home
Shri Datta Swami

 04 Jan 2025

 

నిష్కామ సేవ

Updated with Part-2 on 05 Jan 2025


Part-1   Part-2


Part-1

ఆంజనేయుల వారి దివ్యతత్త్వము ఏమి?

[29.10.2001] నిష్కామముగా, అష్టసిద్ధులకు దూరముగా యుండి ఎట్టి సిద్ధులను ప్రదర్శించని శ్రీరాముని పరబ్రహ్మముగా గుర్తించి ఆరాధించటమే ఆంజనేయుని దివ్యతత్త్వము. ఇచ్చట శ్రీరాముని కళ్యాణగుణములే ఆంజనేయుని ఆకర్షించినవి కాని అష్టసిద్ధులు కానే కాదు. అది అత్యుత్తమ మార్గము. శ్రీఆంజనేయుడు జ్ఞాని, అయినను శ్రీరాముడినే పరబ్రహ్మముగా ఆరాధించినాడు. ఆయన ఎట్టి అష్టసిద్ధులను ప్రదర్శించకపోయిననూ శ్రీరాముడినే సేవించినాడు. అదే శ్రీకృష్ణభగవానుడు అష్టసిద్ధులను ప్రదర్శించిననూ, శ్రీహనుమంతులవారు ఆయనను అంగీకరించలేదు. శ్రీహనుమంతుల వారికి పరబ్రహ్మమైన శ్రీరామచంద్ర ప్రభువు ఆలింగనము నొసగి భవిష్యద్బ్రహ్మగా అనుగ్రహించినారు. బ్రహ్మ, విష్ణు, శివ రూపములు ప్రసాదించినారు. ఆ మార్గము చాలా అత్యున్నతమైనది. కనుక శిష్యులారా! ఆ మార్గమునే అనుసరించుడు. అష్టసిద్ధులను, సాక్షాత్కారములను కోరకుడు. వాని వల్ల ప్రయోజనమేమి? ఈర్ష్యాసూయలను విడనాడుడు. అనసూయలు కండు. అత్రులు కండు. మీ సేవలను దత్త ప్రభువు స్వీకరించుచున్నారు గదా! మిమ్ము కంటికి రెప్పవలె కాపాడుచున్నారు గదా.

సాక్షాత్కారము కన్న అనుగ్రహమే ముఖ్యము. వారికి దర్శనము లభించినది, వీరికి దర్శనము లగుచున్నవి. కాని మాకు ఎట్టి దర్శనములు లభించుట లేదని మీ ఆంతర్యము. ఆమె అవతల పెద్దగా అరచి చెప్పుచున్నది. మీరు సౌమ్యముగా మృదువుగా చెప్పుచున్నారు, అంతే తేడా. నాకు అంతా తెలియును. మిమ్ములను శ్రీహనుమంతుల వారి మార్గములో పెట్టి నడిపించుచున్నాను. అదే ఉత్తమము. శ్రీదత్తప్రభువులు మీకు అంత్యకాలములో తన దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తానని ఎన్నోసార్లు చెప్పియున్నారు. అంత్యకాలములో స్వామి దర్శనము అమోఘము, అది ఉత్తమస్థితికి కారణమౌతుంది. అట్లు కాక ఇప్పుడు అయ్యే దర్శనము వల్ల ఎట్టి ప్రయోజనము లేదు. తెలుసుకోండి. ఈ క్షణములో దివ్యదర్శనము అనుగ్రహించగలను. అంత్యకాలములో అనుగ్రహించబడే దివ్యదర్శనము వదలుకొని, ఆ దర్శనాన్ని ఇప్పుడే కోరుకుంటే అంత్యకాలములో ఆ దివ్యదర్శనాన్ని కోల్పోయినట్లే గదా! కనుక ప్రియ శిష్యులారా! మిమ్ము శ్రీఆంజనేయని పథములో నడిపిస్తున్నాను. అత్రి అనసూయులుగా శ్రీ ఆంజనేయుని పథములో పయనించి తరించండి.

Swami

 

Part-2

[01-11-2001, వృషనామ సం|| ఆశ్వయుజ పూర్ణిమ-పాడ్యమి-గురువారం-మధ్యాహ్నం 02.00 గంటలకు శ్రీ దత్తస్వామి వేంచేసినారు. సత్సంగము రాత్రి 08.00 గంటల వరకు జరిగినది.]

శ్రీదత్తస్వామి రహస్య వివరణ ఇలా అందించినారు. ప్రియ శిష్యులారా! బాలకృష్ణమూర్తి, భవాని, ఫణి, అజయ్, పద్మారామ్ వీరు ముక్తజీవులు. వారికి సాధన అవసరము లేదు. ముక్తజీవులైన వారిని నా కార్యక్రమములో సేవ చేయుటకు ఈ జన్మలను ప్రసాదించినాను. వారు చేయవలసినది నా కార్యప్రచార సేవయె కాని సాధన కాదు. "ఏనాడో మిము ముక్తుల చేసితి బంధమున్నదను భ్రమలో యుంటిరి" అని చెప్పియే యుంటిని.

1) ముక్తి: సంసార బంధముల నుండి ముక్తులగుటయే నిజమైన ముక్తి. ఇది ఈ జీవితసమయము నందే సాధించాలి గాని, మరణానంతరము సాధించే ముక్తి ఏమియు లేదు.

2) కైవల్యము: కేవలము పరబ్రహ్మముతో బంధము పెట్టుకొని, స్థిరపరచుకొనుటయే కైవల్యము.

3) ముక్తి, కైవల్యములను సాధించుటకు ఇల్లు వదలి భార్యాపుత్రులను త్యజించి అడవులకు వెళ్ళి కాషాయము ధరించి సాధన చేయనవసరము లేదు.

4) త్యజించవలసినది ఇల్లు, భార్యాపిల్లలను కాదు. ఐహికబంధాలనే త్యజించాలి గాని, భార్యాపిల్లలను కాదు.

5) గృహస్థుగానే ఉంటూ, కర్తవ్యములను నిర్వహిస్తూ, మోహములో పడక, అహంకార, మమకారములను త్యజించి, భగవంతుని యందు స్థిరమైన బంధము స్థాపించుకుని, తాను చేయు ప్రతి పని భగవంతుని సేవగానే భావన కలిగి, దుస్సంగమునకు దూరముగా ఉంటూ, సత్సంగములో జీవితాన్ని పండించుకొనటము సాధ్యమేనని ఆచరించి చూపించాలి.

6) నన్ను చూడండి, నేను గృహస్థును, ఉద్యోగం చేస్తున్నాను. నా కర్తవ్యాలను యథావిధిగా నిర్వహిస్తున్నాను. స్వామిసేవలో పాల్గొంటూ ఉన్నాను. నేను భార్యాపిల్లలను త్యజించానా? ఇల్లు వదలి అడవులకు వెళ్ళానా? కాషాయ వస్త్రాలు ధరించి సంన్యసించానా? నా కర్తవ్యాలను నిర్వహిస్తూనే జ్ఞానభోధ చేస్తున్నాను గదా. ఇలా కాక 18 సంవత్సరముల వయస్సులోనే సంన్యసించి, కాశీనగరములో కాశీపీఠంలో పీఠాధిపతినై యున్నట్లైతే మీకు నా సాంగత్యము లభించేదా? నా మిత్రుడి లాగా నేనూ పీఠాధిపతినయేవాడిని. ఈనాడు నా మిత్రుడు శృంగేరి పీఠాధిపతి గదా. అయినా, అందరికీ అందుబాటులోకి రాలేకపోతున్నారు గదా. ఇది సహజము. కనుక ఈనాడు నేను అనుసరిస్తున్న విధానము వినూత్నమైనది.

7) అపోలో హస్పిటల్ లో ప్రధాన వైద్యుడు వైద్యములో నిష్ణాతుడు గదా. ఆయన ఏ ముగ్గురో నలుగురో రోగులకు ప్రత్యేక వైద్యసౌకర్యము కలుగచేయుచున్నారు. అదే ఆ వైద్యనిపుణుడు జనరల్ ఆస్పత్రిలో వైద్యుడైతే ఎందరో రోగులను, రోజూ చూస్తారే గాని, ప్రతి రోగికి ప్రత్యేక వైద్యసౌకర్యాన్ని అందించటం సాధ్యం కాదు కదా! అట్లే జనరల్ హాస్పటల్ వైద్యుడివలె వారు వందలమంది భక్తులను అష్టసిద్ధులచే ఆకర్షించినప్పటికి, ప్రతి ఒక్కరికి దర్శన, స్పర్శన, సంభాషణ అందించలేకపోతున్నారు గదా. అదే ఇక్కడ నలుగురు ముఖ్యశిష్యులతో సన్నిహిత సంబంధము ఏర్పరుచుకొని, దర్శన, స్పర్శన, సంభాషణ మొదలగు అనుగ్రహభాగ్యములను అందించి వారి ద్వారా జ్ఞానప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అపోలో హాస్పటల్ ప్రధాన వైద్యుడి వలె నేను చేయుచున్నాను.

8) మీరే నా ముఖ్యశిష్యులు. మీరు ముక్తజీవులు. నాకార్యక్రమ నిర్వహణ కోసమే మీకు ఈ జన్మ నిచ్చాను. కార్యక్రమము నెమ్మదిగానే జరుగుతుంది. ఏమీ తొందరలేదు. అంతా నా క్రీడ అని తెలుసుకోండి.

9) జీవులందరినీ నా ఒకే ఒక సంకల్పం చేత ముక్తులను చేయగలను, కాని అలా చేస్తే నా కార్యక్రమం ముగిసినట్లే కదా. ఇక దీనిలో క్రీడ, ఆనందము ఎక్కడ వున్నది? పైగా నా ముఖ్యభక్తులైన మీరు నా కార్యక్రమములో పాల్గొని తరించే అవకాశము ఇంకా ఎక్కడ ఉన్నది? రాముడు సంకల్పము చేసినంత మాత్రమున రావణాసురుడు పరిగెత్తుకుని వచ్చి చేతులు జోడించి, స్వామి, నేను నీ ద్వారపాలకుడను గదా. నీ ఆజ్ఞ మేరకే వర్తించుచున్నాను గదా. ఇదిగో స్వామి, సీతామాత. గ్రహించి నన్ననుగ్రహించు అని ప్రణమిల్లేవాడు. అప్పుడు ఇంకా క్రీడకు చోటు ఎక్కడ ఉన్నది? వానరులకు స్వామి కార్యక్రమములో పాల్గొను అవకాశమెక్కడుండెడిది? కనుక ఇది అంతా నా క్రీడ. “క్రీడయంత మహర్నిశం గణనాథయూధ సమన్వితమ్” - అనగా ఇదే అర్థము. కనుక ప్రియశిష్యులారా! ఉద్వేగ పడకండి. అంతా నా సంకల్ప ప్రకారమే జరుగుతుంది.

10) ఆదిశంకరులకు ఎంతో మంది శిష్యులున్నారా? నలుగురు అంటే నలుగురే ఉండేవారు కదా. ఆయన నా కార్యమును ఎంత చక్కగా నిర్వహించారు. కనుక ఉద్వేగపడక, మీరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క జీవుని ఎన్నుకుని ఆ జీవునికి నా సందేశములందించి ఉద్ధరించండి. అట్లు ఉద్ధరించబడిన ఆ జీవుడు మరియెక జీవుని ఈ మార్గములోనే ఉద్ధరించవలెను. ఇది ఈనాటి దివ్యవాణి.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch