home
Shri Datta Swami

Posted on: 11 Sep 2024

               

గురుదత్తుని పొందే మార్గము

సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” అని వేదము. స్వామి సత్యమైన అనంతమైన బ్రహ్మము అని చెప్పుచున్నది. స్వామి అంటే గురు దత్తుడే. నీకు ఇష్టమైననూ, కాకున్ననూ దత్తుడు సత్యమునే బోధించును. ఇందుకే ఇంతవరకు దత్తుడు ప్రసిద్ధికి రాలేదు. అయితే ఇప్పుడు ప్రసిద్ధికి వచ్చుచున్నది. కారణమేమనగా ఈ మధ్య ప్రజలు సత్యము యొక్క విలువను గుర్తించుచున్నారు. సత్యము యొక్క ఫలము నిజముగా, శాశ్వతముగా యుండును. సాధారణముగా దేవునితో జనులు వ్యాపార సంబంధమును పెట్టుకుంటారు. ఒక సమస్య పరిష్కారమనకు గానీ, ఒక లాభమును పొందుటకుగానీ, స్వామి వద్దకువచ్చి, ముడుపులను అనగా లంచమును యిస్తామని మొక్కుకొనుచున్నారు. దానిలో కూడ ఇప్పుడు తెలివి ముదిరిపోయినది. తిరుపతిలో దేవునితో “ముందు ఈ పని చేసిపెట్టుము పని జరిగిన తరువాత యీ పూజను చేయించెదను, లేక ఇంత డబ్బు యిచ్చెదను” అనుచున్నారు. అనగా పనికి ముందే డబ్బును ఇచ్చుటకు దేవునిని కూడా శంకించుచున్నారు. ఇది అసలు దేవుని అస్తిత్వమునే అనుమానించుట అగుచున్నది. మరియొక మార్గము ఏమనగా బిచ్చగాడు అన్నము కొరకు యాచించినట్లు, దేవుని ధ్యాన, స్తుతులతో యాచించుట. ధనవంతుడైన భక్తుడు యీ మార్గములో యిట్లు దేవుని యాచించుటలో వాని ఆలోచన అంతరాంతములలో వానికి తెలియక ఇట్లు దాగియున్నది. ఆ ఆలోచన ఏమనగా “దేవుడున్నాడో లేడో తెలియదు. ఉంటే, స్తోత్రములతో ప్రసన్నుడిని చేసుకుంటాను. ఒక వేళ లేకుంటే నాపని నా శక్తి చేతనే జరిగి ఉండి, దానిని దేవుడు చేశాడని భ్రమపడి దేవునికి డబ్బు యివ్వవలసి వచ్చును”. ఇట్టి ఆలోచన వాని మనస్సులో ఉన్నట్లు వాడు అంగీకరించడు. ఏలననగా ఈ భావము చాలా సూక్ష్మరూపములో ఉంటుంది. కావున మనస్సు గ్రహించలేదు. కావున ఆ భావము తనలో లేదనుకుంటాడు. కాని దత్తుడికి ఎంత సూక్ష్మమైనా తెలుస్తుంది. బిచ్చగాడి పద్ధతిలో పేదవాడు భగవంతుని యాచించుటలో తప్పు లేదు. కాని ధనవంతుడు అట్లు యాచించుట నీచము.

