21 Jan 2025
Updated with Part-2 on 22 Jan 2025
[26.07.2001] Part-1: వైదికులు అగు బ్రాహ్మణులు ఏర్పాటు చేసిన కర్మ కలాపములలో అనేక దోషములు కలవు. అందులో ఒక ప్రధానమైన దోషమును వివరించుచున్నాను. మనము ఒక ఆరాధనమున ఒక పసుపుముద్దలో కాని, మట్టి విగ్రహము నందు కానీ భగవంతుని ఆవాహనము చేసి ప్రాణప్రతిష్ఠను చేయుచున్నాము. ఆరాధన ముగిసిన వెంటనే ఉద్వాసన చెప్పుచున్నాము. ఇది ఎంత నీచమైన కర్మ? ఒక సాధారణ మానవుని, మనము పిలువకయే వచ్చిన వాడిని, మనము పొమ్మనుట లేదే! వాడంతట వాడు లేచిపోవుచున్నాడే తప్ప ‘ఇక మీరు వెళ్ళండి’ అనము కదా! మరి ఆ పరమ దయాసముద్రుని పిలచి, నీవు పూజచేసి, నీ కోరికను చెప్పి, వెంటనే పొమ్మని చెప్పుట ఎంత నీచము!
స్వామి ఇట్లు ఉంటే నిష్ఠతో కొలవలేమందురు! స్వామికి నిష్ఠలు మడులు అక్కరలేదు. ప్రేమస్వరూపమైన స్వామికి మన ప్రేమ (భక్తి) కావలయును తప్ప, ఆయన నీ నుండి ఎట్టి మడులు దడులు కోరడు. శబరి, కన్నప్ప ఎట్టి నిష్ఠలతో ఆరాధించినారు? ఒక్క ప్రేమ నిష్ఠయే గదా. వినాయకుడిని ఆవాహనము చేసి ఉద్వాసనము చెప్పనిచో ఆయన మన ఇంటిలోని బియ్యము తింటాడట! ఆయనకు పాపము కైలాసములో బియ్యము రేషన్ వచ్చినందున ఇలాంటి పనులకు పాల్పడినాడా? అలానే గౌరమ్మను పసుపుముద్దలో ఆవాహనము చేసి ఉద్వాసన చెప్పి తులసికోటలో పారవేస్తారు!
ఓ మూర్ఖులారా! మీరు చేయు పని ఏమిటో ఆలోచింపుడు. ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత ఉద్వాసన చెప్పుట యనగా ప్రాణములను వెళ్ళగొట్టుట! అనగా దైవహత్య! తొమ్మిదిరోజులు పూజచేసి పదియవరోజున, దైవహత్య చేసి, ఆ కళేబరమును జలములో పారవేసి దశమదినకర్మ కూడును తినుచున్నారా! అలానే గౌరమ్మ శరీరమును చెట్ల మధ్యలో పారవేయుచున్నారా? బ్రాహ్మణ హత్య చేసిన శ్రీరాముడు, దైవప్రతిష్ఠను రామేశ్వరంలో చేసి విముక్తి పొందినాడు. కానీ దైవహత్యను చేయు మీకు ప్రాయశ్చిత్తము లేదు, లేదు, లేదు. శివపూజను చేసిన వానికి అకాలమృత్యువు కలగదు. మరి అంత శివపూజ చేసిన రావణుడు, పుత్ర, మిత్ర, కళత్ర, బంధుసహితంగా ఎందులకు అకాలమృత్యువును పొందినాడు? అతడు రోజూ పార్థివ (మట్టి) లింగము నందు ప్రాణప్రతిష్ఠ చేసి, పూజానంతరము ఉద్వాసనయను దైవహత్య చేసి, సముద్రములో కలిపినాడు. అందువల్లనే, శాశ్వతమైన ఆత్మలింగము అతడి వెంట రాలేదు. దాని ఫలితమే అతడికి సవంశ అకాలమృత్యువు లభించినది.
కావున స్వామిని లోహ లేక శిలా విగ్రహము పైన కానీ, చిత్రపటమున కానీ ఆవాహనము చేయవలెను. ఉద్వాసన చెప్పరాదు. మరల పూజలో ఆవాహనము చేయుము. ఏలననగా, నీవు ఉద్వాసన చెప్పక పోయినను, ఆయన కార్యాంతరము వలన వెడలిపోయి ఉండవచ్చును. కావున మరల, మరల ఆవాహనము చేయుము. అట్లు చేసినచో, స్వామి నీ గృహము విడువక, ఎల్లపుడు నీ వెంట, జంట, ఇంట నుండగలడు. మహా తపస్సులు చేసినవారు ఆవాహనము చేసినచో రాని స్వామి నీవు పిలువగనే వచ్చి, పొమ్మనగానే పోవువాడా స్వామి? ఎంత పిచ్చిదత్తుడైనా అంత సిగ్గులేని పిచ్చివాడు కాదు స్వామి అని గ్రహించవలయును. భజన కూడా కర్మయే. వాగింద్రియముతో భజన చేయుచు చేతులతో తాళము వేయుచు, మనస్సును లగ్నము చేయు భజన కలియుగములో ఎంతో ఉత్తమమార్గము. కలియందు నామ సంకీర్తనము ముఖ్యము కదా. దీర్ఘరాగములతో సంగీత కసరత్తులు లేకుండగ, స్వల్పరాగములో నారదీయ పద్ధతిలో కీర్తనమే ముఖ్యము. రాగము కాదు ప్రధానము, భగవదనురాగము ప్రధానము. స్వామి నీ అనురాగమును చూచునే తప్ప రాగములను చూడడు. అనురాగముతో కూడిన పిచ్చిరాగమైననూ స్వామికి ఎంతో ప్రీతి.
నారదుని మించిన గాయత్రీ ఉపాసకుడు లేడు.
నారదుని మించిన గాయత్రీ ఉపాసకుడు లేడు. గాయత్రి యనగా ఛందస్సు మాత్రమే. ఛందోబద్ధమైన పద్య (ఋగ్వేద) వాక్యమునే స్వల్పగాన రాగముతోను, అనురాగముతోను చేర్చి పాడు కీర్తనయే (సామవేద) గాయత్రి. సామవేదము ఋగ్వేద అంతర్నిహితమని తెలియవలెను. ‘న గాయత్ర్యాః పరో మన్త్రః’ అనగా ఇటువంటి ఆరాధన కన్నా మించిన మన్త్రము లేదనియే. ఇందులో రాగప్రాధాన్యత కాక అనురాగ ప్రాధాన్యత ఉండవలెను. రాగశబ్దమునకే సంస్కృతమున ప్రేమయని అర్థము కలదు. ఆ భగవత్ర్పేమ లేని ఎట్టి పవిత్రమార్గమైననూ ప్రాణరహిత శవమే. గుర్రము ఎంతో ఉత్తమమైన వాహనము. నిజమే కానీ దానిలో ప్రాణము లేనపుడు అది వాహనముగ ఉపయోగపడునా? లేదు, లేదు. దాని వైపు కూడ చూడము కదా. అది నీచమైన గాడిదయే కావచ్చును. కానీ దానిలో ప్రాణమున్నది. అది నిన్ను గమ్యమును నిదానముగనైనను చేర్చగలదు.
అట్లే ఎంతో పవిత్రమైన యజ్ఞము, గుర్రమువలె, ఎంతో ఉత్తమమార్గమే. నిజమే కానీ దానిలో భగవత్ర్పేమ అను ప్రాణములేనపుడు అది శవమే. అది నిన్ను నా కడకు చేర్చజాలదు. ఏదో పిచ్చి భజనను కనీసము రాగ-తాళ-లయములు కూడా లేకుండా పాడుకొనునపుడు, అది అంత ఉత్తమము అయిన మార్గము కాదనియు, అది కేవలము స్త్రీ-శూద్ర-బాలాదులకేనని ఒక విధమైన తక్కువ భావముతో, అజ్ఞానముతో మనము దానిని చూస్తాము (జ్ఞాని దీనినే గాయత్రీ మంత్రముగా తెలుసుకుంటాడు). కానిండు, అది ఒకవేళ గాడిదవలె నీచమైనదే అనుకుందాము. కానీ దానిలో ప్రాణమున్నది. అప్పుడు అది నిన్ను భగవంతుని కడకు చేర్చును. కావున భగవత్ప్రేమయే ప్రాణము. ప్రేమ యనగా ఎట్టి ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలము భగవద్గుణముల చేత ఆకర్షింపబడుటయే.
అష్టసిద్ధులు స్వామికి సొమ్ములు. వాటిని ప్రకటించుటకు ఎంతసేపు కావలయును. మెడలో నున్న ముత్యాలహారమును చూపించుటకు ఎంతసేపు పట్టును? కావున సంకల్ప మాత్రముననే అష్టసిద్ధులు బయటపడును. కానీ అవి స్వామిని గుర్తించుటకు లక్షణము కాదు. అవి ఎవరికైననూ ఈయవచ్చును. చివరకు సృష్టి, స్థితి, లయాధికార కిరీటము (ఎవరికీ ఈయనిది) కూడా స్వరూపలక్షణము కాదు అది తటస్థలక్షణమేనని ‘జన్మాద్యస్య యతః’ అను బ్రహ్మసూత్రము వద్ద భాష్యకారులు స్పష్టము చేసినారు. కిరీటమైననూ మరియొకరికి ఈయవచ్చును. ఈ కిరీటమును ఆంజనేయస్వామి తలపై నుంచినారు స్వామి. ఇక భవిష్యద్ర్బహ్మ – విష్ణు – శివులు ఆంజనేయస్వామియే. స్వామి నుండి వేరు చేయరాని సౌందర్య రూపగుణములు జ్ఞాన (బ్రహ్మ) – ప్రేమ (విష్ణు) – శాంతి (శివ) అనెడి యీ మూడు స్వరూపలక్షణములనే ‘సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ’ అని శ్రుతి చెప్పుచున్నది. లోకములో జడము కన్నను చైతన్యము విలువ కలది. అష్టసిద్ధులు జడములకు సంబంధించినవి. జ్ఞానప్రేమాది దివ్యగుణములు చైతన్యగుణములు. ఈ జీవులు జడములకు సంబంధించిన సిద్ధులకు ప్రాధాన్యత నిచ్చుచున్నారే తప్ప జ్ఞానాది చైతన్యగుణములకు ప్రాధాన్యత నిచ్చుట లేదు.
ఒక తేజస్సు కన్నులకు చూపినచో భగవంతుడని పరుగెత్తుచున్నారు. అట్టి తేజస్సును క్షుద్రమాంత్రికులును, రాక్షసులును కూడ చూపగలరు. అసలు సిద్ధులు చూపిన తేజస్సుకు, యీ ప్రపంచములో చూపబడిన తేజస్సుకు తేడా లేదు. రెండూ జడములే. రెండూ భగవత్సృష్టియే. జ్ఞాన-ప్రేమతత్త్వమును గుర్తించి స్వామిని నిర్ణయించుకొనవలెను. అట్లుకాక, సిద్ధుల ద్వారా నిర్ణయించుట పామరత్వము. అట్టి దానిలో స్వామి జారిపోవుట కూడ జరుగును. అనగా ఒక రాక్షసుని, స్వామియని భ్రమించు ప్రమాదమున్నది. జ్ఞాన ప్రేమాది లక్షణములు లేక రాక్షసులు, సిద్ధుల మాత్రము చేతనే తాము స్వామియైనామని అహంకరించినారు. రాజాభరణములు ధరించిన పగటి వేషగాడు రాజు అగునా?
లోకవిషయముల లోనికి భగవంతుని తీసుకొని రాకూడదు. లోక విషయములందు కర్మసిద్ధాంతము ననుసరించి సుఖదుఃఖములు వచ్చుచుండును. లోకములో కర్తవ్యములను ఏకాగ్రతతో ఆచరించవలయును. కొంత కాలమైన తరువాత ఆ కర్తవ్యకర్మలో కౌశలము సిద్ధించును. అప్పుడు మనమును పరమాత్మపై కేంద్రీకరిస్తూనే కర్తవ్యముల నాచరించవలయును. కర్మలో కౌశలము వచ్చిన తరువాత యోగము సాధ్యమే. ‘యోగః కర్మసు కౌశలమ్’. అనగా వంట బాగుగ వచ్చిన తరువాత మనస్సును వాక్కును భగవత్పరము చేయవచ్చును. అప్పుడు వంట చెడదు. కానీ వంట బాగుగ రాని ప్రారంభకాలములో, మనోవాక్కులను భగవత్పరము చేసినచో వంట చెడును. అప్పుడా వంటను బాగు చేయమని దైవమును అర్థించుట అవివేకము. కర్తవ్యములందు నేర్చుకున్న ఏకాగ్రత, తరువాత ఆధ్యాత్మికముగను ఉపయోగించును కావున కర్తవ్యములందు ఏకాగ్రత కలిగియుండుట ఆధ్యాత్మికభాగమే అగుచున్నది. కావున వ్యర్థమని తలచరాదు. ఉట్టికెక్కలేని వాడు స్వర్గము నెక్కునా?
కర్తవ్యములందే ఏకాగ్రతలేని చంచలురు ఇక భగవత్ర్పాప్తి సాధనలో ఏకాగ్రతను సాధించుకొనునా? కావున లోకవిషయములను భగవంతుని వద్ద తీసుకొనిపోకుండా, కేవలం భగవద్గుణాకర్షణతో ఆరాధించాలి. అలానే లోకములోకి భగవంతుని తీసుకురాకుండా, ఏకాగ్రతతో కర్తవ్యాలు నెరవేర్చాలి. ఇట్లు చేయనిచో రెండునూ భ్రష్టమగును. చేసేవాడి ఇహపరముల చెడును. ఐహికాలకు భగవంతుని యాచించకుండా ఉండాలంటే, ఐహికములందు ఏకాగ్రతను కలిగి దీక్షతో ఐహికాలను సాధించాలి. యుద్ధమును ఏకాగ్రతతో చేయమని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. తన సాయం లేకుండా ఏకాగ్రతతో కర్తవ్యమును నిర్వహించుకొని, అదే ఏకాగ్రతతో భగవంతుని వైపు తిరగాలి. నేరుగానే ఏకాగ్రతతో భగవంతుని పై తిరిగిన ఏమి? తిరగవచ్చును తప్పు లేదు. కానీ, సంసార సమస్యలు, భగవంతునిపై ఏకాగ్రతను భంగపరుచును. ఐహికముల కొరకు భగవంతుని యాచింపవలసివచ్చును. అపుడు నిష్కామారాధనము కుదరదు. నిష్కామారాధనము లేకుండా సకామారాధనము చేసినపుడు భగవంతుడు ప్రసన్నుడు కాడు కావున సాధన వ్యర్థమగును. కావున కర్తవ్యమును ముందు సాధించుకొని, కర్తవ్యనిర్వహణము చేసుకొనుచు, దైవారాధన చేయువానికే నిష్కామారాధనము కుదురును.
శ్రీకృష్ణదత్త మహామంత్రము అతి శక్తివంతమైనది. ఇందులో కృష్ణశబ్దము స్వామిపై కలుగు ఆకర్షణమును చెప్పును. ఆకర్షించువాడు కృష్ణుడని శబ్దార్థము. ఆ ఆకర్షణము ఏర్పడినపుడు సంసార బంధములు వాటి అంతట అవే జారిపోయి మోక్షము లభించును. ఈ ఇతర సర్వబంధచ్ఛేదమే “దత్త” శబ్దము. దత్తమనగా వదిలివేయబడినది. “దత్తం ఛిన్నం” అని కదా. అమృతము త్రాగినవాడు కాఫీని త్రాగలేడు. కాఫీని వదలుటకు వాడు ప్రత్యేక ప్రయత్నము చేయనక్కరలేదు. భగవద్బంధమే భక్తి. ఇదే కృష్ణ శబ్దము. సంసార బంధచ్ఛేదమే ముక్తి. ఇదే దత్త శబ్దము. భక్తి కలిగినచో ముక్తి దానంతట అదే సహజముగ లభించును. ముక్తికి ఎట్టి ప్రయత్నము అక్కరలేదు. భక్తి లేని ముక్తి శాశ్వతము కాదు. అమృతము తాగకుండా కాఫీని బలవంతముగా వదలినను, మరల 4 రోజుల తరువాత రెండింతలు కాఫీ త్రాగును. సాధన లక్ష్యము ముక్తి కాదు, భక్తి. భక్తి లేని ముక్తి ఎట్టి బంధము లేని రాయి వంటి జడస్థితి వంటిది. అది వ్యర్థము. ‘రసో వై సః’ అను శ్రుతి ప్రకారము రసస్వరూపుడైన భగవంతునితో బంధమేర్పడుటయే భక్తి. సాధన లక్ష్యము భక్తి కాని, ముక్తి కాదు. సాధన లక్ష్యము బంధమే అనగా భగవద్బంధమే కాని, సంసార బంధముక్తి కాదు.
కర్మఫలమును అనుభవించిన కాని తీరదు. ఒక చోట, ఒక పనిలో నీకు కష్టము కలుగుచున్నదని మరొకచోట, మరొక పనిని చేసినచో ఆ కష్టము తప్పునా? ఏ పనిని చేయకున్నచో కష్టము తప్పుననరాదు. అప్పుడా కర్మఫలము, వ్యాధి రూపమున నిన్ను వెంబడించి నీకు కష్టమును కలుగించును. కావున ఓ జీవుడా! నీ తెలివితేటలతో కర్మఫలములను తప్పించుకొన జాలవు. నీ కర్మఫలము తీరు సమయము రాగానే నీవున్న చోటులోనే, నీవు చేయు పనిలోనే కష్టము పోయి సుఖము లభించును.
కర్మఫలమును తప్పించుకొనవలయునన్న భగవంతుని ప్రేమించి స్మరించుము. అయిన నీకు యోగము ప్రసాదించి, కష్టమును నీ మనస్సుకు అంటకుండునట్లు చేయును. నీ భక్తి పరాకాష్ఠకు చేరినచో నీ కర్మఫలములో చాలా భాగము తానే అనుభవించి, నీకు కొంచెము మాత్రమే అందచేయును. అయితే దీని కొరకు అని దైవము నారాధించుట సత్యభక్తి కాదు. స్వామికి ఎప్పుడు ఏదీ అవసరము లేదు. నీవేభావంతో ఆయన వైపు ఒక అడుగు వేస్తావో అదే భావంలో నీ వైపు ఆయన 100 అడుగులు వేస్తాడు. భావంలోని ప్రేమయే విలువకు కారణము కాని, భావమేదియని కాదు. నీవు స్వామిని గురువుగా, స్వామిగా, తండ్రిగా, అన్నగా, భర్తగా, ప్రియునిగా ఆరాధించవచ్చును. రాధ యనగా ఒక వ్యక్తి కాదు. ఒక పదవి. నిరంతర భక్తి ధారగల ఏ జీవుడైనా రాధయే. రాధ పదవిలో కలియుగంలో ప్రస్థానంలో నిలచిన వాడు రామకృష్ణ పరమహంస యని తెలియుము.
