home
Shri Datta Swami

 04 Nov 2024

 

అత్రి–అనసూయలు ఋక్షపర్వతముపై తపస్సు చేశారు. వారికి స్వామి తన్ను తాను దత్తపుత్రుడిగా దత్తం చేసుకున్నారు. దీనిలో అంతరార్థమేమి?

[1999-09-09]

స్వామి సమాధానము: అత్రి అనగా– మూడింటిని పారద్రోలినవాడు. ఆ మూడే 1) సాత్త్వికాహంకారము: విద్య–జ్ఞానము, సద్గుణములు తనకు కలవని గర్వించుట. 2) రాజసాహంకారము: ధనము, బంధుబలము, తాను చేయు సత్కార్యముల గురించి గర్వించుట. 3) తామసాహంకారము: తన శరీరములోని శక్తిసామర్థ్యాలు, తన శరీరరూపమును గురించి గర్వించుట.

ఈ మూడును ఒకదాని కన్నా మరియొకటి బలమైనవి. ఎప్పుడు ఈ మూడు అహంకారములు తొలగిపోవునో అప్పుడు వాడు అత్రి అగును. అట్టివాని అహంకారములు పోగా, ‘అహం’ (నేను) పోయినది. ఇక వానికి ‘మమ’ (నాకు) అనునదియే ఉండదు. అట్టివాడు స్వార్థమును పోగొట్టుకొని నిర్మలుడగును. వానికి కోరికలే ఉండవు. ఇది తనను గురించిన సాధన.

అనసూయ అనగా–తన చుట్టు ఉన్నవారిని గురించిన సాధన. తన తోటిమానవులపై అసూయ చెందకుండా ఉండుటయే అనసూయ స్థితి.

Swami

ఇట్లు అత్రి–అనసూయా స్థితులు గల జీవుడు ఋక్షపర్వతము పై తపస్సు చేశాడు. ఋక్ష అనగా–భల్లూకము. అనగా భల్లూకపు పట్టువంటి నిష్ఠ. పర్వతము అనగా నిశ్చలత్వస్థితి. నిష్ఠతో గూడిన నిశ్చలస్థితియే ఋక్షపర్వతము. తపస్సు అనగా తపనతో చేయు పని.

ఈ తపస్సు మూడు విధములు 1) మానసిక తపస్సు: భగవంతుని నుండి జ్ఞానమును సంపాదించుకొనుట. 2) వాచిక తపస్సు: ఆ జ్ఞానమును ఇతర జీవులకు ప్రబోధించుట. 3) శారీరకమైన కర్మ తపస్సు: దేశసంచారమును చేయుచు జ్ఞానప్రచారకర్మను చేయుట. ఈ తపస్సే సేవా రూపమైనకర్మ.

ఇట్టి సేవ చేసినవారికి (జీవునకు) స్వామి తన్ను తాను అర్పణము చేసుకుంటారు. ఇదే దత్తత. తన్ను తాను పుత్రునిగా సమర్పణము చేసుకొనుట. పుత్రుడు అనగా సేవకుడు. అనగా తన సేవకునికి సేవకుడౌతాడు. ఇదే చరమ–పరమముక్తి.

సేవయే చరమస్థితి. ఒక కన్య వరుడి గుణగణముల జ్ఞానమును పొంది, తరువాత అతడిని పొందుటకు తపన పడును. ఈ తపనయే భక్తి. భక్తి ద్వారా స్వామిని పొందును. ఆ తరువాత ఆ భర్తను వృద్ధవయస్సు వరకును బ్రతికియున్నంత వరకును భార్యగా సేవ చేయును. ఈ సేవయే నిజమైన పరీక్ష. సేవతోనే సర్వము సమాప్తమైనది. ఈ సేవకు ముందు యోగము కావలయును. యోగము అనగా కాల శక్తులను దుర్వినియోగము చేయకుండా కాపాడుకొనుట. యోగము తరువాతనే కర్మ (సేవ). కావున జ్ఞాన–భక్తి–యోగ– కర్మ (సేవ) లే వరుసగా సోపానములు.

ఇట్టి అంతరార్థమును గ్రహించక, కేవల కథనే తీసుకొని వినోదించుట, సేవలో పాల్గొనక చేయు పూజలు, భజనలు, జపములు, యజ్ఞములు వ్యర్థములే అగును.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch