09 Nov 2024
Updated with Part-3 on 12 Nov 2024
[26-01-2010, శ్రీదత్తస్వామి ఉపన్యాసము (తెలుగు అనువాదము): ఒక భక్తుడు స్వామిని ఈ విధముగా ప్రశ్నించినాడు. మరణానంతర క్రతువులకు పురోహితులు సుమారుగా లక్ష రూపాయల సొమ్మును తీసుకొనుచున్నారు. ఇది ఎంత వరకు సమంజసము? బ్రాహ్మణులుగు మీరు, దీనిని ఏ విధముగా సమర్థిస్తున్నారు?]
స్వామి సమాధానము: పురోహితులు బ్రాహ్మణులే కాని ప్రతి బ్రాహ్మణుడు పురోహితుడు కాదు. కొంతమంది పురోహితులు తప్పుచేయుట వలన అందరిని నిందించుట తగదు. పురోహితులు ఈ విధముగా సమాజాన్ని దోచుకొనుటను నేను సమర్థించుట లేదు. అదే సమయములో సమాజములో జరిగే ఏ దోపిడీవిధాన్నానైనా ఖండించాలి. ఉద్యోగస్థులు, వ్యాపారవేత్తలు కూడ సమాజాన్ని అక్రమమార్గాలలో దోచుకొనుచున్నారు. సర్వసాధారణముగా ఒకరిని ఒకరు దోచుకొనుట సమాజములో జరుగుతునే ఉన్నది. నేను పురోహితులు చేసేదానిని సమర్థించుట లేదు కాని, ఏదో ఒక కోణములో దోపిడీని నిర్మూలించినంత మాత్రమున, సమాజము ఈ సమస్య నుండి విముక్తి పొందినట్లు కాదు. కనుక నేను చేసే విన్నపము ఏమిటంటే మన విమర్శ పురోహితుల వరకు మాత్రమే పరిమితము కాకుండా, సమాజములో జరిగే ప్రతి దోపిడీని పరిగణలోనికి తీసుకొనవలెను. ఒక్క పురోహితుల వరకే పరిమితమైనచో వచ్చు ఫలితము అత్యల్పము. పురోహితుడు సమాజములో, మరణానంతర నరకభయాన్ని కల్పించి, తరువాత జరిపే క్రతువులు చనిపోయిన ఆత్మను నరకము నుంచి కాపాడునని చెప్పును. నాస్తికుడు, దృశ్యముగా గోచరించని మరియు ఎవ్వరునూ చూపించలేని కారణమున నరకమే లేదను వాదనతో ఈ సమస్యను పరిష్కరించును. కావున నాస్తికుడు నరకభయమును మరియు తత్క్రతువులను వ్యతిరేకించును. నాస్తికుడు ఈ విధమైన పరిష్కారాన్ని సూచిస్తున్నాడు.
కాని నేను ఈ సమస్యకు ఇంకొక దృక్కోణములో సమాధానము ఇచ్చెదను. ఏమిటంటే, నరకము ఉన్నది మరియు నరకభయము ఉండవలెను. దీనితోపాటు నరకభయము పోగొట్టుకొనుటకు మరణానంతర క్రతువులును చేయవలెను. అదే సమయములో, పురోహితుడు ఈ స్థితిని ఉపయోగించి దోచుకొనుచు, క్రతువును సక్రమమైన విధానములో జరుపక, క్రతువును చేయించినందులకు గాను ధనమును రొక్కించుచున్నాడు. ఈ విధముగా పురోహితుడు రెండుతప్పులును చేయుచున్నాడు. మొదటితప్పు ఏమనగా క్రతువులను శాస్త్రప్రకారముగా సక్రమమైన విధానములో జరపకపోవుట. రెండవతప్పు ఏమనగా క్రతువు చేయించినందులకుగాను ధనమును తీసుకొనుట. ఇక క్రతువులను సక్రమమైన మార్గములో, శాస్త్రపరముగా జరిపించుట ఎట్లనగా క్రతువు సమయములో బ్రహ్మజ్ఞానమును బోధించి భగవద్భక్తిని పెంపొందించుటకు ప్రయత్నము చేయుటయే. మరి జరుగుతున్నది ఏమనగా, పురోహితుడు సంస్కృతభాషలో మంత్రములు చదువును. క్రతువు చేయువానికి మంత్రార్థములు తెలియవు. వేదములను ఋషులు వారి మాతృభాషయగు సంస్కృతములో లిఖించిరి. భగవంతుడు సర్వజ్ఞుడును మరియు అన్ని భాషలను అర్థము చేసుకొనగలడు. కావున మన పురోహితులు ఇప్పటి మన మాతృభాషలో మంత్రములను చదివినచో, వానిని మనము అర్థము చేసుకొను అవకాశము కలుగును. కనీసము మాతృభాషలో అర్థము చెప్పినను క్రతువు చేయువానికి బ్రహ్మజ్ఞానము తెలిసి భగవద్భక్తి పెంపొందును.
కాని ఇప్పటి పరిస్థితులలో పురోహితునకు సహితము సంస్కృతభాష తెలియని కారణమున మంత్రార్థములను బోధించలేని స్థితి ఏర్పడినది. ప్రాచీన కాలములో వేదములను భద్రపరచుటకుగాను మరియు లిఖితపూర్వకముగా కుదరకపోవుటవలన, ఋషులు ఉచ్చారణమార్గమును అనుసరించినారు. ప్రస్తుత సమయములో వేదములు పుస్తకరూపములో ముద్రింపబడినవి. అందువలన పురోహితుడు పుస్తకము చూసి పఠించి, వాని అర్థములను తెలియజేయవలెను. ఇతర మతములైన క్రైస్తవ మరియు ఇస్లాం మతములలో వారి గ్రంథములు మాతృభాషలో లిఖింపబడుట వలన వారికి ఈ దుఃస్థితి కలుగలేదు. పుస్తకము చూసి పఠించరాదన్న శాస్త్రము గురించి (లిఖితపాఠకః ...) ఆలోచింప పనిలేదు. దానిని పండితుడు సృష్టించి గ్రంథములో ప్రవేశ పెట్టినాడు. కాని అదే మంత్రములో పురోహితుడు అర్థము తెలుసుకొని పఠించవలయుననియు ఉన్నది (అనర్థజ్ఞః...). పురోహితుడు తన సమయము మొత్తాన్ని వెచ్చించి సంస్కృతభాష నేర్చుకొని మంత్రార్థములను తెలియజేయు స్థితికి చేరవలయును. పురోహితుడు తన సమయాన్ని కేవలము గ్రుడ్డిగా బట్టీపట్టుటలో వృథా చేయుట మానవలెను. ఈ విధమైన మార్పు సాధించిననాడు హిందూమతము తన పూర్వపు వైభవాన్ని సంతరించుకొనును.
క్రతువుల అంతరార్థము బ్రహ్మజ్ఞానమును ప్రచారము చేసి భక్తిని పెంపొందించుటయే
క్రతువు యొక్క అంతరార్థము బ్రహ్మజ్ఞానమును ప్రచారము చేయుట, తద్ద్వారా భక్తిని పెంపొందించుట కాని గ్రుడ్డిగా సంస్కృతములోని మంత్రములను ఉచ్చరించుట కానేకాదు. సంస్కృతములో ఒకానొక మంత్ర ఉచ్చారణ ద్వారా మరణించిన జీవుడు ఉద్ధరింపబడినచో, భగవంతుడి సంకల్పము ద్వారా ప్రతి మతములోను అటువంటి ఆచరణలు అమలులో ఉండవలెను కదా! ఒకవేళ అటువంటి అవకాశము హిందూమతములోనే ఉన్నచో, భగవంతుడికి పక్షపాతము ఉన్నట్లు అగును. దీని వలన ఆయన సర్వజనులకు తండ్రి అనునది అసత్యమగును కదా! ఈ సంస్కృతమంత్రముల ఉద్దేశ్యము ప్రధానముగా బ్రహ్మజ్ఞానమును బోధించి భగవద్భక్తిని పెంపొందించుటయే. అట్టి ప్రధానోద్దేశ్యము ప్రతి మతముయొక్క భాషలోని మంత్రములలోనూ ఉన్నది. అందువలన మంత్రముల సారము అన్ని భాషలలోను ఒక్కటే. ఈనాడు హిందూమతములో, ఈ సారము పోయి, క్రతువులన్నియు నిస్సారముగను మరియు అసమర్థముగను మారి మరణించిన జీవుని రక్షింపలేకున్నవి. మంత్రములలోని జ్ఞానములో ప్రవహించు భక్తి మాత్రమే జీవుని నరకము నుంచి రక్షింపగలదు.
పురోహితుడు అశాస్త్రీయముగా క్రతువు చేయుటయే కాక ధనమును రొక్కించి తీసుకొనుచున్నాడు. ఒకవేళ శాస్త్ర పరముగా చేయించినప్పటికిని ఇట్లు ధనమును ఆశించరాదు. ఇది రెండు విధములుగా నేరము. ధనమును తీసుకొనుట శాస్త్ర సమ్మతము కాదు. శాస్త్రము, ధనమును దానము చేయుట ధర్మమన్నది కాని ధనమును అడిగి తీసుకొనుటను సమర్థించలేదు (ఆద్యత్రిషు నియమః...). పురోహితుడు క్రతువును సక్రమమైన మార్గములో జరిపించి, కర్తకు బ్రహ్మజ్ఞానము ద్వారా భక్తిని ప్రేరేపించవలెను. అట్లు ప్రేరేపితుడైన కర్త, తన శక్తి మరియు అభీష్టము అనుసరించి ఇచ్చిన దక్షిణను పురోహితుడు స్వీకరించవలెను. అంతేకాని పురోహితుడు ధనమును రొక్కించి తీసుకొనరాదు. అట్టి పరిస్థితులలో పురోహితుడు తన భుక్తికి భంగము కలుగగలదని అభిప్రాయపడవచ్చు. పురోహితునకు వేల రెట్లు ధనము లభించగలదని నేను ఆశ్వాసనమిస్తున్నాను. ఎందుకనగా పురోహితుడు తన కర్తవ్యమును సక్రమముగా నెరవేర్చినందుకు భగవంతుడు సంతుష్టుడగును. పురోహితుడు రొక్కించి తీసుకొన్న ధనము మంచిది కాదు. మరియు ఆ ధనము సంసారములో సంతోషమును మరియు విజయాన్ని చేకూర్చదు. అక్రమమార్గములో, మోసగించి ఆర్జించిన ధనము యొక్క అంతిమ ఫలితము ఎల్లప్పుడునూ సక్రమముగా ఉండదు. పురోహితుడు సక్రమముగా చేయించినచో చేయించువాడు తన శక్తికి మించి కూడ దక్షిణ ఇచ్చును. కారణము అతడు మంత్రార్థము తెలిసిన మీదట భగవత్ప్రేరేపితుడగును. కాని ప్రస్తుత సమయములో కర్త పురోహితునకు బలవంతముగాను, భయముతోను ఇచ్చున్నాడే కాని పరిపూర్ణ అభీష్టముతో ఇచ్చుట లేదు. దీనికి కారణము కర్త క్రతువులోని మంత్రార్థములను తెలియక పూర్తిగా సంతుష్టి చెందుటలేదు.
శాస్త్రపరముగా క్రతువును చేయు సక్రమమైన మార్గము
పురోహితుడు తన తప్పిదమును తెలుసుకొని తప్పుడు మార్గాన్ని విడనాడనిచో, ఈ సమస్యకు పరిష్కారమేమనగా కర్తయే అటువంటి వ్యర్థ క్రతువులను త్యజించి శాస్త్రపరముగా సక్రమమైన మార్గములో జరుపుకొనవలెను. కర్త, కొందరు మంచి భక్తులను ఆహ్వానించి, మరణించిన ఆత్మకు సద్గతి కొరకు మాతృభాషలో భజనలను చేసుకొనవచ్చును. ఈ విధముగా జరిపిన క్రతువులో మరణించిన జీవునకు ఖచ్చితముగా సద్గతి కలుగును. ఏలననగా, క్రతువు యొక్క సారమును ఆచరించుట వలన సద్గతి కలుగును. ఒక వేళ క్రతువు చేయువాడు కూడ బుద్ధిహీనుడై, భయమనే ఉచ్చులో ఉండినచో, మరణించబోయే జీవుడు మరణమునకు ముందే సంన్యాసము తీసుకొనిన, సంన్యాసికి ఏవిధమైన మరణానంతర క్రతువులు అవసరములేదు. ఒకవేళ కుమారుడు మూర్ఖముగా మూఢసంప్రదాయములను పాటించువాడైనచో, ఈ విధముగానైనను, అనవసరముగా అతడు ఖర్చు పెట్టబోయే లక్షరూపాయలను దాచుకొనవచ్చును. నిజముగా ఆలోచించినచో, ప్రతి జీవుడు చనిపోయే ముందే సంన్యాసాశ్రమము తీసుకొనవలయును. శాస్త్రము ఏమని చెప్పుచున్నదంటే, ప్రతి జీవుడు క్రమముగా నాలుగు ఆశ్రమములను పాటించవలయును అని చెప్పుటయే కాక గృహస్థాశ్రమములోనే ఉండి చనిపోవుటను కూడా ఖండించుచున్నది.
Part-2
మరణించిన జీవునకు భగవద్గీతలో రెండు మార్గములు చెప్పబడినవి
నిజముగా ఆలోచించినచో, మరణించిన జీవుడు భగవద్గీతలో చెప్పబడిన రెండుమార్గములలో ఏదో ఒక మార్గమున ప్రయాణించును. అవియే శుక్ల మరియు కృష్ణ మార్గములు (శుక్ల కృష్ణ గతీ హ్యేతే ... గీత). మొదటి శుక్లమార్గములో ఆత్మ భగవంతుని చేరును మరియు అట్టి ఆత్మకు ఏవిధమైన ఆహారము అవసరము లేదు (నహి తేన పథా తనుత్యజః, తనయావర్జిత పిండకాంక్షిణః ...). రెండవ కృష్ణమార్గము మూడు భాగములుగా విభజింపబడినది. ఉన్నతభాగము స్వర్గము. ఈ లోకమున ఆహారపానీయముల అవసరమే లేదు (ఉభే తీర్వ్తాఽశనాయ ...). దాని క్రింద లోకము పితృలోకము. ఈ లోకములో కూడ అహారపానీయములు అవసరము లేదు, కారణము ఆత్మ అస్తిత్వానికి కావలసిన శక్తి, చంద్రుని నుంచి వచ్చు కాంతి ద్వారా సమకూరును (నిర్విష్టసారం పితృభిః హిమాంశోః). ఈ లోకము కన్న క్రింద లోకము నరకము. ఈ లోకములో జీవునకు ఆహారపానీయములు ఇవ్వబడవు. జీవుడు ఆకలి దప్పికలు అనుభవించును (జాయస్వ మ్రియస్వ ...). ఈ విధముగా మరణించిన జీవునకు ఆహారపానీయముల అవసరము లేదు, ఎందుకనగా మరణానంతరము జీవునకు శక్తిమయశరీరము ఇవ్వబడును. ఈ శక్తిమయశరీరమునకు భౌతిక పదార్థముతో కూడిన ఆహారము అవసరము లేదు. క్రతువునందు పురోహితులకు చేయు అన్నదానమంతయు, అర్హత కలిగిన వేదజ్ఞానము కలవారగు పురోహితులను అనందపరచుట కొరకే. ఇట్టి అర్హత కలిగిన వారికి దానము చేయుట అను మంచికర్మ ద్వారా, మరణించిన జీవునకు రక్షణ చేకూరును. మరి, పురోహితునకు అన్నదానము చేయుట ద్వారా మరణించిన జీవునకు భోజనము సమకూరునను అసత్యము చెప్పుట ఎందులకు? దీనిని అర్థవాదము అందురు. అనగా, మంచి కార్యము చేయించుట కొరకు ప్రోత్సహించుటలో ఒక అబద్ధమును చెప్పుట. దీనివలన దురాశాపరుడు కూడ అర్హత కలిగిన పురోహితులకు లేదా భక్తులకు అన్నదానము చేయును. ఎందుకనగా, అటుల చేయనిచో మరణించిన తన బంధువు భోజనము లేక, ఆకలిబాధతో యుండుననియే. కాని ఈ అర్థవాదమును ప్రస్తుత అర్హతలేని పురోహితులు, అజ్ఞానులైన ప్రజలనుంచి ధనమును దోచుకొనుటకు ఉపయోగించుచున్నారు. కావున ప్రస్తుత సమయములో ఈ అర్థవాదమను ముడి విప్పి ప్రజలకు సత్యము తెలియజేసినచో ప్రజలు దానిని సరియైన స్ఫూర్తితో ఆచరించుదురు. ఏలననగా, సత్యమైన మార్గములో అర్హత కలిగిన భక్తులకు చేయు దానము భగవంతుని కృప సంపాదించి మరణించిన ఆత్మకు రక్షణ కలిగించును. కనుక సత్యమును తెలియజేసి ఆ మార్గము ద్వారా మరణించిన ఆత్మకు భగవంతుని రక్షణ పొందగలిగినచో, ఈ అసత్యముతో కూడిన అర్థవాద మార్గము అవసరమేల?
మరణానంతర క్రతువులో అర్హత కలిగిన పురోహితునకు గోదానము చేయుదురు. దీనిలోని అర్థవాదము ఏమనగా, మరణించిన జీవుడు నరకము ముందున్న నదిని (చీము మరియు రక్తముతో కూడినది) దాటుట కొరకు అనియే. ఈవిధముగా అర్థవాదము, గోదానము అను మంచి కార్యమునకు ప్రోత్సహించును కాని, నదిని దాటుట అనునది అసత్యము. ఇదే విధముగా యుక్త వయస్సులోని ఎద్దును కూడ వదలివేయుదురు. కారణమేమనగా, ఫలదీకరణము ద్వారా గోజాతి వృద్ధి చెందును. సాధారణముగా ఎద్దులను ఫలదీకరణమునకు ఉపయోగపడకుండా చేసి వాటిని వ్యవసాయమునందు ఉపయోగించుదురు. ఈ విధముగా గోజాతిని వృద్ధి చేయుట కొరకు ఈ అర్థవాదమును ప్రవేశపెట్టినారు. సర్వ సాధారణముగా ప్రతి జీవుడును స్వార్థపూరిత కర్మలలోనే (వ్యవసాయాభివృద్ధికై) నిమగ్నుడై, ఇటువంటి మంచి దానధర్మములందు ఆసక్తి చూపడు. పైన తెలియజేసిన దానములు అన్నియు మరణించిన జీవునకు సద్గతి కలుగజేయును. కనుక, ఇటువంటి దానములను, సత్యమును తెలియజేయుట ద్వారా సాధించగలిగినచో, ఈ అర్థవాదము అవసరము లేదు. అర్థవాదమును ఉపయోగించి అనర్హులైన పురోహితులు లబ్ధి పొందుచున్నారు. అనర్హులైన వారికి దానము చేసినచో పాపము కలుగును మరియు మరణించిన జీవుని శిక్షలు కూడ పెరుగును. దానము తీసుకొనువాని అర్హత పైనే దానము యొక్క ఫలితము ఆధారపడును. ఒకవేళ అర్హత కలిగిన వాడు దొరకని ఎడల, క్రతువును అర్హత కలవాడు దొరుకు వరకును వాయిదా వేసుకొనవచ్చును. కాని ఈనాడు అజ్ఞానులైన ప్రజలు ఈ విషయమునకు అంత ప్రాముఖ్యత ఇచ్చుట లేదు. వీరు సామాన్యముగా చనిపోయిన రోజునే క్రతువు మరియు దానములను చేయుటకు ఉత్సాహము చూపుచున్నారే గాని, దానము తీసుకొనువాని అర్హత ఆలోచించుట లేదు. దానమునందు ప్రదేశము మరియు సమయమునకు ప్రాముఖ్యతలేదు.
నరకము యొక్క ఉనికి (existence) 50-50% సంభావ్యత (probability) పైన ఆధారపడియున్నది
ఇప్పుడు, నాస్తికుడు ఈ విశ్వములో నరకమే లేదని వాదించవచ్చును. మరియు తద్ద్వారా ఈ క్రతువులు అనవసరమనియు భావించవచ్చును. నేను నరకముయొక్క ఉనికిని చూపించ లేకపోవుచున్నాను. కాని అదే సమయములో, నాస్తికుడు నరకము లేదనియూ చెప్పలేకపోవుచున్నాడు. కారణమేమనగా ఈ విశ్వము అనంతము కావున. మరియు కనిపించని వస్తువులన్నియు లేవనియు చెప్పలేము. విశ్వమంతయు వ్యాపించిన విశ్వశక్తి (cosmic energy) కంటికి కనిపించదు కాని కలదు. మనము దీనిని అత్యంత శక్తిమంతమైన సూక్ష్మదర్శిని ద్వారా చూడగలము. కనుక, కంటికి కనిపించని విశ్వమంతయు నిండిన శక్తిని, సూక్ష్మదర్శిని (microscope) అను ప్రత్యేక పరికరము ద్వారా చూసి దాని ఉనికిని ధృవీకరించుచున్నాము. అదే విధముగా, తపస్సు ద్వారా సాధించిన ప్రత్యేకశక్తి లేక భగవత్కృప అను ప్రత్యేక పరికరము ద్వారా ఊర్ధ్వలోకముల ఉనికిని తెలుసుకొనవచ్చును. నరకము సమీపములోనే ఉండి ఉండవచ్చును. కాని ఈ ప్రత్యేక పరికరము లేని కారణమున కనిపించదు. లేదా నరకము కంటికి కనిపించనంత, ఈ అనంత విశ్వములో చాలా దూరములోనైనా ఉండవలెను. మనమిద్దరము నరకము యొక్క ఉనికిని ఉన్నది, లేక లేదు అని ఖచ్చితముగా చెప్పలేకున్నాము. ఈ స్థితిలో నరకము యొక్క ఉనికి 50% శాతము ఉండుటకును మరియు 50% లేకుండుటకునూ అవకాశము కలదు. ఒక గ్రుడ్డివాడు నడచుచున్నాడనుకొనుము. ఒకడు వాని వద్దకు వచ్చి నీ మార్గములో నిప్పు కలదు అని చెప్పినాడు అని అనుకొందము. మరియొకడు వచ్చి నిప్పు లేదని చెప్పినాడు అని అనుకొందము. ఆ గ్రుడ్డివాడు నిజముగా తెలివిగలవాడైనచో, వాడు వెనుకకు మరలుట మంచిది, కారణమేమనగా నిప్పు ఉండుటకు మరియు లేకపోవుటకునూ 50-50 శాతము అవకాశము కలదు. ఒకవేళ నిజముగా నిప్పు ఉన్న ఎడల, వాడి శరీరము కాలును. ఇదే విధముగా తెలివిగలవాడు నరకము ఉన్నది అని నమ్మి, చనిపోయిన వాని ఆత్మ, సుఖశాంతుల కొరకు మరణానంతర క్రతువులను చేయును. నిజముగా మాట్లాడినచో, క్రతువులను సరిగా చేయించక మరియు ధనమును ఆశించిన ఎడల, పురోహితుడు నరకమునకు పోవును.
Part-3
సృష్టి యొక్క అవధులు ఎప్పుడును కనిపించనందున సృష్టి ఊహాతీతము
ఒక వస్తువు మన కంటికి కనిపించని మాత్రమున అది ఊహాతీతము (unimaginable) అని చెప్పలేము. కారణమేమనగా ఒక ప్రత్యేక పరికరము లేక పద్ధతి ద్వారా ఆ వస్తువు కనిపించినచో అది ఊహాతీతము కాదు కదా. దృష్టికి కనిపించనంత వరకు ఊహాతీతముగా ఉండును. అనగా, ఎప్పటికిని దృష్టికి కనిపించని ఎడల అది ఊహాతీతము అగును. సృష్టి యొక్క అవధులు (boundaries) ఎప్పుడును కనిపించవు. కనుక అవి ఎప్పుడును ఊహాతీతమే అగును. కావున, ఏ వస్తువు శాశ్వతముగా ఊహాతీతమగునో ఆ వస్తువు సృష్టి అవధులవలె దృష్టికి ఎప్పటికిని కనిపించదు. ఇక తాత్కాలికముగా ఊహాతీతమైనచో, విశ్వమునంతయు వ్యాపించిన శక్తివలె, కొంత సమయము వరకు కనిపించదు. కాని, ఏదో ఒక సమయములో ఒక ప్రత్యేక పరికరము ద్వారా దృష్టికి కనిపించవచ్చును. నీవు ఒకానొక బిందువును ఊహించుకొని దానిని సృష్టి అవధిగా భావించవచ్చును. కాని, ఆ విధముగా ఊహించుకొనిన బిందువు సృష్టి అవధి కాజాలదు కారణమేమనగా, సృష్టి అవధులు ఊహకు అందవు కదా! ఒకవేళ ఎవరైనా సృష్టి అవధిని ఊహించితిమి అన్నచో, వానికి వెంటనే స్ఫురించే ప్రశ్న ఏమనగా ‘ఆ సృష్టి అవధులు దాటిన తరువాత ఏమున్నది?’ అని. అప్పుడు నీవు ఇంకనూ మరికొన్ని బిందువులు ఉన్నవనినచో, నీవు ఊహించిన బిందువు సృష్టి అవధి కాజాలదు. కనుక, సృష్టి అవధులు శాశ్వతముగా ఊహాతీతము. భగవంతుడు విశ్వమును (universe) కూడ దాటి ఉండుటచే, సృష్టి అవధులు చేరినచో భగవంతుని చేరినట్లే. కాని సృష్టి అవధులు ఊహామాత్రమున కూడ చేరలేనిచో, భగవంతుడు ఎప్పుడును ఊహాతీతుడగును.
ఒక అద్భుతమైన మహిమ (miracle) ఎప్పుడును ఊహాతీతమైన భగవంతుని సూచించును. అద్భుతము అనగా ఊహించగలిగే మరియు దృష్టికి గోచరించే కొన్ని అంశాల సమ్మేళనము. ఈ సమ్మేళనము ద్వారా, కనిపించని మరియు ఊహాతీతమైన అంతర్లీనముగా ఉన్న అంశము యొక్క ఉనికి తెలియజేయబడును. ఉదాహరణకు, చిన్న బాలుడు, చిన్న వ్రేలు, ఒక పర్వతము మరియు దానిని ఎత్తుట అనునవి కనిపించేవి మరియు ఊహకు అందు అంశములు. కాని, ఈ అంశములన్నియు దృష్టికి కనిపించని మరియు ఊహకు అందని తర్కాతీతముగా (beyond logic), ఒక బాలుడు పర్వతము ఎత్తుటను సూచించుచున్నది. ఇచ్చట తర్కము వర్తించనందువలన, బాలుడు పర్వతమును ఎత్తుట అనునది ఊహాతీతమగును. ఊహాతీతమైన వస్తువు ఎప్పుడును దృష్టికి గోచరించదు, కారణమేమనగా, ఊహకే అందని వస్తువు దృష్టికి గోచరించదు. ఇక్కడ బాలుడు పర్వతమును ఎత్తుట అనునది కనిపించినప్పటికిని, అంతర్లీనముగా ఉన్న పర్వతము ఎత్తుటలోని తర్కము (logic) దృష్టికి కనిపించదు మరియు ఊహాతీతము. తర్కముతో కూడిన ఈ పర్వతము ఎత్తుటలోని విధానము ఎల్లప్పుడును కనిపించదు మరియు ఊహాతీతము. అందువలన ఊహాతీతమైన వస్తువు దృష్టికి కనిపించదు. ఇదే విధముగా, ఈ పర్వతమును ఎత్తుట అను కార్యములో పాల్గొన్న బాలుడు, దృష్టికి గోచరించి మరియు ఊహకు అందినప్పటికిని, కారణభూతమైన భగవంతుడు, అంతర్లీనముగా ఉండి దృష్టికి గోచరించడు.
నీవు బాలుని చూసి ఊహాతీతమైన భగవంతుని చూశాను అని అనుకొనెదవు. కారణము నీవు ఆ బాలునినే భగవంతుడనుకొనుచున్నావు. కాని నిజమేమనగా, ఆ బాలునిలో భగవంతుడు అంతర్లీనముగానే కలడు. అందువలన వేదము చెప్పిన, ఒకానొక భగవంతుని కృప కలిగిన జీవుడు భగవంతుని చూచును (కశ్చిత్ ధీరః...) అనునది సత్యమైనది. అదే విధముగా, ఊహాతీతమైన భగవంతుడు ఆ బాలునిలో దాగి ఉన్నాడు కాబట్టి నిజముగా ఆలోచించినచో భగవంతుని చూడలేదు. అందువలన వేదము చెప్పినట్లుగా, ఏ ఒక్కడూ ఈ నేత్రములతో భగవంతుని చూడలేడనునదియు సత్యమైనది (న తత్ర చక్షుషా...). ఈ అద్భుతము ద్వారా ఊహాతీతవిధానముయొక్క ఉనికిని గ్రహించవచ్చును. కాని ఊహాతీతమును అద్భుతము ద్వారా గ్రహించితిమి కావున ఊహాతీతము ఇక ఊహకు చిక్కినది అని వాదించరాదు. సహనము మరియు సూక్ష్మమైన ఆలోచనతో ఆ కారణము మనకు తెలియును. ఈ అద్భుతకార్యము నుండి గ్రహించినది ఏమనగా, ఊహాతీతమైన వస్తువు (unimaginable item) యొక్క ఉనికి (existence) మాత్రమే తెలసినది కాని ఆ ఊహాతీత వస్తువు యొక్క ఏ విధమైన జ్ఞానమూ తెలియలేదు.
ఒక కొండ పైనుంచి వస్తూ కనిపించెడి పొగను చూసి, కనిపించని మంటను గ్రహించవచ్చును కాని ఈ సంఘటనలో ఒక్క మంట ఉనికినే కాక దాని ఇతర లక్షణములగు కాంతి, వెచ్చదనము, జ్వాలలు మొదలగు వానిని కూడ ఊహించుకొనుచున్నాము. కావున ఈ సంఘటనలో అనుమాన ప్రమాణము (inferential authority), మంట యొక్క లక్షణజ్ఞానమును పూర్తిగా తెలియజేయగలిగినది. కాని అదే అనుమాన ప్రమాణము అట్టి అద్భుతకార్యములో, ఊహాతీత వస్తువుయొక్క ఉనికిని మాత్రమే తెలియజేయగలిగినది కాని, ఆ ఊహాతీతవస్తువు యొక్క లక్షణజ్ఞానమును ఏమియు తెలియజేయలేకపోయినది. ఈ విధముగా, అనుమాన ప్రమాణము ఎల్లప్పుడును ఊహాతీతమైన వస్తువుయొక్క లక్షణజ్ఞానమును తెలియజేయుటలో విఫలమైనది. ఒకవేళ ఉనికిని కూడ తెలియకుంటే, ఎవ్వరునూ ఊహాతీతమైన వస్తువు యొక్క అస్తిత్వమును (existence) కూడా ఒప్పుకొనెడివారు కాదు. ఇట్టి ఊహాతీతమైన వస్తువే భగవంతుడు. అందువలన వేదము, భగవంతుని ఉనికి మాత్రమే తెలియునుగాని ఆయన ఇతర లక్షణజ్ఞానము ఏమియు తెలియలేము అని చెప్పుచున్నది. కాబట్టి, ఊహాతీతమైన భగవంతుని ఉనికి తెలిసినంత మాత్రాన, భగవంతుడు ఊహించుటకు వీలు కాడు. భగవంతుని గురించిన ఏకైకజ్ఞానము ఏమనగా, ఆయన ఉనికిని తెలుసుకొనుటయే. ఇదియే ‘ఓమ్ తత్ సత్’ యొక్క అర్థము.
ఓమ్ తత్ సత్
శ్రీవేణు గోపాల కృష్ణాయ వందనమ్
★ ★ ★ ★ ★