home
Shri Datta Swami

 27 Feb 2025

 

భగవంతుని చేరే మార్గము

Updated with Part-2 on 28 Feb 2025


Part-1   Part-2 


Part-1

[05-01-2004] వేదము, భగవద్గీత ఈ రెండును సాక్షాత్తు భగవంతుని దివ్యవాణి. భగవంతుని చేరే మార్గము ఏమి? భగవంతుని ఏ స్వరూపములో మనము ఆరాధించాలి? అనే రెండు ప్రశ్నల మీద మన రెండు కన్నులు పెట్టి దృష్టి సారించాలి.

భగవంతుని చేరే మార్గము కర్మయోగము లేక సేవ. ఇది రెండు భాగములుగా యున్నది. ఒకటి – కర్మసంన్యాసము. అనగా మనము మన కుటుంబ నిమిత్తము నిత్యము అనేక కర్మలను చేయుచున్నాము. ఆ కర్మలు చేయగా మిగిలిన సమయము కొంత విశ్రాంతి తీసుకొనుచున్నాము. ఈ కుటుంబ నిమిత్తమైన కర్మ సమయము, విశ్రాంతి సమయము పోను మిగిలిన సమయమును మనము వ్యర్థములైన ప్రసంగములు, కబుర్లు చెప్పుకొనుట ,సినిమాలు చూచుట, కథల పుస్తకములు చదువుట మొదలగు వానితో వ్యర్థము చేయుచున్నాము. ఈ వ్యర్థము చేయు సమయములో భగవంతుని కార్యము కొరకు కర్మను చేయుట సాధనములో మొదటిదశ. ఇక సాధన రెండవదశలో ఈ కర్మ చాలక కుటుంబ నిమిత్తము చేయు కర్మ తగ్గించుకొని, దానిలో కూడ కొంత భాగమును భగవంతునికై కర్మ చేయుట. ఇక మూడవదశలో కుటుంబమునకు, తనకు కావలసిన అన్నపాన వస్త్రాదులు ఏర్పడినచో, మొత్తము సమయమును భగవంతుని కర్మ కొరకే వినియోగించుట. ఈ మూడు దశలు వరుసగా అధమ, మధ్యమ, ఉత్తమదశలు. కుటుంబ కర్మ, విశ్రాంతి పోను మిగిలిన సమయమును వ్యసనములందు వినియోగించు వాడు మరీ అధముడు అట్లు భగవంతునకు ఇటు కుటుంబమునకు ఏ పనిచేయక పూర్తిగా వ్యసనములయందే నిమగ్నుడై భోగించువాడు మరీ మరీ అధముడు. అట్టి మరీ మరీ అధమునికి అన్నపాన వస్త్రాదులు ఏర్పడియున్నచో భగవత్కర్మ చేయమనియు, అట్లు అన్నపాన వస్త్రాదులు ఏర్పడక యున్నచో, వాటి కొరకు ముందు కర్మను చేయమనియు వేదము, గీత బోధించుచున్నవి.

భగవంతునికి చేయు కర్మ, కర్మయోగమనియు, కుటుంబము కొరకు చేయు కర్మ కర్మయనియు అందురు. కావున సాధకుడు ఏ దశలో యున్ననూ, కర్మనో, కర్మయోగమునో చేసి తీరవలయును. కర్మయోగము గాని, కర్మగాని కర్మశబ్దము చేత చెప్పబడును. కావున సాధకుడు ఏ దశలోనైనను కర్మాధికారియే. వేదము దీనినే ‘కుర్వన్నేవేహ కర్మాణి’ అని చెప్పుచున్నది. అనగా ఈ లోకములో నీవు జీవించి యున్నంత వరకు కర్మయోగమును తప్పక ఆచరించవలయును. ఇక అవసరమును బట్టి కర్మను ఆచరించవలయును. మొత్తము మీద జీవిత కాలమంతయు కర్మతోనో, కర్మయోగముతోనో మానవుని జీవితము గడిచితీరవలయునని భగవద్గీత చెప్పుచున్నది. ‘నహి కశ్చిత్ క్షణమపి’, ‘జాతు తిష్ఠత్యకర్మకృత్’ అనెడి శ్లోకము ద్వారా, జీవుడు ఒక్క క్షణము కూడ కర్మ చేయకుండా ఉండజాలడు అని గీత ధృవీకరించుచున్నది. అయితే, ఆ కర్మ అవసరమును బట్టి చేయవలెను.

Swami

అన్నపాన వస్త్రాదులు అవసరమైనచో కుటుంబకర్మను తప్పక చేయవలయును. అన్నపాన వస్త్రాదులు అవసరములేనిచో అంతకు మించిన ధనము కొరకు కర్మను ఆచరించకూడదు. భగవత్కార్యమగు కర్మయోగమునే చేయవలయును. కావుననే గీత ‘శరీరయాత్రాపి చ తే’ అంటూ, శరీరయాత్ర కొరకు కావలసిన అన్నపాన వస్త్రాదులను సంపాదించుకొనుటకు మాత్రము తప్పనిసరియగు కర్మను చేయుము అని అర్థమును చెప్పుచున్నది. వాటి అవసరములేనిచో నీ జీవితము అంతయు భగవత్కార్యము కొరకు కర్మయోగమునే చేయుము అని ‘మత్కర్మ పరమో భవ – యదర్థమపి కౌంతేయ’ మొదలగు అనేక శ్లోకములలో భగవద్గీత కర్మయోగమును బోధించుచున్నది. సంన్యాసి యనగా అవసరములేని కర్మను త్యజించి కర్మయోగమను కర్మను చేయుటయే తప్ప, ఏ కర్మయు చేయక సోమరిగా తిరుగుచూ ముక్కు మూసుకొని కూర్చుండుట కాదు.

సంన్యాసి యనగా అన్నపాన వస్త్రములు సిద్ధించియుండగా అనంతమైన ఆశతో కుటుంబకర్మను చేయక భగవత్కార్యమగు కర్మయోగమును ఆచరించువాడు. సంన్యాస శబ్దమునకు రెండు అర్థములున్నవి. విడచిన వాడు అని ఒక అర్థము, బాగుగా ఆసక్తుడైనవాడు అని మరియొక అర్థము. మొదటి అర్థములో అన్నపాన వస్త్రములు ఏర్పడియున్నపుడు అనవసరమైన కుటుంబకర్మను విడచినవాడు అని అర్థము. రెండవ అర్థములో భగవత్కార్యమగు కర్మయోగములో బాగుగా ఆసక్తుడైనవాడు అని అర్థము. ఈ రెండు అర్థములను నిర్వర్తించినవాడే సంన్యాసి. దీనినే భగవద్గీత ‘కర్మ సంన్యాసాత్ కర్మయోగో విశిష్యతే’ అని చెప్పినది. అనగా సంన్యాసిగా మారి సర్వకర్మలను త్యజించుట కాదు. అవసరములేనిచో కుటుంబకర్మను వదలి పూర్తిగా కర్మయోగమును ఆచరించవలయును. ‘న కర్మణా మనారంభాత్’ అని, సంన్యాసమనగా ఏ కర్మ చేయకపోవడము కాదు అని గీత చెప్పుచున్నది. అన్నపాన వస్త్రాదులు సిద్ధించియున్నను అనంతముగా కుటుంబకర్మ చేయుటకు కారణము నీ సంగములో నిత్యముగా యున్న కుటుంబ బంధములపై వ్యామోహమేనని, ఆ వ్యామోహమును తెంచుకున్నచో, నీవు అవసరమైన కర్మయే చేయుదువని గీత ‘ముక్తసంగః సమాచర, సంగం త్యక్త్వా కరోతి యః’ అని చెప్పుచున్నది. అనగా వ్యామోహ కారణమగు సంగము తెంచుకొని అవసరమైనమేరకే కర్మలు చేయుము అని అర్థము. కావున అన్నపాన వస్త్రాదులకు లోకముపై ఆధారపడు సంన్యాసి జ్ఞాన భక్తి ప్రచారమను కర్మయోగమును నిరంతరము ఆచరించవలమును.

 

Part-2

2) కర్మఫలత్యాగము: ఈ జ్ఞానము తెలిసిన ఈ దినము నుండి ఇంట్లో ఆచరించినచో ఇక నుండి నీకు ఎట్టి పాపము అంటదు. కాని గడచిన కాలములో అనంతమైన ఆశతో అన్నపాన వస్త్రములకు మించి కుటుంబకర్మను చేసి అధిక ధనమును కూడ పెట్టిన పాపము ఎట్లుపోవును? ఇప్పుడు పాపకర్మలను చేయకున్నచో ఇప్పుడు పాపము రాదు. కాని పూర్వమున చేసిన పాపము పోదు. చేసిన పాపమునకు శిక్షను అనుభవించుటగాని, ప్రాయశ్చిత్తము గాని చేసుకొనవలయును.

ఇక ప్రాయశ్చిత్తము ఎట్లు చేసుకొనవలెను? కర్మఫలము కర్మ యొక్క రూపాంతరమే. ఒక గంట పనిచేసి వందరూపాయిలు సంపాదించినాడు. ఆ వంద రూపాయిలు నీవు గంటసేపు చేసిన పని యొక్క రూపమే. ఆ వంద రూపాయిలను భగవత్కార్యమునకు త్యాగము చేసినచో, నీవు చేసిన గంట పనియు భగవత్కార్యమునకు వినియోగించినట్లే. అనగా నీవు చేసిన ఆ గంట పని కర్మయోగమే అగును. ఆ వందరూపాయలను నీవు అవసరము లేకపోయినను కుటుంబమునకే ఇచ్చినచో ఆ గంట పని కర్మ శబ్దమునకు యోగ్యముకాదు. కర్మ యనగా కుటుంబమునకు కావలసిన అన్నవస్త్రాదులకై చేయు పని. కావున ఆ గంట పని వికర్మ అనబడుచున్నది. వికర్మయనగా నీకు శిక్షను అందించు పాపకర్మ. కావున నీవు అధికముగా సంపాదించిన ధనమును అనగా నీ కర్మఫలమును భగవత్కార్యమునకై అనగా కర్మయోగమునకై త్యాగము చేసినపుడు, నీవు ఆ ధనమును సంపాదించుటకై చేసిన వికర్మ కర్మయోగముగా మారిపోవును. అనగా నీవు చేసిన పాపకర్మ భగవదనుగ్రహమును సంపాదించు కర్మయోగముగా మార్చబడుచున్నది. ఇచట పాపకర్మను రద్దుచేయుటకాదు. పాపకర్మ దైవానుగ్రహమును సంపాదించు పుణ్యకర్మగా మారుచున్నది. అనగా మైనస్ (-) జీరో (0) అగుట కాదు ప్లస్ (+) గా మారుచున్నది. కావున ధర్మశాస్త్రములు అన్నియు ‘కాంచనమ్ కర్మమోచనమ్’ అని దానముల యొక్క గొప్పదనమును వర్ణించుచున్నవి.

అయితే దానము అపాత్రదానము కారాదు. అపాత్రదానము చేసినచో అది మరియొక పాపము, కావున పాపము రెండింతలగును. అధిక ధనమును సంపాదించిన పాపఫలముతో పాటు అపాత్రదానము చేసిన పాపకర్మ చేరినందున పాపఫలము పెరుగుచున్నది. వెనుక బొక్కాయను ఇంటిపేరు గలవారు పీఠము వారిని పిలుచుకొని ధనమును ఖర్చు చేసుకొని ఇంటి పేరు మార్పించుకొనిరు. పీఠము వారు ఇంటి పేరును ‘బ్రహ్మాండము’ అని మార్చినారు. ఆనాటి నుండి జనులు ‘బ్రహ్మాండము బొక్కావారు’ అని పిలవసాగిరి. కావున ధనమును ఖర్చు చేసుకొని మామూలు బోక్కాను పెద్దబోక్కాను చేసుకొన్నట్లైనది.

దానమునకు పాత్రులు పనిచేసుకొనలేని పేదవారు. వారికి దానము చేసి దైవభక్తిని కూడ బోధించవలయును. దైవ సంబంధములేని కేవల దానము అనిత్యములగు స్వర్గాదుల నిచ్చునే కాని, నిత్యమగు బ్రహ్మలోకమును ప్రసాదించలేదు. దాన కార్యములు చేయు నాస్తికులకు ఇదే గతి. ఆ పుణ్య ఫలము క్షీణించగనే తిరిగి పశపక్ష్యాది జన్మలను పొందుదురు. కావున కేవలము బీదవారి కన్నను, భక్తుడగు బీదవాడు, ఇంకను వారికన్నను పరిపూర్ణ జ్ఞానియైన అవతార పురుషుడు అత్యుత్తముడు. అతడు సర్వఙ్ఞడు కావున దానమున ఎట్టి పొరపాటు జరుగదు. గీతలో ‘ఆర్తో జిజ్ఞాసు రర్ధార్ది జ్ఞానీ చ భరతర్షభ ఉవారా స్పర్వైతే తే జ్ఞానేతకవా తైవమేతమ్’ అనగా దానమునకు యోగ్యలగు పాత్రులలో ఆర్తుడైన బీదవాడు మొదటివాడు. ఆ తరువాత బీదవాడగు దైవజ్ఞానమునకు ప్రయత్నించు వాడు పాత్రుడు. ఆ తర్వాత పరమార్థమగు దైవమును తపనతో అర్థించు భక్తుడు యోగ్యుడు. అందరి కన్నను జ్ఞాని పరమ యోగ్యుడు. ఏలయనగా అట్టి పరిపూర్ణ జ్ఞాని నేనే అని అర్థము. అందుకే శ్రీకృష్ణుడు శమంతకమణిని తనకు ఇమ్మని కోరినాడు. అట్టి అవతార పురుషుని కన్నయోగ్యుడు లేడు కావుననే శిరిడిసాయి అందరిని దక్షిణలను కోరినాడు. కర్మఫల త్యాగము యొక్క గొప్పతనమును గీతలో భగవానుడు అత్యుత్తమమును గూర్చి ఇలా వచించాడు. ‘జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగం’ జ్ఞానము కన్నను భక్తి గొప్పది. భక్తి కన్నను కర్మఫల త్యాగము గొప్పది. ‘త్యాగాత్ శాంతి రనంతరమ్’ అనగా త్యాగమునకు మించినది ఏదీలేదు అని అర్థము. ‘సర్వ కర్మఫల త్యాగమ్, ప్రాహుత్యాగమ్, యస్తున ఫలత్యాగీ’ మొదలగు శ్లోకములా గీతలో అడుగు అడుగును కర్మసంన్యాసముతో పాటు కర్మఫల త్యాగమును ఘోచించుచున్నవి.

వేదము కూడా ‘ధనేన త్యాగేనైకే’ అని కేవలము కర్మఫల త్యాగమే పూర్వ పాపమును బోగొట్టి భగవదనుగ్రహమును సంపాదించుచున్నదని చెప్పుచున్నది. ఇట్టి పాపమునకు కారణములు కూడా వేదము చెప్పుచున్నది. ‘మాగృఢః కశ్చత్ ధనం’ అనగా ఈ జగత్తు అంతయు ఈశ్వర ధనమే, నీవు అన్నపాన వస్త్రాదుల వరకే కాక పెచ్చు ధనమును తీసుకొనుటకు ఈశ్వర అనుమతి లేదు కావున అది దొంగతనమను పాపము అని చెప్పుచున్నది. గీతలో కూడా ‘యో భుంక్తే స్తేన ఎవసః’ అనగా దైవకార్యమునకు త్యాగము చేయకుండా అధిక ధనమును ఎవడు భుజించునో వాడు దొంగ అని పై మంత్రార్ధమునే చెప్పుచున్నది.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch