home
Shri Datta Swami

 21 Nov 2024

 

పరిపూర్ణ సత్త్వగుణము కైవల్యదాయకము

[10.12.2002] ప్రతి జీవునిలోను సత్త్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణములు ఉన్నవి. ఒకానొక సమయములో ఒక్కొక్క గుణము ప్రధానమై ప్రకోపించుచుండును. ఎక్కువ సమయములలో ఏ గుణము ప్రకోపించునో ఆ జీవుడు ఆ గుణము కలవాడు అని చెప్పబడును. సాత్త్వికగుణియగు ధర్మరాజు సహితము జూదవ్యసనమునకు బానిసయై తమోగుణమును ప్రదర్శించెను. రావణాది రాక్షసులు తపస్సు చేయునపుడు ఓర్పుతో సత్త్వగుణమును ప్రదర్శించిరి. కొందరిలో బయటకు సత్త్వగుణము అను ముసుగు కప్పబడి యుండును. ఇట్టి వాడే ధృతరాష్ట్రుడు. సత్త్వగుణము అనగా అహంకారము, స్వార్థము లేకుండుట. ఇది త్యాగముతో కూడిన వినయముతో, సేవాభావముతో యుండును. రజోగుణము అనగా అహంకారము -  అనగా ‘నేను’, ‘నాకు’ అను భావము ఎక్కువగా యుండుట. "రజసో లోభ ఏవ చ" అను గీతాశ్లోక ప్రకారము రజోగుణము గలవారికి లోభగుణము ఎక్కువగా యుండును. ధృతరాష్ట్రునికి, నా రక్తమునకు జన్మించిన కౌరవులకే రాజ్యముండవలయును అను స్వార్థ రజోగుణము గలదు. దుర్యోధనుడు కూడా రజోగుణియే. నేను రారాజును అనుకొనెడి వాడు. ఇట్లు "నేను, నా యొక్క" అను బీజముల నుండి వచ్చినదియే రాజసము. ఈ రజోగుణలోభము చేతనే ధృతరాష్ట్రుడు పాండవులకు ఎడారి ఇచ్చినాడు.

Swami

ఇక తమోగుణమున ఎట్టి వివేకము లేక పరిపూర్ణమైన అజ్ఞానముండును. కేవలము మాంసాది భోజనములతో జీవించిన బకాసురుడు మొదలగు వారు తమోగుణులు. పరమాత్మ అవతరించినపుడు ఆయన సత్త్వగుణప్రకృతిని అధిష్ఠించియుండును. "ప్రకృతిం స్వామ్ అధిష్ఠాయ" అని గీత. అనగా ఆయన స్వభావగుణము సత్త్వగుణమే. ఆయన యొక్క షోడశ కళ్యాణగుణములు సత్త్వగుణములే. అయితే అవతరించినపుడు కొన్ని రాజస, తామస గుణములను కూడా అవసరము కొరకు ఆయన కలిగి యుండును. ఇంత మాత్రమున అవి ఆయన స్వభావములు కావు. చేతిలో నిప్పును పట్టుకున్నంత మాత్రమున ఆ వ్యక్తికి దహింపు స్వభావము ఉండునా? ఈ గుణముల యొక్క అవసరము అనేక విధములుగా యుండును. తనను గుర్తించిన వారి విశ్వాసమును కొంతసేపు ఉంచిన తరువాత దానిని ఆర్పకున్నచో ఆ భక్తుడు ఉద్రేకముతో, ఉన్మత్తునిగా గాని విగతప్రాణునిగా గాని కావచ్చును. కావున నేను "మత్తః స్మృతిః జ్ఞానమపోహనం చ" అని గీతలో చెప్పినాను. అనగా నన్ను గుర్తించు జ్ఞానమునిచ్చి, మరల ఆ జ్ఞానమును నేనే ఉపసంహరించుచున్నాను అనియే అర్థము. అజ్ఞానము, ఉద్రేకమునిచ్చి విశ్రాంతి నిచ్చును. అందుకే పగలంతయు ఆలోచనలతో ఉద్రిక్తులై రాత్రికాలమందు ఆ ఆలోచనలను పూర్తిగా మరచి నిద్రించుచున్నారు. మరల ఉదయమున ఆలోచించుట ఆరంభమగుచున్నది. ఇట్లు జ్ఞానము చేత ‘విశ్వాసము’ అను పగటిని, కొంతసేపు కల్పించి, మరల ‘అనుమానము’ అను రాత్రిని కూడా స్వామియే కల్పించుచున్నాడు.

పగలు-రాత్రి, శీతము-ఉష్ణము, సుఖము-దుఃఖము ద్వంద్వములు. ఇవియే సృష్టిధర్మములు. ఏదియును నిరంతరము పనికిరాదు. అది వెగటు కల్గించి విరిగిపోవును. యశోదకు నోటిలో విశ్వమును క్షణకాలము మాత్రమే చూపినాడు. ఆ క్షణకాల ఉద్రేకముతో ఆమె మరణస్థితిని సమీపించినది. కావున వెంటనే ఆమెకు అనుమానమును కల్పించి ఇది కంటి భ్రమయని తలపింప చేసినాడు. మరల తన చేష్టలతో మానవమాత్రునివలె ప్రవర్తించి ఆమె అనుమానమును బలపరచినాడు. కావుననే, ఆమె జీవించకలిగినది. కావున భగవానుడు అజ్ఞానము కలిగించుటలో కూడా కరుణాతత్త్వమునే కలిగియున్నాడు. సాత్త్వికగుణము ఏ జీవునకు పరిపూర్ణమగునో అతడు అవతార పురుషులతో సమానమగుచున్నాడు. సత్త్వగుణము పరిపూర్ణము అనగా ఆచరణాత్మకమగు ఆధ్యాత్మికజ్ఞానము. అట్టి జీవుని అవతారము కొరకు భగవంతుడు ఉపాధిగా ఎన్నుకొనును. అవతారమునకు ఎన్నుకొనుటకు పూర్వము అట్టి జీవుడు భావ అద్వైతములో ఉండును. ఇది భావకైవల్యము (పూతా మద్భావమాగతాః – గీత). ఇట్టి సమానత్వమే కైవల్యము. కైవల్యము అనగా ఒకటి అని అర్థము. ఇరువురు ఒకటియే అని అర్థము. ఇట్లు హనుమంతుడు రామునితో సమానుడై, జీవన్ముక్తియగు రామకైవల్యమును సాధించినాడు. పరిపూర్ణ సత్త్వగుణము అనగా నూటికి నూరుపాళ్ళు స్వార్థము లేకుండుట. హనుమంతునికి ఏ క్షణములో కూడా తనను గురించి పట్టలేదు. ఎప్పుడునూ స్వామి కార్యమునే చేసి స్వామియే సదా సుఖముగా యుండవలయునని కోరినాడు. స్వామి కూడా తనను గురించి క్షణకాలము ఆలోచించినాడేమో కాని హనుమంతునకు 'తాను' అన్న భావమే లేదు. 'తాను' అన్న అహంకారమే లేకున్నచో 'తనకు' అన్న మమకారము ఎట్లు వచ్చును?

కావుననే స్వామి తన కన్న హనుమంతుడు అధికుడని యుద్ధములో తన ఓటమి ద్వారా నిరూపించి, తన పదవియగు జగత్ సృష్టి, స్థితి, లయాదులను హనుమంతునికే ఇచ్చివేసినాడు. చూచితిరా! సత్త్వగుణము యొక్క ప్రభావము భగవంతునకే భగవంతుడైనాడు. ఇట్లే రాధయును ఎప్పుడూ కృష్ణుని గురించే ఆలోచించెడిది. నిరంతరము భగవచ్చింతన ధారయే రాధ. ఈ ధారలో 'తాను, తనకు' అన్న నలుసులు కనిపించవు. కావుననే రాధకు శ్రీమత్సింహాసనేశ్వరీ పదవిని ఇచ్చినాడు స్వామి. రాధయే హనుమంతుడు. హనుమంతుడే రాధ. ఈ "కోతి, నాతి" ఇరువురు ఒక్కటే. ఇదియే స్వార్థ రహితమైన భక్తికి ఆదర్శమైనది. ఈ ఆదర్శములను గ్రహించక తోకతో గంతులు వేయు కోతిగా హనుమంతుని, నీటి కడవను పట్టుకుని యమునా తీరమునకు వచ్చుచున్న యువతిగా రాధను ఊహించువారికన్న అవివేకులు ప్రపంచమున కలరా?

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch