home
Shri Datta Swami

 31 Jan 2025

 

సత్త్వము, రజస్సు, తమస్సు

[10-02-2004 స్వభానునామ సంవత్సరము మాఘ కృష్ణ విదియ సోమవారము 3.30pm] పరమాత్మ పశు, పక్షి, మృగాలను సృష్టించిన తరువాత మానవులను సృష్టించెను. ప్రతి మానవుడును ఈ ప్రాణుల గుణములన్నియును కలిగియున్నాడు. ఈ గుణములన్నియును వివిధములైన పాళ్ళలో కలిసిన త్రిగుణముల మిశ్రమములే. ఆ త్రిగుణములే సత్త్వము, రజస్సు, తమస్సు. ఈ మూడు గుణములే సర్వసృష్టి స్వరూపమైయున్నది. గుణములన్నియు భావరూపములే. కావున పరమాత్మ యొక్క భావముల సమాహరమే ఈ సృష్టి. ఈ సర్వ ప్రాణుల భావములన్నియు కలిపిన జీవుడే మానవుడు. మానవుడు ఒక వెజిటెబుల్ బిర్యాని వంటివాడు. మానవునిలో ఉన్న సర్వ పశు, పక్షి, మృగముల భావములలో ఏది ఎప్పుడు ప్రకటనమగునో చెప్పలేము. మానవుని యొక్క భావములు కాలము గడచు కొలది మారుచుండును. స్థిరమైన భావము ఒక్కటియు యుండదు. ‘చంచలం హి మనః కృష్ణ’ అని గీత చెప్పుచున్నది కావున శ్వాస ఎట్లు లోపలికి వచ్చుచు పోవుచున్నదో విశ్వాసము కూడ అట్లే వచ్చుచు పోవుచు ఉండును. ఇట్టి అతిచంచలుడగు మానవునకు ప్రతిఫలాపేక్ష లేని స్థిరమైన విశ్వాసము ఎట్లు ఉండగలదు?

మాటల ద్వారా, మనస్సు ద్వారా విశ్వాసమును ప్రకటించుచున్నాడే తప్ప, ఆచరణము వచ్చు సరికి విశ్వాసము సూర్యుడు ఉదయించగనే పొగమంచు పోయినట్లు, ఎగిరిపోవుచున్నది. కర్మఫలత్యాగము అసలు చేయలేని వారు ఆచరణములో పరిపూర్ణ నాస్తికులే. కర్మఫల త్యాగమును ఎంత చేసిన అన్ని పాళ్ళు విశ్వాసమున్నట్లు. ఎంత మిగుల్చుకున్న అంత అనుమానమున్నట్లే. సక్తుప్రస్థుడు పరిపూర్ణ విశ్వాసముతో పరిపూర్ణ కర్మఫలత్యాగమును చేసినాడు. వచ్చిన అతిథి దైవత్వమును ప్రకటించలేదు. దైవత్వమును ప్రకటించినచో కర్మఫలత్యాగమేల? ప్రాణత్యాగమే చేయుదురు. అయితే అసలు ప్రకటించకున్నచో, దైవము పేరు చెప్పి నీ కష్టార్జితమునంతయు స్వాహా చేయు దొంగలు అనేకులున్నారు. అప్పుడు నీ త్యాగమునకు ఎట్టి ఫలము లేక నీవు అవివేకముతో ఒక వంచకునకు దానము చేసినందుకు నీకు పాపమే లభించును.

Swami

కావున పరమాత్మ కొన్ని గుర్తులను మాత్రమే ప్రకటించును. తన నారాయణ తత్త్వమును అప్పుడప్పుడు మెరిపించుచుండును. కాని తన నరతత్త్వమును మాత్రము కారుమేఘము వలె నిరంతరము ప్రకటించుచుండును. ఒక్కొక్కసారి ప్రేమను వర్షించి మరియొకసారి పిడుగులను వర్షించుచుండును. ఈ విధముగా అతివృష్టియు, అనావృష్టియుగా నర-నారాయణ తత్త్వము మిశ్రమమై యుండును. ఇదియే అవతారతత్త్వము. నీవు చిక్కించుకున్న నరుడు పుస్తకములను బట్టీ పట్టి చిలుక పలుకులను పలుకు పండితుడు కావచ్చును లేక నాలుగు క్షుద్రవిద్యలను నేర్చిన మాంత్రికుడు కావచ్చును. నకిలీ వజ్రముల నుండి అసలు వజ్రమును గుర్తించు జ్ఞానమునకు పరీక్ష ఇదే. ఏ మాత్రము పొరపాటు పడినను ఒక వైపున క్రిందపడుదువు. నీ కర్మఫలత్యాగము అపుడు వ్యర్థమగుటయే కాక పాపమును గూడ తెచ్చును.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch