01 Oct 2024
[31-12-2002] "పరోక్ష ప్రియా ఇవ హి దేవాః ప్రత్యక్ష ద్విషః" అని శ్రుతి. అనగా దేవతలు సహితము ఎదురుగా నున్న దానిని ద్వేషింతురు. పరోక్షముగా ఉన్నదానిని ఆరాధింతురు. ఇక మానవుల విషయము చెప్పనేల? దేవతలు, ఋషులు సహితము ‘అసూయ’, ‘అహంకారము’ అను రెండు మహా సర్పదంపతుల బారిన పడక తప్పదు. జీవునికి గల షడ్గుణములలో చిట్ట చివరిది మాత్సర్యము. దీనిని ఎవ్వరును అతిక్రమించలేరు.
దేవతల అంశ గల పాండవులు సహితము స్వామి ఎన్ని విధముల బోధించినను గయుని వదలి పెట్టమన్నారు. స్వామి చెప్పినదే వేదము, స్వామి ఆచరించినదే ధర్మము అను పరాభక్తిని త్రోసిపుచ్చినారు. ప్రతి జీవుడిలోను సత్త్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణములు ఉండును. సాత్త్వికుడు అనగా సత్త్వగుణము ఎక్కువ పాళ్ళలో కలవాడు. సత్త్వము నుండి జ్ఞానము జనించును. "సత్త్వాత్ సంజాయతే జ్ఞానమ్" అని గీత. నూరుపాళ్ళు సత్త్వగుణము ఉన్నవాళ్ళు పరిపూర్ణ జ్ఞాని, సర్వఙ్ఞుడు. సర్వఙ్ఞుడు అనగా పరమాత్మయే అని అర్థము. కావున జీవుడు ఎంత జ్ఞాని అయినను కొంత అజ్ఞానము ఉండక తప్పదు. ఈ అజ్ఞానము ఒక్కొక్క జీవునిలో ఒక్కొక్క సమయమున ప్రకోపించి ఉండునని గీత చెప్పుచున్నది.
కృష్ణుడు పరమాత్మయేనని నమ్మి పరిపూర్ణ విశ్వాసము గల సాత్త్వికులగు పాండవులు సహితము గయుని విషయము నందు అజ్ఞాన ప్రభావములో పడిరి. హనుమంతుడు జ్ఞానులలో శ్రేష్ఠుడు. ‘బుద్ధిమతాం వరిష్ఠమ్’ అనిపించుకున్నవాడు. కాని యయాతి రక్షణ విషయమున హనుమంతుడు సహితము అజ్ఞాన ప్రభావమునకు లొంగినాడు. యయాతిని తనకు అప్పగించమని స్వామి తనను ఆదేశించినాడు. స్వామి కోరినదే కర్తవ్యము అను పరాభక్తిని క్షణకాలము మాయ కప్పినది. తల్లియగు అంజనాదేవి యమాతిని రక్షించమని పుత్రుని ఆదేశించినది. స్వామి ఎక్కువా? తల్లి ఎక్కువా? ఆయనతో సమానుడు కాని అధికుడు గాని లేడు.
"న తత్సమః" అని శ్రుతి చెప్పుచున్నది. దీనికి కారణము స్వామి కృష్ణునిగా, రామునిగా నర స్వరూపమున కన్నుల ఎదుట ఉండుటయే. కావుననే భగవానుడు "మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే, యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః" అని గీతలో వచించినాడు. అనగా స్వామి నరాకారమున ప్రత్యక్షముగ యుండగా గుర్తించుటకు ప్రయత్నించువాడే వేలాది వేలలో ఒక్కడుండును. అట్లు ప్రయత్నించిన భక్తులలో ఏ ఒక్కరో స్వామిని గుర్తించి పూర్ణముగా విశ్వసింతురు. అట్లు పూర్ణముగా విశ్వసించిన వారు సహితము ఎదో ఒక క్షణకాలమైనను భ్రమలో పడక తప్పదు.
ఎంత విశ్వాసమున్ననూ ఒక క్షణ కాలమైనను అనుమానము రాక తప్పదు. దీనికి కారణము ఏ జీవునికైనను పరిపూర్ణ బ్రహ్మజ్ఞానము అసంభవము. "బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి" అని శ్రుతి. అనగా పరిపూర్ణ బ్రహ్మజ్ఞానము గలవాడు పరమాత్మ ఒక్కడే. కావుననే ఆయన మీద క్షణకాలము కూడా అనుమానము రానివాడు ఆయన ఒక్కడే. దీని అర్థము అసూయా అహంకారములు సాధనచే క్షీణించునే కాని ఏ జీవునకు పూర్తిగా నశించవు. కావున ఏ జీవుడూ బ్రహ్మము కాడు. జీవుడు జీవుడే. దేవుడు దేవుడే.
ఒక కార్యము కొరకు దేవుడు జీవుని ఆవహించవచ్చును. ఆ సమయమున జీవునకును దేవునకును అద్వైతమే అయినప్పటికిని, ఆ కార్యము ముగిసిన తర్వాత దేవుడు తొలగిపోగా జీవుడు జీవుడే అగును. స్విచ్‌ని ఆపివేయగా విద్యుత్ తీగెలో ప్రసరించదు. అప్పుడు అది మామూలు తీగెయే అగును. క్షత్రియ సంహారము ముగియగా విష్ణువు అను విద్యుత్తు తొలగిపోవగా పరశురాముడు అను తీగె మామూలు తీగెగా మిగిలెను. అనగా ఆయన ఒక ఋషి మాత్రమే ఆయెను. దీనినే ఆవేశావతారము అందురు.
కాని రాముడు అట్టి తీగె కాదు. జననము మొదలు తుది నిమిషము వరకు రాముడు విద్యుత్ తీగెయే. కావున రాముని పూర్ణావతారమందురు. కృష్ణుడును అంతే. తుది శ్వాస విడచిన తర్వాత కృష్ణుని శరీరము కూడ విద్యుత్ పోయిన తీగెయే. కావుననే అర్జునుడు ఆ శరీరమునకు దహన సంస్కారములు చేసెను. దావాగ్నిని మింగి గోపికలను రక్షించిన ఆ కృష్ణశరీరము ఆనాడు పరిమితమైన అగ్ని చేత దగ్ధము గావింపబడెను. అయితే రామ, కృష్ణ శరీరములు ప్రాణము ఉన్నంత వరకు విద్యుత్ తీగెలుగనే ఉండెను.
రాముడు తాను దేవుడని ఎప్పుడునూ చెప్పలేదు. కావున పూర్ణావతారము. కాని కృష్ణుడు మాత్రము అనేక సమయములందు తాను దేవుడని ప్రకటించినాడు. కావున అది పరిపూర్ణావతారము. రాముడు ఉన్నప్పుడు ఆయనకు భక్తుల సంఖ్య ఎక్కువ శత్రువుల సంఖ్య తక్కువ. కృష్ణుడు ఉన్నప్పుడు భక్తుల సంఖ్య తక్కువ శత్రువుల సంఖ్య ఎక్కువ. దీనికి కారణమేమి? రాముడు తాను దేవుడనని చెప్పలేదు కావున రాముడు దేవుడని విశ్వసించినవారు ఎక్కువ. కృష్ణుడు తాను దేవుడనని చెప్పినందున విశ్వసించిన వారు చాలా తక్కువ.
దీని తాత్పర్యమేనగా ఒక మానవుడు దేవుడని విశ్వసించు వారి సంఖ్యయే తక్కువ. దేవుడు జీవుడెట్లు అగును? అని వారి ప్రశ్న. నిజమే. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే. కాని జీవుని దేవుడు ఆశ్రయించినప్పుడు జీవత్వము మూగపోవును. దైవత్వము ప్రకటించబడును. తీగెను చేతితో పట్టుకొని ఆడుకొనవచ్చును. కాని తీగెలో విద్యుత్ ప్రవేశించినపుడు ఆ తీగెను స్పర్శ కూడా చేయలేము. ఏలననగా తీగె తన ధర్మములను మన కంటికి కోల్పోయినట్లు కనిపించకున్నను నిజముగా కోల్పోయి విద్యుత్ యొక్క ధర్మమునే పొందియున్నది.
★ ★ ★ ★ ★