home
Shri Datta Swami

 02 Oct 2024

 

తన్మయా హి తే - భక్తుని కూడ పరమాత్మ ఆవేశించును

[12-01-2003] శ్రీదత్తసద్గురువు ఉపదేశము మరియు ప్రవర్తన మానవుని యొక్క అసూయ, అహంకారము, మమకారముల ప్రమాణములపై ఆధారపడి యున్నది. మానవుడు ప్రత్యక్షమును వర్తమానమును ఓర్చుకొనజాలడు. అందులోను తన స్వరూపము వంటి సాటిమానవుని ఎట్టి పరిస్థితులలోను సహించజాలడు. కావున పరమాత్మ సాటిమానవునిగా వచ్చినపుడు మానవుడు గుర్తించుట చాలా కష్టము. ఆ సాటిమానవుని స్వరూపము పరోక్షముగా వైకుంఠముననో, కైలాసముననో ఉండినచో కొంత సహించగలడు. ఆ సాటిమానవుని స్వరూపము వర్తమాన కాలములో కాక గతించిన కాలములో ఉన్నచో అదియైనను కొంత సహించగలడు.

వర్తమానకాలములో సాటి మానవునిగా ఎదురుగా కనపడుచూ ఎట్టి మహిమలను చూపక సామాన్య మానవునివలె ప్రవర్తించుచున్నను అట్టి రామునే దైవమని విశ్వసించి సేవించుచూ, తాను ఎట్టి మహిమలను చూపగలిగినను, తాను దైవమని భావించకయున్న హనుమంతుడు ఎంత గొప్పవాడో ఆలోచించుడు. రాధయును అట్లే వర్తమానకాలమున ప్రత్యక్షముగాయున్న నరస్వరూపమును ఆరాధించినను, కృష్ణుడు మహిమలను ప్రదర్శించినాడు. రాధ వద్ద ఎట్టి మహిమలు లేవు. కావున రాధ కృష్ణుని గుర్తించుట కన్నను హనుమంతుడు రాముని గుర్తించుట చాలా కష్టమైనది. కాన రాధ యొక్క జ్ఞానము, హనుమంతుని జ్ఞానము కన్న తక్కువ. అందువలనే హనుమంతుడు చతుర్దశభువనములకు అధిపతియై అందరి చేతను ప్రత్యేక దేవాలయములలో పూజింపబడుచున్నాడు. కాని రాధకు అట్టి దేవాలయములు లేవు.

కావున హనుమంతుడు రాధ కన్న గొప్పవాడు. దేనిలో? జ్ఞానములో. కాని రాధ యొక్క మార్గము చాల కష్టమైనది. ఆమె యొక్క ప్రేమ నరకమునకు కూడా భయపడలేదు. కనుక భక్తిలో హనుమంతుని కన్న రాధ గొప్పది. కావుననే పదునాలుగు భువనములకు పైనున్న గోలోకమునకు మహారాణి అయియున్నది. హనుమంతుని మార్గము దాసమార్గము. ఇది చాలా సులభమైనది. కాని రాముని గుర్తించుట చాల కష్టము. కాన గుర్తింపు చాల గొప్పయైనది. కాని రాధ యొక్క ప్రియమార్గము చాల కష్టమైనది. కావున మార్గము గొప్ప, గుర్తింపు సులభము. కావున ఇరువురును సమ ఉజ్జీలే. పొందిన ఫలములు సమానమే. ఇంత అత్యుత్తమ ఫలమును ఇరువురును సమానముగా పొంది యున్నారు. కావున వారి సాధనలు కూడ అత్యుత్తమములై యుండవలెను.

Swami

సాధనలో ప్రధానఅంశము ఏది? నీకు అత్యుత్తమసిద్ధిని అందించగల అత్యుత్తమ దైవస్వరూపమును ఎన్నుకొనుటయే ప్రధానాంశము. ఏలయనగా ఫలప్రదాత ఆ దైవస్వరూపమే కదా! వారిరువురు అత్యుత్తమ ఫలమును పొందినారు అన్నప్పుడు వారు అత్యుత్తమ దైవస్వరూపమును ఎన్నుకున్నట్లే గదా! కావున వారు ఎన్నుకున్న అత్యుత్తమ దైవస్వరూపము ఏది? ఆ దైవస్వరూపము వారున్న వర్తమాన కాలములో వారికి ప్రత్యక్షముగ యుండి వారికి అందివచ్చిన బ్రహ్మమగు రామావతారము, కృష్ణావతారములే గదా. వారిరువురును (నరాకారములగు) ఎప్పుడును పరోక్షములగు నరాకారములగు విష్ణు, శివాది రూపములను ధ్యానించినట్లు ఆరాధించినట్లు వినబడలేదు. ఇంతకన్న క్రియాత్మకమైన ప్రమాణము ఏమి కావలయును? వారిరువురు గతించిన నరాకారములను కూడా ధ్యానించలేదు.

