23 Mar 2025
[11.11.2002] అవతారము అనగా క్రిందకు దిగుట. అవతారము తత్త్వములో ఎట్టి మార్పు రాదు. పై అంతస్థులోని వజ్రము, క్రింద అంతస్థు లోనికి దిగినంత మాత్రమున గులకరాయి కాదు. అట్లే జీవుడు సాధన ద్వారా పరమాత్మతో కైవల్యము చెందినంత మాత్రమున పరమాత్మ కాజాలడు. అద్వైతకైవల్యము ఆవేశమే, అనగా పూనకమే. ఈ పూనకము పోగానే మరల జీవుడు యథాస్థానమునకు చేరును. క్రింది అంతస్థులో యున్న గులక రాయి, పై అంతస్థులోనికి ఎక్కినంత మాత్రమున అది వజ్రము కాజాలదు. అది వజ్రము వలె తళతళ మెరయవచ్చును. కాని దానికి జ్ఞానులు వజ్రము యొక్క విలువను ఈయజాలరు. జీవునకు అద్వైతకైవల్యము నిచ్చుట, తానొక జీవునిగా అవతరించుట, ఈ రెండునూ మార్పుపై కల ప్రీతిని ఆధారము చేసుకొని యుండును. మేడలో నున్న రాజు కొంతకాలము కుటీరములో యుండకోరును. అతడు కుటీరమునకు అవతరించినంత మాత్రమున పేదవాడు కాజాలడు. అట్లే బీదవాడు మార్పు కొరకు మేడ నెక్కి కొంతసేపు మేడలో కూర్చున్నంత మాత్రమున రాజు కాజాలడు. ఇరువురికీ మార్పుపై మోజు తీరగనే ఎవరి స్థానములో వారు చేరుదురు. ఈ మార్పే జగద్వివినోదక్రీడగా లీలానందమును పరమాత్మకు కలుగచేయును.
ఈ క్రీడయే సృష్టి యొక్క ప్రయోజనము. నాటకము కొరకు ఎట్లు స్టేజి, తెరలు, లైట్లు సమకూర్చబడునో ఈ లీలావినోదము కొరకు అట్లే పంచభూతములు సృష్టించబడినవి. ఈ పంచభూతములు పరమాత్మ యొక్క సంకల్పస్వరూపములే. సంకల్పము అనగా మనస్సు. సంకల్ప వికల్పాత్మకమే మనస్సు అని శాస్త్రము చెప్పుచున్నది. మనస్సు (mind), చైతన్యము (awareness) యొక్క స్వరూపము (form). ఈ మనస్సు నుండి అనగా చైతన్యము నుండి జడములైన పంచభూతములు సంభవించుచున్నవి. చైతన్యధర్మముల కన్న, జడముయొక్క ధర్మములు (properties) భిన్నముగా యున్నవి. అయితే ఒక ధర్మము నుండి మరియొక ధర్మము ఎట్లు పుట్టుచున్నది? ఉప్పు నుండి కారము ఎట్లు పుట్టుచున్నది? కారము నుండి పులుపు ఎట్లు పుట్టుచున్నది? రెండు ధర్మములు కలిపిన మూడవ ధర్మము ఏర్పడవచ్చును.
సున్నము, పసుపు కలిపి పారాణి ఏర్పడుచున్నది గదా (తెలుపు+పసుపు=ఎరుపు). కాని కేవలము సున్నమునుండి గాని, కేవలము పసుపునుండి గాని పారాణి ఏర్పడదు. సంకల్పము అనునది ఒక ధర్మము. జడము ఒక ధర్మము. ధర్మము అధిష్ఠానము (ధర్మి, base) పై ఆధారపడి యుండును. ధర్మము స్వయముగా నిలువజాలదు. కారము మిరపకాయపై ఆధారపడి యుండును. మిరపకాయ నుండి కారమును వేరు చేయజాలము. పప్పులో మిరపకాయను వేసి ఆ మిరపకాయను తీసివేసినపుడు పప్పులోనికి కారము వచ్చినది గదా, కాన మిరపకాయను విడచి కారము ఉన్నది గదా అనరాదు. కారము మిరపకాయను విడచిననూ పప్పును ఆశ్రయించియున్నది. కావున మిరపకాయను, పప్పును విడచిన కారము ఎచ్చటను కనిపించదు. కావున ఒక ధర్మము మరియొక ధర్మము కాజాలదు.
పరిణామము (modification):- కాని చైతన్యము అను ధర్మము జడము అను ధర్మముగా మారినది. ఇది పరిణామము. ఈ పరిణామము విచిత్రము (wonderful). కాన మాయ అనబడును. మాయ శబ్దము "మయ – వైచిత్ర్యే" అను అర్థములో ‘మయ’ ధాతువు నుండి వెలువడినది. మాయ శబ్దము మయ అనే ధాతువు నుండి ఏర్పడినను, ‘ఊహించుటకు వీలుకానిది’ అను అర్థమే వచ్చును. విచిత్రము ఊహకు అందదు కావున రెండు అర్థములూ ఒకే తాత్పర్యమును బోధించుచున్నవి. ఈ అర్థమునే రామానుజాదులు ప్రతిపాదించినారు. శంకరులు మాయ శబ్దమునకు "యా మా సా మాయా" అని నిర్వచనము (definition) చెప్పినారు. అనగా స్వయముగా లేనిది (non-existing) అని అర్థము. ఈ అర్థము కూడ సరియైనదే. ఏలననగా చైతన్యము జడముగా పరిణమించినపుడు ఆ జడమైన పంచభూతములు కలసి ఆ చైతన్యములో ఒక చిన్న బిందువు మాత్రమే అగుచున్నవి.
ఇంకనూ సత్యముగా చెప్పవలెనన్నచో చైతన్యము తేజస్సు యొక్క అనంత కిరణములలో ఒక్క కిరణము మాత్రమే. ఈ పంచభూతములకు సంబంధించి "పాదోఽస్య విశ్వాభూతాని" అని శ్రుతి చెప్పబడినది. అస్య = ఈ చైతన్యము యొక్క; పాదః = ఒక్క కిరణమే; విశ్వాభూతాని = విశ్వముగా మారిన ఈ పంచభూతములు అనగా భూతాత్మకమైన ఈ జగత్తు అని అర్థము. ఇచ్చట రామానుజాదులు చెప్పు పరిణామవాదమును స్వీకరించవలెను. పరిణామము అనగా ఒక దాని నుండి దాని కన్న భిన్నమైన (different) రెండవది పుట్టుట. ఇది అసంభవమే, కాని పరమాత్మ విషయమున సంభవమైనది. కావుననే మనకు విచిత్రమై మాయమైనది. రెండవది పుట్టలేదు అన్నచో సృష్టి జరగలేదు అను అర్థము వచ్చును. అప్పుడు పరమాత్మకు "సృష్టికర్త" అన్న బిరుదము అసత్యమగును.
అయితే చైతన్యము జడముగా మారినప్పుడు పరమాత్మ తన ధర్మమును కోల్పోడు. కాని, అన్య ధర్మమును పొంది వికారమునకు గురియైనాడా? అన్న సంశయము వచ్చును. ఇట్టి సంశయమును నివారించుటకే శంకరులు, రెండవ ధర్మము (creation) "అసలు లేదు" అని అన్నారు. ఇదే "యా మా సా మాయా". ఈ విధముగా ద్వైతులకు, అద్వైతులకును వాదభేదము ఏర్పడినది. దీనిని శ్రీదత్తగురువు ఇట్లు సమన్వయించుచున్నారు.
సమన్వయము (Correlation):- పరిణామము నిజమే. రెండవ ధర్మము పుట్టినది. రామానుజాదుల మతము సత్యమే. రెండవ ధర్మము, మొదటి ధర్మము (God or Paramatman) ముందు అత్యల్పము (negligible). అత్యల్పము అభావముగా (non-existing) పరిగణింపబడును. పాలసముద్రమున ఒక బొగ్గురేణువు పడినంత మాత్రమున తెల్లని పాలసముద్రము నల్లదియగునా? అత్యల్పమైనది దాదాపు లేనట్లే. కావున శంకర వాదమును సత్యమే. ఈ విధముగా జడమైన విశ్వము నందు పరమాత్మ యొక్క మనస్సు అను చైతన్యము నానా జీవ రూపములుగా ప్రవేశించి యున్నది. కావున ఈ జగత్తును సృష్టించిన చైతన్యము యొక్క స్వరూపమే జీవుడు. అయితే ఈ జీవుడు అనుభవించు సుఖదుఃఖాది వికారములన్నియు (feelings) పరమాత్మ మనస్సుకు అంటుచున్నవా? లేదు, లేదు. ఈ జీవులందరును జగత్తులో ఒక భాగమే. జగత్తే అత్యల్పమైన ఒక పరమాణువైనప్పుడు దానిలోని భాగమగు ఈ జీవుడు పరమాణువులో పరమాణువు అగును. కావున ఈ జీవుడు శంకరవాదమును అనుసరించి ఉన్నయునూ లేనట్లే గదా.
కావున పరమాత్మ మనస్సు (mind of God) ఈ జీవుల అనుభూతి ద్వారా కలుషితము కాదు. అయితే ఈ జీవుడు ఆనందించినపుడు ఆ ఆనందాంశ పరమాత్మ యొక్క అఖండానంద స్వరూపమును అంటుచూ, పరమాత్మకు ఆనందము నిచ్చుచున్నది. కావున జీవులకు దుఃఖనివృత్తిని కలుగచేసి ఆనందమును అందించువారు పరమాత్మను నిజముగా ఆనందపరచుదురు. ఆనందము చైతన్యమునకే కలుగును గాని జడమునకు కలుగదు. కావున చైతన్యమైన పరమాత్మ మనస్సునకు ఆనందము కలుగచేయవలయునన్నచో చైతన్య స్వరూపులైన జీవులకు ఆనందము కలుగుచేయు ప్రయత్నము చేయవలయును. కాని అట్టి ప్రయత్నములను జడములకు చేయుట అవివేకము. అర్హుడగు ఆకలిగొన్న వానికి, లేక ఆకలి గొన్న ప్రాణికి క్షీరము అర్పించుట నిజమైన క్షీరాభిషేకమగును. అంతే కాని క్షీరమును మట్టిపాలు చేయుట అవివేకము. ఇది అజ్ఞానమునకు పరాకాష్ఠ (climax of ignorance). అట్టి జఠరాగ్నిలో ఆహారమును అందచేయుట యజ్ఞము. జడమైన అగ్నిలో వేసి కాల్చి అన్నమును వ్యర్థము చేయువాడు మరజన్మలో అన్నము లభించక అలమటించును.
★ ★ ★ ★ ★
సూచన:- ఆధ్యాత్మిక జ్ఞానప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే ‘జ్ఞానయజ్ఞేన తేనాహమ్’ అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మికజ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించడమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడ నెలకొల్పుతుంది. కాబట్టి, శ్రీదత్తభగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞానప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు.
∥ జయ దత్తస్వామి ∥