02 Nov 2024
ఈ రోజు పార్థివనామ సంవత్సర వైశాఖ శుద్ధవిదియ మంగళవారము. ఉదయము 7:15 ని|| సమయము. శ్రీదత్తభగవానులు అనుగ్రహించిన దివ్యవాణి. స్వామీ మేము ధన్యులం! ధన్యులం!! ధన్యులం!!!
నాయనా శ్రద్ధగా విను. ప్రవృత్తి, నివృత్తి గురించి చెప్పియేయున్నాను. ప్రవృత్తిలో ధర్మమే ప్రధానము. నివృత్తిలో ధర్మముకంటే పరమాత్మయే ప్రధానము. ప్రవృత్తి, నివృత్తులను కలుపరాదు.
1. కుచేలుని విషయం వివరిస్తాను. కుచేలుని పేరు సుదాముడు. శ్రీకృష్ణుడు, సుదాముడు ఒకే గురువుగారైన సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేసినారు. ఒకనాడు గురుపత్ని అటుకులను తనకును శ్రీకృష్ణునికి ఇద్దరికీ అని చెప్పి తినుటకు ఇచ్చినది. ఇది శ్రీకృష్ణునికి తెలియదు. ఆ తరువాత, ఇద్దరూ అరణ్యానికి సమిధలు తేవటానికి వెళ్ళినారు. ఇంతలో తుఫాను గాలి, వర్షము రావడంతో చెట్టు ఎక్కి తలో కొమ్మమీద కూర్చున్నారు.
అదా రాత్రి సమయము, పైగా ఆకలి. గురుపత్ని ఇద్దరునూ తినుటకు ఇచ్చిన అటుకులు సుదాముని వద్దనే ఉన్నాయి. సుదాముడు కృష్ణునికి పెట్టకుండా కొంచెం కొంచెం తినటం మొదలుపెట్టాడు. ఆ తినడంలో కరకర శబ్దము అయినది! అపుడు కృష్ణుడు సుదామా! ఏమిటి చప్పుడవుతున్నది? ఏం తింటున్నావు? అని అడిగినాడు. అపుడు సుదాముడు “ఏమీ లేదు. చలికి దవడలు గజగజలాడుతున్నాయి.” అని పరమాత్మకు అబద్ధం చెప్పినాడు.
కృష్ణపరమాత్మకు తెలియనిది ఉన్నదా! కాని, ఆయన సాక్షిభూతంగా ఉండిపోయాడు. శ్రీకృష్ణునికి పెట్టకుండా అన్ని అటుకులనూ సుదాముడే తిన్నాడు. పైగా పరమాత్మకు అబద్ధము చెప్పినాడు. కనుక ఆ జన్మలోనే దారిద్ర్యంతో నిత్యనరకమును అనుభవించినాడు. మరల ఆ అటుకులనే శ్రీకృష్ణునికి సమర్పించితే గాని కర్మవిముక్తుడు కాలేదు గదా. కనుక దీని భావమేమిటి? పరమాత్మతో అబద్ధము చెప్పరాదు అనే కదా.
2. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో “అశ్వత్థామా హతః” అని అబద్ధము చెప్పమన్నాడు. కాని ధర్మరాజు అది అధర్మము నేను అబద్ధము చెప్పను అని “అశ్వత్థామా హతః కుంజరః” అని చెప్పినాడు. ధర్మరాజు మూర్ఖుడుగా ప్రవర్తించాడే అని “కుంజరః” అనే శబ్దము వినపడకుండా కృష్ణపరమాత్మ పాంచజన్యమును పూరించాడు. ఇక్కడ పరమాత్మే అబద్ధము చెప్పమన్నాడు కదా! మరి అది పాపము కాదా, అధర్మము కాదా! అంటే కానే కాదు. పరమాత్మ సర్వసాక్షి. ధర్మము కంటే పరమాత్మే ఎక్కువ. ఇది ధర్మసూక్ష్మము. పరమాత్మకు ఏది ఆనందదాయకమో అదే ధర్మము. పరమాత్మకు ఏది కోపం కలిగిస్తుందో, అదే అధర్మము. ఇది గ్రహించక, ధర్మరాజు పరమాత్మ చెప్పిన మాట విననందుననే నరకదర్శనం చేయవలసి వచ్చినది. దీని ఆంతర్యము ఏమిటి? ధర్మము కంటే పరమాత్మే ఎక్కువ అని తెలుసుకోవాలి. పరమాత్మమాట శిరోధార్యము అని తెలుసుకోవాలి.
3. గోపికలు యమునానదిలో వివస్త్రలుగా స్నానం చేస్తున్నారు. శ్రీకృష్ణభగవానుడు వారి వస్త్రాలను దాచి పెట్టాడు. అది మరి అధర్మము కాదా? గోపికలను వివస్త్రలుగా చూడటం అధర్మము కాదా. కానే కాదు. ఎందువలన? పరమాత్మ సర్వాంతర్యామి. సర్వసాక్షి. ఆయన చూడనిది లేదు. స్త్రీలుగాని పురుషులుగాని వివస్త్రలుగా స్నానం చేయరాదు. అట్లు చేస్తే నరకలోకానికి పోవాలి. కాత్యాయినీ వ్రతదీక్షలో ఉన్న గోపికలకు స్వామి జ్ఞానోపదేశము చేసి వస్త్రాలు అనుగ్రహించారు. మరియైతే, ద్రౌపది విషయం ఏమిటి? సభలో ఆమెను వివస్త్రను చేయటానికి ప్రయత్నించిన కౌరవుల చర్యలకు అడ్డు తగిలి, శ్రీకృష్ణభగవానుడు చీరెలు కొల్లలు కొల్లలుగా ఇచ్చి వస్త్రాపహరణాన్ని అడ్డుకొని మానసంరక్షణము చేశాడు. అయితే, దీని అంతరార్థమేమిటి? గోపికల విషయము నివృత్తికి సంబంధించినది. ఆ ఘట్టములో ప్రవర్తించిన పరమాత్మ సర్వసాక్షి. ద్రౌపది విషయము ప్రవృత్తికి సంబంధించినది. ఆ ఘట్టములో ప్రవర్తించిన కౌరవులు సాధారణ మానవులు. ఇదే అంతరార్థము.
4. అయితే ఇంకొక విషయము. మాణిక్యప్రభువు సాక్షాత్తూ శ్రీదత్తుని అవతారము. తన భక్తురాలు వెంకమ్మ యవ్వనవతి. ఆవిడ స్నానాలగదిలో స్నానం చేస్తోంది. నిండుసభలో కొలువుతీరివున్న మాణిక్యప్రభువు వెంకమ్మను ఉన్న పళాన సభలోకి రమ్మని ఆజ్ఞాపించినారు. ఆమె ఆపాటే, వివస్త్రగానే నిండుసభలోనికి వచ్చినది. వివస్త్రగావున్న ఆమెను మాణిక్యప్రభువు, సభికులు, అందరూ చూచినారు. మరి ఇదేమిటి, దీనిలో ధర్మాధర్మాలేమిటి? అంటే ఇక్కడి ఘట్టము ప్రవృత్తి, నివృత్తుల సంగమము. అందుకే, స్వామి ఆమె తన పైవస్త్రమును ఆమెకు ప్రసాదించినారు. అది గ్రహించి ఆమె ధరించినది. వెంటనే ఆమె వెంకావధూత అయినది. కనుక, సారాంశము ఏమిటి అంటే పరమాత్మ, ఎపుడూ ధర్మము కంటే ఎక్కువ అని గ్రహించాలి. ప్రవృత్తి, నివృత్తి, వేరు వేరే గాని రెంటిని కలుపరాదు అని తెలుసుకోవాలి.
శ్రీగురుదత్త! జయ గురుదత్త.
శ్రీదత్తవాణి
[17-05-2005] ఇహలోకమునందును, పరలోకమునందును మన యోగక్షేమములను చూచువాడు శ్రీదత్తుడే. ఇహలోకమున మనము కోరిన కోరికలు అనేక దేవతా రూపములలో అనుగ్రహించువాడు ఆ దత్తుడే. అది తెలియక ఇతర దేవతలే ఇచ్చుచున్నారని తలంచి మ్రొక్కుచున్నాము. ఇది ఎట్లున్నదంటే ఇంటి యజమాని యొక్క సంజ్ఞలతో సేవకులు అందించుచున్న ఫలహారములు, పానీయములను చూచి, ఆ సేవకులే అందించుచున్నారని భావించి వారికే సాష్టాంగపడినట్లు ఉండును. ఈ సొమ్ము అంతయు ఆ దత్తుడిదే అని తెలియవలెను. ఆయననే విశ్వసించి, సేవించి తరించవలెను
★ ★ ★ ★ ★