home
Shri Datta Swami

 24 Dec 2024

 

నిజమైన ప్రేమయే నిస్స్వార్థ భక్తి

Updated with Part-3 on 26 Dec 2024


Part-1   Part-2   Part-3


Part-1

[07.01.2003] పరమాత్మ బ్రహ్మ, విష్ణు, శివాత్మకుడైన త్రిమూర్తి స్వరూపుడు. అట్లే జీవుడును త్రిమూర్తి స్వరూపుడే. జీవునిలో గల త్రిమూర్తులు అసూయ, అహంకారము, మమకారము. అహంకారము చేత అసూయ మరియు మమకారము ఏర్పడుచున్నవి. మమకారమునే స్వార్థము అందురు. జపము, ధ్యానము, భజన మొదలగు వాటి కన్నను సేవ అత్యుత్తమమే. కానీ సేవ కూడా ఏ ప్రతిఫలమును కోరక స్వార్థము లేనిదై యుండవలయును. జపము, ధ్యానము, భజన మొదలగునవి అత్యల్పమైన ఫలములు కలవి. సేవకు ఫలము చాలా ఎక్కువ. ఈ జపధ్యానాదులు సేవతో కూడినప్పుడు అన్నముతో పాటు వడ్డించిన ఆధరువుల (కూర మొదలగునవి) వలె సార్థకములగును. అయితే అన్ని కూరలతో కలపిన అన్నము వడ్డించినాము. అన్నింటిలోను నేతిని ఒక్కొక్క చుక్క చొప్పున వేసి అభిఘారము చేసినచో వాటి యొక్క రుచి మరియు శుచి ఎక్కువగా పెరుగును. అట్లే కూరతో అన్నము కలిపినప్పుడు ఒక మిల్లి నేయిని వేయగా అది రుచిని పెంచి జిహ్వకు ప్రీతిని కల్గించుచు బలమును చేకూర్చుచున్నది. ఇదే విధముగా జపము, ధ్యానము, భజన మొదలగు కూరలలోను సేవయను అన్నములోను నిస్వార్థమను నేతిని వేసి అభిఘరించుము. వాటితో కలిపి సేవను చేయుట అనగా కూరలను అన్నముతో కలిపి భుజించుట. అప్పుడు కూడా నిస్స్వార్థమను నేతిని అందు వడ్డించుకొనుము. అది పరమాత్మకు ప్రీతికరమగును. నీ సాధనకు బలకరమగును. అట్లుకాక కూరలలోను, అన్నములోను విషమును వేసి అభిఘరించినచో మరియు వాటితో కూడిన అన్నమును భుజించునప్పుడు ఒక మిల్లి విషమును వేసిన ఏమగును? విషము వలన జిహ్వ మండుటయే కాక మరణము సంభవించును. అట్లే జపము, ధ్యానము, భజన మొదలగు కూరలతో కలసిన సేవయను అన్నములో స్వార్థమను విషము ఒక మిల్లి మాత్రము వేసినను అది పరమాత్మకు అసహ్యమై నీవు ఇంతవరకు చేసిన సాధన అంతయును నశించును. స్వార్థము అనగా మమకారము సర్వలౌకిక ప్రేమలలో ప్రాణముగా వ్యాపించియున్నది. యాజ్ఞవల్క్యుడు సంన్యసించి పోవుచుండగా, మైత్రేయి, గార్గేయి వెంట పడినారు. మీరేల వచ్చుచున్నారని ముని అడిగెను. నీవు మాకు ప్రియుడవు కావున మేము నీవెంట వచ్చుచున్నామని ఆ ఇద్దరు భార్యలు పలికిరి. దానికి యాజ్ఞవల్క్యుడు ఇట్లు చెప్పెను.

Swami

"ఆత్మనః కామాయ సర్వం ప్రియం భవతి" అనగా నీవు ఒక వస్తువును గాని, వ్యక్తిని గాని ప్రేమించునపుడు ఆ వస్తువు లేక వ్యక్తి నీకు సుఖము నిచ్చుచున్నాడు కావున ఆ వస్తువు మరియు అతడు ప్రియమగుచున్నారు. అదే వస్తువు లేక వ్యక్తి నీకు దుఃఖమును కలుగ చేసినచో శత్రువు అగుచున్నాడు. కావున నీ ప్రేమకు కారణము నీకు సుఖము నిచ్చుటయే. భర్త తనకు దుఃఖమునిచ్చు భార్యను విడాకులిచ్చి వదలి వేయుచున్నాడు. ఇట్లే భార్యయు ప్రవర్తించుచున్నది. తనను పోషించుచున్నాడు కాన తనయుడు తండ్రిని ప్రేమించుచున్నాడు. తనకు చివరలో సేవ చేయును గాన తండ్రి పుత్రుని ప్రేమించుచున్నాడు. ఇట్లు లోకప్రేమలన్నియు స్వార్థముతో కూడుకునియున్నవి. కాని స్వామి మన వలన తనకు ఎట్టి లాభము లేక పోయినను మనలను ప్రేమించుచున్నాడు. అట్టి నిస్వార్థప్రేమకు బదులుగా మనము కూడా నిస్వార్థప్రేమనే ఈయవలెను. ఆయన ఇచ్చినది నిస్వార్థ ప్రేమయన్న బంగారము. నీవు ఆయనకు తిరిగి స్వార్థముతో కూడిన ప్రేమయను తుప్పు పట్టిన ఇనుము. ఆయన చేసినది నిజమైన దానము. కావున ఆయన ఒక్కడే దత్తుడు. దత్తుడనగా దాన స్వరూపము. లౌకిక బంధములలో ఉన్న అనురాగము స్వార్థముతో కలుషితమై ‘ప్రేమ’యని పిలువబడుచున్నది. అసలు ప్రేమ అనెడి శబ్దమే కలుషితమై పోయినది. భగవంతునిపై ఇదే అనురాగము కలిగినను దానిని కలుషితమైన ప్రేమయను శబ్దముతో పిలుచుట న్యాయము కాదు కావున దానినే ‘భక్తి’ అను క్రొత్త శబ్దముతో పిలచినారు. శబ్దభేదమే తప్ప తత్త్వమొకటియే. లౌకిక బంధములందున్న ప్రేమయే భగవంతుని పైనను ఏర్పడుచున్నది.

 

Part-2

"యా నః ప్రీతి ర్విరూపాక్ష" అను శ్లోకము ఈ విషయమునే చెప్పుచున్నది. అసూయ కలవాడు తనకన్న అధికుని అంగీకరింపడు. ఇంకనూ ఎక్కువ అసూయ కలవాడు తనకన్న అధికునే గాక తనతో సమానుని కూడా అంగీకరింపడు. కావుననే దత్తుడు జీవులకన్న అధికుడుగా లేక కనీసము సమానుడుగా కూడా దర్శనమీయక చండాలాది రూపములలో అధమునిగ దర్శనమిచ్చుచున్నాడు. అధికుడు లేక సమానుడు చెప్పినది అసూయ గల జీవులు వినరు అంగీకరించరు కావున వారు ముందు వినునట్లు చేయవలయునన్నచో అధమునిగా గోచరించి, తాను అధముడని స్వామి పలుకును. అధముడు చెప్పినది వినుటకు ముందడుగు వేయుదురు. ఏలననగా చెప్పువాడు అధముడు కావున తమలో ఉన్న అసూయ అహంకారములు రెచ్చగొట్టబడవు. కావున స్వామి అధమ స్థితి నుండియే బోధను ఆరంభించును. క్రమముగా వారు విని విని మెచ్చుకొని నీవు అధికుడవని స్వామిని ప్రశంసింతురు. కాని అప్పుడును వారిలో అసూయ నిద్రపోవుచున్నదే కాని భస్మము కాలేదు. కావున స్వామి అప్పుడును తాను అధికుడనని చెప్పడు. అట్లు చెప్పినచో వారిలోని అసూయ మేలుకొనును. చాలాకాలము తరువాత వినగా వినగా కోటానుకోట్లలో ఏ జీవునిలోనో అసూయ భస్మమగును. అప్పుడును స్వామి ఇది మరణించినదా లేక నిద్రించినదా అని పరీక్షలను పెట్టును. అది భస్మమైనదని నిర్ధారణ చేసుకున్నప్పుడు స్వామి "నేనే పరబ్రహ్మమును" అని ప్రకటించుకొని బ్రహ్మజ్ఞానమును ప్రసాదించును. అప్పుడే అతనికి జ్ఞానయోగమునకు అధికారము వచ్చినది. చిత్తశుద్ధి హెచ్చినది.

బ్రహ్మజ్ఞానము అనగా జీవరూపమున ఉన్న పరబ్రహ్మము తానే పరబ్రహ్మమని నిశ్చయముగా చెప్పుట. దేవకి పూర్వజన్మలో పరమాత్మ తన గర్భమున జన్మించవలెనని తపస్సు చేసినది. పరమాత్మ వరము నిచ్చినాడు. తరువాత దేవకి కంసుని సోదరిగా రాజవంశమున పుట్టినది. ఆమెలో కొంత రజోగుణము మిగిలి యున్నది. దానికి కారణము పరిసర ప్రభావము. ఒకనాడు ఆమె తులసిచెట్టుకు ప్రదక్షిణము చేయుచుండగా, స్వామి సాక్షాత్కరించి నీ కడుపున పుట్టపోవు చున్నాను అని చెప్పినాడు. శుద్ధ సత్త్వగుణమున్నచో ఆమె ఏమని బదులు చెప్పవలెను. "ఆహా! స్వామీ ఎంత అదృష్టమిది? నాకు అంతటి అర్హత కలదా? అని చెప్పియుండవలెను. కాని ఆమె ఇట్లు పలికినది. "స్వామీ నీ అంతట నీవే స్వయముగా వచ్చి నాకడుపున పుడతానంటే నేను కాదంటానా? అన్నది. ఆ వాక్యమునకు అర్థమేమి వచ్చినది? తన కన్న అర్హత గల జీవుడు లేనట్లు, తాను తప్ప స్వామికి వేరే గతి లేనట్లు అహంకారము గల అర్థము ఆ వాక్యము సూచించినది. అందుకే స్వామి జన్మించియు, బాల్యమంతయు ఆమెకు దక్కకుండా చేసినాడు. తల్లి నిజముగా ఆనందించునది పుత్రుని యొక్క బాల్యమునే. ఆమె వెనుక జన్మలో స్వామిని అర్థించినానన్న విషయము మరచిపోయినది. కంసుని చెలెల్లిగా, కంసుని సహచర్యములో ఆమెకు కొంత రజోగుణము ఎక్కినది. కాని స్వామి ఎంత సూక్ష్మగ్రాహియో కదా?

 

Part-3

దీనినే శ్రుతి "కశ్యపః పశ్యకో భవతి యః పశ్యతి సౌక్ష్య్మాన్” అనగా స్వామి పశ్యకుడు అనగా సాక్షి, అనగా ఎంత సూక్ష్మాతి సూక్ష్మము నైనను చూచువాడని అర్థము.

అనసూయ మాయమ్మ అత్రిముని మా తండ్రి
చంద్ర దూర్వాసులు సహోదరులు మాకు
సహ్యాద్రి మా ఇల్లు సతి అనఘ భామ
స్కంద భార్గవాదులు మా శిష్య గణములు
భక్తి మద్యమే మాకు నిత్య పానీయము
వరముల కోరెడి భక్త వేశ్యల ఇండ్ల
సంచరింతుము వారి ప్రేమ సత్యమనుకొని
సత్యమేదో బయటపడగా మతి భ్రమించె
పిచ్చివాడని నన్ను పిలుచుట ప్రమాదంబు
ఎపుడేమి సేతునో ఎరుగను నేనును
పోపొండు పోపొండు మా తోడ మీకేల
అపకారముల సేతు మీ ఆరాధనములకు
పోపొండు పోపొండు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch