31 Dec 2024
Updated with Part-2 on 01 Jan 2025
[30-12-2002] శ్రీదత్తభగవానుడు నిరంతరము మనుష్య శరీరమును ఆశ్రయించి యుండును. ఆ మనుష్య శరీరము సామాన్య మానవ శరీరము వలె ప్రకృతి ధర్మములు కలిగి పరిమితమైన శక్తినే కలిగియుండును. దీనికి కారణమేమనగా ఆయన నిరంతరము సద్భక్తులైన సజ్జనుల యొక్క దుష్కర్మ ఫలములను అనుభవించుచు కర్మ నియమానుసారము వారికి ఛాయా మాత్రముగనే ఆ కర్మఫల భోగముల నిచ్చుచూ, తాను అనుభవించుట వారికి తెలియనీయక పైకి చిరునవ్వు చిందించుచుండును. స్వామి అనుభవించుచున్నారని వారికి తెలిసినచో మంటలలో పడిన చిగురుటాకుల వలె వారు విలవిలలాడుదురు. కర్మఫలానుభవ సమయమునందు అల్పశక్తి గల ఒక మానవ శరీరము ఎంత భాధపడునో, అంత భాధను స్వామి అనుభవించును. అట్లు అనుభవించి ధర్మదేవతకు ఇచ్చిన మాటను స్వామి నిలుపుకొనుచున్నాడు.
కర్మఫలానుభవ కాలమున తన దివ్యశక్తినుపయోగించి భాధను తప్పించుకొన్నచో ధర్మదేవతను మోసగించినట్లగును. కావున స్వామి శరీరము అల్పశక్తిని, అల్పజ్ఞత్వమునే కలిగియుండును. ఆయన శరీరములో అతీంద్రియ శక్తులు ఉండవు. జరుగబోవునది తెలియదు. ఇట్లు అజ్ఞానముతో ఉండుట చేత ఆయన నిజముగా ఆ పాత్రరసమును పూర్ణముగా రమించును. సినిమా చూచుచున్నప్పుడు రాబోవు కథ తెలిసినచో దాని యందు నిజమైన రమణము, వినోదము ఉండవు. ఇట్లు అజ్ఞానము స్వామి యొక్క వినోదమునకు కారణమగుచున్నది. ఇది శివస్వరూపము. అజ్ఞానమయమైన తమోగుణము. కావుననే స్వామి నామములలో 'మూఢాయ నమః' అని కలదు.
ఇట్టి పరిపూర్ణ అజ్ఞానములో సామాన్య మానవుని పాత్రలో సంపూర్ణముగా రమించుచున్నప్పుడు రాముడనబడును. అయితే అప్పుడప్పుడు ఈ మానవత్వము నుండి దైవత్వము వైపుకు ఆకర్షితుడగును. ఇట్లు ఆకర్షింపబడిన వాడే కృష్ణుడు. అనగా అప్పుడప్పుడు మానవ శరీరములో దివ్యశక్తులు ప్రవేశించును. అయితే దివ్యశక్తి ప్రవేశించినను, ఆ మానవ శరీరము దివ్యత్వమును పొందజాలదు. అట్లు దివ్యత్వమును పొందినచో భక్తపాలనానుభవము అను కర్మ ఆగిపోవలసి వచ్చును. భక్తరక్షణకర్మ ఎప్పుడును ఆగదు. కావున స్వామి శరీరము దివ్యత్వమును పొందదు. కావున దివ్యశక్తి ప్రవేశించినప్పుడు దాని ధాటికి స్వామి శరీరము బాధపడుచుండును. జ్ఞానులైన వారు, స్వామిని పరిపూర్ణముగా విశ్వసించిన వారు, స్వామి నుండి ఎట్టి మహిమలను చూడగోరరు.
స్వామి నరాకారమున ఉండుట చేతనే షోడశోపచార పూజకు సంపూర్ణ సార్థకత వచ్చినది. స్వామీ! మా ఇంటికి వచ్చి భిక్షను స్వీకరించమని ప్రేమతో పిలుచుటయే "ఆవాహయామి" అను ఉపచారము. వచ్చిన స్వామికి ఉన్నతాసనము నీవు సమర్పించుటయే ఆసనం సమర్పయామి. ఇట్లే పాద్య, అర్ఘ్య, స్నానాదులు. స్వామిని స్పష్టముగా చూచుటకే దీపము. మశక, మక్షికాదులను పారద్రోలుటకే ధూపము. స్వామికి భిక్ష సమర్పించుటయే నైవేద్యము. ఈ ఉపచారములన్నియును స్వామి యొక్క నరాకారమునకే జరిగెడివి. అట్టి నరాకారము లభించనిచో, మహాభక్తులకు ఈ పూజ జరిగెడిది. మహాభక్తుడు భగవంతునితో సమానుడు. "తన్మయా హి తే" అను నారద భక్తిసూత్రము ప్రకారము మహాభక్తుని దత్తుడు ఆవహించియుండును.
కావున అతడు సాక్షాత్తు భగవంతుడే. స్వామి యగు రాముడు భగవంతుడు అవగా మహాభక్తుడగు హనుమంతుడును భగవంతునితో సమానుడే. "భక్త్యా త్వనన్యయా లభ్యః" అను గీతావాక్యము ప్రకారము, భగవంతుడు భక్తుని చేరియుండును. అట్టి భక్తుడును లభించనిచో యోగ్యులైన సజ్జనులకు, ఆర్తులైన సాధువులకు ఈ పూజను చేసినచో, వారు ఆనందించినచో ఆ ఆనందము జీవాధారుడగు పరమాత్మకు చెంది పరమాత్మ ఆనందించును. స్వామి వేరు, స్వామి ఆశ్రయించిన నరశరీరము వేరు అనుటయే ద్వైతము. ఈ ద్వైతములో సేవ్య-సేవక సంబంధముండును. అనగా ఈ మనుష్య శరీరము స్వామి కార్యములో సేవకుని వలె పాల్గొనును. ఈ నరశరీరము స్వామి యొక్క పూర్ణ శరీరమైన జగత్తులో ఒక అల్పభాగము. కావున ఈ నరశరీరము ‘అవయవము’ లేక ‘శేషము’ అనబడును. ఈ జగత్తు సర్వావయవములైన స్వామి శరీరము. కావున స్వామి 'అవయవి' లేక 'శేషి' అనబడును. ఇదే శేష-శేషి సంబంధమును చెప్పు విశిష్టాద్వైతము. ఈ విధముగా స్వామి పూర్ణశరీరమగు జగత్తు చేతనులగు జీవులతో, అచేతనములగు పంచభూత కార్యములతోను నిండియుండెను. కావున జగత్తును స్వామి యొక్క ‘చిదచిదాత్మక శరీరము’ అన్నారు రామానుజులు. చిత్ + అచిత్ = చిదచిత్. చిత్ అనగా జీవులు. అచిత్ అనగా నదీ, కొండ మొదలగు జడములగు స్థావరములు. కావున శేషుడనగా జీవుడే. ఆయన శరీరములోని ఒక చిన్న కణమే ‘జీవుడు’. జీవుడు ‘ఆత్మ’ అనబడుచున్నాడు. ఈ ఆత్మకు లోపల ఉన్న అంతరాత్మయే ఆత్మేశ్వరుడనగా స్వామి అనబడుచున్నాడు.
"పతిం విశ్వస్యాత్మేశ్వరగ్ం" అను శ్రుతి జడమైన విశ్వమునకు చేతనములగు ఆత్మలకు ఆయన పతి అని అర్థము చెప్పుచున్నది. "పృథ్వీ శరీరమ్" అను శ్రుతియు ఆయన శరీరములో భూమి మొదలగు పంచభూతములున్నవి అని చెప్పుచున్నది. గీతలో కూడా "యస్మాత్ క్షరమతీతోఽహం అక్షరాదపి చోత్తమః, అతోఽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః" అని జడములగు క్షరముల కన్నను అక్షరులగు జీవుల కన్నను భిన్నుడు ఉత్తముడగు పురుషోత్తముడు వేరు అని చెప్పబడుచున్నది. ఆయన యొక్క ఊహలగు జీవులు పంచభూతములగు జడములు ఆయనను శరీరము వలె ఆవరించి యున్నవని అర్థము. ఈ విశ్వశరీరము ఊహాత్మకము కాన విశ్వములో జరుగు వికారములు ఆయనను అంటవు. ఈ నరశరీరము దానిని ఆశ్రయించిన స్వామి తీగె-విద్యుత్తుల వలె వేరుగనున్నను తీగెనంతయు విద్యుత్తు వ్యాపించినందున అది విద్యుత్తుతీగె లేక విద్యుత్తే అనబడును. ఇది అద్వైతము. ఇట్లు అవతార శరీరములో ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతములను సమన్వయము చేయవచ్చును.
★ ★ ★ ★ ★