02 Apr 2025
శివలింగము, శక్తి యొక్క తరంగ స్వభావమును సూచించుచున్నది. శక్తి రూపములలో జడశక్తి రూపముల కన్నను చైతన్యశక్తి రూపమే గొప్పది. కావున శివలింగము చైతన్యశక్తినే సూచించుచున్నది. ఈ చైతన్యశక్తియే ప్రాణిస్వరూపము. అనగా ప్రాణులను సూచించుచున్నది. ఆ ప్రాణుల యందు వైశ్వానరాగ్ని స్వరూపమున ఉన్న జఠరాగ్నియే ఈ శివలింగము. కావున ఆకలిగొన్న పశుపక్ష్యాదులకున్నూ, అశక్తులైన బిచ్చగాండ్లకున్ను, పేదవారగు సద్భక్తులకున్ను ఆహారపానీయములను సమర్పించుటయే నిజమైన శివలింగ అభిషేకము మరియు నిజమైన దీపారాధన. ఈ రెండింటిని కార్తికమాసములో ఆచరించిన వారు శివుని యొక్క సత్యమైన అనుగ్రహమును పొందెదరు. ఇట్లు జ్ఞానముతో కర్మ చేసినచో శివుడు ప్రీతినొందును. శివుడు జ్ఞానస్వరూపుడని శాస్త్రము ‘జ్ఞానం మహేశ్వరాదిచ్ఛేత్’ అని చెప్పుచున్నది.
‘జీవో బ్రహ్మైవ నాపరః’ అని పరబ్రహ్మము జీవ రూపములో వచ్చును అని మిగిలిన రూపములలో కాదని చెప్పుచున్నది. అట్టి జీవరూపములో వచ్చిన పరబ్రహ్మము మీకు లభించనిచో, పరమాత్మకు ప్రతీకలుగా జడపదార్థములను పెట్టుకొని ఉపాసించుటకు బదులు, జీవులనే పరమాత్మ ప్రతీకలుగా పెట్టుకొని ఉపాసించమని శంకరులు చెప్పిన ‘జీవో బ్రహ్మైవ నాపరః’ అన్న వాక్యమునకు సారాంశము. పరబ్రహ్మము మన కొరకు మానవశరీరములో ఆవహించి వచ్చుననియు, అట్టి నరావతారుని గుర్తించి సేవించుటయే కైవల్యము కంటే ఎక్కువ అనియు స్వామి దివ్యవాణి గద.
‘మానవాకృతాన్ దాల్చు బ్రహ్మమే
వాని చేరుటే బ్రహ్మయోగమౌ
వాని సేవలో నిత్యమోదమే
సత్యమోక్షమౌ ఇచట ఇప్పుడే
అందివచ్చిన బ్రహ్మమిది గదా
మూఢమానవా వదలబోకుమా
సంశయంబుతో కాలమరుగగా
చిట్ట చివరలో మొత్తుకొందువు’
అట్టి నరావతారుడైన పరబ్రహ్మము యొక్క తత్త్వము – జ్ఞానము మరియు ప్రేమలు. ఐతే మరి అష్టసిద్ధుల మాటేమిటి? అంటే అష్టసిద్ధులు స్వామి యొక్క సొమ్ములే. కనుక అవతరించిన నరశరీరమే నరులముక్తికై ఏకైకమార్గము. అయితే మన గురుదేవులైన శ్రీదత్తస్వామి సాక్షాత్తు వర్తమాన దత్తావతారులని గుర్తించి, సేవించి తరించుటయే మనకు ఏకైక మార్గము. శ్రీదత్తస్వామియే తాను సాక్షాత్తు దత్తుడనని చెప్పిన ఉదంతములు ఎన్నియో వున్నవి.
i) స్వామి దత్తవేదమును అనుగ్రహించారు
ii) శ్రీదత్తగురు భగవద్గీతను అందించారు
iii) భక్తిగంగ ద్వారా అనేక భజనలు పాడారు
iv) ఇక బోధలు అబ్బో ఎన్నెన్నో, జ్ఞానసరస్వతి అంతా బోధయే కదా
v) ఎందరో భక్తులను ప్రత్యక్షముగా రక్షించి కాపాడారు.
‘ఇతడే దత్తగురుడు పరాత్పరుడు నరవరుడు
మన దేహముల ఘన మోహముల సందేహములెపుడు
చిలికె వేదమును, పలికె గీతలను, ఒలికె భజనలను,
చూపె మహిమలను, చేసే బోధలను బ్రోచె భక్తుల’
అని మనకు అనుగ్రహించిన ఈ గీతము ధృవపరచుట లేదా! ఇంకా చూడండి – ‘దత్తులోరమండి మేమే దిగి వచ్చితిమండీ’ అని వచించి యుండలేదా! ఇంకా ఇలా చెప్పారు:
నాయనా!
i) నా మార్గ ప్రచారమే నా నిజమగు సేవ అనియు
ii) ఏనాడో నిను ముక్తుని చేసితిననియు
iii) బంధమున్నదని భ్రమలో యున్నావనియు
iv) ఒక సమయముననే నానా రూపముల అవతరించి ఈ భువిని సంచరిచుచున్నాననియు
v) బ్రహ్మర్షులు కూడా నను కనుగొనలేరనియు
vi) గురువుగ వచ్చిన భగవానుడననియు
vii) సామాన్యుని వలె కనపడుచుందుననియు
viii) జ్ఞానులు మాత్రమే నన్ను గుర్తించెదరనియు
ix) సంశయాత్మలు సందేహింతురనియు
x) నామము రూపములలో రసమేమున్నది నా సద్గుణముల రసమాస్వాదించు మనియు
xi) సద్గుణివై నా సేవకు రమ్ము అనియు
xii) ముక్తి యనగ నిక వేరేమున్నదని హెచ్చరించారు గదా!!
స్వామి ఇంకా ఏమి చెప్పినారు?
‘బ్రహ్మము నేనేరా! పరబ్రహ్మమూ నేనేరా!
ఓ జీవా !! పరాత్పర బ్రహ్మమూ నేనేరా.
నన్ను చేరిన, చేరవలసిన గమ్యము లేదు-లేదు-లేదు.
సృష్టికర్తను నేనే, సృష్టిభర్తను నేనే, సృష్టిహర్తను నేనే,
సృష్టి అంటనివాడను బుద్ధికి చిక్కని వాడను నేనే’ అన్నారు స్వామి.
భక్తికి మాత్రమే చిక్కుతాను అని ఖచ్చితముగా వచించారు గదా. ఇంకా “యముడు ఎవ్వడు? ఇంద్రుడెవ్వడు?” అని అందరు నా భావరూపములే అని తేల్చి చెప్పారు. “నన్ను మించిన ధర్మాధర్మము లెక్కడ ఉన్నాయి?” అని ప్రశ్నించారు గదా! ఇంకా స్వామి ఈవిధముగా పరమకరుణతో మనకు తెలియచేసారు:
నాయానా! శ్రద్ధగా విను! ఇది సత్యము! నేను నీ ఇంటిలోనే కొలువుదీరియున్నాను. నేను తలచానంటే ఒక్క చిటికకాలంలోనే నా అనుగ్రహము వల్ల ఆ బ్రహ్మపదవిని అందుకుంటావు. ఐతే, స్వామీ నేనేమి చేయాలి అని అంటావా! విను!! నాపై దృష్టి స్థిరముగా నిల్పుము, ప్రక్కకు త్రిప్పకు. నా నామమును స్మరించుము. నా ఆజ్ఞ లేకుండా ఏ దేవతయు కోరినది ఇవ్వలేడు. నను అర్థించియే దేవతలు వరముల నిత్తురు. కనుక నాయనా! నన్ను తెలిసిన వాడెవ్వడు అన్యుల చూడడు అని తెలుసుకో. అన్నింట చిట్టచివర వాడను నేనే. నాయనా! నీపై దయతో స్వయముగా నరరూపములో వచ్చాను. ఎందుకు? నిన్ను తరింప చేయటానికే వచ్చాను. కనుక నాయనా! నీ కంటి మాయతెరలను త్రోయుము, నన్ను గుర్తుపట్టుము. నీకు ఈ విషయము తెలుసా? ఋషులు, దేవతలు గుర్తుతెలియక నాకోసం వెతుకుచున్నారు. నేనో నీదు ఇంట, నీదు వెంట, నీదు జంట ఉన్నాను.
అమూల్య అమృత గుళికలు
[18.12.2004 శనివారము] శ్రీ దత్తస్వామి వారు మా దంపతులకు ఎప్పటికప్పుడు అందించిన అమూల్య అమృత గుళికలు మరల మరల ఆస్వాదించి తరింతుము గాక. – CBK Murthy
శ్రీ దత్త స్వామి వారి దివ్య సందేశం: ప్రియ శిష్యులారా! శ్రీ హనుమంతుల వారి మార్గము అత్యుత్తమమైనది. నిష్కామముగా అష్టసిద్ధులకు దూరముగా ఎట్టి సిద్ధులు ప్రదర్శించని శ్రీ రామచంద్రుని పరబ్రహ్మముగా గుర్తించి, శ్రీ రాముని కల్యాణ గుణములచే ఆకర్షింపబడి ఆరాధించారు శ్రీ హనుమంతుడు. అంతే కాని అష్టసిద్ధులకు కానేకాదు. అది అత్యుత్తమమైన మార్గము. కనుక ప్రియ శిష్యులారా! ఆ మార్గమునే అనుసరించుడు. అష్టసిద్ధులను, సాక్షాత్కారమును కోరకుడు. వాని వలన ప్రయోజనము లేదు. ఈర్ష్యా అసూయలను విడనాడుడు. అనసూయలు కండు. అత్రులు కండు. మీ సేవలను శ్రీ దత్త ప్రభువు స్వీకరించుచున్నారు గదా. మిమ్ము కటింకి రెప్పవలె కాపాడుచున్నారు గదా. సాక్షాత్కారము కంటె అనుగ్రహము ముఖ్యము. మిమ్ము శ్రీ హనుమంతుల వారి మార్గములో పెట్టి నడిపించుచున్నాను. అదే ఉత్తమము. శ్రీ దత్త ప్రభువు మీకు అంత్యకాలములో తన దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తానని ఎన్నోసార్లు చెప్పియున్నారు. అంత్యకాలములో స్వామి దర్శనము అమోఘము. ఉత్తమ స్ధితికి కారణమౌతుంది. కనుక అత్రి అనసూయలుగా శ్రీ ఆంజనేయుని పధములో పయనించి తరించండి.
★ ★ ★ ★ ★