home
Shri Datta Swami

 30 Nov 2024

 

భాగవత రహస్యాలు - అంతరార్ధములు

[21.01.2006] ప్రపంచముపై విరక్తి ఏర్పడినప్పుడే పరమాత్మపై అనురక్తి పొడసూపుతుంది. విషయసుఖాలు శాశ్వతములని భావించినంతకాలము మనసు భగవానునియందు లగ్నము కాదు. అనిత్యమైన ఈ దృశ్యమాన ప్రపంచముపై రోత జన్మించగా బ్రహ్మర్షులైన గోపికలు భగవానుని ఆశ్రయించి, అభయహస్తమును చూపి రక్షించమని ప్రార్థించినారు. నిస్సారమైన సంసారములో మానవునకు శాంతి లభించదు. దారాపుత్రాదులయందు (spouse and children), ధనవస్ర్తాదులయందు మనం ఏర్పరచుకున్న వ్యామోహమే వాటికి లేని కళాకాంతులను అందిస్తుంది. ఈ క్షణికసుఖాలు దుఃఖానికే దారితీస్తాయి. సంసారము అనిత్యము. ఏక ఆగతః, ఏక ఉద్గతః మధ్యబంధనం విమర్శరే జీవ, విమర్శరే ఖల - సంసారము అనిత్యము. ఆద్యంతములు లేని దానిని, మధ్యలో ఉన్నట్లు భ్రమించటమే భ్రాంతి.

Swami

సంసారము ఒక మానసికక్రీడయని గ్రహించలేక పోతున్నాము. సంసారము స్వప్నము లాంటిది. అనిత్యమైనది. ఇట్టి సంసారముపై వ్యామోహము యుక్తము కాదు. కనుక విచారణ అను ఔషధసేవ చేసుకుంటే భగవంతునివైపు తిరగవచ్చును. అప్పుడు భగవంతుని అభయహస్తము లభించును. కోరిక అవిద్యాజనితము (born out of ignorance). ఇది మనలచే కర్మలనాచరింపచేస్తుంది. అశాశ్వతమైనఫలాన్నే అందిస్తుంది. కనుక కోరికలు విషతుల్యములైనవి. సంతృప్తి అనేదే ఉండదు. కనుక అశాంతియే మిగులుతుంది. కోరికలను అంతమొందించుకోవాలి. నిష్కామమే ఇది. భగవానుని అభయహస్తము ఆ స్థితిని కలిగిస్తుంది. శ్రీకృష్ణా! అట్టి అభయహస్తమును మా శిరస్సుపై ఉంచమని గోపికలు ప్రార్థించారు. అంటే అంతఃకరణశుద్ధి చేసి ఆత్మానందాన్ని ప్రసాదించమని ప్రార్థన. ఆంతర్యములో చోటుచేసుకునియున్న కామ, క్రోధాది శతృవులను తుదముట్టించేవాడు భగవానుడు. శ్రీకృష్ణుడు సిద్ధహస్తుడు, రాగద్వేషములకు లొంగనివాడు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch