home
Shri Datta Swami

 24 Nov 2024

 

సాకారమైన నరావతారమే పరబ్రహ్మ స్వరూపము

పరబ్రహ్మము ఇంద్రియములకును, మనస్సుకును, బుద్ధికిని, ఊహలైన తర్కములకును అందదు అని ఆనేక శ్రుతులు బోధించుచున్నవి కదా! ఉదాహరణకు 'న తత్ర వాగ్గచ్ఛతి', 'న మనో గచ్చతి', మరియు 'యతో వాచో నివర్తన్తే', 'అప్రాప్య మనసా సహ', 'యో బుద్ధే పరతస్తు సః', 'న మేధయా', 'నైషా తర్కేణ', 'న చక్షుషా', 'న సన్దృశే', 'అతర్క్యః కథమేతత్‌ విజానీయామ్‌' అను శ్రుతులన్నియును ఈ విషయమునే చెప్పుచున్నవి. ఇట్టి బ్రహ్మము “యత్‌ సాక్షాత్‌” మరియు “ప్రత్యగాత్మాన మైక్షత్‌” ఇత్యాది శ్రుతులు పరబ్రహ్మము కంటికి కనబడుచున్నదని చెప్పుచున్నవి. వీటి సమన్వయము ఎట్లు చేయవలెను? కంటికి కనబడుచున్న బ్రహ్మము అవతారపురుషుడనియు, కంటికి కనబడని బ్రహ్మము అగ్రాహ్యమైన నిర్గుణబ్రహ్మమనియు చెప్పవచ్చునా? శ్రీకృష్ణుని అర్జునుడు చర్మచక్షువులతో చూచుచునే ఉన్నాడు. అయితే శ్రీకృష్ణుని అసలు స్వరూపమైన యోగీశ్వరస్వరూపమును చూపమని అర్జునుడు అడిగినపుడు శ్రీకృష్ణుడు తన నిజస్వరూపమును చర్మచక్షువులతో చూచుటకు వీలు కాదనియు, దానిని దివ్యనేత్రములతో చూడమనియు చెప్పి సమస్త విశ్వమునకు కారణ, ధారణ, మారణతత్త్వమైన తన పరబ్రహ్మస్వరూపమును చూపినాడు.

Swami

అనేక దేవతాముఖములతో జగత్తునంతయు పుట్టించి, భరించి, ఉపసంహరించి తన నిజస్వరూపమే సృష్టి, స్థితి, లయకారణమైన పరబ్రహ్మస్వరూపమని చూపించినాడు. ఆ స్వరూపమునకు కాళ్ళు, చేతులు, ఉదరము, ముఖము మొదలగు అవయవములున్నవి. మరి ఆ నిర్గుణపరబ్రహ్మము నిరాకారము ఎట్లగును? ఈ జగత్తుకు సృష్టి, స్థితి, లయకారణమైన పరబ్రహ్మము నిరాకారమని బ్రహ్మసూత్రములు చెప్పుచున్నవి. “అరూప వదేవ తత్ర్పధానత్త్వాత్‌” శ్రుతియు “న రూపమస్త్యేహ” అనియు “అరూపమవ్యయమ్” అనియూ నిరాకారతత్త్వమును కూడా ప్రస్తావించుచున్నది. కావున ఈ శ్రుతులను, గీతలను, బ్రహ్మ సూత్రములను సమన్వయించి పరబ్రహ్మస్వరూపమును నిర్ణయించవలెను. ఈ నిర్ణయము ఈ విధముగా ఉన్నది.

పరబ్రహ్మ స్వరూపనిర్ణయము

పరబ్రహ్మము సాకారుడే. ఈ పరబ్రహ్మము “సః పురుషః” ఇత్యాది శబ్దములచే శ్రుతులలోను పురుషోత్తముడని గీతలోను ప్రస్తావించబడియున్నది. కావున ఈ పరబ్రహ్మము సాకారమే కాక శ్రేష్ఠమైన పురుషాకారమైయున్నది. ఇంత మాత్రమున జీవులలో స్త్రీల కన్న పురుషులులెక్కువ అని భావించరాదు. జీవులందరు ప్రకృతిరూపులైన స్త్రీలే. జీవులలోనున్న పురుషులు, పురుషవేషమున ఉన్న స్త్రీలేయని భావించవలెను. పరబ్రహ్మమొక్కడే పురుషుడు. “పురుష ఏ వేదగ్ సర్వమ్”, “అధ పురుషోహ వై నారాయణః” అను శ్రుతులు దీనినే చెప్పుచున్నవి. ఈ నిర్గుణ, యోగీశ్వరస్వరూపము కోటానుకోట్ల సూర్యుల తేజస్సుతో విరాజిల్లుతూ చర్మచక్షువులకు అగ్రాహ్యమైయున్నది. ఈ మూలరూపము కేవలము ఆ పరమాత్మ అనుగ్రహముచే దత్తమైన దివ్యనేత్రమునకే చూచుటకు సాధ్యము కావున కనపడడు అను శ్రుతులన్నియు చర్మ చక్షువులకు చూచుటకు వీలుగాని మూలరూపమును గురించి చెప్పుచున్నవి. కనపడును అన్న శ్రుతులన్నియు చర్మచక్షువులచే చూడబడు అవతార బాహ్యమనుష్య రూపమును గురించియు, లేక దివ్య చక్షువులచే చూడబడు మూలరూపమును గురించి చెప్పుచున్నవి. ఇక బుద్ధికి కూడా అర్థము కాని పరబ్రహ్మతత్త్వమును గురించి చెప్పిన శ్రుతులు మూలస్వరూపమునకును, అవతారస్వరూపమునకును వర్తించును.

అనాద్యనంతమైన విశ్వమును సృష్టించిన మూలస్వరూపమును గురించిన తత్త్వము బుద్ధికి ఎటూ చిక్కదు. ఇక అవతారస్వరూపము కంటికి కనపడుచున్నను, దీని తత్త్వము కూడా బుద్ధికి చిక్కుటలేదు. ఉదాహరణకు శ్రీకృష్ణుడు కంటికి కనపడుచున్నను గోవర్ధన పర్వతమును చిటికిన వేలుపై నిలిపినపుడు ఆ కృష్ణతత్త్వము బుద్ధికి అగ్రాహ్యమై యున్నది కదా! ఇక మూలస్వరూపము సాకారము కాక నిరాకారము అని చెప్పినచో బాగుండునని కొందరు తలచుచున్నారు. వీరి మతము ప్రకారముగా ఆది, అంతములు లేని ఈ విశ్వమును భరించు వస్తువు కూడా ఆది అంతములు లేనిదై యుండవలెను. ఇట్లు చెప్పినచో ఇది తర్కసమ్మతముగా యుండును. కాని పరబ్రహ్మతత్త్వము తర్కాతీతము కదా! కావున ఆది, అంతములు కలిగి పరిమితమైన ఒక రూపము ఆది, అంతములు లేని అపరిమితమైన ఈ జగత్తును ధరించి ఉన్నదని చెప్పినచో ఇది తర్కమునకు అందని విషయమై యుండును. అనగా పరిమితాకారము కలిగిన కృష్ణుడు అపరిమితమైన జగత్తును ధరించియున్నాడు అన్నచో ఈ విషయము బుద్ధికి అందదు.

అట్లు కాక అపరిమితమైన నిరాకార పరబ్రహ్మస్వరూపము అపరిమితమైన జగత్తును ధరించి ఉన్నది అన్నచో ఈ విషయము బుద్ధికి తర్కసహితముగా అందుచున్నది. తర్కసహితముగా బుద్ధి పరబ్రహ్మతత్త్వమును అందుకొనలేదని శ్రుతులు చెప్పుచున్నవి కదా! కావున పరిమితాకారము గల సాకారమైన యోగీశ్వర మూలస్వరూపమే అసలు నిర్గుణ పరబ్రహ్మస్వరూపమనియు నిశ్చయించబడుచున్నది. ఉదాహరణకు పరిమితాకారము కలిగిన బాలకృష్ణుడు తన చిన్నినోటిలో అనంతజగత్తును యశోదాదేవికి చూపుట చేత పరిమితాకారుడైన ఆ బాలకృష్ణుడే పరబ్రహ్మమని చెప్పుటలో తర్కమునకు అందని తత్త్వము స్పష్టమగుచున్నది.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch