28 Nov 2024
[10-07-2007] డార్విన్ సిద్ధాంతము ప్రకారము మానవుడు కోతినుండి పుట్టాడు. కోతికి తోక వున్నది. దోమలను, ఈగలను దులుపుకోడానికి కోతి తోకను వాడుతుంటుంది. ఆ తోక కూడా బలంగానే ఉంటుంది. అట్టి కోతినుండి మానవుడు ఉద్భవించాడని, మానవునకు చేతులు బలిష్ఠమై, కాళ్ళు బలిష్ఠమై ఉండుట చేత అతనికి ఇక తోకతో అవసరం లేకపోయింది. అందువల్ల మానవులకు తోక లేదు, కానీ గుర్తుగా చిన్న వంకర ఎముక ఉన్నది అని డార్విన్ సిద్ధాంతము. అంటే, అవసరము ఉన్నంతవరకు తోక ఉన్నదని, అవసరము లేదు కనుక ఇప్పుడు మానవులకు తోక లేదు అని ఆయన సిద్ధాంతము. అయితే, హనుమంతుల వారి సంగతి ఏమిటి? ఆయన అంతా మానవస్వరూపమే గదా! బలిష్ఠమైన కాళ్ళు, చేతులు, భుజములు ఆయనకు ఉన్నాయి. కనుక డార్విన్ సిద్ధాంతము ప్రకారముగా ఆయనకు తోక అవసరం లేదు గదా! కానీ ఆయన తోక మహాబలిష్ఠమై ఉండుటయే కాక పొడవుగా కూడా ఉన్నది. కనుక అది డార్విన్ సిద్ధాంతమునకు వ్యతిరేకమే గదా! అంటే దీనిలోని అంతరార్థమేమి? అవసరాన్ని బట్టి అవయవము ఉండుటయా? లేక కుంచించుకొని పోవుటయా? అని కాదు అని తేలిపోయినది. హనుమంతులవారి తోక బలిష్ఠముగా, పొడవుగా ఉండుటలోని అంతర్యమేమి?
ప్రపంచమునందు నాస్తికులు, ఆస్తికులు అని రెండురకములవారు ఉన్నారు. నాస్తికులు భగవంతుడు లేడని విశ్వసించుట వలన, వారి పనులు వారే చేస్తున్నారు అనుకొనుట వలన వారికి భగవంతుడు లేకుండా పోయినారు. అదే ఆస్తికులు అన్ని పనులు భగవంతుడే చేస్తున్నాడు, భగవంతుడు ఉన్నాడు అనుకోవడం వల్ల వారికి భగవంతుడు ఉన్నాడు. అయితే, భగవంతుణ్ణి విశ్వసించినా, విశ్వసించకపోయినా ఆయన ఉన్నారు. అక్కడ అవసరము అనేది లెక్క కాదు. దీనిని రుజువు చేయుటకే హనుమంతుడు మానవాకారము అయినప్పటికీ, కాళ్ళు, చేతులు దృఢముగా ఉన్నప్పటికీ, తోక అవసరము లేనప్పటికీ, పొడవాటి దృఢమైన తోకను కలిగియున్నారు. అంటే నాయనా, ఇక్కడ అవసరము ప్రధానం కాదు. దృఢమైన, నిరంతరమైన భక్తియే ప్రధానమని రుజువు చేయుచున్నారు అని తెలియుటలేదా! కనుక నిరంతరమైన, ధృఢమైన భక్తి యొక్క ఆవశ్యకతను హనుమంతుడు నిరూపించినారు. బాలకృష్ణుడు హనుమంతుడని, భవాని హనుమంతుల వారి తోకయని స్వామి ఎన్నోసార్లు తెలియపరచినారు. అంటే ఓ భవానీ! నీవు నిరంతర భక్తి చెయ్యి అని తెల్పినారు అన్నమాట.
నాయనా! హనుమంతుడు నిష్కామసేవకు ప్రతిరూపమైతే - ఆయన తోక నిరంతరధృఢభక్తికి సంకేతము. ఇదే ముక్తికి మార్గము. ఇలా ఆచరించి తరించండి. నిష్కామ సేవ - నిరంతర ధృఢభక్తి - స్వామిసేవలో పాల్గొనడము - ప్రతిఫలాపేక్ష లేకుండటమే - హనుమంతుని మార్గము. అందుకే ఆయన “దాసోఽహం కోసలేంద్రస్య” అని తెలిపినారు. హనుమంతుని మార్గముననుసరించి, ప్రత్యక్ష నరావతారుని గుర్తించి, విశ్వసించి, సేవించి తరించమని స్వామివారి దివ్య సందేశము.
★ ★ ★ ★ ★