09 Feb 2025
Updated with Part-3 on 11 Feb 2025
వానప్రస్థాశ్రమము యొక్క అంతరార్థము చాలా ఉన్నది. గృహస్థాశ్రమమున పుత్రపౌత్రాదులను ఎట్లు పోషించినావో అట్లే వానప్రస్థాశ్రమమున పశు, పక్షి, వృక్షాదులను పోషించవలెను. ‘నివసన్నా వసథే పురాద్బహిః’ ప్రకారముగా నగరమునకు బయట నున్న చిన్నతోటలో నివసించవలెను. దీని వలన వృక్షముల నుండి వెలువడు శుద్ధప్రాణవాయువు లభించి ఆరోగ్యము బాగుగ నుండి శక్తి పెరుగును. నగరములో విషవాయువులు తప్ప శుద్ధప్రాణవాయువు లభించదు. వృద్ధదశ రాగానే శక్తి క్షీణించి రోగములు వెంటబడును. కావున వృద్ధదశలో మానవునకు వానప్రస్థము ఎంతో ఉపయోగము. గృహస్థాశ్రమమున కేవలము తన సంతానమును, బంధువులను మాత్రమే ఆతిథ్యముతో అర్చించినాడు మానవుడు. దీని వలన తనతోటి మానవజాతికే సేవ చేసినాడు తప్ప, పశు, పక్షి, వృక్షాదులకు సేవ చేయలేదు.
ఈ స్వార్థమును విడనాడి, సంతానమును బంధువులను త్యజించి, ఊరికి దూరముగ ఒక వనముతో గూడిన ఆశ్రమమున నివసించి, పశు, పక్షి, వృక్షాదులనే అతిథులుగా భావించి వాటిని సేవించుటయే వానప్రస్థము. సంతానమునకు, బంధువులకును దూరముగనుండుట వలన వారి సమస్యలను పట్టించుకొననందున ప్రశాంతి ఏర్పడి ఆరోగ్యము చక్కగా నుండి దైవారాధనమునకు సహకరించును. సంతానము మధ్యలోనే నున్నచో వారి దిన దిన సమస్యలు నెత్తిపై బడుచుండును. దూరముగ నున్నపుడు పెద్దసమస్యల సలహా కొరకు వారు ఆశ్రమమునకు వచ్చిపోవచ్చును కానీ ప్రతి చిన్నసమస్యకును వారు రారు కదా. వారి ప్రతి ఐహికసమస్యను మనస్సులోకి ఎక్కించుకొనుట వలన మనస్సు కూడ లోకపరమే అగును తప్ప భగవత్పరము కాదు.
బ్రహ్మచర్యాశ్రమము మొదటిది. బ్రహ్మచర్యమనగా నేమి? బ్రహ్మమును గుర్తించుటయే బ్రహ్మచర్యము. చర శబ్దమునకు జ్ఞానమని అర్థము. ‘గత్యర్థానాం ధాతూనాం జ్ఞానార్థకత్వాత్’ కావున ‘చర’ ధాతువునకు జ్ఞానము అని అర్థము వచ్చును. జ్ఞానము అనగా తెలుసుకొనుట అనగా గుర్తించుట తప్ప, బ్రహ్మము యొక్క తత్త్వజ్ఞానము కాదు. బ్రహ్మతత్త్వమును బ్రహ్మము తప్ప మానవమాత్రుడెవడునూ తెలుసుకొనలేడని ‘బ్రహ్మవిద్ర్బహ్మైవ భవతి’ అని శ్రుతి చెప్పుచున్నది. ‘న మేధయా’, ‘నైషా తర్కేణ’ మొదలగు శ్రుతులు (Veda) కూడ ఇదే చెప్పుచున్నవి. ‘మాం తు వేద న కశ్చన’ అని గీత కూడ ఇదే చెప్పుచున్నది. అనగా సర్వదేవతా రూపములలో ఏ రూపము బ్రహ్మస్వరూపము? అని గుర్తింపు మాత్రమే బ్రహ్మజ్ఞానము లేక బ్రహ్మచర్యము. ఈ ఆశ్రమము గాయత్రీ మంత్రోపదేశముతో ఆరంభించబడుచున్నది. గాయత్రీ మంత్రదేవత సవిత అనగా బ్రహ్మదేవుడు అనగా సృష్టికర్త. ఎవడు సృష్టికర్తయో వాడే సృష్టిభర్తయు, సృష్టిహర్తయు అయివున్నాడని శ్రుతులు చెప్పుచున్నవి:-
ఈ అర్థమునే శ్రుతి మరల ఇట్లు చెప్పుచున్నది.
ఇక ఈ బ్రహ్మము నిరాకారమా? సాకారమా? ఈ ప్రశ్నకు సమాధానము నిచ్చుటకు ముందు బ్రహ్మము యొక్క తర్కాతీత (beyond logic) లక్షణమును గ్రహించవలెను ‘యతో వాచో..., న మేధయా..., నైషా తర్కేణ..., యో బుద్ధేః పరతః..., మాం తు వేద న కశ్చన...’ ఇత్యాది శ్రుతి, స్మృతులన్నియును బ్రహ్మము వాక్కులకు, మనస్సుకు, బుద్ధికిని అందదని ఘోషించుచున్నవి. ఇటువంటి పరిస్థితిలో బ్రహ్మము నిరాకారమని మీరు ఎట్లు చెప్పగలరు? ఒక గది తాళము వేసి యున్నది. దానిలో నిరాకారమైన మట్టిముద్ద ఉన్నదని మీరు ఎట్లు వాదించగలరు? సాకారమైన కుండ ఉన్నదని మేమూ వాదించగలము కదా. ఇపుడు ‘శాస్త్రయోనిత్వాత్’ అను బ్రహ్మసూత్రము ప్రకారముగా వేదమే ప్రమాణమగును (authority). వేదముననుసరించు స్మృతులును (secondary scriptures) ప్రమాణములే. వేదమునకు విరుద్ధముగా వచించు స్మృతులు ప్రమాణములు కావు. అట్లు విరుద్ధముగా చెప్పు స్మృతులు వ్యాసప్రోక్తములు కావు. అవి మధ్యలో ఆయా అభిమానులచే రచింపబడి దూర్చబడినవి. వీటినే ప్రక్షేపము (insertions) లందురు. వేదములలో అట్టి ప్రక్షేపములు లేవు. కారణము వేదము పరంపరగా అధ్యయనము ద్వారా రక్షింపబడినవే కాని గ్రంథరూపమున వ్రాయబడలేదు. ఈ మహోపకారమును బ్రాహ్మణులు సాధకులకు చేసినారు కావున వారు ఎంతో అభినందనీయులు. వారికి ఈ విషయమున లోకమంతయును కృతజ్ఞత చెప్పవలసియున్నది.
Part-2
‘శ్రుతి స్మృతి విరోధే తు, శ్రుతిరేవ గరీయసీ’ అనగా శ్రుతి స్మృతులకు విరోధము వచ్చినపుడు వేదమే ప్రమాణము. స్మృతులనగా పురాణాది గ్రంథములు. అయితే వేదము అధ్యయనముతో అగిపోరాదు. దాని అర్థమును తెలియవలెను. విదుల్ – జ్ఞానే కదా. అర్థము తెలిసిననే వేదవేత్త యగును.‘అరూపమవ్యయమ్’, ‘న చక్షుషా’ మొదలగు శ్రుతులును ‘అరూపవదేవ హి’ అను బ్రహ్మసూత్రమును, బ్రహ్మము నిరాకారమనియే వాదించుచున్నవి గదా అన్నచో –‘పరిపశ్యన్తి’, ‘వివృణుతే తనూం స్వామ్’, ‘ప్రత్యగాత్మన మైక్షత్’, ‘అపరోక్షాద్ర్బహ్మ’ మొదలగు శ్రుతులన్నియును సాకారమును ప్రతిపాదించుచున్నవి. మరియును ‘హిరణ్యగర్భః’, ‘నారాయణః’, ‘రుద్రః’, ‘పురుషః’ మొదలగు పదములన్నియును బ్రహ్మము పురుషస్వరూపముగా చెప్పుచున్నవి గదా. మీరు ‘రూఢఅభిధ’ను (అనగా లోకమునందు రూఢియగు శబ్దార్థమును) మా శ్రుతులందు గ్రహింపక మా శ్రుతులందు వ్యంజనను (అనగా శబ్దార్థము కన్న విలక్షణమగు అర్థమును) తీసినచో మేమును అట్లే చేయుదుము.
బ్రహ్మశబ్దమునకు వేదము అనియు అర్థము. వేదార్థ విచారణ చేసిన వాడే బ్రహ్మవేత్త. వేదాధ్యయనము అనగా వేదార్థవిచారమును చేసి సత్యమైన జ్ఞానమును గ్రహించుట. వేదమును మించిన ప్రమాణము లేదు. ఏలననగా అది ఈశ్వరప్రోక్తము (అస్య మహతో భూతస్య... అని శ్రుతి). ఈ కారణము వల్లనే వేదమును కంఠస్థరూపముగా, ప్రక్షేపములు చేరకుండా, దానిని బ్రాహ్మణులు రక్షించినారు. వారు చేసిన ఈ పని చాలా గొప్పది. అయితే చాలా మంది వేదార్థ విచారమును చేయుటలేదు. వేదార్థవిచారమే పరమాత్మను గుర్తించు సత్యమైన జ్ఞానమును కలుగచేయును. ‘శాస్త్రయోనిత్వాత్’ అను బ్రహ్మసూత్రము ఆ విషయమునే చెప్పుచున్నది.
నిరాకారవాదులు రెండు వర్గములుగా ఉన్నారు. ఒకరు చైతన్య బ్రహ్మవాదులు. వీరినే ‘చిన్మాత్రవాదులం’దురు. మరియొకరు శాక్తేయులు. చైతన్యమన్ననూ, శక్తియన్ననూ ఒక్కటే. చైతన్యమే (awareness) శక్తి. నవీనవిజ్ఞానము (Modern science) ప్రకారము చైతన్యము శక్తిరూపముగా యంత్రముల తెరలపై (screen) ప్రదర్శించబడుచున్నది. ఎక్కువ ఆలోచనతో ఉన్నవుడు ఈ చైతన్యము ఎక్కువ తరంగములుగాను, శాంతముగ ఉన్నపుడు ఈ చైతన్యము అత్యల్ప తరంగరూపముగాను గోచరించుచున్నది.
పూర్వపక్షి (Opponent):- ఈ చైతన్యమును మేము చేతన యందుము.
సిద్ధాంతి (Swami) :- అట్లు అయినచో ఇక చైతన్యము ఎక్కడ ఉన్నది.
పూర్వపక్షి:- చేతనలోనే అంతర్గతముగా నున్నది.
సిద్ధాంతి:- అట్లు ఉన్నట్లు చెప్పుటకు ప్రమాణమేమున్నది?
పూర్వపక్షి:- వేదమే దీనికి ప్రమాణము ‘సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ’ మొదలగు శ్రుతులు.
సిద్ధాంతి:- ఆ వేదమే బ్రహ్మమును ‘పురుషః, హిరణ్యగర్భః, నారాయణః, రుద్రః’, అను శబ్దములతో చెప్పుచున్నది గదా.
పూర్వపక్షి:- ఆ చైతన్యము జగత్తు యొక్క నానా రూపములను ధరించినట్లు, పురుషాది రూపములను ధరించుచున్నది.
సిద్ధాంతి:- మేము ఈ విధముగా సమన్వయము చేయుదుము. ప్రజ్ఞానమనగా ప్రజ్ఞాని. జ్ఞానమనగా జ్ఞాని. గుణము యొక్క అతిశయము ఎక్కువ నున్నపుడు ఒక ద్రవ్యమును గుణముగనే చెప్పవచ్చును కదా. ఉదాహరణకు ‘తేజసాం హి న వయ స్సమీక్ష్యతే’ – అన్నచోట తేజశ్శబ్దము ఆ తేజస్సు కలిగిన తేజస్విని గురించి చెప్పుచున్నది. వివరణము: ‘తేజస్సులకు వయస్సు చూడరు’ అన్నప్పుడు ‘తేజస్సు కలవారికి వయస్సు చూడరు’ అని అర్థము. ఇక్కడ తేజస్సు ఎక్కువగ కలవాడు, ‘తేజస్సు’ అనియే చెప్పబడుచున్నాడు. అట్లే జ్ఞానము ఎక్కువగ కలవాడు ‘జ్ఞానము’ అనియే చెప్పబడుచున్నాడు. శబ్దములు నాలుగు విధములు:
జ్ఞానము అను శబ్దము లోకమున ఒక శాస్త్రము యొక్క విశేషమైన జ్ఞానమునందు వాడబడుచు రూఢము అయినది. కేవలము తెలియుట అను వ్యుత్పత్తి చేత చైతన్యము అని చెప్పబడుట లేదు. శాస్త్రమును తెలియుట అని వ్యుత్పత్తి చేతను శాస్త్రజ్ఞానమునందే ఈ శబ్దము వాడబడుచున్నది. అట్టి శబ్దము యొక్క రూఢిని (లోక వ్యవహారమును) వదలి, కేవల వ్యుత్పత్తి మాత్రమున (యౌగికము) తీసుకొనుట సరిగాదు. అనగా జ్ఞానశబ్దము యోగరూఢముగా శాస్త్రజ్ఞానమునే చెప్పును కానీ కేవలము యౌగికముగా చైతన్యమును చెప్పదు. ఇక ‘సత్యం జ్ఞానమనంతం...’ అన్నచోట–సత్యము, అనంతమైన శాస్త్రజ్ఞానము కలవాడు అని అర్థము. అట్టి జ్ఞానము కేవలము పరమార్ధజ్ఞానము కల వేదాంతశాస్త్రమనియే అర్థము. అనగా వేదాంతమును బోధించు గురుస్వరూపమే పరమాత్మయని సారాంశముగా తేలుచున్నది.
Part-3
పూర్వపక్షి:- బ్రహ్మశబ్దము నపుంసకలింగమున ఉన్నది. నపుంసక లింగముచే లోకమున పురుషుడు చెప్పబడుట లేదు. మరియు ‘పరిపశ్యన్తి’ అనుచోట (అనగా పరమాత్మను చూచుచున్నారు అనునపుడు) ‘పశ్యన్తి’ అనగా తెలుసుకున్నారు అని అర్థమును చెప్పుచున్నాము. ‘గత్యర్ధానాం ధాతూనాం జ్ఞానార్థకత్వాత్’ అని కదా.
సిద్ధాంతి:- సరే ‘హిరణ్యగర్భః’, ‘నారాయణః’, ‘రుద్రః’, ‘పురుషః’ అను శబ్దములు, నపుంసకలింగము చేత చెప్పబడవలసిన చైతన్యమును ఎట్లు చెప్పును? అవి పుంలింగ శబ్దములు కదా.
పూర్వపక్షి:- శబ్దమును బట్టి అర్థనిర్ణయము లేదు గదా. ‘కళత్రమ్’ అను నపుంసకలింగ శబ్దము స్త్రీ యగు భార్యను ‘మిత్రమ్’ అను నపుంసకలింగ శబ్దము పురుషుడగు మిత్రుని చెప్పుచున్నవి. ‘దారాః’ అను పుంలింగ బహువచనశబ్దము ఏకవచనమై స్త్రీలింగమైన భార్యను చెప్పుచున్నది గదా.
సిద్ధాంతి:- ఓయీ! మీ వాదము మీ కంఠమునకే చుట్టుకొనుచున్నది. అర్థము యొక్క లింగమును శబ్దము నిర్ణయించలేనపుడు ‘బ్రహ్మ’ శబ్దము నపుంసకలింగమైనను, పుంలింగమైన పురుషుని ఏల చెప్పదు? పైగా మీరు చెప్పిన శబ్దములు అంతవరకే పరిమితములు. మిగిలిన శబ్దములన్నియును లోకవ్యవహార (రూఢి) ప్రమాణముగా ఆయా లింగశబ్దములు, ఆయా లింగముల కల వస్తువులనే బోధించుచున్నవి గదా. పైగా బ్రహ్మశబ్దము నపుంసకలింగమైననూ, పురుషస్వరూపమున సమన్వయము చేయుటకు మాకు ‘గుణాతిశయ న్యాయము’ (తేజస్సు–తేజస్వి) ఎటూ ఉన్నది. బ్రహ్మము అనగా గొప్పతనము. అతిశయించిన గొప్పతనము కలవాడు ‘గొప్పతనము (బ్రహ్మము)’ అగు నపుంసక లింగశబ్దముచే సూచింపబడవచ్చును గదా. కావున సత్యము, జ్ఞానము, అనంతము, బ్రహ్మము అనుచోట జ్ఞానికి సత్య–అనంత–బ్రహ్మములను గుణములుగా చెప్పవచ్చును. పైగా ‘రామబ్రహ్మము’ అని పురుషుని, ‘పంకజం’ అని స్త్రీని పిలుచుచున్నారు. రూఢి మాత్రమే కాక, గుణాతిశయ న్యాయము కూడ మా వాదమునకు సహకారి యగును. మీ వాదమునకు ఇట్టి సహకారము లేదు. మాకు గుణశబ్దము చేత ద్రవ్యమును పిలుచు న్యాయముమున్నది. అనగా తేజస్విని తేజస్సు అని పిలుచుట కలదు కాని, తేజస్సును తేజస్వి అని పిలచుట లేదు గదా.
పూర్వపక్షి:- బ్రహ్మము లోకాతీతము కాన రూఢి కుదరదు కావున మీకు రూఢి బలము లేదు.
సిద్ధాంతి:- ఈ దోషము మీకునూ వర్తించును. లోకాతీతమైన దానియందు మీరును లింగాతీతమని ఎట్లు చెప్పగలరు? చైతన్యము ఒక శక్తియే. అదియును లోకాతీతము కాదు గదా. ‘నేతి నేతి’ అని శ్రుతి చెప్పిన ప్రకారము (అనగా ‘ఇది కాదు, ఇది కాదు’ అన్న ప్రకారము) సమస్త లోకపదార్థములను కాదన్నచో, ఇక బ్రహ్మము ‘ఇది’ అని మీరు మాత్రము ఎట్లు చెప్పగలరు?
బ్రహ్మము లోకాతీతమా కాదా అన్న దాని గురించి శ్రుతి ఇట్లు చెప్పుచున్నది ‘యత్సాక్షాదపరోక్షాత్’, ‘పశ్యన్తి’, ‘ఐక్షత్’, ‘తనూం స్వామ్’ – ఇవన్నియును బ్రహ్మము ఇంద్రియుముల చేత చూడబడునదియే అని చెప్పుచున్నది. ‘దివ్యం దదామి తే చక్షుః’ అను గీత ప్రకారము బ్రహ్మమును చూచుటకు బ్రహ్మము యొక్క అనుగ్రహము చేత ఈ నేత్రములు ఆ దర్శనమును తట్టుకొనుటకు, ఈ నేత్రములకు అధిక శక్తి (దివ్యదృష్టి) లభించును. ‘సాక్షాత్’, అపరోక్షాత్’ అను చోట ‘అక్ష’ శబ్దమున్నది. అనగా బ్రహ్మము ఇంద్రియ గోచరమనియే అర్థము. సాక్షాత్కారము అనగా లోకములో కన్నులకు కనిపించుటయే అని రూఢి ఉన్నది గదా. ‘తనూం’ అన్నపుడు బ్రహ్మమునకు ఆకారమున్నదనియు, ‘పురుషః’ అను శబ్దము చేత, బ్రహ్మము పురుష స్వరూపమనియే అర్థము.
ఇక రూఢి విషయము: 1) లోకములో పుంలింగ, స్త్రీలింగ వస్తువులను నపుంసకలింగ శబ్దములతో పిలుచుట కలదు. (రామబ్రహ్మము, పంకజం మొదలగునవి). కానీ నపుంసకలింగ వస్తువులను స్త్రీ-పురుష-లింగ శబ్దములతో పిలుచుటలేదు. నపుంసక లింగవస్తువు అగు తేజస్సును ‘తేజోవంతుడు రాముడు’ మొదలగు పుంలింగ శబ్దములతో కాని ‘తేజస్విని సీత’ మొదలగు స్త్రీలింగ శబ్దములతో పిలుచుట కానీ లేదు. శక్తి శబ్దము స్త్రీలింగమైనను ‘విద్యుచ్ఛక్తి’ మొదలగు నపుంసకలింగ విషయము నందే ప్రయోగించబడుచున్నది.
పూర్వపక్షి:- శబ్దములను బట్టి వస్తులింగమును నిర్ణయించుట మేము అంగీకరించము. శబ్దము యొక్క లింగమునకు లోకవ్యవహారము తోడు అగునేని దానిని అంగీకరింతుము. ఉదాహరణకు, ‘శైలః’ అను సంస్కృత శబ్దము పుంలింగమైతే ‘కొండ’ అను తెలుగు శబ్దము నపుంసకలింగము. ‘సారః’ అను సంస్కృత శబ్దము పుంలింగము. దాని అర్థమైన సామర్ధ్యము లేక బలము నపుంసకలింగ వస్తువును సూచిస్తుంది, కావున శబ్దములతో పాటు లోకవ్యవహారమును గ్రహించవలెను.
సిద్ధాంతి:- ఇది అంగీకరించవలసినదే. ‘పురుషః’ అను శబ్దము పుంలింగ వస్తువునందే వాడబడుట లోకవ్యవహారమే. ఇక హిరణ్యగర్భః- నారాయణః-రుద్రః అని మేము చెప్పిన శబ్దములు కూడ పురుషస్వరూపమున వాడబడుటయు లోకవ్యవహారము. ‘సాక్షాత్’, ‘అపరోక్షాత్’ అనెడి శబ్దములద్వారా కూడ నేత్రములచే చూడబడుటయను క్రియను సూచించుట లోకవ్యవహారసిద్ధమే. ‘తనూం’ అను శబ్దము కూడ అవయావాత్మకమైన శరీరమున వాడబడుటయు లోకవ్యవహారసిద్ధమే. ‘జ్ఞానం’ అను శబ్దము కూడ చైతన్యమునందు కాక ఒకానొక శాస్త్రజ్ఞానమునందును, ‘ప్రజ్ఞానం’ అను శబ్దము శ్రేష్ఠమైన శాస్త్రజ్ఞానము (వేదాంతము) నందు వాడబడుటయును లోకవ్యవహార సిద్ధమే కదా. చేతన–అచేతన అను వ్యవహారము ఉన్నదియే తప్ప ‘జ్ఞాన–అజ్ఞాన’ అని ప్రాణి–అప్రాణి భేదము నందు వ్యవహారము లేదు గదా. మీ చైతన్యము లోకసిద్ధమైన చైతన్యము కాదు, లోకాతీతమైన చైతన్యము అన్నచో లోకాతీతమైనది చైతన్యమనియే ఏల? పురుష స్వరూపము కావచ్చును. ఈ లోకమునందున్న చేతన జగత్సృష్టిస్థితిలయములను చేయుట లేదు. అట్లే లోకమునందున్న ఏ పురుషుడును జగత్ సృష్టి-స్థితి-లయములను చేయుటలేదు.
ఇట్లు మన ఇరువురికిని సమానస్థితి ఏర్పడగా జగత్ సృష్టి-స్థితి-లయములను చేయు లోకాతీతమైన చైతన్యమును తీసుకొనుటకు బదులు, జగత్ సృష్టి-స్థితి-లయములను చేయు పురుషుని ఏల తీసుకొనరాదు? మరియును జ్ఞానం–ప్రజ్ఞానం అను రెండు నపుంసకలింగ శబ్దములందు అతిశయగుణ న్యాయము ద్వారా జ్ఞాని–ప్రజ్ఞాని అను పురుష స్వరూపసిద్ధిని మేము సాధించినాము. మీరు ‘పురుషః’ అను శబ్దము నందు, చైతన్యమును అట్లు సాధించ లేదు. మీ సాధనయందు లోకవ్యవహారమునకు అనుగుణమైన రూఢి ననుసరించి జ్ఞానశబ్దమునకు శాస్త్రజ్ఞానమును సాధించి, దానియందు గుణాతిశయ న్యాయముగా జ్ఞాని శబ్దమును సాధించినాము. కావున మా సాధన యందు రూఢి, శాస్త్రము, రెండూ సమన్వయించినవి.
పూర్వపక్షి:- మీరు ప్రతిచోట, శ్రుతి–యుక్తి–అనుభవము ఈ మూడింటి సమన్వయమును ప్రమాణముగా తీసుకొంటారు గదా. మీరు చెప్పు చైతన్యము విడిగా స్వతంత్రించి ఒక పదార్థముగా లోకములో ఎక్కడను అనుభవసిద్ధముగా కనిపించుటలేదు. చైతన్యము ఒక వ్యక్తిని (ప్రాణిని) ఆశ్రయించియే లోకమున కనిపించుచున్నది. మీరు యిచ్చే స్వప్న ఉదాహరణము చైతన్యసృష్టియే, కాదనము. కానీ ఆ చైతన్యము ఒక వ్యక్తిని ఆశ్రయించియే యున్నది. ఈ వ్యక్తికి స్వప్నము వచ్చినది అని అందుమే కానీ, ఈ వ్యక్తిలోని చైతన్యమునకు స్వప్నము వచ్చినది అని అనము గదా. ఆచార్యులు ముగ్గురూ బ్రహ్మశబ్దమునకు చైతన్యమునే తీసుకున్నారు గదా. జ్ఞాన-ప్రజ్ఞాన శబ్దములకు చైతన్యమునే అర్థముగా చెప్పి బ్రహ్మమన్నారు గదా.
సిద్ధాంతి:- దానిని మేము ఎక్కడ కాదన్నాము. చైతన్యము జగత్తునకు అభిన్న నిమిత్తోపాదాన కారణమే (లోకములో మట్టి, కుండకు ఉపాదాన కారణమైతే – కమ్మరి నిమిత్త కారణము). విగ్రహారాధనలు చేయు దుండగులను ఖండించుటకు, వారిని ఉద్ధరించుటకును, ఆచార్యులు బ్రహ్మశబ్దమునకు చైతన్యము వరకు అర్థము చెప్పి ఆపినారు. మఖ్యముగా మొదట వచ్చిన శంకరులు చైతన్యము వరకే చెప్పినారు. పైగా బౌద్ధులు విగ్రహవ్యతిరేకులై నాస్తికులైనారు. వారికి నిరాకార చైతన్యమును అంగీకరించుటయే చాలా కష్టమైనది. వారిని ఉద్ధరించి, వారిని కనీసము ఆస్తికులుగా మార్చుటకు నిరాకార చైతన్యము వద్ద శంకరులు ఆగిపోయినారు. వారికి చైతన్యాశ్రయమైన వ్యక్తి తెలియక కాదు. ‘బ్రహ్మ పుచ్ఛం ప్రతిష్ఠా’ అను శ్రుతి చైతన్యాశ్రయ వ్యక్తిని చెప్పుచున్నది. లేదన్నచో చైతన్యమే చిచ్ఛక్తిగా తీసుకొను శాక్తేయులు శక్తియే బ్రహ్మమని వాదించు ప్రమాదము కలదు. చైతన్యాశ్రయమునే బ్రహ్మమని శంకరులు స్థాపించి శాక్తేయులను ఆ ప్రకరణములో నిరాకరించినారు గదా. విగ్రహ వ్యతిరేకుల దోషములు శమించగా, తరువాత రామానుజ–మధ్వాచార్యులు, చైతన్యాశ్రయ వ్యక్తిని చెప్పినారు గదా. ఆయా సమయాలలో ఆయా సాధకుల సాధన దశల ననుసరించి ఆచార్యులు ఉపదేశించిరి. ఆచార్యుల అనుయాయులలోనే కలహమున్నది కానీ ఆచార్యుల మతములలో భేదము లేదు.
పూర్వపక్షి:- మధ్వ రామానుజులు కేవలము నారాయణ శబ్దమునే బ్రహ్మపరముగా వాడినారు గదా. దీని చేత హిరణ్యగర్భ (బ్రహ్మ) – రుద్ర నిరాకరణము వచ్చినది గదా.
సిద్ధాంతి:- కాదు, అక్కడ బ్రహ్మ-విష్ణు-శివాంతర్గత వ్యక్తి పదముగా నారాయణ శబ్దమును తీసుకోవాలి.
★ ★ ★ ★ ★