22 Mar 2025
[13.11.2002] పరమాత్మపై భక్తి కలుగక పోవుటకు లౌకిక విషయములందు ప్రేమ కలుగుటకు కారణమేమి? మనము లౌకికములైన విషయములందే ఆసక్తి కలవారి యొక్క సంగమునందే సదా ఉండుచూ రమించుచున్నాము. వారితో సదా లౌకిక విషయములను గురించియే మాట్లాడుచూ ఆనందముగా వినుచున్నాము. ఈ లౌకిక విషయములు వారి నుండి సదా ఇంజెక్షన్ వలె మన లోనికి ఎక్కుచున్నవి. వీటి ద్వారా లౌకికమగు జ్ఞానమే మనలో పెరుగుచున్నది. ఈ లౌకికజ్ఞానమే లోకబంధములపై ప్రేమకు కారణమగుచున్నది. అట్లు కాక భగవద్భక్తుల సంగము యందు, భగవద్విషయ గ్రంథముల యందు సదా సంగము పెట్టుకొన్నచో భగవద్భక్తి మన లోనికి ప్రవేశించును.
ఆవకాయ జాడీలో యున్న మామిడిముక్కకు పులుపు, కారము ఎక్కుచున్నది. పంచదార ద్రావణములోని రసగుల్లా లోనికి తీపి ఎక్కుచున్నది గదా. కావున సంగము వలన జ్ఞానము, జ్ఞానము వలన భక్తి, భక్తి వలన సేవ ఏర్పడును. జ్ఞానము పెరిగిన కొలది భక్తి ఎక్కువగును. కాశీ నగరములో యున్న విశేములన్నియు తెలియు కొలది కాశీనగరమునకు పోవలయునను ఆశ ఎక్కువగును. ఆ విశేషములను చెప్పు భక్తుల యొక్క సంగమే కాశీ నగరము యొక్క విశేషములకు జ్ఞానమగుచున్నది. అట్లే బొంబాయి నగరములోని విశేషములను చెప్పు వారి సంగము నందు బొంబాయి యొక్క సంగజ్ఞానము లభించి దాని వలన బొంబాయిపై ఆసక్తి ఏర్పడి బొంబాయిలో విహరించు కోరికలు ఏర్పడుచున్నవి. కావున ఎల్లప్పుడును సంగమును గూర్చి పరిశీలించవలయును.
పదిరూకలను ఇచ్చి దుస్సంగమును వదిలించుకొనుము. పదిరూకలు యిచ్చి సత్సంగమును కొనుము అని పెద్దల వచనము. ఋషులు ఎల్లప్పుడును ఆశ్రమములలో సత్సంగములను జరిపి బ్రహ్మజ్ఞానమును పెంచుకున్నారు. దాని వలన భగవద్భక్తి అధికమై ఆ భక్తి వలన పరమాత్మను పొందినారు. నగరములలో నుండు పౌరులును, గ్రామములలో నుండు గ్రామస్థులును సర్వదా లౌకిక విషయములనే చర్చించుకొనుచు లోకమునందే బంధమును పెంచుకుని భగవంతునకు దూరమౌతున్నారు. కనుక మానవుడు సర్వదా సత్సంగమునకే ప్రయత్నించి, సత్సంగమున ఉన్నచో ఏ నాటికైనను తప్పక భగవంతుని చేరును.
★ ★ ★ ★ ★