05 Mar 2025
విగ్రహారాధనము:- వేదమే పరమప్రమాణము అని బ్రహ్మసూత్రములు చెప్పుచున్నవి.
1) ఆచార్యులు కూడ ఏ సిద్ధాంతమైనా వేదప్రమాణము ఆధారముగా ఉంటేనే భాష్యాలలో పలుకుతారు. శ్లోకములు వేదార్థాన్ని అనుసరించియుంటేనే అంగీకరిస్తారు.
2) ఇది సనాతన పండిత సంప్రదాయము.
విగ్రహములను ప్రతీకలుగా ఆరాధించాలి. ప్రతీక అంటే అందుబాటులో లేని తత్త్వానికి ప్రతినిధిగా మరియొక వస్తువును ఉంచి ఆరాధించుట, వాక్కులకు, మనస్సుకు, బుద్ధికి, తర్కానికి ఊహలకు సైతము పరమాత్మ అందడని వేదాలు పదే పదే ఘోషిస్తున్నాయి. ఆ పరమాత్మకు ప్రతీకగా సృష్టిలోని ఒక వస్తువును పెట్టుకొని ఆరాధించమని వేదమే ‘ఆదిత్య విద్య ప్రకరణము’లో చెప్పింది. అయితే సృష్టిలో ఏ వస్తువూ, ఏ జీవుడూ పరమాత్మ కాదని చెబుతూ ఈ సూర్యమండలము కూడా పరమాత్మ కాదని స్పష్టముగా చెప్పినది. సృష్టిలో ఏ వస్తువులోను పరమాత్మ లేడని కేవలము సృష్టికి ఆధారముగనే ఉన్నాడని వేదము మరియు గీతలు పలుకుచున్నవి. ఉపాసన అనగా – మనస్సుతో ధ్యానమునకు, వాక్కుతో స్తోత్రానికి సంబంధించినది. జడములకు క్రియాత్మకముగా సేవ చేయుట వీలుకాదు. విగ్రహములు నైవేద్యము పెట్టితే తినవు. దీపారాధన కాంతిని చూడవు. ఊదువత్తుల వాసనలను పీల్చవు. కర్పూర నీరాజనముల కాంతిని ఉపయోగించుకొనవు.
అర్పించినది అనుభవించుటను ‘యజ్ఞము’ లేక ‘ఇజ్య’ అంటారు. పంచభూతములు అయిన జడములు వీటిని సేవించవు. ఈ విగ్రహములను అడ్డము పెట్టుకొని వెనుక కొందరు దక్షిణలను కాజేస్తారు కావున, విగ్రహములు అయిన జడములకు ఇజ్య చేస్తే జడములుగా పుట్టుదురని గీత తీవ్రముగా నిరసించుచున్నది. ఏ జీవుడూ పరమాత్మ కాకపోయిననూ, ఒకానొక జీవరూపమున పరమాత్మ జగత్తులోనికి అవతారరూపమున ప్రవేశించుచున్నది. అట్టి నరావతారమును అంగీకరించుటకు మద, మాత్సర్యములు అడ్డు వచ్చును. వాటిని పోగొట్టుటకు నరావతారములో నున్న ప్రతిమలను పూజించుట, ఆ నరావతారముల యొక్క నామజపము, ఆ నరాకారముల ధ్యానము సలుపవలయును.
ఇంకనూ మద, మాత్సర్యములు పూర్తిగా తొలగకయున్నచో, చివరకు సోఽహం భావముతో నీవే పరమాత్మవు అని బోధించినారు. దీనితో ప్రాణిని ఆరాధించుట అనగా తనను తాను పరమాత్మగా అంగీకరించుట సాధ్యమగును. అనగా పరమాత్మ తనవంటి నరుడే అన్న భావమును కలిగించి, తనలాగ సర్వనరులు పరమాత్మయేనని చెప్పటము ద్వారా నరావతారమును స్పష్టము చేయుటయే ఈ విధముగా చెప్పుట లోని ప్రధాన ఉద్దేశ్యము.
★ ★ ★ ★ ★