16 Nov 2024
Updated with Part-2 on 17 Nov 2024
చక్రాల వివరణ: 1) మూలాధారము: స్థిరమగు భూమితత్త్వము. ఇది స్థిరాస్తియగు ధనమును సూచించును.
2) మణిపూరము: చలమగు జలతత్త్వము. ఇది చరాస్తియగు ధనమును సూచించును. ధనబంధము కన్న స్వామి బంధము ఎక్కువ అని నిరూపించినవాడే ఈ రెండు బంధములను దాటినవాడు.
3) స్వాధిష్ఠానము: అగ్నితత్త్వము. కామము అగ్నిస్వరూపము. ఇది భార్యాభర్తల బంధమును సూచించును. ఈ బంధముకన్న స్వామియే ఎక్కువ అని నిరూపించినవాడు స్వాధిష్ఠానము దాటినవాడగును. క్రొత్తగా పెండ్లియైన ఒకడు రామకృష్ణ పరమహంస సత్సంగములో రాత్రి ఆలస్యముగా ఇంటికి చేరెను. ఆలస్యముగా వచ్చినందులకు వాని భార్య చివాట్లు పెట్టెను. మరునాడు అతడు పరమహంసతో ఆ విషయము చెప్పెను. పరమహంస, నీ భార్యను వదలివేయుము అని తేలికగా చెప్పి పోయెను. ఎంతో ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్యను నాలుగు రోజులలోనే భగవంతునికన్న ఎక్కువ కాదని పరమహంస చెప్పినాడు. కాని ఈనాడు అరవై సంవత్సరములు దాటినను షష్టిపూర్తి చేసుకొని ఇంకనూ దగ్గర అగుచున్నారు. భగవంతుని అన్వేషించుటకై బుద్ధుడు క్రొత్తగా పెండ్లి అయిన యశోధరను త్యజించెను. స్వామి కొరకై మీరాబాయి భర్తను అంటలేదు. రామకృష్ణ పరమహంస భార్యను స్పృశించలేదు. వీరే స్వాధిష్ఠానము దాటినవారు.
4) అనాహతము: ఇక సంతానమును సూచించునది అనాహతచక్రము. హృదయస్థానమున ఉన్నది. అచ్చట ప్రాణస్థానములగు ప్రాణకోశములున్నవి. ఇది వాయుతత్త్వము. “వాయుర్వై క్షేపిష్ఠో దేవతా” అని శ్రుతి చెప్పుచున్నది. అనగా వాయువు అన్నిటికన్నను బలవంతుడని అర్థము. అనగా సంతానబంధము అన్ని బంధములకన్నను అత్యంత బలమైయున్నది. హృదయమున దాగి ప్రాణసమానమై యున్నది. అనాహతమనగా ఎవరిచేతను కొట్టబడనిది అని అర్థము. ఈ బంధము ఎవరూ ఛేదించలేరని అర్థము.
5) విశుద్ధము: అనాహతము దాటినను కంఠస్థానమున విశుద్ధచక్రమున్నది. ఇది ఆకాశతత్త్వము. సర్వవ్యాపకము. వాక్కును సూచించును. అనగా మాయగురువుల యొక్క బంధములోపడి ఆధ్యాత్మికమార్గత్రోవ తప్పుట. ఈ మాయగురువులు పరిపూర్ణజ్ఞానము లేక పూర్తిగా తెలియనివారు కొందరు, కొంత తెలిసినవారు కొందరు. సాధకులను తాము సాధించిన కొన్ని సిద్ధులచే ఆకర్షించి తప్పుత్రోవను పట్టించుచున్నారు. కావున బాహ్యవేషములను, ఆశ్రమముల ఆర్భాటమును చూచి గులకరాళ్ళవలె చేరు భక్తులసంఖ్యలను, సిద్ధులను చూచి మోసపోక అట్టి నరగురువులను ఆశ్రయించక అవతరించిన నారాయణగురువును ఆశ్రయించవలెను. నారాయణుని ఎట్లు గుర్తించవలెను? నారాయణ శబ్దము యొక్క అర్థముచే గుర్తించుము. “నారం పరమార్థ జ్ఞానమ్ అయనం యః సః నారాయణః” అనగా పరిపూర్ణజ్ఞానము అని అర్థము. “సత్యం జ్ఞానమ్ అనంతం బ్రహ్మ” అను శ్రుతి ఇదియే చెప్పుచున్నది. పౌండ్రకవాసుదేవుడు నారాయణ వేషమును ధరించి తానే నారాయణుడనెను. హిరణ్యకశిపుడు సిద్ధులను ప్రదర్శించి తాను తప్ప నారాయణుడు ఎక్కడనూ లేడని ప్రకటించి తన ఆలయములను కట్టించి, తన నామములు జపింపచేసెను. కావున ఇట్టి మాయగురువుల బంధమునుండి దాటుటయే విశుద్ధచక్రమును దాటుట. ఆకాశము ఎట్లు సర్వవ్యాపకమో ఈ గురువులును అట్లే విశ్వమంతయు వ్యాపించియున్నారు. పరిపూర్ణజ్ఞానమును ప్రసాదించువాడు నీ అంతరాత్మకు పరిపూర్ణసంతృప్తిని కలుగచేయును. అంతరాత్మను మించిన ప్రమాణము లేదని “ప్రమాణ మంతఃకరణప్రవృత్తయః” అని శ్రుతి. కావున దీని సహాయము చేత జీవుడు విశుద్ధచక్రమును దాటవలెను.
6) ఆఙ్ఞాచక్రము: ఇక చిట్టచివరది ఆజ్ఞాచక్రము. ఇది మనస్సును సూచించును. మనస్సు నామరూపాత్మకమైనది, అనగా దత్తస్వరూపము తప్ప మిగిలిన 33 కోట్లదేవతల యొక్క నామరూపములను ఈ చక్రము సూచించును. ఇవి అన్నియు శ్రీదత్తపరబ్రహ్మము యొక్క వేషములే. ఈ చక్రము దాటుటకు వేదము యొక్క సహాయమును తీసుకొనవలెను. వేదము చెప్పు బ్రహ్మముయొక్క లక్షణముల ద్వారా శ్రీదత్తుడే పరబ్రహ్మమని గుర్తించు బ్రహ్మజ్ఞానము కలవాడే ఈ చక్రమును దాటును.
ఈ చక్రము జ్ఞాననేత్రస్థానమగు భ్రూమధ్యమమున ఉన్నది. వేదము అనగా జ్ఞానము. కావున వేదజ్ఞానము చేతనే దీనిని దాటవలయును. “తమేతం వేదానువచనేన బ్రాహ్మణా వివిదిషంతి” అను శ్రుతియు “వేదైశ్చ సర్వై రహమేవ వేద్యః” అని గీతయు “శాస్త్రయోనిత్వాత్” అను బ్రహ్మసూత్రమును ఈ విషయమునే చెప్పుచున్నవి. ఇవి దాటిన తర్వాత అనగా ఆరుచక్రములను దాటిన తర్వాత, అనగా షడ్గుణముల తత్త్వము అనగా షణ్ముఖతత్త్వమును దాటిన తర్వాత సహస్రారములో సుబ్రహ్మణ్యము సిద్ధించును. సహస్రారము బుద్ధిస్థానమున ఉన్నది. “అధ్యవసాయాత్మికా బుద్ధిః” అను శాస్త్రవచనముచేత బుద్ధియనగా నిశ్చయము. శ్రీదత్తుడే పరబ్రహ్మమని నిశ్చయించిన తరువాత సహస్రారము చేరుట అనగా శ్రీదత్తుని చేరుట. సహస్రారము అనగా సహస్రశీర్షుడగు పురుషుడు. సహస్రమనగా వేయి అని కాదు ‘అనంతమైన’ అని అర్థము. అనంతముఖములు కలవాడని అర్థము. అనంతముఖములు అనగా అనేకానేక ముఖములు అని అర్థము. పులివేషము వేసుకున్నప్పుడు నటుడు పులిముఖమును తన ముఖముపై పెట్టుకొనుచున్నాడు. అట్లే శ్రీదత్తుడు సర్వదేవతల వేషముల ముఖములను తన ముఖమునందు ఉంచుకొని సర్వదేవతలుగా భాసించుచున్నాడు. అట్లు ఉంచుకొనినప్పుడు ఆ వేషముల యొక్క అవయవములలో తన అవయవములు యిమిడిపోవును.గంజాయి త్రాగి మత్తులోకి పోయిన స్థితిని సమాధి అనరాదు
ఇదే కేనోపనిషత్తులో చెప్పబడినది. ఇప్పటికి సాలోక్య, సామీప్యములు సిద్ధించినవి. శ్రీదత్తుని నరావతారమును గుర్తించి యిట్లు దగ్గర చేరుటయే సాలోక్య, సామీప్యములు. అయితే ఇది నిశ్చయస్థానమగు బుద్ధిలోయున్నది. నిశ్చయమనగా విశ్వాసము. చేరగనే సరిపోదు. విశ్వాసము జారరాదు. అట్లు జారక విశ్వాసముతో నిశ్చయముగా నిలిచియున్నచో దానిని నిర్వికల్పసమాధి అందురు. జారి అనుమానించి క్రిందపడినచో దానినే సవికల్పసమాధి అందురు. సం+ఆఙ్+ధి అను పదముల కలయికయే సమాధి. సం అనగా పరిపూర్ణము. ఆఙ్ అనగా నిరంతరము. ధీ అనగా బుద్ధి. అనగా నిశ్చయము అనగా విశ్వాసము. అంతే కాని గంజాయి త్రాగి మత్తులోకి పోయిన స్థితిని సమాధి అనరాదు.
ఇట్లు శ్రీదత్తుని చేరిక తర్వాత ఏడవచక్రము లేక ఏడవ కొండను సూచించును. సహస్రారమున భక్తుడు భగవంతుడు మాత్రమే మిగులుదురు. ఆ బంధములో భగవంతుని ప్రేమలో రమించుటయే భక్తి అనబడును. ఈ భక్తియను అమృతము భక్తుడు పొందును. దీనినే సహస్రారమున, కుండలిని శివుని చేరి అమృతము త్రాగును అని ఆలంకారికముగా చెప్పినారు.
కావున శ్రీదత్తుని గుర్తించి, విశ్వసించి, చేరుటయే జ్ఞానము. ఆ జ్ఞానమునుండి భక్తిని పొందుము. ఆ భక్తివలన పరమాత్మ కూడా జీవుని ప్రేమించి ఆ బంధములో ఆనందించి ఆనందస్వరూపుడైన తాను ఆభక్తునికి దత్తత కావించుకొని ఆ భక్తునిలో లీనమైనందున ఆ భక్తుని అఖండ బ్రహ్మానందస్వరూపునిగా చేయుచున్నారు. దీనినే సాయుజ్యము, కైవల్యము అనుచున్నారు.
సంసారబంధములనుండి విడివడుటయే మోక్షము అందురు. సంసారము సాగరముగా చెప్పబడినది. సాగరములోని అలలే సంసారబంధములు. నీరు తప్ప అల లేదు. అల పుట్టి నశించుచున్నది. అనగా సంసారబంధములు అసత్యములు అనిత్యములు అని అర్థము. నీవు అలపై ఆధారపడి కూర్చున్ననూ మునిగిపోవును. అట్లే ఏ సంసార బంధముపైనను ఆధారపడరాదు. ఈ అలలు సాగరము దాటి స్థిరముగా తీరమగు భగవంతుని చేరినచో ఆ తీరముపై స్థిరముగా కూర్చున వచ్చును. అచ్చట మునిగిపోడు. కావున భగవంతుడు సత్యము, నిత్యము, స్థిరము అని అర్థము.
చక్రముల వివరణ సారాంశము
1) మూలాధార చక్రము-స్థిరాస్తిపై బంధము. 2) మణిపూర చక్రము-చరాస్తిపై బంధము. 3) స్వాధిష్ఠాన చక్రము-కామము. భార్యాభర్తల బంధము. 4) అనాహత చక్రము-సంతాన బంధము 5) విశుద్ధ చక్రము-మాయాగురువుల బంధము. 6) ఆజ్ఞా చక్రము-శ్రీదత్తసద్గురువు. సహస్రారము-ఇదే సుబ్రహ్మణ్యతత్త్వము. శ్రీదత్తుని గుర్తించి, విశ్వసించి, చేరుటయే జ్ఞానము. ఆ జ్ఞానమునుండి భక్తిని పొందుము. ఆ భక్తివలన పరమాత్మకూడా జీవుని ప్రేమించి ఆ బంధములో ఆనందించి ఆనందస్వరూపుడైన తాను ఆభక్తునికి దత్తత కావించుకొని ఆ భక్తునిలో లీనమైనందున ఆ భక్తుని అఖండ బ్రహ్మానందస్వరూపునిగా చేయుచున్నారు. దీనినే సాయుజ్యము, కైవల్యము అనుచున్నాము. కావున భగవంతుడు సత్యము, నిత్యము, స్థిరము అని అర్థము.
★ ★ ★ ★ ★