home
Shri Datta Swami

 26 Feb 2025

 

క్రియాపరమైన సేవయే త్యాగము

ప్రేమ, మోహము పరమాత్మ సృష్టించిన తేనె. ఆ తేనెను పరమాత్మకు అర్పించక నీవు సంసారమునకు అర్పించుచున్నావు. చాలామంది గురువులు ఈ సంసార వ్యామోహమును దగ్ధము చేయవలయునని చెప్పుతుంటారు. దగ్ధము చేయవలసినది సంసార బంధమునుగాని వ్యామోహమును గాదు. తేనెను సంసారమను సీసా నుండి పరమాత్మయను సీసాలో పోయవలయును గాని తేనెను పారపోయమని కాదు. సంసారమను సీసాతో గల నీ బంధమును పగులగొట్టుము. సంసారమను సీసాను కాదు. నీ భార్యపుత్రుల పై బంధము తెంచుకొనమని అర్థము గాని భార్యాపుత్రులను చంపమని కాదు. మరియు వారిపై గల ప్రేమను నాశనము చేయుట గాదు, ఆ ప్రేమను భగవంతుని మీదకి మరలించుము. కావున సీసాను పగులగొట్టుట గాని, తేనెను పారపోయుటగాని అర్థము కాదు. ఒక సీసాపై గల బంధమును తెంచుకొని, మరియొక సీసాపై బంధమును పెంచుకొని మొదటి సీసా నుండి తేనెను రెండవ సీసాలోనికి మార్చుటయే నీవు చేయవలసిన పని.

నీవు ఒక కారులో మద్రాసుకు పోవుచున్నావు. నీవు పోవలసిన లక్ష్యము ఢిల్లీ, కావున, నీవు కారును ఢిల్లీ వైపుకు త్రిప్పవలయునుగాని ఈ కారు నన్ను మద్రాసుకు తీసుకొనిపోవుచున్నది అను కోపముతో కారును వదలివేయుట కాదు. కారు నీ అధీనములో యున్నది. అట్లే వ్యామోహము నీ అధీనములో ఉన్నది. కావున సాధన అంటే వ్యామోహమును వదలుట కాదు. వ్యామోహమును పరమాత్మ వైపుకు మరలించుటయే సాధన. అదే వ్యామోహము నిన్ను భగవంతుని వద్దకు అతి శీఘ్రముగా తీసుకొనిపోవును. అయితే, వ్యామోహము మాటలు, భావనలు, వాక్కుల వరకే పరిమితము కారాదు. అది క్రియాత్మకముగా యుండవలెను. ఏలయనగా నీవు భార్యాపుత్రులు, సంసారములపై క్రియాత్మకమైన వ్యామోహమునే చూపుచున్నావు. ముఖ్యముగా నీ పుత్రులను తీసుకొనుము. వారిపై నీవు ఎప్పుడును మాటలతో భావములతో వ్యామోహమును ప్రకటించుట లేదే. వారితో ఎంతో మౌనముగా ఉండుచున్నావు. కాని వారిపై క్రియాత్మకమైన మోహమును ఆచరణలో చేయుచున్నావు. కావున ఉత్తమ సాధకుడు భగవంతుని పై కూడా అట్టి వ్యామోహమును కలిగియుండవలెను. మౌనమే ఉత్తమ సాధనలక్షణము ‘మౌనమాత్మ వినిగ్రహః’ అని గీత.

భావములను, వాక్కులను నిగ్రహించి నీవు పరమాత్మ వద్ద నీ ప్రేమను, శక్తిని క్రియలో కేంద్రీకరించుము. ఎట్లు మౌనముగా నీ పిల్లల వద్ద నీ ప్రేమనంతయును క్రియాపరముగా కేంద్రీకరించుచున్నావో, అట్లే మౌనముగా పరమాత్మ వద్ద కూడా నీ ప్రేమనంతయును క్రియాపరముగా కేంద్రీకరించుము. నీ పిల్లలకు క్రియ అవసరము వచ్చినప్పుడు క్రియాపరమైన సేవను చేయుచున్నావు. అట్లే అవసరము వచ్చినపుడు పరమాత్మ పై కూడ క్రియాత్ర్మకమైన ప్రేమను ప్రదర్శించుము. స్థిర, చరరూపమైన నీ ధనమును నీ పిల్లలకు నీవు ఎట్లు ఇచ్చుకొనుచున్నావో, అట్లే పరమాత్మకు యిచ్చుకొనుము. నీ పిల్లల వద్ద నీవు ఏమి చేయుచున్నావో అదే పరమాత్మ వద్ద చేయుము. నీవు ఏది నీ పిల్లలవద్ద చేయుట లేదో దానిని పరమాత్మకు చేయకుము. నీవు నీ పిల్లల వద్ద మడిబట్టలు కట్టుట లేదు. మాలలు వేసుకొనుట లేదు. వారి పేరు జపించుట లేదు. వారి చరిత్రను పారాయణ చేయుట లేదు. భజనలు చేయుట లేదు. కన్నీరు కార్చుట లేదు. వారి వద్ద మౌనముగా  వుంటున్నావు. గంభీరముగా ఉంటున్నావు. ఏలయనగా వారిపై గల సత్యమైన ప్రేమకు ఇట్టి వేషములు, ఇట్టి కర్మలు నిరూపణములు కావని నీకు బాగుగా తెలియును. మరి అట్టి వేషములను అట్టి పనులను పరమాత్మ వద్ద ఏల చేయుచున్నావు? మరియును నీ పిల్లలకు చేయు క్రియాత్మకమైన సేవయైన త్యాగమును పరమాత్మ వద్ద ఏల చేయకయున్నావు?

Swami

ఏలననగా సత్యమైన ప్రేమను బయటకు ప్రకటించక క్రియాపరముగా చేయుటయే సత్యమైన ప్రేమను తెలియచేస్తుంది. అసత్యమైన ప్రేమ ఎప్పుడును ప్రకటించబడుటయే తప్ప క్రియాపరముగ ఉండదు. ఇదే ‘కరిచే కుక్క మొరగదు, మొరిగే కుక్క కరవదు’ అని అంటారు. అందుకే భావములను ప్రకటించకుండా మనస్సును నిగ్రహించమనియు, వాక్కులతో ప్రదర్శనము చేయకుండా, మౌనమును పాటించమనియు, ఈ రెండు పనులు నీ పిల్లల వద్ద ఎట్లు చేయుచున్నావో, అట్లే భగవంతుని వద్ద సాధనలో కూడ చేయమని గీతాబోధ. ఆత్మ వినిగ్రహము అనగా ‘భావప్రకటనము చేయు మనస్సును నిగ్రహించుట’. మౌనము అనగా ‘వాక్కులతో చేయు ప్రదర్శనమును నిగ్రహించుట’. ఏలయనగా ఎట్టి ప్రయోజనము లేని ఈ రెండు పనుల ద్వారా నీవు నీ కాలమును, నీ శక్తిని వ్యర్థము చేయుచున్నావు. స్వామి సర్వజ్ఞుడు కావున ఇట్టే అసత్యమైన పనుల వలన ఆయన మోహింపబడడు.

క్రీస్తు భగవానుడు ఒకమాటను చెప్పియున్నాడు. అది ఏమనగా – ముందున్న వారు వెనుకకు పోవుదురు. వెనుకనున్న వారు ముందుకు వచ్చెదరు. దీని అర్థమేమి? వాక్కులతో, మనస్సుతో, వేషములతో అనేక విన్యాసములను చేయుచు, క్రియాపరముగ శూన్యులై, మహాజ్ఞానులుగను, మహాభక్తులుగను లోకదృష్టిలో అగ్రగణ్యులై ప్రసిద్ధికి ఎక్కినవారు లోకేశ్వరుని  దృష్టిలో చిట్టచివరకు పోవుదురు. ఇట్టి విన్యాసములు చేయక అవసరమైనపుడు క్రియాపరముగ సేవలు త్యాగము చేసి తమ వ్యామోహము భగవంతునిపై తప్ప అన్యమునందు లేదని నిరూపించినవారు లోకదృష్టిలో సామాన్యులుగా భావించబడి వెనుక నున్నవారు, లోకేశ్వరుని దృష్టిలో అగ్రస్థానమునకు చేరుదురు. కావున దుమ్ముచే కప్పబడిన వజ్రము, తళతళ మెరయు తగరపు కాగితముచే చుట్టబడిన రాయి లోకదృష్టిలో అంతిమ ప్రథమస్థానములను పొందును. కాని లోకేశ్వరుని దృష్టిలో అవే స్థానములు తారుమారగును.

భగవద్గీత మొత్తము క్రియాత్మకమైన సేవను (కర్మసంన్యాసమును) మరియు క్రియాత్మకమైన త్యాగమును (కర్మఫల త్యాగమును) అను కర్మయోగమును మాత్రమే చేసి వాక్కుల ప్రదర్శనమును ఆపుట యను మౌనమును భావముల ప్రదర్శనమును ఆపుటయను మనోనిగ్రహమును కూడ నిషేధించుచున్నది. ఈ రెండింటిలో వ్యర్థమగు కాలశక్తులను క్రియాపరమైన సేవ, త్యాగములలోనే నీ పిల్లల వద్ద కేంద్రీకరించినట్లు, పరమాత్మ వద్ద కేంద్రీకరించమనియే గీతాసారము.

వాక్కులతో, మనస్సుతో కాలశక్తులను వ్యర్థము చేయక కాలశక్తిని క్రియలో కేంద్రీకరించమని చెప్పుటచేత యోగము కూడ దీని అర్థమే అగును. యోగము అనగా వ్యర్థముగా పోవు కాలశక్తులను సార్థకమైన మార్గములో ఏకీకరణముతో కేంద్రీకరించమనియే (యుజ్ – ఏకీకరణే – యోగః) గదా. వేదములో యీ గీతార్థమే ఉన్నది. వేదము ‘యతో వాచః..., అప్రాప్య మనసా’ అని స్వామిని వాక్కులు కానీ, మనస్సు (భావములు) కానీ అంటవు అనియే చెప్పుచున్నది. అట్లే బుద్ధితర్కము కూడ స్వామిని అంటదు అని వేదము చెప్పుచున్నది (యో బుద్ధేః పరతః, న మేధయా, నైషా తర్కేణ). నీవు నీ పిల్లలను గురించి తర్కించుటలేదు. గుడ్డి వ్యామోహముతో క్రియాపరముగా సేవ, త్యాగములను చేయుచున్నావు. గీత ‘ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా’ అని భగవంతుడు బుద్ధికి చిక్కడని తెలియుము అని చెప్పుచున్నది. కావున క్రియాపరముగ సేవ, త్యాగములు లేక చేసెడి కేవల శాస్త్రతర్కములు కూడ నిరుపయోగములే అని తెలియవలెను.

కొందరు గీతాసారమును వక్రీకరించినారు. కేవలము కర్మఫలమునందు ఆసక్తిని విడనాడమనియే గీతాసారమని అందురు. కర్మఫలాసక్తి లేకుండుట కర్మఫలత్యాగము చేతనే నిరూపించబడును. కర్మఫలమును అనుభవిస్తూ, కర్మఫలాసక్తి లేదనుట ద్వారా పైన చెప్పిన అసత్యప్రేమను వాక్కుల ద్వారా ప్రదర్శించి పరులను వంచిస్తున్నారే కాని, తమ ఆత్మలను వంచిస్తున్నారని తెలియకున్నారు. కర్మఫలమును త్యాగము చేయు కర్మను చేయవలెనని వేదము చెప్పుచున్నది (కుర్వన్నేవేహ కర్మాణి, ధనేన త్యాగేన) అయితే శరీరయాత్రార్థ మాత్రముగా కర్మఫలమును భోగించుట, మిగిలినది త్యాగము చేయుటయే శ్రుతి (త్యక్తేన భుంజీథాః) చెప్పుచున్నది.

కర్మఫల త్యాగము చేయక, కర్మఫలమును స్వార్థముతో సంపాదించి నీవు, నీ పరిమిత కుటుంబము అనుభవించుటకు చేయు కర్మను చేయవలదని ‘న కర్మణా’ శ్రుతి చెప్పుచున్నది. కావున కర్మఫలత్యాగము చేత నిరూపితమైన నిస్స్వార్థము (కర్మఫలాసక్తి లేకుండుట) తో కూడిన కర్మను చేయమనియు, కర్మఫలత్యాగము చేయక కేవలము కర్మఫలాసక్తి లేదని బుకాయించు వంచనా మార్గములో చేయు కర్మను త్యజించమనియు శ్రుతి అర్థము చెప్పుచున్నది. ఇదే గీతలో ‘తత్కురుష్వ మదర్పణమ్’, ‘మదర్థమపి కౌంతేయ’ ఇత్యాది అనేక శ్లోకములలో ఈ ముఖ్యమైన విషయము ప్రతిపాదించబడినది.

ఇక పిల్లలు మానవరూపములో ఉన్నారు. భగవంతుడు నిరాకారుడూ లేక విగ్రహాకారుడే కదా అని వాదించి తప్పించుకొనవలదు. గీతలో ప్రతిచోట నేను, నన్ను, అను (అహం, మామ్) శబ్దములు నరాకాములో నున్న భగవంతుడిని సూచించుచున్నవి. నీకు అంత పరిపక్వత రావాలేకాని, ఆయన నరాకారంలో ఎప్పుడూ లభిస్తాడు.

★ ★ ★ ★ ★

సూచన:- ఆధ్యాత్మిక జ్ఞానప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే ‘జ్ఞానయజ్ఞేన తేనాహమ్’ అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మికజ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించడమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడ నెలకొల్పుతుంది. కాబట్టి, శ్రీదత్తభగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞానప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు.

జయ దత్తస్వామి


EXPLORE YOUTUBE PODCASTS

 
 whatsnewContactSearch