21 Sep 2024
నాయకుడు తన ప్రజల యొక్క శ్రేయస్సును కోరి సదా శ్రమించవలయును. కాని ఈ రోజు నాయకులు ప్రజల గరించి చింతించక తాము ధనమును సంపాదించి, తమ ఆత్మోద్ధరణమునకు, తమ కుటుంబసభ్యుల అభివృద్ధికి ప్రయత్నిస్తున్నారు. కాని రాధ అటువంటి నాయకురాలు కాదు. ఏ స్త్రీ కూడా తనకు ప్రియమైన వానిని ఇతర స్త్రీలు పంచుకొనుటకు ఒప్పుకొనదు. కాని రాధ కృష్ణునిపై తన ప్రేమ ఇతర గోపికలకు పంచెడిది. అట్లు వారు ఉద్ధరింపబడుట కోరెను. ఆమె యొక్క త్యాగభావముతో కూడిన మధురప్రేమ చేతనే కృష్ణుడు రాధాలోలుడైనాడు. రాధను గురించిన ఈ విషయము ఈనాటి వరకును ఎవ్వరికిని తెలియదు. ఇతర గోపికలు కృష్ణుడు ప్రేమించుచుండగా రాధ అలిగి కూర్చునట్లు వర్ణింతురు. కాని ఇది పూర్తిగా అసత్యము. సామాన్య స్త్రీస్వభావమును రాధపై రుద్దినారు. దత్తుడే కృష్ణుడు. రాధయే అనఘ. ఈ అనఘాష్టమి పుణ్యదినమున ఈ సత్యమైన అనఘాతత్త్వమును దత్తుడగు నేను బయట పెట్టుచున్నాను. ఈ విధముగనే శంకరులు పరమాత్మ నుండి జ్ఞానసంపదను పొందినారు. కాని ఆయన ఏమి చేసెను.
శంకరులు భారతదేశమంతయు కాలి నడకతో సంచరించి గ్రామ గ్రామమునకు పోయి ఆ జ్ఞానమును ఇతరులకు బోధించి వారి అజ్ఞానమును తొలగించెను. కావున ఆయన దైవము నుండి పొందిన జ్ఞానమును తన ఆత్మోద్ధరణమున కొరకు ఇంటిలో కూర్చునలేదు. ఆయన తన యొక్క ఉద్ధరణము గురించి చింతించలేదు. ఆయన జీవితమంతయు జ్ఞానబోధలతోనే గడచిపోయెను. పరులను ఉద్ధరించు జ్ఞానములోనే ఆయన జీవితమంతయు గడిపెను. నేను దేవుడనే మీరును దేవుడే అని తాను పొందినది ఇతరులు పొందినట్లుగా భావించినాడు. కావున సేవ ఎప్పుడు ఇతరుల కొరకే ఉండవలయును. నీ ఆత్మోద్ధరణకు కారాదు. నీవు ఇతరులను ఉద్ధరించుటకు ప్రయత్నించినచో నీవు స్వామిచే ఉద్ధరించబడుదువు. ఇతరులు ఉద్ధరించబడినను, ఉద్ధరించబడకపోయిననూ ఫలమును గురించి నీకు అనవసరము. నీవు మాత్రము ఇతరుల ఉద్ధరణమునకు సదా ప్రయత్నించుచుండవలెను. నీ ప్రయత్నము చెడినను నీవు ఆ ప్రయత్నములో నిరంతరము ఉండుము. నీవు అంత్యక్షణము వరకు అట్టి ప్రయత్నములో ఉన్నచో భగవంతుడు సంతోషించి నిన్ను మాత్రము ఉద్ధరించును. కావుననే శంకరులను చివరిలో దత్తుడు కౌగలించి తనలో లీనము చేసుకొన్నాడు. ఇట్లే మీరాబాయి భక్తిని ప్రచారము చేసినది. ఇతర జీవులను తన గానముతో కృష్ణభక్తులుగా మార్చుటకు ప్రయత్నంచెను. కావుననే జగన్నాథ దేవాలయములో మీరాను సశరీరముగా ఐక్యము చేసుకున్నాడు. దత్తుడు సృష్టికర్త, సృష్టిభర్త, సృష్టిహర్త. ఇవియే బ్రహ్మ, విష్ణు, శివస్వరూపములు. సృష్టికర్తగా కొందరు అభిమానించి దత్తుని తల్లి తండ్రిగాను లేక పుత్రునిగాను లేక సోదరునిగాను ఆరాధించిరి.
ప్రహ్లాదుడు తండ్రిగాను, దశరథుడు, నందుడు పుత్రునిగాను, లక్ష్మణుడు అన్నగాను ఆరాధించినారు. లక్ష్మణుడు కూడా స్వామికి నిరంతరసేవ చేయుచు స్వామి కార్యమైన యుద్ధములో పాల్గొనెను. మరికొందరు భక్తులు స్వామిని సృష్టిభర్తగా పతిగా ప్రియునిగా ఆరాధించినారు. రుక్మిణి రాధలు దీనికి ఉదాహరణ. సత్యభామ ఎప్పుడు స్వామి తన వద్దనే ఉండవలయునని కోరుకొన్నది. కాని రుక్మిణి స్వామి అష్టభార్యలను పంచుకొనవలయునని తలచినది. కావుననే తులాభారము నందు రుక్మిణి గెలిచి సత్యభామ ఓడిపోయినది. కాని రుక్మిణి కన్న రాధ గొప్పది. ఏలననగా స్వామిని 16 వేల గోపికలు పంచుకొనవలెనని కోరినది. కావున రుక్మిణి త్యాగము కన్న రాధ త్యాగము గొప్పది. కావుననే రాధ ముందు రుక్మిణి ఓడిపోయినది. ఒకనాడు రాధ బృందావనము నుండి ద్వారకకు వచ్చెను. రుక్మిణి తాను రోజు తాగు వేడిపాలు రాధకు యిచ్చెను. రాధ దానిని స్వీకరించినది. ఇరువురు స్వామి వద్దకు పోగా స్వామి ఎర్రగా కందియుండెను. ఇరువురు ఆశ్చర్యపడి అడిగిరి. స్వామి పలికెను:
రాధ వేడి పాలను తాగినది. రాధ హృదయములో నేనున్నాను. కావుననే కందిపోయినాను. అప్పుడు రుక్మిణి అడిగినది. నాథా! ఐతే వేడి పాలను నేను రోజు తాగుతున్నాను గదా! కాని నీవు ఏనాడు కందిపోలేదు. నీవు నా హృదయము నందు లేవా? స్వామి ఇట్లు పలికెను. ఓ రుక్మిణి! నీ ప్రేమ కన్న రాధ ప్రేమ గొప్పది. నీవు నన్ను అష్ట భార్యలతో మాత్రమే పంచుకొనుచున్నావు. కాని రాధ బృందావనములో పదునారువేల గోపికలతో కలసి నన్ను పంచుకొనుటకు సిద్ధపడినది. కావున ఆమె త్యాగము నీ త్యాగము కన్న గొప్పది. మరియును నీవు నిత్యము నా సహచర్యములో ఉన్నావు. కావున నీకు నా యందు నిర్లక్ష్యము ఏర్పడినది. కావున నా విలువ పోయినది. రాధ దూరముగా యున్నది. కావున ఆమెకు వియోగము నందు నాపై శ్రద్ధ ఎక్కువగా యున్నది. భగవంతుడు మనకు కనపడకుండా ఎందుకున్నాడు? ఆయన కనపడక దూరముగాయున్నచో మనకు ఆయనపై విలువ పెరిగి మనము తరింతుము. కావున మన శ్రేయస్సు కోరి మనకు కనబడకున్నాడు. ఒక వేళ నరరూపములో వచ్చినచో అప్పుడును కొంతకాలము మాత్రమే ఉండి తరువాత అవతారము చాలించుచున్నాడు. ఆయన నిరంతరము మనతో ఉన్నచో ఆయన పై మనకు నిర్లక్ష్యము ఏర్పడును. స్వామితో నిరంతరము యాదవులు ఉన్నారు. చిన్ననాటి నుండియు కాళియమర్దనము, గోవర్ధనమునెత్తుట చూచినారు. స్వామి కురుక్షేత్ర యుద్ధమునకు పోవుచు నేను వచ్చు వరకు మద్యమును ఎవరు సేవించవలదని ఉత్తర్వులిచ్చియుండెను. దీనికి కారణము ఏమనగా యాదవులు మద్యము త్రాగినచో దుర్వాసశాపము వలన వారు కలహించి మరణింతురనియే, కాని యాదవులు ఉత్తర్వులను నిర్లక్ష్యము చేసిరి. కృష్ణుడు 19 రోజున తిరిగి వచ్చెను. కాని అప్పటికే యాదవులు మద్యము సేవించి, కొట్టుకొని, చంపుకొనిరి.
మరి చిన్ననాటినుండియు ఎన్నో మహిమలను చూచిన యాదవులు కృష్ణుని ఉత్తర్వులు ఏల ధిక్కరించిరి? దీనికి కారణము కృష్ణుడు నిరంతరము యాదవులతో ఉండుటయే. నిరంతర సాన్నిధ్యము, సహచర్యము యాదవులదృష్టిలో కృష్ణుని విలువ పోగొట్టినది. అందువలననే భగవంతుడు కనిపించడు. కనిపించినను 10 నిమిషములే కనిపించి అదృశ్యుడగుచున్నాడు. ఎందుకనగా తనపై విలువను నిలుపుకొనుటకే. కావున త్యాగముతో కూడిన సేవ కలిగి జపము, ధ్యానము, భజన చేయుచున్నచో అవి సార్థకములగును. ఇవి అన్నియు శరీర అవయవములు అయినచో త్యాగముతో కూడినచో సార్థకము. ప్రాణమున్ననే శరీరావయవములకు విలువ యున్నది. ఎంత గొప్పవాడైనను మరణించిన తరువాత వాని నేత్రములు కత్తిచే పెకిలింపబడుచున్నవి. అది పుణ్యకర్మ యగుచున్నది. నేత్రదానమున కత్తితో పెకిలించుట పాపమగుటలేదు? ఎందులకు? ప్రాణము పోయినది కాన శరీరమునకు విలువలేదు. కాని అదే కన్నులు ఒక క్రూరమైన జంతువుకు పెకిలించినచో అది మహాపాపము అగుచున్నది. ఎందులకు? ప్రాణమున్నది కాన కండ్లకు, శరీరమునకు విలువయున్నది. హనుమంతుడు రామనామ జపము చేసెను. రామభజన చేసెను. రామధ్యానము చేసెను. కాని ఎప్పుడు? రాముని కార్యము ముగిసిన తర్వాత. వారధి నిర్మాణము కొరకు రాముడు కూర్చుని యుండగా, లేక రామ రావణ యుద్ధ సమయములో భజనలు చేయలేదు. రామకార్యములో పాల్గొనెను. యుద్ధము ముగిసిన తర్వాత రాముడు సింహాసనారూఢుడైన తర్వాత రామపాదసేవ చేయుచు అప్పుడునూ వ్యక్తిగతముగాను సేవను విడనాడలేదు. సేవ చేయుచునే యుండెను. రాముడు తన శరీరమును విడిచిన తర్వాత ఆయన పాదసేవ లభించనందున ఆయన కార్యములో పాల్గొనుటకు అవకాశము లేనందున కదళీవనములోయుండి ఆయన భజన, రామనామ జపము చేసెను. అంతేకాక దత్తుడు ఎప్పుడెప్పుడు అవతరించుచున్నాడో అప్పుడప్పుడు ఆయన సేవకునిగా అవతరించెను. కృష్ణావతారములో ఆయన తన అంశతో భీమునిగా జన్మించెను.
కావున ఓ దత్తభక్తులారా! స్వామి జ్ఞానమును భక్తిని ప్రచారము చేయుటకు వచ్చినారు. మీ జపమును, తపములను, మీ నిత్య పూజలను విడనాడి స్వామి కార్యములో పాల్గొనుడు. స్వామి ఈ శరీరమును వదలి దేవగఢ్ కు వెళ్ళిన తర్వాత అప్పుడు మీ మీ పూజలు మీరు చేసుకొనవచ్చును. స్వామి కార్యార్థియై వచ్చియుండగా స్వామి కార్యమున పాల్గొనక మీ సాధనల యొక్క అవసరమేల? ఇదియే అనఘాష్టమి నాటి స్వామి సందేశము.
శ్రీ కృష్ణభగవానుడు 6 నిమిషముల పాటు కారాగారములో ఉండెను గదా. అంటే శ్రీ కృష్ణుడు కారాగారములో జన్మించి 6 నిమిషముల పాటు కారాగారములో యున్నారు గదా! దీనికి కారణము శ్రీ దత్తభగవానుడు ఇలా వచించినారు. "రామావతారములో అరణ్యవాసములో భరతుడు వచ్చి శ్రీరామునికి దశరథుని మరణవార్త విన్నవించి, రాజ్యమును స్వీకరించవలసిదిగా ప్రార్థన చేసిన సందర్భములో జాబాలిమహర్షి శ్రీరామునకు రాజ్యస్వీకారము చేయమని బోధించినాడు. అప్పుడు శ్రీరాముడు జాబాలికి జ్ఞానోదయము కల్గించటం, జాబాలి తన అజ్ఞానాన్ని తొలగించుకుని శ్రీరామునికి దాసోహమనటం జరిగినది. కాని రావణాసురుని విషయములో శ్రీరాముడు ఇట్టి జ్ఞానోపదేశము చేయలేదు. సంహరించినాడు. ఆ తర్వాత కాలభైరవులవారి సమక్షంలో రావణాసురుడు ఈ విషయమై ఫిర్యాదు చేయగా అప్పటి రామావతారము చాలించిన శ్రీదత్తుడే ముద్దాయిగా నిలబడవలసివచ్చినది. జాబాలి బ్రాహ్మణుడైతే, తానూ బ్రాహ్మణుడనే గదా, జాబాలి తపస్సంపన్నుడైతే తానూ తపస్సంపన్నుడనే గదా. కనుక జాబాలి విషయములో ఒక న్యాయము తన విషయములో మరొక న్యాయము ఉండరాదు గదా. శ్రీరాముడు జాబాలికి జ్ఞానోదయము కల్గించినట్లుగా, సకాలంలో తనకు జ్ఞానోదయం కల్గించవచ్చును గదా. అట్లు చేయక శ్రీరాముడు పక్షపాతముతో వ్యవహరించినాడను వాదనకు కాలభైరవులవారు ఏకీభవించి శ్రీదత్తునకు 6 చేతులకు సంకెలలు వేయించి 6 నిమిషములు కారాగార శిక్ష విధించినారు. ఆ శిక్షను శ్రీదత్తుడు శ్రీకృష్ణావతారములో 6 నిమిషములు కారాగారంలో ఉండి అనుభవించారు. ఇది రహస్యం అని వివరించారు.
★ ★ ★ ★ ★