హనుమంతుడు అప్పటికి గతించిన పరశురామ, వామన, నరాసింహాది అవతారములను ధ్యానించలేదు. అట్లే రాధ అంతకు ముందు గతించిన రామావతారమును ధ్యానించలేదు. దీనికి గల కారణము ఒక్కటే. ఆ ఇరువురిలోను అసూయ సంపూర్ణముగా నాశనమై యున్నది.

దత్తుడు అసూయ లేని వారికే చిక్కును:

దత్తుడు అనసూయ గర్భము లోనికి మాత్రమే ప్రవేశించును. కనుక అసూయ లేని వారికే చిక్కును. అందివచ్చిన వర్తమాన నరాకారమునే ఉపాసించవలయునని నాలుగు వేదములు నాలుగు మహావాక్యముల ద్వారా బోధించుచున్నవి. శివశక్తి స్వరూపమే శిరిడిసాయిగా, సత్యసాయిగా అవతరించినది. కొందరు వర్తమానుడగు సత్యసాయిని నమ్మక గతించిన శిరిడి సాయినే నమ్ముదురు. నరాకారమున ఈ లోకమున స్వామి అవతరించుట నమ్మని మరికొందరు ఈ ఇరువురిని నమ్మక నరాకారములనే కలిగిన పరోక్షమున యున్న కైలాసవాసులైన పార్వతి పరమేశ్వరులను నమ్ముచున్నారు. కావున ఈ మతభేదములన్నియు మానవునిలో గల అసూయ యొక్క ప్రమాణము మొదలగు భేదము మీద ఆధారపడి యున్నది.

ఇంకనూ అందరి కన్నను అసూయ ఎక్కువ కలవాడు అసలు ఆకారమునే కొట్టివేసి నిరాకారమైన సర్వవ్యాపకమైన చైతన్యము వంటి శక్తిని దైవస్వరూపముగా అంగీకరించును. కావున నిరాకారవాదులు మూడుకిలోల అసూయ కలవారు. పరోక్షసాకారాదులు అనగా కైలాసవాసులైన పార్వతి పరమేశ్వరులను మాత్రమే అంగీకరించు వారు రెండుకిలోల అసూయ కలవారు. భూలోక నరాకారమును అంగీకరించు సాకారవాదులు ఒకకిలో అసూయ కలవారు. గతించిన నరాకారమైన శివశక్తి అవతారమైన శిరిడిసాయిని మాత్రమే నమ్ముదురు. వీరిలో అరకిలో అసూయ కలవారు వర్తమాన నరావతారమైన సత్యసాయిని విశ్వసింతురు. ఆ అరకిలో అసూయ కూడ లేనివారు సత్యసాయిని చేరి ఆయన తలపెట్టిన కార్యములో పాల్గొని ఆయన సేవకులుగా తరించుదురు. అట్లే శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీయును వర్తమాన దత్తావతారులే. వర్తమానములో శ్రీదత్తుడు ఎందరో మహానుభావులైన నరావతారములను దాల్చి అందరికిని వారున్న ప్రదేశములలోనే అందుచున్నాడు.

కనుక భగవంతుని అందుకొనుటకు మనము ఎట్టి ప్రయత్నము చేయనక్కరలేదు. శ్రీదత్తపాదము ఇంటింటికి తిరుగును. చేయవలసినదేమి? అనగా ఆయన ఉపదేశములను అనుసరించి ఆయన సేవలో పాల్గొనుటయే నీవు చేయవలసిన పని. కాని నీవు అక్కరలేని పనియగు భగవత్ప్రాప్తికై ప్రయత్నించుచున్నావే కాని అవసరమైన స్వామిసేవ చేయకున్నావు. అనవసరమైన పనిని చేయుట, అవసరమైన పనిని చేయకుండుట మానవుని నైజము. ఈ మత భేదములలో అసూయతో పాటు మానవునిలో లోభగుణము గూడా వివిధ ప్రమాణములలో తాండవించుచున్నది.

నిరాకారవాదులలో మూడు కిలోల లోభము ఉన్నది. దీపారాధన కూడ వారు చేయరు. ఏలననగా, ఆకారమును అంగీకరించినచో విగ్రహము వద్ద దీపారాధన ఖర్చు చేయవలసి వచ్చును. విగ్రహముల యొక్క ముఖము ప్రత్యేకముగా, స్పష్టముగా కనిపించుట కొరకే దర్శనమునకు సహకరించు విధముగా దీపారాధన నీరాజనము చేయబడుచున్నది. ఇది ఇంటిలో అక్కరలేదు. గర్భగుడిలో చీకటిగా యుండును కావున దీపారాధన చేయబడుచున్నది.

ఐతే నిరంతరము ఒక లైటు వెలిగించి ఉంచవచ్చును గదా అన్నచో మానవ స్వభావమునకు ఉన్న గుణము ఏమనగా, నిత్యము కనిపించినచో వెగటు పుట్టును. గర్భగుడిలో చీకటిలో కనిపించక, స్పష్టమైన దర్శనము కొరకు ఉత్కంఠముతో వేచియుండగా ఒక్క క్షణకాలము నీరాజనజ్వాల కాంతులలో స్వామి స్వరూపము గోచరించినపుడు స్వామిపై శ్రద్ధ ఎక్కువగా నుండి విలువ పెరుగును.

ఏలననగా మానవుని యొక్క అసూయ దీనికి కారణమగుచున్నది. నిత్యము గోచరించు దానిని నిర్లక్ష్యము చేయుదురు. ఎప్పుడో కనిపించినచో విలువ యుండును. రాక రాక వచ్చిన ఒక బంధువు జీవుడైననూ వానికి విలువ నిత్తురు. నారాయణుడైనను నిత్యము కనిపించుచున్నచో నిర్లక్ష్యము చేయుదురు.

నిత్యము కనిపించు కృష్ణపరమాత్మను నిర్లక్ష్యము చేసి కృష్ణుని ఆదేశములను పాటించక యాదవులు మద్యము త్రాగి నశించిరి. అప్పుడప్పుడు వచ్చి కనిపించు కృష్ణపరమాత్మ ఆజ్ఞలను పాండవులు ఆచరించిరి. ఐతే మానావమానములకు భగవంతుడు అతీతుడు గదా! అన్నచో, భక్తులు చేయు నిర్లక్ష్యము వలన స్వామికి ఎట్టి నష్టము లేదు. అది భక్తులకే నష్టము కలిగించినది. భక్తుల యొక్క నష్టము, భక్తులకు కలిగించు బాధకన్నను, కరుణామయుడైన పరమాత్మకే ఎక్కువ బాధ కలిగిస్తుంది. కావున భక్తుల శ్రేయస్సు కొరకే నిరంతర దర్శనము మంచిది కాదని ఇట్లు చేయుట జరుగుచున్నది.

ఇక సాకారవాదులలో రెండుకిలోల లోభమున్నవారు మరియు ఒకకిలో లోభమున్నవారు విష్ణు శివాది రూపములను లేక శిరిడిసాయి రూపమును విగ్రహములుగా పటములుగా పూజించుచున్నారు. ఈ ఆరాధనలో ధూపదీపాదులకు స్వల్పమైన ఖర్చు మాత్రమే అగుచున్నది. అంతే కాక విగ్రహము వద్ద పెట్టిన దీపము యొక్క కాంతి ఆ గదిలోనికి ప్రవేశించి మనకు దీపముగా కూడా సాయపడుచున్నది కదా. సుగంధధూపమును మనమే ఆఘ్రాణించుచున్నాము గదా. కనుక నష్టము లేదు. ఇందులో ముఖ్యముగా పెట్టిన నైవేద్యము పటములు స్వీకరించుట లేదు. కనుక ఖర్చు తగ్గుతున్నది.

ఇక అరకిలో లోభమున్న వాడు ప్రత్యక్ష నరాకారమును విశ్వసించి ఆయనకు నైవేద్యము అర్పించి వ్యక్తిగత సేవలో పాల్గొనుచున్నాడు. ఆ అరకిలో లోభము కూడ పూర్ణముగ నశించిన వాడు స్వామి యొక్క కార్యములో పాల్గొని జ్ఞాన భక్తి ప్రచారసేవలో తాను కష్టించి ఆర్జించిన ధనములో ఎక్కువ భాగము వ్యయము చేయుచున్నాడు. నైవేద్యసేవ కన్నను ఈ సేవలో ఖర్చు ఎక్కువ గదా. కావున ఇట్లు అసూయా లోభముల యొక్క భిన్నప్రమాణముల యొక్క నృత్యములే భిన్న మతములు. ఐతే ఈ అసూయ లోభములను మానవుడు అంగీకరించడు. వాని అంతరాత్మ తెలిసియున్ననూ బహిరంగముగా అంగీకరించడు. అవి బయటపడి అంగీకరించనిచో తన అహంకారము దెబ్బతినుచున్నది.

మానవుని అసూయను పట్టియే స్వామి యొక్క దశావతారములున్నవి:

మానవుని యొక్క అసూయను పట్టియే స్వామి యొక్క దశావతారములున్నవి. "ప్రజ్ఞానం బ్రహ్మ" - బ్రహ్మము జీవుడుగా వచ్చును. కాని ఆ జీవుడు భూమిపై కనిపించరాదు. ఇది పదికిలోల అసూయ. కావుననే స్వామి భూమి మీద కనిపించక జలములో మత్స్యరూపములో అవతరించినాడు. ఒకకిలో అసూయ తగ్గగా, అప్పుడప్పుడు భూమి మీదకు వచ్చు కూర్మావతారము ఎత్తినాడు. మరియొక కిలో అసూయ తగ్గగనే ఎప్పుడు భూమిపై నుండు వరాహవతారము ఎత్తినాడు. భూమిపై నిత్యము కనిపించుచున్నను సాటి నరాకారమును అంగీకరించని స్థితిలోనే యున్నాడు. వానికి మరియొక కిలో అసూయ తగ్గినది. పూర్తి నరాకారమును అంగీకరించలేడు.

నరాకారములో ముఖము ప్రధానము. కావున పరమాత్మ నరసింహ ముఖమును ప్రదర్శించినారు. తరువాత వానిలో మరియొక కిలో అసూయ తగ్గినది. పూర్ణనరాకారమును అంగీకరించినాడు కాని తన కన్న అధముడుగా యుండవలెను.

స్వామి పూర్ణనరాకారముగా వామనుడుగా వచ్చినాడు. వామనుడు అనగా పొట్టివాడు అని కాదు. ఒక మానవుడు ఉచ్చదశలోకి పోయినప్పుడు ఎంత ఎక్కువకు ఎదిగినాడందుము. అనగా 7 అడుగులు పెరిగినాడని అర్థము కాదు. ఈ స్థితిలో జీవుడు బలియను దానవునిగా చెప్పబడినాడు. బలి అనగా అహంకారి అని అర్థము. భగవంతుని చేయి క్రింద వుండి తన చేయి పైన ఉండు స్థితిని కోరుకున్నాడు. కావుననే వామనుడుగా వచ్చినాడు.

అనగా అధముడుగా వచ్చి స్వామి క్రమక్రమముగా విజృభించినాడు. అనగా ఎత్తు పెరుగుట కాదు. తన యొక్క పరమాత్మతత్త్వమును ప్రకటించినాడు. ఒక పదము చేత ఆకాశమును మరియొక పదము చేత భూమిని ఆక్రమించినాడు. ఇక్కడ పదము అనగా శబ్దము, వాక్కు, బోధ. అనగా తన బోధ చేత ఆకాశమునాశ్రయించుట అనగా ఉత్తమ సాధకులను బోధ ద్వారా ఆక్రమించినాడు. మధ్యములగు భూలోక స్థాయిని కూడా బోధచే ఆక్రమించి ఉద్ధరించినాడు. ఇక అధములు అనగా పాతాళము మిగిలినది.

తాను అధమస్థితిలో వచ్చి ఎంత ఉచ్చస్థితికి ఎదిగినాడో చూపుటకు బలి తలలోకి బోధ ద్వారా జ్ఞానము నెక్కించినాడు. మూడవ పదమును బలి శిరస్సుపై యుంచుట ఇదియే. బలి అట్టి అధమస్థితిలో ఉండి తన అహంకారమును నిర్మూలించమని ప్రార్థించినాడు. ఇదే బలి పాతాళమునకు త్రొక్కపడుట. అనగా బలి అహంకారమును వదలి అధమ స్థితిలో తన్ను తాను తగ్గించుకున్నాడు. “నిన్ను నీవు ఎంత తగ్గించు కొందువో అంత హెచ్చింపబడుదువు” అని విదేశములో అవతరించినపుడు శ్రీదత్తుని వాణి గదా. కావున బలి ఎంత హెచ్చింపబడినాడు అనగా ఆ బలికి తాను దాసుడై స్వామి గేటు కాపరిగ నిలబడినాడు.

అనగా వామనుడుగా ఉన్నవాడు ఎవడైనను తప్పక త్రివిక్రముడగును. కావున అహంకారము ఎంత నిర్మూలించుకున్న అంత ఉచ్చస్థితి లభించును. ఈ స్థితిలో మానవుడు పరమాత్మను ప్రశ్నించినాడు. స్వామీ! గర్భములో ఏర్పడిన ఒక శిశుస్వరూపమును తాము ఆవేశించి అవతరించి పూర్ణావతారముగ ఉన్నారు. అట్లు కాక తమ భక్తుడగు ఒక మానవుని ఆవేశించినపుడు అతడు కూడ అవతారము కావచ్చును గదా. ఒక లోహపు తీగె నిర్మించబడగనే దానిని లైటుకు బిగించి విద్యుత్తును పంపగా ఎట్లు విద్యుత్తీగె అగుచున్నదో అట్లే లోహపు తీగె నిర్మించబడిన కొంత కాలము తరువాత దానిని బిగించి, విద్యుత్తును పంపినచో అదియును విద్యుత్తీగె అగును కదా అని ఈ ప్రశ్నను నారదుడు వేసినాడు.

"తన్మయా హి తే" అను భక్తి సూత్రమున భక్తుని గూడ పరమేశ్వరుడు ఆవేశించును అని చెప్పబడినది. కావుననే ఒక ఋషికుమారుడగు పరశురాముని స్వామి ఆవేశించి వ్యాపించినాడు. అచ్చట స్వామి విష్ణువు అనబడినాడు. విష్ణువు అనగా వ్యాపించువాడు అని అర్థము. పరశురాముడు కూడా అవతారములలో నిలచినాడు. కాని అహంకరించి గర్వభంగము పొందినాడు కారణమేమి? పరశురామునిలో శరీరము మాత్రమే కాక అనేక జన్మల సంస్కారముల సమూహమైన విశిష్టమైన ఒక జీవస్వరూపమున్నది. కావున పరశురామునిలో శరీరము, జీవుడు, దేవుడు అను ముగ్గురున్నారు. దేవుడు చేసిన పనిని జీవుడు తాను చేసితినని అహంకరించినాడు. కావున జీవుడు అద్వైత కైవల్యమును పొందినచో వచ్చు ప్రమాదమిది.

కనకపు సింహాసనమున శునకము కూర్చుండ బెట్టిన వెనుకటి గుణమేల మారును? కావున జీవుడు అద్వైత కైవల్యమును కోరవద్దని ఉపదేశించుచు దాసభావములో ఉన్న జీవుడు అద్వైత కైవల్యమున కన్న అధికస్థితిని సాధించవచ్చునని ఉపదేశించుచూ రామావతారమున దైవశక్తులను దాసుడైన హనుమంతునకిచ్చి తాను ఆ దైవశక్తులను లేకయుండి తన కన్న అధికస్థానమున దాసుని నిలిపి చూపెట్టినాడు. పరశురాముడు స్వామి కైవల్యమును కోరి తనను తాను హెచ్చించుకున్నాడు. కనక తగ్గించబడినాడు. హనుమంతుడు దాసభావమున తనను తాను తగ్గించుకున్నాడు. కనుకనే రామాంజనేయ యుద్ధమున రామునినే ఓడించగలిగినాడు. ఇది జీవులకు స్వామి ఇచ్చిన ఉపదేశము.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch