home
Shri Datta Swami

 15 Nov 2024

 

కార్తికేయుడు బ్రహ్మత్వమును పొందిన పుణ్యదినమే కార్తికపౌర్ణమి

[19.11.2002, కార్తికపౌర్ణమి సందేశము] కార్తికపౌర్ణమి యొక్క అంతరార్థము ఏమనగా ఈ దినమునాడు కార్తికేయుడగు కుమారుడు తన ఆధ్యాత్మికగురువగు శ్రీదత్తునిచేత గురువుగా ప్రకటింపబడిన పుణ్యదినము. ఈనాడే కుమారుడు ‘సుబ్రహ్మణ్యుడు’ అను పేరున శ్రీదత్తసద్గురువుల చేత పిలువబడిన దినము. అనగా, బ్రహ్మత్వమును పూర్తిగా పొందినాడని అర్థము. కుమారస్వామి శ్రీదత్తసద్గురువుల ఆధ్యాత్మికశిష్యుడు. ఇతడు ఆరుకృత్తికలకు జన్మించెను. అందుకే ‘కార్తికేయుడు’ అని పిలువబడెను. ఈ ఆరు కృత్తికలే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే ఆరు గుణములను సూచించును. మాయనుండి సంభవించిన జీవుడే కుమారుడు. ఇతనికి గల ఆరుముఖములు ఆ ఆరుగుణములను సూచించును. ముఖము అనగా ఆరంభము. అనగా ఈ షడ్గుణముల ప్రేరణయే ఆరంభములుగా కలిగి ప్రవర్తించువాడే జీవుడు.

ఇట్టి ఈ జీవుడు సద్గురుసార్వభౌముడైన శ్రీదత్తుని ఆశ్రయించి హస్తములో శక్తిని అనగా భక్తిని ధరించిన వాడాయెను. భక్తియే పరమాత్మను లభింపచేయు శక్తి. పరమాత్మ లభించినచో సర్వత్రా విజయమే. ఈ కుమారుడు మయూరవాహనుడై తన వాహనము యొక్క పాదముల చేత సర్పమును త్రొక్కించెను. మయూరము అనగా జ్ఞానము. ఏలననగా మయూరమునకు ప్రధానలక్షణము పింఛము. ఆ పింఛములో ఒక కన్నుయున్నది. అదియే జ్ఞాననేత్రము. సర్పము అనగా వంకర టింకరగా పోవు చిత్తవృత్తి. జ్ఞానముచేత వంకరగా ప్రసరించు చిత్తవృత్తిని జీవుడు నియమించుటయే దీనిలోని అంతరార్థము. ఇతడు తారకాసురుని సంహరించెను. తారకయనగా రెండుకన్నులలో రెండు గుడ్డులు అనబడు భాగములు. అసురుడు అనగా తమోగుణమైన అజ్ఞానము. ఈ రెండు కన్నులయందు కప్పబడిన అజ్ఞానమే తారకాసురుని సూచించుచున్నది.

Swami

అట్టి అజ్ఞానమును జయించిన జీవుడే తారకాసురుని సంహరించిన కుమారస్వామి. ఈరోజు కృత్తికలు అనబడు ఆరునక్షత్రములు పూర్ణిమను చేరియున్నవి. కావుననే కార్తికపూర్ణిమ అనబడుచున్నది. ఈ షట్ కృత్తికలు షడ్గుణ మయుడైన జీవుని సూచించును. పూర్ణిమ అనగా షోడశకళాకల్యాణగుణ పరిపూర్ణుడైన శ్రీదత్తభగవానుడు. ఇట్లు కార్తికశబ్దము జీవుని, పూర్ణిమశబ్దము శ్రీదత్తసద్గురువుని సూచించుచున్నవి. జీవుడు శ్రీదత్తసద్గురువును ఆశ్రయించుటయే కార్తికపూర్ణిమలోని అంతరార్థము. కార్తికపూర్ణిమ బ్రాహ్మణుల పండగయని ధర్మశాస్త్రము చెప్పుచున్నది. దీని అంతరార్థమేమి? బ్రాహ్మణశబ్దము యొక్క అర్థమేమి? బ్రాహ్మణుడు అనగా బ్రహ్మజ్ఞానము కలవాడు. అయితే బ్రహ్మము యొక్క తత్త్వము అనూహ్యమని “అతర్క్యః, నైషా తర్కేణ, న మేధయా, యో బుద్ధేః పరతః” ఇత్యాది శ్రుతులు చెప్పుచున్నవి. మరియును “యస్యామతం తస్య మతమ్” అను శ్రుతిలో బ్రహ్మమును తెలియలేమని తెలుసుకున్నవాడు మాత్రమే జ్ఞాని అని చెప్పబడుచున్నది. మరియును “బ్రహ్మవిత్ బ్రహ్మైవ” అను శ్రుతి, బ్రహ్మమును గురించి బ్రహ్మమునకే తెలియునని చెప్పుచున్నది.

మాం తు వేద న కశ్చన” అను గీతయును ఇదే తెలుపుచున్నది. బ్రహ్మతత్త్వము తెలియబడనిది అయినచో బ్రహ్మజ్ఞానము అసంభవము కదా. బ్రహ్మజ్ఞానము కలవాడు ఎవ్వడును లేనిచో ఈ సృష్టిలో బ్రాహ్మణుడే లేడు. బ్రహ్మమైన శ్రీదత్తభగవానుడు ఒక్కడే బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణులందరూ “బ్రాహ్మణబ్రువాః” నామమాత్ర బ్రాహ్మణులే అని స్మృతి తెలుపుచున్నది. కావున బ్రహ్మజ్ఞానము అనగా బ్రహ్మముయొక్క తత్త్వముయొక్క జ్ఞానము అని తీసుకొనినచో బ్రాహ్మణుడే లేకపోవును. పైసయూలేని దరిద్రులలో పదిపైసలు కలవాడే ధనికుడైనట్లు కనీసము బ్రహ్మమును గుర్తుపట్టినవాడు బ్రాహ్మణుడు అనవచ్చును. కావున బ్రహ్మజ్ఞానము అనగా బ్రహ్మము యొక్క అభిజ్ఞానము అను అర్థము తీసుకొనవచ్చును. ఈ కోటానుకోట్ల దేవతాస్వరూపములలో ఏ స్వరూపము బ్రహ్మము? ఇది గుర్తించిన చాలును, అట్టివాడు బ్రహ్మజ్ఞానియగును.

బ్రహ్మము మూడు ప్రాపంచిక బంధములతో పోటీ పడును

బ్రహ్మము యొక్క నిర్వచన మేమి? “ఏకమేవ అద్వితీయం బ్రహ్మ” బ్రహ్మము అనగా ఒకే ఒక వ్యక్తి. ఒకడే పరమాత్మ అని అర్థము. “యతో వా ఇమాని భూతాని జాయంతే” అని శ్రుతియు, “ప్రభవః ప్రళయస్తథా, మయి సర్వమిదం ప్రోక్తమ్” అను గీతయును “జన్మాద్యస్య యతః” అను బ్రహ్మసూత్రమునూ బ్రహ్మమును గుర్తించు ఏకైకలక్షణమును ఘోషించుచున్నవి. శ్రుతి, గీత, బ్రహ్మసూత్రములే ప్రస్థానత్రయమను పవిత్రగ్రంథములు. ఆ గుర్తించు లక్షణము ఏమనగా ఒకే ఒక స్వరూపము ఈ సర్వసృష్టిని పుట్టించి, పాలించి, లయింపచేయుచున్నది అని అర్థము. వీటి ఆధారముగా శ్రీదత్తుడే పరబ్రహ్మమని గుర్తించుటయే బ్రహ్మజ్ఞానము. ఈ దత్తపరబ్రహ్మము అత్రి అనసూయలకు మొట్టమొదట దర్శనమిచ్చెను. ఆయన జన్మలేని వాడగుట చేత దత్తపుత్రునిగా స్వీకరించి సేవించి వారు తరించిరి. మరి భూలోకమున ఉండు మానవుల గతి ఏమి? అత్రి అనసూయల వలె తీవ్రతపస్సును చేయుటకు వారికి శక్తి లేదు కదా అని సందేహము కలిగినది. ఇక్కడ తపస్సు అనగా భగవంతుని దర్శించుటకు ఏర్పడిన తపన. అంతే తప్ప అన్నపానాదులు వదలి శరీరమును హింసించుట కానే కాదు. ఆ తపనలో అన్నపానాదులు విస్మరించవచ్చును. అంతే కాని బలవంతముగా వాటిని వదలివేయుట కాదు. ఆ తపనచే ఏర్పడిన జ్వరమే శరీరబాధ కావచ్చును. అంతే కాని అగ్నుల మధ్య కూర్చుని శరీరమును కాల్చుకొనుట కాదు. కావున మనము అంత తపస్సు చేయలేము అన్నప్పుడు, అంత తపన మనకు పుట్టదు అనియే గద అర్థము. మనకు అంత తపన భార్యాపుత్రధనాదులపై కలదు. దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనునవి మూడును బలమైన సంకెళ్ళు. ఒక ఊరిలో అందరికన్న బలవంతుని ఓడించినచో అందరిని ఓడించినట్లే కదా. కావున ఈ మూడింటిపై కల మమకారము కన్నను శ్రీదత్తునిపై గల మమకారము ఎక్కువ అని నీవు నిరూపించినప్పుడు మిగిలిన మమకారములన్నింటి కంటే స్వామి ఎక్కువ అని నిరూపించపనిలేదు. కావున స్వామి ఈ మూడింటితో పోటీ పడును. కొందరు ధనబంధములను దాటకలుగుతున్నారు. మరికొందరు భార్యాభర్తల బంధములను కూడా దాటగలుగుతున్నారు. కాని సంతానబంధమును ఎవరూ దాటలేక పోవుచున్నారు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch