచున్నదో అట్లే లౌకికవ్యక్తులతో సంగము దుస్సంగమై నీ చేత అజ్ఞానమను అపథ్యాహారమును తినిపించుచున్నది. కావున మొహమాటము లేక లౌకికుల యొక్క సంగమును పరిహరించుము. వాడు కుమారుడైనను, తండ్రియైనను సరే.
ఏలననగా ఈ బంధములు అసత్యమైన నాటక బంధములు. ఈ జ్ఞానము నీకు తెలిసినపుడు నీకు మొహమాటము రాదు. అంత్యక్షణమున వీరు ఎవ్వరూ నిన్ను రక్షింపజాలరు. ఆ అంతిమక్షణమున స్వామి నీకు చావు తెలివినిచ్చును. ఆ సమయమున అశక్తుడవై పడు వేదనయే మరణవేదన. అప్పుడు నీ ఆత్మకు నీవు ఎంత ద్రోహము చేసుకున్నావో తెలియును. నీ భ్రమలు అన్నియు తొలగును. ఈ జ్ఞానమును నిత్యము స్మరించుము. మదించిన ఏనుగును అంకుశమువలె నీ సంసారపు పిచ్చిని ఇది నిగ్రహించును. కావున ఈ జన్మలో నీవు సంపాదించిన ఆధ్యాత్మిక జ్ఞానము ఈ జన్మలోనే నీ అపథ్యాహారము వలన నశించిపోవుచుండగా, ఈ జ్ఞానము నీకు మరుజన్మకు ఎట్లు అందును? మరియు మరుజన్మ మానవజన్మ వచ్చునని నమ్మకము లేదు. నీ ఫైలు ప్రకారము ఈ ప్రస్తుత మానవజన్మ కూడా, నీవు సంపాదించుకున్నది కాదు. ప్రతి జీవునకు స్వామి ఒక అవకాశమిస్తాడు. ఆ ఒక్క అవకాశమే ఈ మానవజన్మ. ఇచ్చిన అవకాశమును దుర్వినియోగము చేసుకొన్న నీకు మరల అవకాశము లభించదు.
అందుకే క్రైస్తవమతములో మరల మానవజన్మ లేదనియు, ఈ మానవజన్మ తరువాత తుది తీర్పు చేయబడుననియు క్రీస్తు భగవానుడు చెప్పియున్నాడు. ముస్లిముల మతములో కూడ ఇదే ఉన్నది. అది నిజమే. ఏలయనగా, ఇచ్చిన అవకాశమును దుర్వినియోగము చేసుకున్నవానికి ఎన్నిసార్లు అవకాశము యిచ్చినను వాడు మరల మరల దుర్వినియోగము చేయునే తప్ప సద్వినియోగము చేయడు. కావున ఈ మానవజన్మ తరువాత నిరంతరము సంసార వాసనలతో పరిపూర్ణమైన పశుపక్ష్యాది జన్మలు లభించుట తథ్యము. ఆ చక్రములో పడిన తరువాత మరల మానవజన్మ లభించుట అసంభవము.
కావున భగవంతుడు నిన్ను గురించి ఈ జన్మలో ఒక నిర్ణయమును తీసుకొనపోవుచున్నాడు. ఏ మాత్రమైనను ఆత్మోద్ధరణము చేసుకొను అవకాశము ఉన్నది అని అనిపించినపుడే స్వామి నీకు మరల మానవజన్మ నిచ్చును. కాని మరణ సమయము వరకు నీ ప్రవర్తన, ఈ జీవుడు ఇక మారడు అని స్వామి తీసుకొనబోవు నిర్ణయమును ప్రోత్సహించుచున్నది. కావున హిందూమతము ప్రకారముగా కూడా మరల ప్రతి మానవునకు మరల మానవజన్మ వచ్చునని నమ్మకము లేదు. అట్టి అవకాశము లేని జీవులను శాశ్వతముగా పశు, పక్షి, రాక్షసాది జన్మల యందు త్రోసివేయుదునని గీతలో భగవానుడు ‘క్షిపా మ్యాసుర యోనిషు’ అని చెప్పియున్నాడు.
కావున వైరాగ్యము అను పథ్యముతో కూడిన ఆధ్యాత్మికజ్ఞానమను ఔషధసేవ నిత్యము ఉండవలయునని గీత చెప్పుచున్నది. ‘ఆధ్యాత్మిక జ్ఞాన నిత్యత్వమ్’. నిరంతరము సత్సంగములను చేయుట, వైరాగ్యములో నుండుట అనునవి రెండే ఔషధసేవ మరియు పథ్యము అనియు గీత చెప్పుచున్నది ‘అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే’. ఓ పిచ్చి జీవుడా! ఇతర జీవులు ఎవరును నిన్ను రక్షించజాలరనియు, నీకు నీవే ఆత్మోద్ధరణము చేసుకొనవలయుననియు, అట్లు చేసుకొననిచో నీ ఆత్మను నీవే చేతులారా నాశనము చేసుకునుచున్నావనియు ‘ఉద్ధరే దాత్మనాత్మానం నాత్మాన మవసాదయేత్’ అనియు గీత బోధించుచున్నది.
★ ★ ★ ★ ★