30 Sep 2024
గురువు శిష్యులకు బోధించినపుడుగాని లేక అపమార్గమున ఉన్న సాధకులను సరియగు మార్గమునకు తెచ్చుటగాని చేయునపుడు వారి యొక్క మానసిక తత్త్వమును అనుసరించి బోధలను చేయవలసివచ్చును. సత్యమిది అని చెప్పినచో ఆ సత్యమును ఒక్కసారి జీర్ణించుకొనలేరు. ఒక పెద్దబండను చూపి దీనిని ఎత్తుకొనవలెను అని చెప్పినపుడు దానిని చూచి దానిని నేను ఎత్తలేనని శిష్యుడు వెనుదిరిగిపోవును. అదే బండను చిన్న చిన్న రాళ్ళుగా పగులకొట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కరాయిని ఎత్తమన్నచో శిష్యుడు ఆ పనిని సులభముగా చేయును.
ఈ పరమ నిష్ఠురసత్యము ఏమనగా పరమాత్మ ఎప్పుడును పరోక్షముగా లేడు. ఆయనకు ప్రత్యేకముగా ఒక లోకము లేదు. బ్రహ్మలోకము, విష్ణులోకము, శివలోకము అనగానే వెంటనే జీవుల యొక్క మానసికస్థితి ఏమనగా ఒక దివ్యమైన విమానమును ఎక్కి పైకి పోగా పోగా పోగా, భూమి నుండి రాకెట్‌లో చంద్రమండలమును చేరినట్లు, ఈ లోకమునకు పోవచ్చును అని తలచెదరు. అప్పుడు ఆ లోకములో దత్తుని త్రిమూర్తుల స్వరూపముతో చూడవచ్చునని తలచెదరు. ఇది సత్యమును అర్థము చేసుకొనని వారి యొక్క మానసికస్థితి. వారు ఈ భ్రమలలో ఎంత కూరుకొని పోయినారు అనగా ఎవరు చెప్పినను వినరు. విన్ననూ జీర్ణంచుకొనలేరు. కావున తిరస్కరింతురు.
ఇట్లు వారికి వారి భ్రమలను సంతృప్తి పరచుచు సత్యమును ముక్కలు చేసి ఒక ముక్కను ముందు అందించి అది జీర్ణమగువరకు కొంతకాలము ఆగి మరియొక ముక్కను మరల అందించుచు ఇట్లు క్రమముగా పూర్ణసత్యము అందించబడు చున్నది. పూర్ణసత్యమును - అందించు సమయము ఒక్కొక్కసారి కొన్ని జన్మలు పట్టవచ్చును. అనగా ఈ జీవుడు పూర్ణసత్యములోని ఇంత ముక్కను మాత్రమే జీర్ణించుకొనగలడు. కావున ఈ జన్మలో అంతకన్న ఎక్కువ బోధించరాదు. కరుణామయమైన వాత్సల్యముతో కూడిన గురుతత్త్వమిదే.
ఇప్పుడు నేను ఒక పూర్ణసత్యమును చెప్పుచున్నాను. అనగా ముక్కలు చేయకయే ఒకేసారి పెద్దబండను చూపించుచున్నాను. మీలో ఎందరు జీర్ణించుకొనగలరు. ఇది చెప్పినచో మీరందరు నన్ను 'నాస్తికుడు' అని అందురు. సరె! చెప్పుచున్నాను వినుడు. "పరమాత్మ ఎప్పుడును భూలోకములోనే నర స్వరూపములలోనే యున్నాడు".
ఆయన ఉన్న స్థలమే బ్రహ్మ, విష్ణు, శివ లోకములు. దత్తుడనగానే - మూడు ముఖముల ఆరుచేతులు గల స్వరూపమే మనకు స్ఫురించును. ఇట్టి నర స్వరూపములో దత్తుడు కనిపించినచో వెంటనే జనులు మూగి ఈ వింత స్వరూపమును చూచుటకు సర్కస్ వారు తీసుకొని పోయి టికెట్టు పెట్టి వ్యాపారము చేసుకొందురు. ఆయన ఎల్లప్పుడును భూలోకములోనే ఒకే ముఖముతో రెండు చేతులతో సంచరించుచున్నాడు. ఆ వింత రూపము లేదు కాన ఆయనను ఎవరును దత్తుడని గుర్తించరు. ఆయన యొక్క మూడు ముఖముల అర్థమేమి? ఒక వ్యక్తిని చూపి ఇతడు బహుముఖ ప్రజ్ఞావంతుడని ప్రశంసింతురు. అనగా అనేక విధములగు ప్రజ్ఞలు కలవాడు అని అర్థము. అంతేకాని అనేక ముఖములు కలవాడు అని కాదు.
త్రిముఖములు అనగా మూడు విధములగు ప్రజ్ఞలు కలవాడు అని అర్థము. అనగా 1) సృష్టిని చేయుటలో, 2) సృష్టిని పాలించుటలో, 3) సృష్టిని సంహరించుటలో సామర్థ్యము కలవాడు అని అర్థము. ఒక ముఖమునకు రెండు చేతులు లెక్క ప్రకారము, ఆరు చేతులను తగిలించినారు. ‘వాడు వెయ్యి చేతులతో యుద్ధము చేయుచున్నాడు’ అన్నప్పుడు - ఒకే సమయమున అనేకులతో యుద్ధము చేయు ప్రజ్ఞ కలిగినవానిని ఆ విధముగా అందురు. ఆరు చేతులు అనగా ఆరు విధములగు పనులు చేయువాడు అని అర్థము.
1) శంఖహస్తము: అనగా వేదార్థమును వివరించి వేదమును ప్రచారము చేయువాడు అని అర్థము.
2) చక్రపాణి యనగా: కాలమును, సృష్టిని తన అధీనములో ఉంచుకొన్నవాడని అర్థము.
3) డమరుక హస్తము అనగా: సర్వశాస్త్రములను సమన్వయించి జ్ఞానప్రచారము చేయువాడు అని అర్థము.
4) త్రిశూలపాణి అనగా: భూత, భవిష్యత్, వర్తమాన కర్మఫలప్రదాత యని అర్థము.
5) మాల హస్తమునందు ఉన్నది అనగా: మనమును ఆకర్షించి పదే పదే ఉచ్చరింపచేయు భజనలను రచించి, పాడి భక్తి ప్రచారము చేయువాడని అర్థము.
6) కమండలుపాణి అనగా: తన సంకల్పశక్తి చేత సర్వజీవుల చైతన్యములను నిలబెట్టుచున్నవాడు అని అర్థము. కమండలము అనగా జడమైన దేహము. దానిలోని జలము అనగా దేహములోనున్న జీవచైతన్యము. జీవనము అను శబ్దమునకు నీరు, ప్రాణము అను రెండు అర్థములు కలవు.
ఈ విధముగా వేదశాస్త్రముల ద్వారా జ్ఞాన ప్రచారమును, గాయత్రి అను గానాత్మకమగు పద్ధతి ద్వారా భక్తి ప్రచారమును చేయుచు, సృష్టిని, కాలమును, కర్మల యొక్క ఫలములను, జీవుల యొక్క ప్రాణములను తన గుప్పెటలో ఉంచుకున్నవాడని తాత్త్వికమైన అర్థము. అనగా యదార్థమైన అర్థము.
ఇట్లు యథార్థమును చెప్పినచో పౌరాణిక చిత్రములను, సినిమాలలో, టి.వి. లలో చూచి చూచి పౌరాణికులు చెప్పు కథలు విని విని ఆవకాయ జాడీలో ఊరిన మామిడిముక్కల వలె అణువు అణువు భ్రాంతికి చిక్కిపోయిన జీవులు ఇట్టి పరమసత్యమైన అర్థము చెప్పిన వానిని చూచి ఇంక కొంచము సేపు విన్నచో వీడు తానే దత్తుడనని చెప్పుకొను విధముగా ఉన్నాడు కావున ఈ పిచ్చివానిని వదలి పోవుదమని వెడలి పోవుదురు.
అందుకే దత్తుడు సాయి రూపమున శిరిడి వచ్చినప్పుడు కొంత కాలము వైద్యునివలె ప్రవర్తించెను. తరువాత కొంతకాలము మంచిమాటలు చెప్పు గురువువలె ప్రవర్తించెను. ఆ తర్వాత కొంత కాలము సిద్ధులు కలిగిన యోగిగా ప్రవర్తించెను. చిట్టచివరి అంత్యకాలమున అందరును క్రమక్రమముగా జీర్ణించుకొన్న తర్వాత తాను పరమాత్మగా ప్రవర్తించెను. షిరిడిలోనికి ప్రవేశించగనే తాను దత్త పరమాత్మను అని చెప్పియున్నచో అందరును పిచ్చివాడని తరిమియుండెడివారు.
పరమాత్మ ఎల్లప్పుడును భూలోకముననే మామూలు నరస్వరూపముననే ఉండి మనలోనే సంచరించుచూ ప్రత్యక్షముగా మనకు కనబడుచుండునని వేదమే ఘోషించుచున్నది. "యత్సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ" అని శ్రుతి. అనగా పరబ్రహ్మము ఎప్పుడును పరోక్షముగా లేడు. మనకు ఎల్లప్పుడు ప్రత్యక్షమగుచు నర స్వరూపములోనే ఉన్నది అని అర్థము. వేదప్రమాణమునకు ముందు స్మృతులు అనగా పురాణములు నిలువలేవు. "శ్రుతి స్మృతి విరోధే తు శ్రుతి రేవ గరీయసీ" అనగా వేదములకు, పురాణములకు విరోధము వచ్చినచో వేదమే ప్రమాణము అని శాస్త్రములే చెప్పుచున్నవి. ఇక వేదము ముందు సినిమాలు, టి.వి.లు ఎంత?
★ ★ ★ ★ ★