home
Shri Datta Swami

 03 Mar 2025

 

మరణానంతరము జీవుని యాత్ర

Updated with Part-2 on 04 Feb 2025


Part-1   Part-2


Part-1

[08-02-2003] ఒక గ్రామము నుండి మరియొక గ్రామమునకు పోయినంత మాత్రమున మనిషిలో ఎట్టి మార్పు రాదు. కావున మరణానంతరము జీవుడు ఈ లోకము నుండి మరియొక లోకమునకు పోయినంత మాత్రమున జీవునిలో ఎట్టి మార్పు రాదు. ఒక వస్త్రమును విడచి మరియొక వస్త్రమును ధరించిన మాత్రమున మనుజునిలో ఎట్టి మార్పు రాదు. అట్లే జీవుడు ఈ స్థూలశరీరము వదలి యాతనాశరీరము ధరించినంత మాత్రమున జీవునిలో ఎట్టి మార్పు రాదు. కావున ఈ లోకమున ఈ స్థూలశరీరము ఉన్న చివరిక్షణములో ఎట్టి స్థితిలో జీవుడున్నాడో మరణానంతరము కూడ అదే స్థితిలో కొనసాగుచున్నాడు. జీవునిలో ఇది వరకే పూర్వజన్మల కర్మల గుణములకు వాసనా సంస్కారములు ఉన్నవి. ఆ సంస్కారములు అగు గుణముల బట్టియు మరియు ఈ లోకమున అతడు చేసిన సత్సంగ, దుస్సంగ ప్రభావముల బట్టి సంక్రమించిన గుణములను బట్టియు ఈ లోకమున కర్మల చేయుచున్నాడు.

పూర్వజన్మ గుణములు ఈ లోకములో సంగ ప్రభావము వలన మారవచ్చును లేక బలపడవచ్చును. సాధారణముగా తన పూర్వజన్మ గుణములను బట్టియే సత్సంగములు కాని, దుస్సంగములు కాని జీవుడు ఇష్టపడును. అనగా ఆ జీవుని యొక్క పూర్వ సంస్కారములు దుర్గుణములైనచో అతడు దుస్సంగమును కోరును. జీవుడి పూర్వ సంస్కారములు సద్గుణములైనచో సత్సంగములే ఇష్టపడును. సాధారణముగా మానవలోకములో వచ్చు జీవులు సద్గుణములతోను, దుర్గుణములతోను మిశ్రమములుగా ఉందురు. కావున అట్టివారు రెండు పడవలలోను పాదములను పెట్టుచుందురు.

అయితే సత్సంగ, దుస్సంగముల బలములను అనుసరించి కొంతమంది ఏదో వైపుకు లాగబడుట జరుగుచుండును. ఇక కేవలము సద్గుణములైన సత్త్వగుణములను కలిగినవారు నిరంతరము భగవంతుని సత్సంగములోనే రమింతురు. ఇట్టివారే దేవతాస్వరూపులు. ఇక కేవలము దుర్గుణములతో నున్నవారు తమోగుణులుగా నిరంతరము దుస్సంగములలోనే క్రీడించుచున్నారు. వీరే అసురులు అనబడుచున్నారు. ఈ విధముగా మానవులలో సాత్త్వికులు ‘ఇష్టుల’నియు, తామసులు ‘అనిష్టుల’నియు రెండింటి యొక్క మిశ్రమములైన రజోగుణులైన రాజసులు ‘మిశ్రుల’నియు గీతలో పిలువబడుచున్నారు. సాత్త్వికులు స్వర్గలోకమునకు పోయి తిరిగి సాత్త్వికులుగను, తామసులు నరకలోకమునకు పోయి మరల తామసులుగను, రాజసులు పితృలోకమునకు పోయి రాజసులుగను ఈ లోకమున పునర్జన్మలను ఎత్తుచున్నారు. సాధారణముగా ఎక్కువమంది రాజసులుగానే జన్మించుచున్నారు. కావుననే, మరణించిన వారిని ‘పితరులు’ అని పిలుచుచున్నారు. పితరులు పితృలోకముకేగి మరల ఈ లోకమున మిశ్రులుగా జన్మించుచున్నారు. పితృలోకమున స్వర్గభోగములు ఉండవు. అట్లే నరక శిక్షలు ఉండవు. కొన్ని అత్యల్పములైన పాపకర్మలు, పుణ్యకర్మలు మాత్రమే ఉండును. ఈ పితృలోకమునే అధమస్వర్గలోకమందురు. అటువంటి సమయమున పాపము కాని, పుణ్యము కాని రెండునూ పెద్దగా ఉండవు. కావున ప్రతిజీవుడును పితృలోకమునకు పోవుటచేత పోయినవారు పితరులు అనబడుచున్నారు.

Swami

కొందరు జీవులకు పుణ్యకర్మలు పాపకర్మలను పోగొట్టగా కొంత పుణ్యకర్మ మిగులుచున్నది. ఈ పుణ్యశేషము చేత పితృలోకము నుండే వారు స్వల్పకాలము కొరకు స్వర్గలోకమునకు పోవుదురు. అట్టి వారిని పితృదేవతలు అందురు. మనుజుడు మరణించిన తరువాత ప్రేతలోకమున పది దినములు ఉండును. ఆ లోకమున విచారణ పూర్తికాగానే కొన్ని పుణ్యకర్మలు కొన్ని పాపకర్మలు ఉండుట చేత సాధారణముగా పితృలోకమునకు పోవుదురు. అక్కడ సాధారణముగా ఒక సంవత్సరకాలము ఉందురు. పితృలోకములో ఒకరోజు మానవలోకమున ఒక నెలతో సమానము. కావున ఒక సంవత్సరకాలము ప్రతినెలయు మాసికములను పెట్టుచున్నారు. ఆ తరువాత పితరులు స్వర్గలోకమునకు పోవునట్లు సంభావన చేయబడుచున్నది. స్వర్గలోకమున ఒకరోజు మానవలోకమున ఒక సంవత్సరముతో సమానము. ప్రతిజీవుడును తన పితరులు స్వర్గలోకమునకు పోయినట్లు భావించుచూ సంవత్సరము తరువాత ప్రతి సంవత్సరము, సంవత్సర శ్రాద్ధము పెట్టుచున్నారు.

కావున పితృలోకమున 360 రోజులు ఉన్న తరువాత స్వర్గలోకమున 360 సంవత్సరముల గరిష్ఠపరిధి వరకు జీవుడు ఉండుచున్నాడు. అనగా మూడు తరములు ఉండుచున్నాడు. ఒక తరము 120 సంవత్సరములు. ఒక తరమునే ‘పూరుష’ మందురు. ఆ తరువాత ఆ జీవుడు మర్త్యలోకమునకు తిరిగి వచ్చుచున్నాడు. కావున మూడుతరములు దాటిన తరువాత శ్రాద్ధములలో పిండస్థానమును తీసివేయుచున్నారు.

 

Part-2

అయితే కొందరు జీవులు పది దినముల విచారణ ముగియగనే కేవలము పాపకర్మలు చేసిన వారే అయినచో వారు నరకలోకమునకు పోవుచున్నారు. అనగా వారు పితృలోకమునకు గాని స్వర్గలోకమునకు గాని పోవుట లేదు. అట్టి వారికి మాసికములు, శ్రాద్ధములు అనవసరములగుచున్నవి. కొందరు పాపకర్మలు ఎక్కువగా చేసి పుణ్యకర్మలు తక్కువగా చేసిన వారు, పితృలోకమునకు పోయి అచ్చట నుండి నరకలోకముకు వత్తురు. అట్టివారికి మాసికములు ఉపయోగించునే కాని శ్రాద్ధములు వ్యర్థములు. అనగా మనము పెట్టు పిండ భోజనము మరియు భోక్తల భోజనము పితృలోకమున గాని స్వర్గలోకమున గాని లభించును. నరకలోకమున శిక్షింపబడినప్పుడు ఆకలి దప్పికలతో జీవుడు వేదన పడవలయును కావున మనము పెట్టు ఆహారము వారికి అందదు. అట్లు పితృలోకమున సోమరసము, దేవలోకమున అమృతము ఆహారముగా లభించుచున్నది. కావున ఆ జీవులకును మాసిక శ్రాద్ధములు అనవసరము.

అయితే మర్త్యలోకమున దధిశాఖయుత (curries along with curd) భోజనము యొక్క వాసనాగుణము జీవునిలో ఉన్నది కావున ఆ జీవుని ప్రీతికై మనము అదే ఆహారమును అందించుచున్నాము. అంతే తప్ప ఈ ఆహారము అందించకపోయినను పితృలోకమున కాని, స్వర్గలోకమున కాని ఎవ్వరును ఆకలిచే బాధపడరు. ఇక నరకలోకమున నున్న వారికి ఇచ్చట పెట్టినను అందవు. కావున మరణానంతరము సర్వజీవులకును మాసిక శ్రాద్ధములు నిజముగా అనవసరములు. ఏలననగా, ఈ లోకములో జీవులకు ఎట్లు భగవంతుడే ఆహారమును ఏర్పరచినాడో, పై లోకములలోను జీవులకు భగవంతుడే ఆహారమును ఏర్పరచినాడు. నరకలోకమున భగవంతుడు ఆహారమును నిషేధించినాడు కావున నీవు పెట్టినను జీవునికి అందదు. ఈ సత్యమును తెలిసిన జ్ఞానులైన సంన్యాసులు మాసిక శ్రాద్ధములను కోరుట లేదు. మరియు వీటిని చేయవలసిన పుత్రుని పొందుటకై వారు వివాహములను చేసుకొనుట లేదు.

శంకరులు వివాహము చేసుకొనలేదు. రామకృష్ణ పరమహంస చేసుకొన్నను పుత్ర సంతానము పొందలేదు. మనము మన పిల్లవానిని దూరరాష్ట్రమునకు చదువుకొనుటకు పంపుచున్నాము. అక్కడ వానికి హాస్టల్ లో భోజనము పెట్టుదురు. కావున వానికి ఆహారము పంపునపుడు మనము భోజనము పంపనక్కర లేదు. అచ్చట వానికి భోజనము ఏర్పాటు కావించబడియున్నది. అయితే వాడు అక్కడ భోజనము కొంచెము కొత్తదిగా ఉండుటచేత ఇక్కడ ఉన్నపుడు తిన్న పదార్థములపై కోరిక కలిగియుండును. ఆ కోరికను తీర్చుటకై మనము ఒక సీసాలో ఆవకాయ, మరియొక సీసాలో చింతకాయ పచ్చడి పెట్టి పంపుచున్నాము. ఇవి అక్కడ దొరకవు. వీటిపై వానికి మోజు. అక్కడ చపాతీలు అతడికి రుచించవు. కావున మనము ఇచ్చి పంపు పచ్చళ్ళు వాని మోజు తీర్చుటకే. కాని వాని ఆకలిని తీర్చి ప్రాణములను నిలబెట్టుట కొరకు కాదు.

కావున మాసిక శ్రాద్ధములలో పెట్టు భోజనములు ఆ గతించిన జీవుని మోజు తీర్చుటకే. కావుననే ఆరోజు వాడు జీవితకాలములో తిన్న వివిధములైన కూరలు, పచ్చళ్ళు చేయుచున్నారు. నాలుగు రకములైన పచ్చళ్ళు, నాలుగు రకములైన కూరలు అనగా అనేక రకములైనవి అని అర్థము కాని కరెక్టుగా నాలుగు అని కాదు. నాలుగు అను శబ్దము ఎక్కువ అని అర్థములో వాడబడుచున్నది. “నాలుగు రూకలు సంపాదించుము” అని అంటారు. ఇచ్చట నాలుగు అనగా ఎక్కువ అని అర్థము. కొందరు మూడు పచ్చళ్ళు, మూడు కూరలనే చేయుదురు. కావున ఈ సంఖ్యలో ఎట్టి తాత్పర్యము లేదు.

‘భూరి భోజనాత్’ అని శాస్త్రము ఉన్నది. దీని అర్థము ఎక్కువ రకములతో భోజనము పెట్టమని అర్థము. కావున ఈ పిండములను పెట్టుటచేతను, శ్రాద్ధములను చేయుట చేతను జీవునకు ఎట్టి లాభము లేదు. పై లోకములలో కర్మశేషము ఉండుటచేత మరల ఈ లోకములో జన్మించుచున్నారని చెప్పబడుచున్నది. కర్మశేషము అనగా కొన్ని కర్మఫలములను అనుభవించిన తరువాత మిగిలిన కర్మఫలములతో ఇచ్చట జన్మించుచున్నారని కాదు. జీవుడు ఈ దేహము వదలినపుడు జీవుని వెంట కర్మలు కాని కర్మఫలములు కాని పోవుట లేదు. వాని వెంటపోవుచున్నది ఇచ్చట చేసిన కర్మలలోని సంస్కారములు లేక వాసనలు అను గుణములే. ఈ విషయమే ‘వాయుః గంధానివాశయాత్’ అని గీతలో చెప్పబడినది.

అనగా క్రూరకర్మలు చేసిన వారి వెంట క్రౌర్యగుణము పోవుచున్నది. నరకములో ఆ జీవుని హింసించిన తరువాత ఆ క్రౌర్యగుణము తగ్గి చాలా వరకు తగ్గి స్వల్పముగా మిగిలియుండును. ఈ మిగిలియున్న దానినే ‘కర్మశేషము అనుచున్నారు. ఈ స్వల్పమైన క్రౌర్యగుణముతో ఆ జీవుడు వ్యాఘ్రాది మృగజన్మలు పొందును. కావుననే పులిపిల్ల పుట్టగనే క్రౌర్యగుణము స్వల్పముగా ఉండుటచేత క్రూరకర్మలను చేయలేకున్నది. క్రమముగా పులుల వాతావరణములో సంఘప్రభావమున ఈ క్రౌర్యగుణము బలపడి క్రూరకర్మలను చేయుచున్నది. ఇదే పులిపిల్ల చిన్నప్పటి నుండియు, ఒక మేకలమందలో పెరిగినచో అది వాటి వల్లే గడ్డిని మేయుచు పులి ఆకారము ఉన్నను సాత్త్వికగుణమును పొందును. కావున ఈ లోకములోన గుణములను మార్చుకొను అవకాశము ఉన్నది.

అనగా సాధన చేత నీ మార్గమును మార్చుకొనవచ్చును. సాధనకు సంఘము అనగా నీవు కూడినట్టి మనుష్యుల యొక్క ప్రభావము ఉండును కావున సంఘమును నిర్ణయించుకొనుటచేత నీ మార్గము కూడా నిర్ణయింపబడుచున్నది. సాధనకు మొదటిమెట్టు సంఘమే అని శంకరులు ‘సత్సంగత్వే నిస్సంగత్వమ్’ అన్నారు. పై లోకములలో నీ గుణములను అనుసరించిన ఫలముల భోగములు మాత్రమే ఉండును. కావున ఆ భోగలోకములలో ఈ పై అవకాశము లేదు. కావున ఈ లోకములో చిట్టచివరి క్షణములో నీవు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలోకి మరల వచ్చి పడుచున్నావు. కావున ఈ లోకములో ఈ మానవజన్మ ముగియుటకు ముందే సర్వమును సాధించుకొనవలయును. నీ పుత్రులు కానీ, నీ ధనముకానీ నీ మరణానంతరము నిన్ను ఉద్ధరించలేవని ‘న ప్రజయా, ధనేన’ అని శ్రుతి చెప్పుచున్నది. అయితే, నిన్ను ఉద్ధరించగల పుత్రుడు ఒకడు కలడు అతడే దత్తుడు. అతడు జన్మరహితుడు కావున నీ కడుపున పుట్టినవాడు కాజాలడు. కావున వానిని దత్తత స్వీకారము తీసుకొనవలయును.

దత్తుడు నీ ఆస్తిలో వాటాకు వచ్చునేమోయని భయపడకుము. స్వామికి నీ ధనముతో ఎట్టి పనియును లేదు. నీ ఆస్తిని నీ కడుపున పుట్టిన వానికే ఇచ్చుకొనుము. అతడికి ఈ ఆస్తి కాదు మరియొక ఆస్తి కావలయును. ఆ ఆస్తిలో మరియొకనికి వాటా ఇచ్చినను అంగీకరించరు. ఆ ఆస్తియే నీ మమకారము, నీ ప్రేమ. దాని చేత స్వామి సంతృప్తిపడును. పరలోకమున నీ వెంట నిలచు ఆయనను చూచిన యమధర్మరాజు కూడ గడ గడ వణుకుచు లేచి నమస్కరించును. నీకు విచారణయే ఉండదు. నిన్ను మరల మర్త్యలోకమునకు తీసుకొనివచ్చి మానవజన్మలోకి పడవేయును. ఇప్పుడు నీకు వచ్చిన మానవజన్మ ఆయన అనుగ్రహమే. కాని కృతఘ్నుడవై స్వామిని మరచినావు. భార్యా, పతి, పుత్రాది వ్యామోహములో పడి ఆయనకు నీవు విలువ ఇచ్చుట లేదు. ఏ పాపమునకైనను ప్రాయశ్చిత్తము ఉండును. కాని కృతఘ్నతకు ప్రాయశ్చిత్తము లేదు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch