home
Shri Datta Swami

 01 Dec 2024

 

రాధ, హనుమదాదుల పొరపాట్లు, గెలుపు ఓటములు జీవబోధ కొరకే

Updated with Part-2 on 12-Dec-2024


Part-1   Part-2


Part-1

[21-01-2003] హనుమంతుడు, రాధ, సత్యభామ, రుక్మిణి మొదలగు పాత్రలన్నియును జీవులుగా నటించుచున్న శ్రీదత్తుని వేషములే. వీరందరును జీవులకు ఆదర్శములను సాధనలో నిలుపుట ఎట్లుండును అని జీవులకు బోధించుటకై గెలుపు, ఓటములను పొందుచు, లోపమున్నట్లు నటించుచున్నవారే తప్ప నిజముగా వారిలో ఎట్టి లోపములు లేవు. కానీ, మానవులు ఈ నాటకముల నుండి గుణపాఠములను నేర్చుకొనక, నిజముగా వారిలో లోపమునట్లు భావించుచుందురు. ఒక సినిమాలో సుబ్బయ్య అను ఒక నటుడు భీమునిగాను దుర్యోధనునిగాను నటించుచున్నారు. భీముడు దుర్యోధనుని పడగొట్టెను. అనగా సుబ్బయ్య సుబ్బయ్యను పడగొట్టెనా? అక్కడ పడిపోయినది దుర్యోధనుడి వేషమే కాని నిజముగా దుర్యోధనుడు అక్కడ లేడు. అట్లే హనుమంతుడు మొదలగునవి శ్రీదత్తుని వేషములే. సత్యభామ చుప్పనాతి అని చెప్పుదురు. సత్యభామ అనునది ఒక వేషము. చుప్పనాతితనము పనికి రాదని మనకు ఉపదేశించుటయే అక్కడి ముఖ్యోద్దేశ్యము. అసలు సత్యభామ ఎవరు? భూదేవి. భూదేవికి ఉన్న సహనము ఎవరికిని లేదు. అందుకే ఆమె చుప్పనాతి సత్యభామపాత్ర వేషమునకు అంగీకరించి, అందరు నిందించుటను సహనముతో ఓర్చుకొనుటకు అంగీకరించినది. కావున పాత్రధారియైన భూదేవి చుప్పనాతి కాదు. ఇక సత్యభామ అనునది బాహ్యవేషమే. వేషమునకు చుప్పనాతితనము ఉండునా? కావున, అక్కడ చుప్పనాతి ఎవరును లేరు. చుప్పనాతివి నీవే. నీ చుప్పనాతితనము పోగొట్టుటకై ఆ వేషము వేసి నీకు బోధించవలసివచ్చెను. నీవు చుప్పనాతివని నీకు బోధించినచో నీవు అహంకారముతో అంగీకరించవు. కావున నేరుగా కాక, పరోక్షముగా బోధించుట ఒక పద్ధతి.

Swami

"కాంతా సమ్మిత తయోపదేశయుజే" అన్నారు పండితులు. అనగా భార్య ఎట్లు మెత్తమెత్తగా తియ్యగా ఉపదేశమును చెప్పునో, అట్లే జీవులకు బోధించవలెను. చుప్పనాతి ఒకరు ఇట్లు గర్వభంగము పొందెనని ఒక నాటకకథను చెప్పినచో, అది విన్న జీవుడు "చుప్పనాతితనము మంచిది కాదు" అని తెలుసుకొని, తనలోని చుప్పనాతితనమును విడచిపెట్టుటకు ప్రయత్నించును. అట్లు కాక, నీ చుప్పనాతితనమును విడిచిపెట్టమని నేరుగా బోధించినచో "నీవే చుప్పనాతివి, నీ తాతతండ్రులును చుప్పనాతులు" అని అహంకారము దెబ్బతిన్నందున ఎదురు చెప్పును. కావున, వ్యాసుడు పురాణములను కాంతావాక్కులతో పరోక్షముగా బోధించుచు, కథలను చెప్పినాడు. కావున రాధ, హనుమంతుడు, సత్యభామ మొదలగు వారి పొరపాట్లు, గెలుపు ఓటములను చెప్పినపుడు జీవులను దృష్టిలో పెట్టుకొని చెప్పినవే కాని వారిలో అట్టి లోపములు ఉండవు. హనుమంతుడు ఎవరు? శివుని అవతారము. శివుడు ఎవరు? సాక్షాత్తు దత్తుడు. కావున, జీవుల బోధ కొరకు అలా హనుమంతుడు నటించినాడే తప్ప, హనుమంతుడు పొరపాటు పడ్డాడు అన్న, సాక్షాత్తు దత్తుడే పొరపాటు పడినాడని చెప్పినట్లు అగును.

త్రిమూర్తులు కూడ దత్తుని వేషములే. కావున పురాణములలో ఒకచోట శివుడు విష్ణువును గెలిచినట్లు శివపురాణములో చెప్పబడును. నరసింహుని, శరభావతారమునెత్తి శివుడు ఓడించినట్లు వ్రాయబడినది. అచ్చట దీర్ఘకోపము పనికిరాదని జీవులకు బోధించుటకై నరసింహుడు దీర్ఘకోపమును నటించెను. అది పనికిరాదని అట్టి దీర్ఘకోపమునకు గర్వభంగము తప్పదని నిరూపించుటయే తప్ప ఇక్కడ శివుడు, విష్ణువును ఓడించెనని శైవులు గంతులు వేయుట పామరదృష్టియే. అట్లే భాగవతమున బాణాసురుని రక్షించుటకు వచ్చిన శివుని కృష్ణుడు ఓడించెను. ఇది వైష్ణవులకు ఆనందము నిచ్చుచున్నది. శివుడు ఎవరు? విష్ణువు ఎవరు? సృష్టిహర్తయే, సృష్టిభర్త. ఆ రెండూ వేషములే. వ్యక్తియగు నటుడు దత్తుడు ఒక్కడే. కావున ఓడినది, గెలిచినది దత్తుడే. వేషములు జడములు, వాటిలో గెలుపు - ఓటమి ఉండదు. అట్లే శివుడు పెరుగుచుండగా, విష్ణువు వరాహరూపమును ధరించి కిందకు, బ్రహ్మ హంసరూపమున పైకి పోయినారు. ఆయన పాదములు విష్ణువుకు, తల బ్రహ్మకు కనిపించలేదు. బ్రహ్మ శివుని తలను చూచినానని అబద్ధమును చెప్పినాడు కావున ఆయన తలను శివుడు తుంచివేసినాడు. ఇందులో అంతరార్థము పరమాత్మ అనాది, అనంతుడనియు, అసత్యము చెప్పుట పనికిరాదనియు జీవులకు బోధించుటయే. బ్రహ్మముఖమును తుంచివేయుట అనగా వేషము యొక్క ముఖమును తుంచుటయే. నిజముగా బ్రహ్మముఖమును శివుడు తుంచినచో, దత్తుడు తన ముఖమును తానే తుంచుకున్నట్లగును. "బ్రహ్మా చ నారాయణః, శివశ్చ నారాయణః" అను శ్రుతి త్రిమూర్తులు ఒక్కరేయని చెప్పుచున్నది. ఆ ఒక్కవ్యక్తియే శ్రీదత్తపరబ్రహ్మము.

 

Part-2

రాధ యనగా ధార. ధార యనగా తన సాధనలో ఎట్టి పరీక్షలోను ఓడిపోక, కుంటుపడక, ఆగిపోక ఎన్ని బలమైన అడ్డంకులు వచ్చిననూ మహాతీవ్రమైన వేగముతో ఉప్పొంగి, వాటిని అతిక్రమించి పరమాత్మను చేరిన మహాప్రవాహము. సృష్టి మొదలు ఇంతవరకును ఏ జీవునకు ఆ స్థానము లభించలేదు. ఒక కళాశాలలో బంగారుపతకము ఒక విద్యార్థికే లభించును. అట్టి బంగారుపతకము పొందినది రాధ. 14 లోకములకును పైన ఉన్నది గోలోకము. ఆ గోలోకమను శ్రీ మత్సింహాసనమును అధిష్ఠించిన సామ్రాజ్ఞియే రాధ. ఆమెయే లలిత యని పిలువబడుచున్నది. లలిత యనగా చాలా తక్కువ బలము కలది అని అర్థము. ఈ జగత్తు అంతయు స్వామి యొక్క ఊహయే. ఊహ యొక్క బలము ఊహించు వ్యక్తి యొక్క బలముతో పోల్చినచో చాలా తక్కువ. ఈ సమస్త జగత్తు స్వామి యొక్క ఊహ. ఈ ఊహాజగత్తులో ఒక బిందువు మాత్రమే జీవుడు. ఈ జగత్తులో జడము, చైతన్యము అను రెండు భాగములున్నవి. అవియే అపరాప్రకృతి, పరాప్రకృతి. జగత్తుకు ప్రతినిధిగా మానవుడు కూడా జగత్తులోనే ఉన్నాడు. మానవునిలో కూడా జడమగు శరీరము, చైతన్యమగు జీవుడు ఉన్నారు. ఊహాసముద్రమగు ఈ జగత్తులో మానవుడు ఒక చిన్న నీటిబిందువు కావుననే ఈ మానవుడు చాలా బలహీనుడు అమిత దుర్బలుడు. కావున మానవుడు లలిత యనబడు చున్నాడు. రాధ కూడా ఒక మానవాకారము కావున లలితయే. ఇట్టి మానవుడు పరమాత్మయుండు పదునాలుగవలోకమగు బ్రహ్మలోకమునకుపైన ఉన్న గోలోకమున శ్రీమత్సింహాసనమున ఆశీనురాలైన లలితయగు రాధయొక్క చరణములక్రింద దత్తపరబ్రహ్మము యొక్క శిరస్సు ఉండు స్థానమును ఆక్రమించినాడు. రాధను ఒక మానవరూపము ఉన్న స్త్రీగా తీసుకొనుటలో అంతరార్థము మానవరూపములో యున్న జీవులందరు అనియే అర్థము. ఈ స్త్రీ-పురుషరూపమున ఉన్న మానవులందరును ప్రకృతిరూపులే. ప్రకృతియనగా స్వామి చేసిన శ్రేష్ఠమైన కార్యము అని అర్థము.

ఒకడు ఒక పెద్ద భవనమును నిర్మించినపుడు ఆ భవనమును వాడు చేసిన కార్యము అని చెప్పుదురు. ఆ భవనములో యున్న ఒక చిన్నగోడయు వాడు చేసిన పనియే అగును. భవనమంతయును సిమెంటు ఇసుకలతో నిర్మింపబడినట్లే ఆ చిన్నగోడ కూడా సిమెంటు ఇసుకలతోనే నిర్మించబడి యున్నది. అట్లే పర-అపరాప్రకృతులతో నిర్మించబడిన ఈ జగత్తు అను భవనము ఎట్లు స్వామి కార్యమగు ప్రకృతి అనబడుచున్నదో ఈ జగద్భవనములో ఒక చిన్నభాగమగు మానవుడు అన్న చిన్నగోడ కూడ పరా-అపరాప్రకృతులచే నిర్మింపబడి స్వామికార్యమగు ప్రకృతియే అగుచున్నది. ఈ అర్థమునే రామానుజాచార్యుడు "తత్త్వమసి" అను మహావాక్యముయొక్క భాష్యములో "స్ధూల చిదచిద్విశిష్ట విశ్వము" అన్ననూ "సూక్ష్మ చిదచిద్విశిష్ట" మానవుడన్ననూ ఒకటియేనని విశిష్టాద్వైతవాదమున వినిపించినాడు. అనగా తత్త్వపరముగా సముద్రము మరియు నీటిబిందువు రెండూ నీవే యనుట. కావున లలిత యనగా అతి బలహీనమైన ఒక మానవుడు రాధ యనగా అట్టి మానవుడు నిరంతర భగవత్ర్పేమ ధారస్వరూపుడై తన సాధనలో అన్ని దత్తపరీక్షలను దాటినవాడని అర్థము. అట్టి జీవునకు దత్తుడు దాసుడై వాని చరణములను నెత్తిమీద పెట్టుకొనుటయే గోలోకము యొక్క అంతరార్థము. దత్తపరీక్షలలో ముఖ్యతత్త్వము ఏమన ప్రతివస్తువు కన్నను, ప్రతివ్యక్తి కన్నను, చివరకు సర్వాధికమైన ధర్మము కన్నను స్వామికే ఎక్కువ విలువనిచ్చుట. చివరకు నీ ప్రాణములతో స్వామి పోటీ పడినపుడు కూడా ప్రాణములకన్నను స్వామి ఎక్కువయని నిరూపించు మరణమే భక్తియొక్క దశావస్థలలో చిట్టచివరిదియగు ‘మరణం తతః’ అని చెప్పబడినది. ఈ ప్రాణత్యాగపరీక్షలో గెలువవలయునన్నచో, దాని ముందు భగవత్ర్పేమ ఉన్మాదావస్థకు రావలయును. అందుకే మరణావస్థకు ముందు తొమ్మిదవమెట్టు ఉన్మాదమని "ఉన్మాదో మరణం తతః" అని చెప్పబడినది. ఇట్టి ఉన్మాదావస్థలో ప్రహ్లాదుడు ప్రాణత్యాగమునకు హిరణ్యకశిపుని హింసలకు సిద్ధమైనాడు. మరియును "జీవతో వాక్యకరణాత్‌" అను ధర్మమును సైతము ఉల్లంఘించి ధర్మము కన్నను స్వామికి విలువనిచ్చినాడు. ఈ విధముగా దత్తపరీక్షలలో దత్తుడు ధర్మముతో పోటీ పడినపుడు మహభక్తులు సైతము ఒక్కొక్కసారి స్వామి కన్నను ధర్మమునకే ఎక్కువ విలువనిచ్చి పరమపదసోపానపటములో ధర్మము అను మహాసర్పము యొక్క నోటిలో పడి క్రిందకు జారినారు. అనగా చిట్టచివరి పరీక్షలో తప్పి వారి భగవత్ర్పేమ ప్రవాహము కుంటుపడి సాగకపోవుటవలన నిరంతరధార కానందున రాధాతత్త్వమును పొందలేకపోయినారు. కావుననే సర్వాధికమైన గోలోకమునకు ఆధిపత్యము అను కైవల్యమునకు మించిన ఫలమును పొందలేకపోయినారు.

అద్వైతకైవల్యమనగా బ్రహ్మత్వమును పొంది బ్రహ్మముతో సమానుడైన దత్తపరబ్రహ్మమే తానై బ్రహ్మలోకము నందుండుట, కానీ గోలోకనివాసము బ్రహ్మమునకే స్వామియై బ్రహ్మమునే దాసునిగా చేసుకున్న సర్వోత్తమస్థానము. లోకపాలకులగు దేవతలు రాజులు అనబడుదురు. అట్టి దేవతలకు దేవుడగు దేవదేవపదవియగు దత్తపరబ్రహ్మమే రాజరాజు. అట్టి దత్తపరబ్రహ్మమునకు స్వామిగా నిలుచుటయే ఈశ్వరీపదవి. దీనినే రాజరాజేశ్వరి అందురు. దేవతలు తేజోరూపులగుట వలన శ్రీమంతులు అనబడుదురు. అట్టి వారికి దేవుడగుటయే దేవదేవపదవియగు శ్రీమత్సింహాసనము. అట్టి దేవదేవుని శాసించు ఈశ్వరపదవియే శ్రీమత్సింహాసనేశ్వరి. ఈ స్థానము అన్ని దత్తపరీక్షలలో గెలిచి ఎచ్చటను ఆగని నిరంతర ప్రేమధారయగు రాధకే చిక్కినది.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch