04 Oct 2024
[23-12-2002] పరమాత్మ అద్వితీయునిగా ఏకాకిగా ఉండెను. ఆ పరమాత్మ స్వరూపము పరమాత్మకే తెలియును. "బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి" అని శ్రుతి. దీని అర్థము బ్రహ్మమును గురించి తెలిసినవాడు బ్రహ్మమే అని. బ్రహ్మమును గురించి బ్రహ్మము కన్న భిన్నులైన ఇతరులు అనగా జీవులు ఏ మాత్రము తెలియజాలరు. కాని ఈ శ్రుతిని తప్పుగా సమన్వయము చేయుచున్నారు. బ్రహ్మమును గురించి ఏ జీవుడు తెలుసుకొన్నను ఆ జీవుడు బ్రహ్మమగును అను అర్థమును చెప్పుచున్నారు.
ఇది సరియైన అర్థము కానే కాదు. ఏలననగా, బ్రహ్మము వాక్కులకు గాని, కన్నులు మొదలగు ఇంద్రియములకు గాని, మనస్సుకు గాని, బుద్ధికి కాని, తర్కమునకు గాని అందదు. శ్రుతులు "యతో వాచః, న చక్షుషా, అప్రాప్య మనసా, న మేధయా, నైషా తర్కేణ" అను శ్రుతులు ఇందుకు ప్రమాణములు. “మాన్తు వేద న కశ్చన” అని గీతలో నన్ను ఏ జీవుడును తెలియజాలడు అని స్వామి వచించినాడు. దీనికి కారణము జీవుల ఊహలన్నియు ఆకాశతత్త్వము వరకే వ్యాపించగలవు. ఆకాశమనగా ఖాళీస్థలము. ఆకాశమునకు అతీతమైన "ఆకాశః" అను శ్రుతి ప్రకారము ఆకాశమును సృష్టించిన పరమాత్మను ఏ జీవుడును, ఎన్నటికిని అర్థము చేసుకొనజాలడు.
ఆకాశము అదృశ్యమైనకాని, పరమాత్మ గోచరించడు. ఆకాశమే అదృశ్యమైనచో జీవుడు, జీవుని యొక్క మేధాశక్తి, జీవుని ఊహలు అన్నియు అదృశ్యమైపోవును. కావున ప్రకృతిస్వరూపుడగు జీవుడు ప్రకృతి అంతయు అదృశ్యమైనపుడు మాత్రమే గోచరించు పరమాత్మను ఎంత ప్రయత్నించినను తెలియజాలడు. ఐతే పరమాత్మను తెలియజాలడు అను విషయము ఎట్లు తెలిసినది? తెలియలేని వస్తువు అసలు లేదనియు భావించవచ్చును గదా! ఈ ప్రశ్నకు శ్రుతి "అస్తీత్యేవోపలబ్ధవ్యః" అని చెప్పుచున్నది. దీని అర్థము, తెలియుటకు వీలుకాని తాను ఉన్నానని మనకు చక్కగా తెలియునట్లు చేయును. అది ఎట్లు అనగా అవతారము ద్వారా.
అవతారము యొక్క ముఖ్యోద్దేశ్యము ఇదే. ఇది పరమాత్మ చేయనిచో సర్వజీవులు నాస్తికులగుదురు. ఊహకు అందని కొన్ని పనులను అవతారము చేసి జీవులకు చూపించును. ఊహాతీతములైన ఆ పనుల ద్వారా ఊహాతీతమైన పరమాత్మ ఉన్నాడని ప్రత్యక్ష ప్రమాణము ద్వారా నిరూపించుటయే సిద్ధులను ప్రదర్శించుటలోని ముఖ్యోద్దేశము. దీని వలన జీవులలో నాస్తికత్వము పోయి ఆస్తికత్వము నిలబడును. కావున నాస్తికుని మార్చుటకే ఈ సిద్ధులు. ఆస్తికునకు సిద్ధులు అక్కరలేదు.
శ్రుతిలో అవతారమును గురించిన ప్రస్తావన లేదని త్రైతమత పండితులు వాదించుచున్నారు. కాని ఇది సరి కాదు. "అజాయమానో బహుధా విజాయతే" అను శ్రుతి పుట్టుకలేనివాడు అనేకసార్లు పుట్టుచున్నాడు అనియు, “తత్ సృష్ట్వా తదేవానుప్రావిశత్” అను శ్రుతి పరమాత్మ ఈ జగత్తును సృష్టించి, ఈ జగత్తులోనికి ప్రవేశించుచున్నాడు అని చెప్పుచున్నది. ఈ ‘అనుప్రవేశ శ్రుతి’కి కూడా కొందరు అపార్థమును చెప్పుచున్నారు. వీరి ప్రకారము మొట్టమొదట పరమాత్మ పంచభూతములతో జడములను మాత్రమే సృష్టించినాడు. తరువాత తన స్వరూపమగు చైతన్యస్వరూపముతో జగత్తులోని జీవునిలో ప్రవేశించినాడు అని చెప్పుచున్నారు. ఇది సరి కాదు ఏలననగా "ఆకాశాత్ వాయుః" ఇత్యాది శ్రుతులు మొదట ఆకాశము, దాని నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి వృక్షములు, వృక్షముల నుండి జీవులు పుట్టినారని జీవుని పంచభూతముల వికారమగు అన్నము నుండి జీవుడు పుట్టుట చెప్పుచున్నది.
జీవుడే పరమాత్మ అయినచో "అన్నాత్ పురుషః" అని అన్నము నుండి జీవుడు పుట్టినాడని శ్రుతి ఎట్లు చెప్పినది. కావున ఏకాకిగా వినోదము లేని పరమాత్మ ఈ జగత్తును తన ఊహారూపముగా సృష్టించినాడు అన్నప్పుడే జీవులసృష్టి కూడా జరిగినది. ఆ సృష్టిని చూచి వినోదించి తృప్తి చెందక పరమాత్మ తానును ఒక జీవరూపమున ప్రవేశించినాడు అనియే అనుప్రవేశ శ్రుతికి అర్థము చెప్పవలెను. మరియును గీతలో ప్రకృతి రెండు భాగములని చెప్పబడినది. ఒకటి జడమగు అపరాప్రకృతి. రెండవది జీవుడు లేక చైతన్యమను పరాప్రకృతి. ప్రకృతి యనగా సృష్టి అని అర్థము. పరాప్రకృతి యనగా ఆయన సృష్టించిన పదార్థములలో జీవుడు శ్రేష్ఠుడని అర్థము.
ఈ విధముగా పరమాత్మ వినోదమను ప్రయోజనము ఒక్కటియే కాక తన భక్త జీవులకు దర్శన, స్పర్శ, సంభాషణ, సహవాసములను అనుగ్రహించి, వారిని తరింపచేయుటకై నిరంతరము జగత్తులో అవతరించుచునే ఉన్నాడు. పరమాత్మ అవతరించునప్పుడు మాతృగర్భమున జడమైన శరీరము ఏర్పడును. ఈ శరీరములో ఎట్టి గుణములు లేని శుద్ధచైతన్యము అగు జీవుడు వ్యాపించియే యున్నాడు. అయితే ఈ శుద్ధచైతన్యమును జీవుడని ఖచ్చితముగా చెప్పరాదు.
జీవుడనగా కొన్ని గుణముల సమూహము. ఈ గుణసమూహమగు జీవుడు పరమాణు ప్రమాణముతో తేజోబిందువుగా యుండును. ఈ జీవుడే యాతనాశరీరముతో పైలోకములలో కర్మఫలమును అనుభవించి మేఘము, వర్షము, భూమి యొక్క ధాన్యపుగింజ ద్వారా మాతృగర్భమున ఏర్పడిన శుద్ధచైతన్య సహితమైన జడశరీరము లోనికి ప్రవేశించుచున్నాడు. ఇక్కడ శుద్ధచైతన్యము కూడా జీవుని యొక్క స్వస్వరూపమే కావున జీవుడు అనవచ్చును గాని ఈ శుద్ధచైతన్యము ‘చేతన’ అను శబ్దముతో పిలవబడుచున్నది. పరమాత్మ అవతరించినపుడు శుద్ధచైతన్యముతో కూడిన జడశరీరము లోనికి పరమాత్మయే ప్రవేశించును. గుణసమూహమగు జీవుడు ప్రవేశించడు. కావున అవతారపురుషునకు ఎట్టి గుణములు లేనందున నిర్గుణుడై కర్మఫలములనంటక ఉండును.
★ ★ ★ ★ ★