24 Jan 2025
[05-03-2004 ఉదయం 8 గంటలకు] కర్మయోగము ద్వారా, ప్రతిఫలము నాశించక నీవు స్వామిసేవను చేసినపుడు స్వామి ఈ లోకములో ఎట్టి ఫలమును అందించక నీ దేహత్యాగానంతరము బ్రహ్మలోకమును ఇచ్చెదనందురు. అప్పుడు అత్యుత్తమ సాధకుడు నేను బ్రహ్మలోకమును ఆశించలేదు. నిన్ను సేవించుటలోనే నేను ఆనందింతును గావున నాకు ఫలము లభించినది. మరియు నీవు ఎచ్చట నున్న అదే బ్రహ్మలోకము అని అంటాడు కాని మరియొక సాధకుడు ఇట్లు తలచును. అసలు బ్రహ్మలోకము ఉన్నదో లేదో? ఒకవేళ ఉన్ననూ ఇతడు అవతార పురుషుడో కాడో? కావున ఈ లోకమున నేను బ్రతికియుండగనే ఫలమును అందించవలయును అని మనస్సులో తలపోయును. అట్టివాడు ప్రతిఫలమును ఆశించి సేవ చేయుచున్నాడు. మరియు వాడు నరావతారమున ఉన్న పరమాత్మను పరిపూర్ణముగా విశ్వసించనివాడు. ఐతే ఇట్టివానికి కొంత విశ్వాసము మరికొంత అనుమానము ఉండును. ఒకవేళ ఇతడు నిజముగా పరమాత్మ ఏమో, నిజముగా బ్రహ్మలోకమున్నదేమో మనము విశ్వసించక పరిత్యజించినచో మనము నష్టపడుదుమేమో అన్న అనుమానముతో ఉండును. ఇట్టివాడు పదిమందిని ఆశ్రయించును. ఇందులో ఒకడైనను నిజమైన పరమాత్మ ఉండవచ్చును గదా! కావున ఒక్కరినే మాత్రము విశ్వసించక పదిమందిని విశ్వసించుచుండును. తనలో దాగియున్న అనుమానమును ప్రకటించినచో ఈ పదిమంది నుండియు జారిపోవుదునేమోయని సంశయించి ఈ పదిమందిని ఒకే పరమాత్మ యొక్క అవతారములుగా పలుకుచు తాను పదిమందిని ఆశ్రయించిన కారణమును సమర్థించుకొనుచుండును.
నిజముగ ఇట్టి వానికి ఆ పదిమందిలో ఏ ఒక్కరి మీదను పరిపూర్ణ విశ్వాసము లేదు. కావున ఆ పదిమందియు నిజముగా ఒకే పరమాత్మ యొక్క అవతారములైనను అట్టి వానిని ఏ అవతార పురుషుడు రక్షించడు. అతడు నిజముగ పదిమందిని పరమాత్మ యొక్క అవతారములుగ విశ్వసించియున్నచో అందులో ఏ ఒక్కరినైనను ఆశ్రయించి ఉండవచ్చును గదా. ఇట్టి వాడు ఏ సద్గురువు యొక్క బోధయందును పరిపూర్ణ విశ్వాసము కలిగియుండలేడు.
ఒక సద్గురువుపై పరిపూర్ణ విశ్వాసము ఉన్నచో, ఆ సద్గురువునే పరిపూర్ణముగా విశ్వసించి ఆ సద్గురువు చెప్పినది తు.చ. తప్పక ఆచరించవలయును. సద్గురువు చెప్పు జ్ఞానము ఎప్పుడును పదిమందికిని ఆమోదయోగ్యమై యుండదు. ఏలననగా సద్గరువు బోధించు మార్గము సత్యమై అతికష్టమై దానిలో ఎప్పుడో ఏ ఒక్కడో పోవుచుండును. కోటానుకోట్లలో ఏ ఒక్కడో భక్తుడగును. కావున ఇట్టివాడు పదిమంది నడచు మార్గమును పరిత్యజించుటకు భయపడుచు సద్గురువునందు సంపూర్ణ విశ్వాసము లేక సద్గురువు బోధించినదియు, దానితో పాటు సద్గురువు నిషేధించినదియు కూడ ఆచరించుచుండును. దీనికి కారణము కేవలము సద్గురువు పై కొంత విశ్వాసము, కొంత సంశయము ఉండుటయే. ఇట్టి అల్పవిశ్వాసి సద్గురువు యొక్క సంపూర్ణానుగ్రహమునకు పాత్రుడు గాక భ్రష్టుడగుచున్నాడు. కావున సద్గురువును ఎన్నకొను ముందే వేదము, గీతాశాస్త్ర సహాయమును తీసుకొని పరిపూర్ణముగా విచారించి ఎన్నుకొనవలెను. ఎన్నుకొన్న తరువాత ఆవగింజ అంత అనుమానము వచ్చినను, అవగింజ అంత కుష్ఠుమచ్చ వున్న కన్యను పెళ్ళివారు పరిత్యజించునట్లు సద్గురువు యొక్క అనుగ్రహము వానిని పరిత్యజించును. పెండ్లికి ముందు 100 కన్యలను చూడవచ్చును. కాని పెండ్లి అయిన తర్వాత ఏకపత్నీ వ్రతమును ఆచరించవలెను.
సద్గురువు ఎదురుగా యున్న శిష్యబృందములో ఎక్కువ భాగము వారిని ఉద్దేశించి, వారి వారి స్థాయిననుసరించి బోధిస్తారు. అక్కడకు వేరే స్థాయి వారు వెళ్ళి విన్నచో అది తేడాగా కనిపించును. నీకు ఒక్కనికే సద్గురువు బోధించినప్పుడు నీ స్థాయికి వచ్చి ఆయన బోధిస్తాడు.
కృష్ణుడు అర్జునునకు మాత్రమే భగవద్గీత బోధించాడు గాని పదిమందిని చేర్చి ఉపస్యసించలేదు గదా. అర్జునుని స్థాయిని దృష్టిలో పెట్టుకొని బోధించినాడు. కనుక ఆ బోధ అన్ని రకముల స్థాయిలకు సంబంధించిన వారికి సమానము కాదు. ఎవరి స్థాయిని అనుసరించి వారు తీసుకోవాలి. అట్లే పదిమంది సద్గురువుల బోధలు విన్నవాడు బోధ తేడాగా ఉన్నదే అనుకొనుటకు వీలు గలుగుతుంది. అది ఎందువలన? స్థాయీభేదం వలన. కనుక నీ స్థాయి ననుసరించి నీ సద్గురువు బోధిస్తాడు కనుక ఒకే సద్గురువును ఆశ్రయించాలి.
★ ★ ★ ★ ★