ఐహికములు ఆద్యంతములు లేని మాయా భ్రమలు. ఇవి నీ కాలమును శక్తిని, కర్పూరమును అగ్ని జ్వాలలవలె అపహరించును. ఐహికములైన కర్తవ్యములు చేయవలసినదే. వాటిని త్యజించమని చెప్పుట లేదు. కానీ వాటికి వీలగునంత తక్కువ కాలమును, తక్కువ శక్తిని వినియోగించుము. భగవత్సాధనములో నీవున్నప్పుడు, వాటికి తక్కువ కాలము, తక్కువ శక్తి ఉపయోగించినను, అవి చెడక ఫలించియే తీరును. ఇందులో సంశయము వలదు. భగవద్యోగము లేక, నీ కాల శక్తులన్నింటినీ ఐహికములకే కేంద్రీకరించిననూ, ఎక్కువ సార్లు అవి వ్యర్థములై చెడుచునే ఉండును. నీవు భగవత్సాధనలో నున్నపుడు దైవము నీకు ఐహికములందును సాయపడును. అవి త్వరగా సత్ఫలితముల నిచ్చునట్లు అనుగ్రహించి, నీ కాలశక్తులు సాధనలో ఎక్కువగా సద్వనియోగపడునట్లు చేయగలడు. అట్లు అసలు కర్తవ్యములను పూర్తిగా త్యజించి అంతా నీవే చేయమంటే కుదరదు. ఎందుకు? నీవంత స్థాయికి రాలేదు. కావున నీ విశ్వాసము నిజముగా ఆ స్థాయికి ఎదిగినచో తప్పక అతడు నీ సర్వకర్తవ్యములను చేయును. నీవు సతతయుక్తుడైనచో అతడు తప్పక నీ యోగక్షేమములను పూర్తిగా స్వీకరించగలడు. కానీ ఆ స్థితి కోటానుకోట్లలో ఏ ఒక్క జీవునికో వచ్చును. కావున పులిని చూచి నక్క వాతలను పెట్టుకున్నట్లు ఆ స్థితిని అనుకరించకుము.
నిర్గుణ నిరాకారము ధ్యాన, సంభాషణ, దర్శన, స్పర్శనాది యోగ్యము కానందున ఆ పరమాత్మ తన నిర్గుణ స్వరూపమును (నిర్గుణ స్వరూపము కూడా సాకారమే అదే దత్తుడు) ఒక పాంచభౌతిక శరీరమున ప్రవేశించి అవతరించును. అట్టి అవతార పాంచభౌతిక శరీరము ఇతర శరీరములవలె అనిత్యమని భావించి భ్రమించి నిర్లక్ష్యము చేయువాడు దారిలో బంగారు మూటను చూచి వదలిపోయిన దరిద్రుని వంటివాడే. అవతార సమయమున భౌతిక శరీరమే దత్తుడగును. కరెంటు ప్రవహిస్తున్నంత సేపు, తీగె కరెంటే గదా. ఆ తీగెను ఎక్కడ తగిలినను కరెంటును తగిలినట్లే. అవతార బాహ్యరూపము – అంతస్స్వరూపములు పూర్ణ అద్వైతముతో నుండును. శంకరులు చెప్పిన పూర్ణ – అద్వైతము అవతార జీవుని వరకే పరిమితము. అయితే ఈశ్వరేచ్ఛ చేత ఏ జీవుడైనను అవతార పురుషుడు కాగల అవకాశమున్నది. పరశురాముడొక ఋషి. క్షత్రియ సంహార కార్యమునకై దత్తుడతనిని ఆవేశించెను. అప్పుడతడు దత్తుడే. కానీ దత్తావేశము పోగానే, అతడు జీవుడై మరల దత్తుని ఆశ్రయించి గురువుగ ఆరాధించెను. రాముడు, కృష్ణుడు జన్మ ప్రభృతి, సమాప్తి పర్యంతము పూర్ణావతారములు. ఒక్కొక్క జీవునిలో కూడ నిత్యము ఆవేశము ఉండవచ్చును. హనుమంతునిలోను దత్తావేశము ఉండును. ఆ జీవుడే ఇక నుండి దత్తకార్యములగు సృష్టి, స్థితి, లయములను చేయును.
To be continued...
★ ★ ★ ★ ★