Swami

స్వామికి గురుదక్షిణ రూపంలో ధనమును అర్పించుట నిజముగా సత్యమైన ప్రేమకు పరీక్ష. ఇదే క్రియాత్మకమైన కర్మఫల త్యాగము. నీవు నీ భార్యా పుత్రులను నిజముగా ప్రేమించుచున్నావు. కాన వారికి నీ ధనము నిచ్చుచున్నావు. స్వామిని కూడా నిజముగా ప్రేమించుచున్నచో స్వామికి నీ ధనము నిత్తువు. నీ కర్మఫలమగు ధనమును త్యజించుటయే గీతలో ఘోషించబడిన కర్మఫల త్యాగము. ఐతే స్వామి నుండి సాయమును కోరుచూ లంచముగా గురుదక్షిణ ఇచ్చుట నీచము. ఈశావాస్య ఉపనిషత్తు మొదటి మంత్రములో ఇట్లు చెప్పబడినది - ఈ ధనమంతయును స్వామిది. నీకు కావలసిన కనీస ధనమును తీసుకొనుము. నీవు ఎక్కువ తీసుకున్నచో స్వామికి తిరిగి యిచ్చివేయుము. మరియు వేదము ఇట్లు బోధించినది. “సిగ్గుపడుతూ, భయపడుతూ ఇమ్ము”. ఏలననగా స్వామి అనుమతించని ధనమును దొంగిలించినావు. కావున గురు దక్షిణను ఎట్టి ప్రతిఫలమును కోరకుండా స్వామికి సమర్పించవలెను. లేనిచో ఆ దొంగిలించిన ధనము నీకు కష్టములను తెచ్చును. వేదము “శ్రద్ధయా దేయం”అని. అనగా గురుదక్షిణను ప్రేమతో ఇమ్మని చెప్పు చున్నది. ఇది చాలా ఉత్తమమైన పద్ధతి. దీని ద్వారా స్వామితో నిత్యసంబంధము ఏర్పడుచున్నది. ఇందులో లెక్క ఉండదు. నీ ధనమును నీ పుత్రునకు ఇచ్చుచున్నావు. అతడు నీకు సేవ చేయుచున్నాడు. ధనము ఎంత? సేవ మూల్యము ఎంత? రెండు సమముగా అయినవా? లేదా? అను ప్రశ్నలు రావు. వానికి నీవీయ గలిగినంత ధనము నిచ్చినావు. వాడు నీకు తాను చేయగలిగినంత సేవ చేసినాడు. అలాగే నీ వీయ గలిగినంత గురుదక్షిణ స్వామికి ఇచ్చినావు. స్వామి నీకు అవసరము వచ్చినప్పుడు నీకెంత అవసరమో అంత వరకు సాయపడును. ఇందులో లెక్కలుండవు. శ్రీ కృష్ణుని వేలు కోసుకున్నది. వెంటనే ద్రౌపది తన చీరను చింపి వ్రేలికి కట్టినది. స్వామికి కావలసినది ఆ సమయములో ఆ చీర ముక్క మాత్రమే. అది ఆమె స్వామికి ప్రతి ఫలాపేక్ష లేకుండా సమర్పించిన గురుదక్షిణ. కావున దానిని గురించి మరచి పోయినది. దుశ్శాసనుడు తన చీరెలను లాగు చున్నపుడు కూడా దాని విషయమును ప్రస్తావించలేదు. ఆ విషయమును ప్రస్తావించి యున్నచో, వడ్డీతో కలిపి ఒక చీర వచ్చి యుండెడిది. కాని ఆ సమయమున ఆమెకు అనంత సంఖ్యలో చీరెలు కావలెను. ప్రతిఫలాశ లేని సేవకు అనంత ఫలము ఉండును. ఏలననగా ఆ సత్య బంధంలో లెక్క ఉండదు కావున స్వామి ఆ చీరె ముక్కను అనంత సంఖ్యలో చీరెలుగా మార్చి అందచేసినాడు. ప్రేమలో అవసరమే కాని లెక్క కూడదు.

స్వామి అద్బుతమైన బ్యాంక్‌

నీవు సంపాదించిన పెచ్చు ధనము స్వామికి గురు దక్షిణగా ప్రేమతో సమర్పించి దానికి ప్రతిఫలము ఆశించక మరచిపొమ్ము. నీకు అవసరమైనప్పుడు స్వామి దానిని నీకు అవసరము ఎంతో అంత మేరకు పెంచి నీకు అందించును. పేదవాడిచ్చు రూపాయి, ధనికుడిచ్చు లక్షతో సమానము. ఏలననగా నీ స్థాయిని అనుసరించి నీ కనీసము యొక్క విలువ మారుట చేత నీవు గ్రహించిన పెచ్చు ధనము కూడా వ్యక్తిని బట్టి మారుచున్నది.

★ ★ ★ ★ ★

 

 

 
 whatsnewContactSearch