03 Nov 2024
[10.01.2006]
1. గోవర్ధనము స్వామి ఎత్తినప్పుడు పెద్ద వానలు కురిపించాడు గదా ఇంద్రుడు. ఆ నీరంతా ఒక చుక్క లేకుండా ఎలా పోయింది అంటే గోవర్ధనమే పీల్చివేసింది. గోకులవాసులు గోవర్ధనమునకు తినుబండారాలు నివేదనము చేశారు గానీ, మంచినీరు ఇవ్వలేదు. అందుకే గోవర్ధనమును ఆవహించిన స్వామి ఆ నీరంతా చుక్క లేకుండా త్రాగివేశారు. ఇది రహస్యము.
2. గోవర్ధనమును ఎత్తిన మూడవరోజున యశోద గోపాలురతో "నాయనలారా! కృష్ణుడు అలసిపోతున్నాడు. మీరు అందరు కర్రలతో గోవర్ధనాన్ని నిలపండి. కృష్ణునికి విశ్రాంతినివ్వండి." అన్నది. గోపాలురు అందరు కర్రలు పెట్టారు. కృష్ణుని విశ్రాంతి తీసుకోమన్నారు. కృష్ణుడు గోవర్ధనాన్ని ఎత్తిన తన చిటికెనవేలును అలాగే వుంచాడు. అపుడు కృష్ణుడు "నేను కూడా మీమాదిరిగానే ఒక వేలును కర్రగా పెట్టాను అంతే" అని అన్నాడు. ఆహా! ఎంత విచిత్రము!. కృష్ణుడు చిటికెన వేలు తీస్తే కొండ ఒక్కసారి క్రిందకు పడిపోతుంది. ఈ విషయము అమాయకులగు గోపాలురకు తెలియలేదు గదా!
ఉత్తరాయణము అంటే సూర్యడు ఉత్తరానికి రావడం కాదు. ఉత్తరద్వారదర్శనము ఒక భ్రమ. ఆనాడు వేదములో "దిక్సూచి" అను దిక్కులను చూపే ఉపకరణాన్ని ఉదాహరణగా తీసుకొన్నారే గాని ఉత్తరాయణ పుణ్యకాలం అని కాదు. ఈ దిక్సూచి ఉత్తర దక్షిణాలను చూపిస్తుంది. అంటే సంసారము - దక్షిణ దిక్కునకు, బ్రహ్మలోకము - ఉత్తరదిక్కునకు సూచింపబడినది.
సంసారంలో చివరిదాకా వచ్చి, దాన్ని దాటిపోయి, ఒక్కఅడుగు ముందుకు పోతే గాని బ్రహ్మలోకము వైపు ఒక్కమెట్టు ఎక్కినట్లు గాదు. కనుక ఈ సంసారసాగరాన్ని దాటి బ్రహ్మలోకము వైపుకు ప్రయాణం చేయండి నాయనా అని దీని భావము. అంతేగాని, ఉత్తరాయణములో చనిపోయినవారు ఉత్తమలోకాలకు పోతారు, దక్షిణాయనములో చనిపోయిన వారు అధమలోకాలకు పోతారు అని కాదు.
కంచి పరమాచార్యులవారు దక్షిణాయనములో చనిపోయారు. అంటే ఆయన అధమలోకాలకు వెళ్ళారనా? ఎంతమందో దుర్మార్గులు ఉత్తరాయణములో చనిపోయారు. మరి వారంతా ఉత్తమలోకాలకు వెళ్ళారనా? కాదు. కాదు. ఈ సంసారసాగరము దుఃఖమని విసర్జించి ఎవరు శాశ్వతుడైన భగవానుని సేవించారో వారే ఫుణ్యలోకాలకు పోతారు. ఇది సత్యమైన మాట. ఇది రహస్యము.
శ్రీదత్తుడు ఎప్పుడూ భూలోకములోనే నరావతారునిగా ఉంటారు. ఇది సత్యము. ఒక కప్పు కమ్మని పాయసం గురించి విన్నంత మాత్రాన దాని రుచి తెలుస్తుందా? దాని మీద మమకారం కలుగుతుందా? ఎప్పుడూ అంటే నిరంతరమూ కమ్మని పాయసం తాగగలవా?
వెగటు పుట్టటం లేదా? కనుక అతివృష్టి, అనావృష్టి రెండును హానికరములే. అందుకే ఒక కప్పు కమ్మని జీడిపప్పు పాయసం తిన్నావనుక, ఎంత రుచి, ఎంత కమ్మదనము! ఇంకా ఇంకా తాగాలని అనిపిస్తుందా, లేదా? ఈ పాయసం దొరకలేదనుకో, దానిమీద మమకారం పెరిగి పెరిగి తపన పుడుతుందా లేదా?
అట్లాగే, గతించిన నరావతారులైన రాముడు, కృష్ణుడు అనావృష్టి వంటివారు. ఇప్పుడు లేరు గదా. ఇప్పుడున్న నరావతారుడు సర్వకాల సర్వావస్థలయందు నిరంతరము నిన్ను అంటి పెట్టుకొని ఉన్నాడనుకో. అది వెగటు, అతివృష్టి. శ్రీకృష్ణుడు నరావతారునిగా ఉన్నప్పుడు చివరలో అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు కొట్టుకు చనిపోయారు.
శ్రీకృష్ణుడు ధనేషణ, దారేషణ, పుత్రేషణ వదలి వేసాడు. సాంబుడు సాక్షాత్తూ పరబ్రహ్మము యొక్క పుత్రుడై ఉండి కూడా దుర్వాసమహామునిని ఎగతాళి చేయుట ఎంతటి దిగజారిపోవడము. అంటే ఇదే ముందు చెప్పిన నిత్య సాన్నిహిత్యము వల్ల కలిగే తీవ్రనష్టము.
దత్తావతారుడనైన నేను కృష్ణలంక వదలి మరల రాకపోవడము ఎందుకు? మీకు తపన పెంచి మిమ్ము ఉద్ధరించుట కొరకే. అట్లే ఇప్పుడు నరసరావుపేటలో ఎక్కువగా ఉంటూ, సత్యనారాయణపురం కూడా వదలి వేస్తున్నాను.
★ ★ ★ ★ ★