10 Apr 2025
శ్రీ దత్తస్వామి వారు మా దంపతులకు (CBK Murthy) అనుగ్రహించిన జ్ఞానజ్యోతి.
మానవజన్మ దుర్లభము. ఈ మానవజన్మను వ్యర్థము చేసుకొనరాదు. పటములను, శిలావిగ్రహములను ప్రథమములో పూజించి ఆత్మశాంతి పొందవచ్చునే గాని, అదే సత్యమని, శాశ్వతమని భావించరాదు. పరమాత్మ మన కోసం ప్రతి తరములోను నరశరీరమును ఆవహించి, నరావతారుడుగా అవతరించుచున్నాడు. అట్టి నరావతారుడే ప్రజ్ఞానం బ్రహ్మగా చెప్పబడిన పరమాత్మ. సాక్షాత్తు మన సద్గురుదేవులే వర్తమాన నరావతారము. అట్టి నరావతారుని గుర్తించి, సేవించి, ఆయన కార్యములో పాల్గొని చేతనైన కర్మఫలత్యాగము చేసి తరించుటయే మానవజన్మను ధన్యము చేసుకొనుటకు ఏకైక మార్గము. ఈ భార్యాపుత్రులు, ఈ ధనసంపత్తి ఏదీ శాశ్వతము కాదు. ఇవి అన్నియు అసత్యములే, అశాశ్వతములే. నాది అనుకొని అహంకారముతో విర్రవీగిన ఈ శరీరము కూడా మనను వదలివేయును. ఈ లోకమునకు ఒంటరిగానే వచ్చినాము. కొన్ని బంధములలో చిక్కుకున్నాము. చివరకు ఒంటరిగా ఈ లోకమును వదిలి వెళ్ళవలసినదే. ఇదే సత్యము.
ఐతే అసలు ఎందుకు వచ్చాము? ఏమి చేశాము? మళ్ళా ఎక్కడకు పోతున్నాము? ఎక్కడి నుండి వచ్చామో తెలియదు. అంత్యములో మరల ఎక్కడికి పోతామో తెలియదు. ఈ జీవించిన కాలములో అన్నీ నావే, అందరు నావారే అని లోలోతు బురదలో మునిగి ఊబిలో చిక్కుకుని, శ్లేష్మములో పడిన ఈగలాగా వదలి వెళ్ళలేక, అసహాయతతో కొట్టుకొని, కొట్టుకొని, వచ్చిన కార్యమును విస్మరించి, ఉద్ధరించగల పరమాత్మను గుర్తించి సేవించక, ఈ మానవజన్మ వృథా చేసుకొని, కాలచక్రములో పడి, చేసిన పాపములకు నరకములో శిక్షననుభవించి, పుణ్యఫలములను స్వర్గములో అనుభవించి, పుణ్యము క్షీణించిగనే మరల ఈ మర్త్యలోకములో స్వామి ఆజ్ఞానుసారము మనిషిగనో, పశువుగనో, క్రిమికీటకముగనో జన్మించుట యదార్థము.
కనుక ఈ ఇల్లు నీది కాదు. ఈ ఆస్తి నీది కాదు. ఈ ధనము నీది కాదు. ఈ భార్య నీది కాదు. ఈ పుత్రులు నీవారు కారు. ఈ శరీరము నీది కాదు. ఐతే ఏది నీది? పరమాత్మ ఒక్కడే నీవాడు. ఆయన సచ్చిదానంద (‘సత్+చిత్+ఆనందము – సచ్చిదానందము) స్వరూపుడు’. ‘సత్’ అనగా పరమాత్మయే సత్యము. ‘చిత్’ అనగా ఆ పరమాత్మ చైతన్యమునే (items of awareness) ఆవహించునే గాని జడమును (inert items) ఆవహించడు అని అర్థము. ‘ఆనందము’ అనగా ఆ పరమాత్మ మనకు ఆనందమునే అనుగ్రహించును అని అర్థము. వేదవాక్యము ప్రకారము సృష్టి, స్థితి, లయములను చేయు ఏకైక స్వరూపమే పరబ్రహ్మము. అట్టి పరబ్రహ్మము శ్రీదత్తపరబ్రహ్మమే. ఆయన ఏకైక స్వరూపము. దేవతలందరూ ఆయన వేషములే. జ్ఞానము మూలాధారము. భక్తి ప్రాప్తిస్వరూపము. సేవ ఫలస్వరూపము. కనుక నాయనా! నీవు ఏ స్వరూపమును పూజించినను ముఖ్యమైనది నీ శ్రద్ధా-భక్తులు. ఇది ముఖ్యముగా గ్రహించు. పుట్టినవాడు మరణించక తప్పదు. మరణించినవాడు మరల జన్మించుట అనివార్యము. కనుక మరణమునకు భీతి చెందకుము.
కర్మసంన్యాసము, కర్మఫలత్యాగము ఈ రెండూ కలిసి ‘కర్మయోగము’ అనబడును. ‘న కర్మణా, న ప్రజయా’ - కర్మలవల్ల గాని, పుత్రుల వల్లగాని మోక్షము రాదు. ‘ధనేన త్యాగేనైకేన అమృతత్వ మానసుః’ - ధనత్యాగము చేతనే అమృతత్వమును పొందుదువు. ఇది సత్యము. కోరికలను త్రుంచుము. నిష్కాముడవు కమ్ము, నిష్కామ కర్మయోగమును ఆశ్రయించుము. ఆశ పిశాచము వంటిది. ఆశను త్రుంచుము. సద్గురువును ఆశ్రయించిన నీవు కర్మచక్రము నుండి ధర్మచక్రము లోనికి ప్రవేశింతువు. కనుక వర్తమాన నరావతారుని గుర్తించి, సేవించి తరించుము. ఇదే జీవన్ముక్తి, ఇదియే చరమ పరమముక్తి.
★ ★ ★ ★ ★