04 Apr 2025
శ్రీదత్తుడే త్రిమూర్తులుగా రూపొందినాడు. ఇది సృష్టికి పూర్వము జరిగినది. శ్రీదత్తుడు అత్రిమునికి ముందు త్రిమూర్తులుగా కనిపించి మరల ముగ్గురు ఏకము కాగా ఒకే మూర్తిగా కనిపించినాడు. ఇది ఒకటి, మూడైనదని చెప్పటమే తప్ప, మూడు ఒకటైనది కాదు. అనగా దత్తపరబ్రహ్మము "ఏకమేవ అద్వితీయం బ్రహ్మ" కదా, కనుక ఏకస్వరూపము. ఈ ఏకస్వరూపము నుండే గుణ (సత్త్వ-రజ-స్తమస్సులు), కర్మల (సృష్టి, స్థితి, లయలు) వశం చేత త్రిమూర్తులకు కారణరూపములో దత్తుడు ‘నిరాకార’, ‘నిర్వికల్ప’, ‘నిరంజన’, ‘అవధూత’ నామములతో పిలువబడి ‘ఉన్మత్త’, ‘పిశాచ’, ‘దిగంబర’ రూపాలలో దర్శనమిచ్చి సద్యో మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఈ కారణరూపానికి కేవలము "ఓం"కారమే మంత్రము. దీనిని కేవలం సంన్యాసులు, అవధూతలు, అంత్యదశలోనున్న గృహస్థాశ్రమములోని వారు ఉపాసిస్తారు. ఐహికార్థులైన కేవల గృహస్థులకు ఇది దుఃఖకరము. ఈ కారణరూపాన్ని ‘పరబ్రహ్మమ’ని బ్రహ్మాభిమానులు, ‘నారాయణుడ’ని వైష్ణవులు, ‘సదాశివుడ’ని శైవులు, ‘శ్రీశక్తి’యని శాక్తేయులు పిలుస్తారు. త్రిముఖషడ్భుజ రూపము అష్టసిద్ధులను, సర్వమంత్రఫలాలను ఇస్తుంది. అన్ని ఐహికవరాలనిస్తుంది. గృహస్థులు కేవలము త్రిముఖషడ్భుజ రూపాన్నే ఆరాధించాలి కాని, ఈ అవధూత దిగంబరరూపమును ధ్యానించినా, కేవలము ఓంకారమును జపించినా దుఃఖాలు పొందుతారు. అందుచేత, వారు కేవలం అంత్యదశలోనే నిర్గుణ కారణరూపాన్ని ఓంకార జపముతో ఉపాసించాలి.
స్వామి స్మరణమాత్ర సంతుష్టుడు. స్వామి ప్రసాదించే వరాలు అనంతాలు. అమోఘాలు. అందుకే మాయ స్వామిని ఆవరించి అయోగ్యులైన మానవులకు ఆయనను అందనీయకుండా భ్రమింప చేస్తుంది. అయోగ్యులు వరములను, సిద్ధులను పొంది పతనము చెంది లోకకంటకులగుచున్నారు. కాన ఈ మనుజలోకమున దత్తుని ప్రసిద్ధికి రానీయకుండా మాయ నన్ను గోప్యముగా ఉంచినది. దత్తాత్రేయమన్న, కేవలము అవధూత రూపమేననియు, అది కేవలము ఆముష్మికమనియు, పిచ్చి, సంసార విచ్ఛేదము, కేవలము మోక్షమునిచ్చునది అనియు ప్రచారము పుట్టించి నరులను దగ్గరకు రానీయకుండా లోకకల్యాణార్థము మాయ దత్తుని ఆవరించియున్నది. స్వామి ఇలా పాడారు.
"పెను మాయ నన్నెపుడు ఆవరించియె యుండు
పెను పరీక్షలు పెట్టు నెట్టు జీవులనెపుడు
కోటాను కోట్లలో ఏ ఒక్క జీవియో
మొండిగా నను పట్టి బ్రహ్మత్వమును పొందు".
దత్తుని నుండి త్రిమూర్తులు, వారి నుండి మూడుకోట్ల దేవతలు, వారి నుండి ముప్పదిమూడుకోట్ల దేవతలు వచ్చినారు. శ్రీదత్తభగవానునికి పెట్టిన నమస్కారము, 33 కోట్ల నమస్కారములగును. శ్రీదత్తభగవానుడు భోగమోక్షప్రదుడు. భోగములనిచ్చి తృప్తి పొందించి, ఆవల మోక్షమును ఒసంగుచున్నాడు. స్వామి షోడశాక్షరి మంత్రములో యున్న నవబీజాలే నవగ్రహాలు. స్వామి శరీరస్థానములలో ఆశ్రయించి ఉన్నవి.
i) ఓం కారము - హృదయము - సూర్యుడు
ii) ఐం కారము - శంఖము - చంద్రుడు
iii) క్రోం బీజము - చక్రము - కుజుడు
iv) క్లీం బీజము - డమరుకము - బుధుడు
v) క్లూం బీజము - కమండలము - గురువు
vi) హ్రాం బీజము - జపమాల - శుక్రుడు
vii) హ్రీం బీజము - త్రిశూలము - శని
viii) హ్రూం బీజము - వామపాదము - కేతువు
ix) సౌః బీజము - దక్షిణపాదము - రాహువు.
ఈ గ్రహములన్నియు జీవుల కర్మఫలముల నొసంగుచు కర్మఫల ప్రదాతయగు నా స్వరూపములే.
నా బ్రహ్మ ముఖమునకు ఋషిపూజయు, విష్ణు ముఖమునకు సత్యనారాయణ వ్రతము, సహస్రనామ పూజయు, రుద్రముఖమునకు రుద్రాభిషేకము చేయుము. బ్రహ్మర్షులందరును బ్రహ్మాంశలే. దేవతలందరును విష్ణు, రుద్రాంశలే. నా బ్రహ్మముఖమున జిహ్వయందు వాణియు, నా విష్ణుముఖమున వక్షమునందు లక్ష్మియు, నా శివముఖ వామభాగమున గౌరియు ప్రకాశించుచున్నారు. ఈ ముగ్గురు శక్తులు కలసిన దుర్గయు నాయందే యున్నది. నాకన్న వేరు కాని ఆ శక్తియే శ్రీశక్తి. కాన నన్ను స్మార్తులు, వైష్ణవులు, శైవులు, శాక్తేయులు అందరును ఉపాసింతురు.
గణపతి, కుమార, వీరభద్రాది శైవ రూపాలన్నీ నా శివముఖములోను; రామ, కృష్ణ, నరసింహాది రూపాలన్ని నా విష్ణుముఖములోను లీనమైయున్నాయి. నా హరిహర ముఖములే హరిహరాత్మకుడైన మణికంఠుడు. త్రిమూర్తుల అంశ అయిన మారుతి నాయందే కనిపించును. నా అంశావతారులైన సిద్ధులందరు అన్ని దేవతారూపములను చూపించగలుగుచున్నారు. స్మార్తులు వదలిన బ్రహ్మపూజయు నాయందు లభ్యముకాన నన్ను సర్వదేవ (పురుష), సర్వ దేవతా (స్త్రీ), సర్వ బ్రహ్మర్షి, సర్వగ్రహ, సర్వ సిద్ధుల రూపాలతో నున్న త్రిమూర్తుల ఏకరూపముగా తెలుసుకొనుము. అన్ని రూపముల సమష్టియు, ప్రతిరూపము పూర్ణముగా ఉండుటను నా అనూహ్యశక్తికి సాధ్యమని తెలుసుకొనుము.
ఇదిగో చూడుము, ఈ త్రిముఖషడ్భుజ రూపమే బ్రహ్మము. ఆ నాలుగు శునకములు నలుగురు వేదపురుషులు. సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులే ఈ వేదపురుషులు. వీరు జ్ఞానసముద్రులు. నన్ను గురించి తర్కించి, తర్కించి అలసి రొప్పుచూ నాలుకలను వ్రేలాడవేసుకుని చివరకు నా పదముల ఆశ్రయించినారు. వారు శునకముల రూపములో తమ అచంచల విశ్వాసమును ప్రదర్శించుచూ స్వామి ఆరాధనలో స్వామి పాదములను ఆశ్రయించినారు. ఈ చతుర్వేదములే జ్ఞానము. ఈ వేదములు కుక్కల రూపములో దత్తుని పాదములను నాకుచున్నవి. ఈ పాదముల క్రిందనున్న పాదుకలను దేవతలు పట్టుకొని యున్నారు. ఆ దేవతలను మునులు పట్టుకొని వ్రేలాడుచున్నారు.
ఈ ధర్మదేవుని చూడుము. కర్మలు చేయు వారికి కర్మఫలములను ఇచ్చుటలో ఇతడు చాలా పట్టుదల గల కఠోర శాసనుడు అయినా తనను రక్షించమని దత్తుని శరణము కోరి, స్వామి పాదముల ఆఘ్రాణించుచూ తలవంచియున్నాడు. యమధర్మరాజే ధర్మదేవత. కర్మరూపమైన ఈ ధర్మము నిత్యము. ఈ ధర్మమే చతుష్పాదములతో ధేనురూపమున ఆశ్రయించినది. ఈ ధర్మధేనువును, ఈ చతుర్వేదములు కుక్కల రూపములో నుండి రక్షించుచున్నవి. ఈ గోవును కుక్కలను శ్రీదత్తపరబ్రహ్మము రక్షించుచున్నాడు.
i) స్వామి పాదముల వద్ద ఉన్న నాలుగు కుక్కలు వేదవిహితమైన స్వధర్మము.
ii) ఆవు స్వధర్మస్వరూపము. ఈ నాలుగుకుక్కలు, గోవు మధ్య స్వామి ఉన్నందున మనమందరము వేదవిహితమైన స్వధర్మ స్వరూపముతో యుండవలెననునది సూచించబడుచున్నది.
iii) ఇక స్వామి పీతాంబరము ధరించుట, కాషాయ ఉత్తరీయము ధరించుట: జీవుడు భోగభాగ్యములను వైరాగ్యముతో కూడి అనుభవించ వలెననియే భావము. అనగా ఈ భోగభాగ్యములు శాశ్వతమని భావించి వానిలో మునిగితేలరాదనియు, అవి అశాశ్వతములను వైరాగ్యభావముతోనే ఈ భోగభాగ్యములను అనుభవించవలెనని సూచన.
iv) ఇక స్వామిచే బూనిన అక్షమాల, కమండలములు: జీవుడు తన శత్రువగు క్రోధాగ్నిని కమండలములోని జలమును ప్రోక్షించి శాంతింప చేసుకొనవలయుననియు, క్రోధము వచ్చినపుడు తమాయించుకొని, మనస్సుతో జపము చేసినచో క్రోధము తొలగిపోవునను సత్యమును అక్షమాల సూచించుచున్నది.
v) త్రిశూలము, డమరుకము: జీవునకు కామమే గొప్పశత్రువు కనుక కామము (కోరికలు) అను ఈ శత్రువును త్రిశూలముచేత సంహరించి, డమరుకధ్వని యనెడి సర్వశాస్త్రసారమైన వేదాంతమనెడి శాస్త్రజ్ఞానమును అవగతము చేసుకొనమని తెలుపుటయే త్రిశూల, డమరుకముల అంతరార్థము.
vi) శంఖ, చక్రములు: జీవుడు లోభమను ప్రచండ శత్రువును చక్రముచే ఛేదించి, శంఖనాదమను నామగానమును చేయుటయే శంఖ-చక్రములు అందించుచున్న సూచనలు.
vii) త్రిముఖములు: సర్వక్రియలు అను బ్రహ్మయు, సర్వకాలము అను ఈశ్వరుడు, భగవత్పరములైన మహాభక్తియను విష్ణువుతో చేరియుండుటయే త్రిముఖముల అంతరార్థము.
viii) త్రిశక్తులు: వాక్కులను సరస్వతియు, చైతన్య వృత్తులను పార్వతియు, వస్తుస్వరూపిణి యైన రాజ్యలక్ష్మియు, అన్నము నుండి ఉద్భవించుచున్నవి. వీటిని భగవత్పరములుగా చేయుటయే త్రిశక్తుల అంతరార్థము.
క్రియ బ్రహ్మ, శ్రద్ధ విష్ణువు, కాలము శివుడు, వాక్కు వాణి, వస్తువులు లక్ష్మి, మనస్సు (చైతన్యము) పార్వతి. ఈ ఆరును భగవత్స్వరూపములై యుండుటే త్రిశక్తి సహిత త్రిమూర్తిస్వరూపము. సాధనాస్వరూపము. శ్రీగురు స్వరూపము. అందుకే సాధన చేయాలి. దత్త భగవానుని పాదములకు ధూళి సోకకుండా ముళ్ళు గుచ్చుకోకుండా, రాళ్ళు గుచ్చుకోకుండా రక్షిస్తూ, సేవిస్తూ ఉన్న పాదుకలు పవిత్రమైనవి. స్వామి పాదుకలే స్వామి ఉత్తమభక్తులకు ప్రతీకలు. సాత్త్వికమైన భావములతో ఉత్తమగతిగా నమ్మి సేవించే ఉత్తమభక్తులే, స్వామి పాదుకలు. దత్తపాదుకలను అందుకే సేవించాలి. దత్తపాద పద్మములను ఆరాధించటయే దత్తుని పాదుకల పూజ. అహంకారమును త్యజించి సర్వస్య శరణాగతిని చేసిన నా సద్భక్తులే నా పాదుకలు.
★ ★ ★ ★ ★