22 Feb 2025
భాగవతము పరమ పవిత్రగ్రంథము. దత్తుని ఆజ్ఞననుసరించి అనఘాదేవి, ఆదిపరాశక్తి, గొల్లభామగా అవతరించినది. పతి, పుత్ర, ధనాది బంధములను పంచభూతమయములును, మనోమయములును అగు 6 చక్రములను ఎటుల దాటి స్వామి వద్దకు చేరవలయునో అభినయించి చూపినది. ఆ తల్లి, తన బిడ్డలను ఉద్ధరించుటకై మరొక జీవుని భర్తగా స్వీకరించు అవమానమును సైతము అంగీకరించినది. అయితే జీవులందరునూ స్త్రీలే. ఆమెయు జీవుడే. ఒక స్త్రీకి మరొక స్త్రీ భర్తయైనది నాటకములో. ఒక స్త్రీ పురుష వేషమువేసి, స్త్రీ వేషమున నున్న మరొక స్త్రీని కౌగలించినచో పాతివ్రత్య భంగమేమికలదు? పురుషుడు దత్తుడొక్కడే కదా. ఇది తెలియక జీవులు ఆమెను అఘము (పాపము) చేసినది అనిరి. ‘కాదు. ఈమె పాపము (అఘము) చేయలేదు. ఈమె పాపరహిత అనఘ’ అని అన్నారు స్వామి. ఇట్లు ఆమెకు అనఘానామము సిద్ధించినది. ఎవరిని ఉద్ధరించుటకు ఆమె ఈ పాత్రను స్వీకరించినదో, వారే ఆమెను పాపము చేసిన వేశ్య అన్నారు. ఆ తల్లిని అలా అన్నవారు నిత్యనరకమందు ముక్కలగుదురు. ఆమె ఆదిజనని. ఆమె దత్తునకు ప్రేయసి పాత్రను ధరించినది. యోగశాస్త్రమిదే. యోగిరాజే దాని అంతరార్థమును చెప్పగలడు.
చక్రములనగా ఏవో చక్రములను శరీరములో ఊహించుకొని, పిచ్చివారు సాధన చేతురు. చక్రములనగా జల సుడిగుండములు. అవి జీవుడు సంసార సముద్రమును ఈదుచుండగా జీవుని ఆకర్షించి, త్రిప్పి వినోదము కలిగించి ముంచివేయును. వాటిని దాటవలయునన్న మాయ నుపయోగించవలయును. అదే వంకరగా మెలికలతో పోవు కుండలినియగు గొల్లభామ, పతిని, సుతుల నిద్రపుచ్చి, మాయా బంధములను మాయతో దాటి, స్వామిని అనగా సత్యపతిని సర్వజీవులకు భర్తయగు వానిని చేరిన మహాపతివ్రత. పతివ్రతలగు స్త్రీలు అందరునూ, స్వామిని చేరనివారు, అనగా సత్యపతిని చేరనివారు పతివ్రతలెట్లు అగుదురు? పురుషాకారముననున్న స్త్రీ జీవులును పతివ్రతలు కావలయును. కావున గొల్లభామయే ‘అనఘ’, ‘జగదేక పతివ్రత’. భాగవతము రంకు గాదు. గీతలో చెప్పిన దానిని చేసి చూపించుటకు అనఘాదత్తులు ఆడిన మాయానాటకమిది. ఆచరణ బోధకమగు భాగవతమును మించిన పవిత్రగ్రంథము ఏమి కలదు? ‘విద్యావతాం భాగవతే పరీక్షా’ అన్నారు అనగా భాగవతమును అర్థము చేసుకున్న వారే పండితులు.
పరమాత్మ సర్వజీవుల యందును ఉన్నాడు. ఇచ్చట ‘అందు’ అని సప్తమీవిభక్తి వాడబడినది. సప్తమీవిభక్తి ఇచట ‘ఔపశ్లేషిక’ అర్థమున తీసుకొనవలయును. అనగా ‘వాడు మంచమునందు ఉన్నాడు’ అని అన్నట్లుగా అర్థము చేసుకొనవలెను. అనగా మంచమువలె, సర్వజీవులకును ఆధారముగ నున్నాడు అని అర్థము.
ఇక అవతార జీవునిలో స్వామి ఉంటాడు అన్నపుడు సప్తమీవిభక్తిని ‘అభివ్యాపక’ అర్థమున తీసుకొనవలయును. అనగా ఎలా విద్యుత్తు ఒక తీగె యందు వ్యాపించి ఉండునో అలా తీసుకొనవలయును. ఆ తీగె స్వామి సృష్టించిన కొత్తతీగె కానీ, పాతతీగె కానీ కావచ్చును. అనగా ఒక కొత్త అవతారశరీరము కావచ్చును లేదా ఒక భక్తుని శరీరమునను కూడ ప్రవేశించవచ్చును. కొత్త చొక్కాయే అవసరము లేదు. భక్తుని చొక్కాను (శరీరమును) కూడా వేసుకుంటారు. స్వామి పరశురాముని శరీరమును అలానే ఆవేశించినాడు క్షత్రియాహంకారమును మర్దించుటకు. అయితే ఆ చొక్కా విప్పిన తరువాత కూడా, తనను ఇంకా స్వామి ధరించియే ఉన్నాడని పరశురాముడు అహంకరించుట వలన స్వామి ఆయనకు గర్వభంగమును చేసినారు. ఆంజనేయస్వామి ఒక్కరే అట్టి అహంకారమును ప్రవేశింపనీయలేదు కావున ఆయనకు భవిష్యద్ర్బహ్మగా సృష్టి, స్థితి, లయాధికారమును ఇచ్చినారు. ఇది ఆయనకు తప్ప మరి ఎవరికీ ఇవ్వలేదు.
★ ★ ★ ★ ★