02 Feb 2025
గురుస్వరూపము కాని భగవత్తత్త్వము లేదు. ఆస్తికుడై పాపములు చేయువానికి బోధించి వానిని పూర్తిగా దిద్దుటకు స్వామి, నరకము, యముడు, కాలభైరవులను బెత్తములను ఉపయోగించును. కొట్టియైనా చదివింప ప్రయత్నించు గురువుకే నిజమైన వాత్సల్యమున్నట్లు గదా. కావున నరకాదులు స్వామి యొక్క గురువాత్సల్యాతిశయమునే సూచించును. ఇక గురువు నెదిరించు శిష్యునికి గురు విశ్వాసమును బోధించు రీతిగా చేసి, నాస్తికునకు తానవతరించి అష్టసిద్ధులను చూపుచూ వానిని కూడ దిద్దుటకు ప్రయత్నించుచున్నారు స్వామి.
ఇది కూడ గురువాత్సల్యాతిశయమే! దానికిని విశ్వసించక నున్నవాడు పశువువలె ఆహార నిద్రారతులనే కోరుచున్నాడు. కావున వానికిని వాడు పట్టు బట్టిన పశుజన్మనే స్వామి ప్రసాదించుచున్నాడు. ఏ విధముగాను మారని నాస్తికులకు యిచ్చు ఈ పశుజన్మ సైతము స్వామి వాత్సల్యసూచకమే. ఇది ఎంత బోధించినా వినని శిష్యునకు ఇక వాడు పట్టు పట్టినదే తండ్రి ఇచ్చునట్లు గదా! కావున సర్వము గురుస్వరూపమే. కావున ‘సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ’ అను శ్రుతి గురుస్వరూపమును చెప్పుచున్నది.
స్వామి తికమకగా ప్రవర్తించుట జీవుల విశ్వాసము-అనుమానములను అనుసరించియే. కావున స్వామి తికమక జీవుల తికమకయే. గీతానుసారముగా వేసే తాళమున్నట్లే, జీవులు చేయు దానికి తలచు దానికి ప్రతిబింబమే స్వామి. జీవుల చంచలత్వమునే స్వామి ప్రదర్శించి చంచలునిగా కనిపించుచున్నారని తెలియవలెను. ఉన్మత్తులగు జీవులకు స్వామి ఉన్మత్తునిగానే కనిపించును.
స్వామి అనుగ్రహమునకు ఒక్కొక్కసారి యుగములు వేచియుండవలెను. పరీక్షలో పడిన కష్టమును బట్టి ఫలితము యొక్క గొప్పతనముండును. పెద్ద పదవిని కోరువాడు పెద్దపరీక్షను వ్రాయవలెను. దానిలో గల గొప్పకష్టమునకు సిద్ధపడవలెను. భక్తితో పాటు ఓర్పు ఉన్ననే స్వామి యొక్క సాధన ఫలించును. యుగయుగములైనా వేచియుండు ఓర్పు కావలయును.
ఏ జీవుడినీ తక్కువ అంచనా వేయరాదు. ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో కదా. ఒకనికి బ్యాంకులో కనపడు ద్రవ్యము వేయి రూపాయిలే ఉన్నది. కానీ అతడి లెక్క కనపడని ఫిక్సుడు డిపాజిట్ రూపంలో లక్ష ఉన్నది. మరొకడికి కనపడే బ్యాంకు లెక్కలో పదివేలున్నది. కానీ ఫిక్సుడులో ఏమీ లేదు. కేవలము కనపడే లెక్కను చూచి రెండవవాడు ధనికుడని భ్రమించుట అవివేకము. మనకు కనపడనివి అన్నీ స్వామికి కనపడును. కావున పూర్వజన్మలలోని పుణ్యములు కనపడనంత మాత్రమున, ఈ జన్మలోని యోగ్యతను మాత్రమే చూచి భక్తుడి యోగ్యతను అంచనా వేయరాదు.
భక్తులు తమ సంసారస్థితిని గురించి శోకింతురు. ఏలననగా ఆ సంసారస్థితి చాలా విరుద్ధముగ నుండుచుండును. ఇట్టి విరుద్ధస్థితియే వారి యొక్క భక్తికి కారణము అగుచున్నది. కావున వారి భక్తికి ప్రేరణ ఇచ్చునది అట్టి విరుద్ధస్థితియేనని తెలియుచున్నది. ఎండలో ఉండినపుడే నీడ విలువ తెలిసి దానిపై తపన ఏర్పడును. మీరాబాయి మొదలగు భక్తుల తపనకు వారి సంసార విరుద్ధస్థితియే కారణము.
★ ★ ★ ★ ★