home
Shri Datta Swami

 02 Jan 2025

 

బ్రహ్మము అనగా నేమి?

Updated with Part-2 on 03 Jan 2025


Part-1   Part-2


Part-1

[16-12-2002] బ్రహ్మము అనగా చాలా గొప్పది అని అర్థము. ఈ సృష్టిలో సృష్టించబడిన పదార్థములలో అన్నింటికన్న గొప్పది చైతన్యము. ఈ చైతన్యమునే “చిత్‌”, "చిత్తము", "జీవుడు", "క్షేత్రజ్ఞుడు", "శరీరి", "దేహి", "ఆత్మ" మొదలగు శబ్దములచే పండితులు పిలచుచున్నారు. చైతన్యము అన్నింటి కన్న గొప్పది అగుటకు కారణమేమనగా జడపదార్థము చేయలేని కొన్ని పనులను చైతన్యము (awareness) చేయుచున్నది. చైతన్యము చేయు పనిని బట్టి ఆ చైతన్యమే వేరు వేరు పేరులను ధరించుచున్నది. చైతన్యము ఒక వస్తువును తెలియునప్పుడు, మరియు తెలిసిన వస్తువును గుర్తుకు తెచ్చుకున్నప్పుడు "చిత్తము" అనబడుచున్నది. "చితీ – సంజ్ఞానే, స్మరణే చ" అని శాస్త్రము. అదే చైతన్యము ఒక విషయమును సంకల్పంచి ఇది సరియా, కాదా అని ఊగులాడినపుడు "మనస్సు" అని పిలువబడుచున్నది. "సంకల్ప, వికల్పాత్మకం మనః" అని శాస్త్రము. అదే చైతన్యము ఒక విషయమును గురించి నిర్ణయము తీసుకున్నప్పుడు "బుద్ధి" అని పిలువబడుచున్నది. "బుద్ధి రధ్యవసాయాత్మికా" అని శాస్త్రము. అదే చైతన్యము "నేను నేను" అను స్ఫురణతో పని చేయునపుడు "అహంకారము" అనబడుచున్నది. చిత్తము, మనస్సు, బుద్ధి, అహంకారము అనబడు చైతన్యక్రియలే అంతఃకరణములు (internal instruments) అనబడుచున్నవి.

ఎట్లు ఒకే పరమాత్మ సృష్టి, స్థితి, లయములు అను పనులను బట్టి బ్రహ్మ, విష్ణు, శివ నామములను ధరించినాడో అట్లే ఒకే జీవుడు ఆయా పనులను బట్టి అంతఃకరణముల నామములతో పిలువబడుచున్నాడు. ఈ జీవుడు లేక చైతన్యము జడము కన్నా ఎందుకు గొప్పది? జడము స్వాతంత్ర్యము లేక చేతనములగు ప్రాణుల (living beings with awareness) అధీనములో ఉండుచున్నది. కావున, జడము గొప్పది కాదు. అట్లే ఆలోచించుట మొదలగు క్రియలను చైతన్యము చేయగలదు. కాని జడము చేయలేదు. కావున, ఈ సృష్టిలో అన్నింటికన్నను చాలా గొప్పది చైతన్యమే. కావున చైతన్యమును బ్రహ్మము అనవచ్చును. అయితే ఈ సర్వసృష్టి కన్నను సృష్టికర్త గొప్పవాడు కావున చైతన్యము కన్నను సృష్టికర్తయే అధికుడు కావున సృష్టికర్తనే బ్రహ్మము అనవలెను. కావున బ్రహ్మము అను శబ్దము నిజముగా, పరిపూర్ణముగా సృష్టికర్త యందే ప్రయోగించవలయును. కాని సృష్టికర్తను వదలివేసి కేవలము సృష్టినే అనగా సృష్టి పదార్థములనే విచారించినపుడు చైతన్యమునే బ్రహ్మము అనవలయును.

Swami

సృష్టికర్త ఇంద్రియములకు గాని, మనస్సు, బుద్ధి మొదలగు అంతఃకరణములకు గాని, తర్కమునకు గాని అందని వాడు. సృష్టికర్తను గురించి ఇప్పటివరకు దేవతలు, ఋషులు వేదశాస్త్రములను చర్చించి, చర్చించి ఆయనను గురించి తెలుసుకున్నది ఏమనగా ఆయన గురించి ఏమియు తెలుసుకొనలేము అనియే. నచికేతుడు బ్రహ్మమును గురించి బోధించమని యమధర్మరాజును అడుగగా ఆయన ఈ విధముగా చెప్పి ఆ దేవతలలో ఒకడనైన నేను మాత్రము బ్రహ్మమును గురించి ఎట్లు తెలియగలను అని తన సుదీర్ఘోపన్యాసమును ముగించినాడు. మన బుద్ధి ఆకాశతత్త్వమును అతిక్రమించలేదు. ఆకాశము అనగా శూన్యమైన ఖాళీస్థలము. ఈ ఆకాశమును పరమాత్మ సృష్టించెను అని "ఆత్మన ఆకాశ స్సంభూతః" అనే శ్రుతి చెప్పుచున్నది. ఆకాశతత్త్వమునకు లోబడిన మన బుద్ధులు ఆకాశతత్త్వమును అతిక్రమించి ఆకాశమునే సృష్టించిన పరమాత్మను ఎట్లు ఊహించగలవు? కావున సృష్టికర్త మనకు ఏ విధముగను చిక్కుటలేదు. ఇటువంటి సమయమున సృష్టికర్త చాలా గొప్పవాడు అని చెప్పుట హాస్యాస్పదమగును.

కావున మన బుద్ధికి అందు సృష్టిపదార్థములలో ఏది అత్యధికమగు గొప్పదో దానినే బ్రహ్మమనుట తప్ప వేరు గతి లేదు. కావున చైతన్యమును బ్రహ్మముగా ఆచార్యులు ముగ్గురును అంగీకరించి యున్నారు. ఎవరి బుద్ధికిని అందనిదానిని, ఏ ఆచార్యుడును బోధించలేడు. బుద్ధికి అందిన విషయములతోనే బోధించవలయును. గురువు గారు "పరమాత్మ ఉన్నాడు" అన్నారు . శిష్యుడు "పరమాత్మ అంటే ఎవరు" అని అడిగినాడు. "నాకు తెలియదు, నీకు తెలియదు" అట్టి వాడే పరమాత్మ అని గురువు చెప్పినచో, శిష్యుడు "అయితే నేను మీ నుండి వినవలసినది ఏదియు లేదు" అని లేచిపోవును. ఇది గురుసాంప్రదాయ విరుద్ధము. ఒకనికి అరుంధతి నక్షత్రమును చూపుచున్నాము. ఆ నక్షత్రము కనపడుటలేదు. అప్పుడు వశిష్ఠ నక్షత్రమును చూపి దానికి దగ్గరగా ఉన్న నక్షత్రమే అరుంధతి అని చెప్పుదురు. దీనినే ‘అరుంధతి-వశిష్ఠ న్యాయ’మందురు.

 

Part-2

అదే విధముగా పరమాత్మను గురించి బోధించవలసి వచ్చినప్పుడు పరమాత్మకు అతి దగ్గరగా పోలికలు ఉండు సృష్టిపదార్థమును చూపించి దాని వంటిదే పరమాత్మయని చెప్పవలసివచ్చును. అయితే అన్ని విషయములలోను పరమాత్మతో పోల్చదగిన వస్తువు సృష్టిలో లేనే లేదు. "న తత్సమః" అని శ్రుతి ఇదే చెప్పుచున్నది. ఒక వస్తువును మరియొక వస్తువుతో పోల్చినప్పుడు ఎక్కువగా పోలికలు (comparison) ఉండునే తప్ప అన్ని పోలికలు సమానము కావు. అన్ని పోలికలు సమానమే అయినచో ఆ వస్తువు ఆ వస్తువే అగును. చంద్రుని వంటి ముఖము అన్నాము. చంద్రుని వలె ఆహ్లాదముగ యున్నది ముఖము అని అర్థము. ఇచ్చట ఆహ్లాద గుణము నందే పోలిక గాని మిగిలిన గుణములందు పోలిక లేదు. చంద్రునకు ఉదయాస్తమయములు ఉన్నవి. కాని ముఖమునకు లేవు. చంద్రునకు శుక్లపక్ష వృద్ధి, కృష్ణపక్ష క్షీణత్వము ఉన్నవి. అవి ముఖమునకు లేవు. కావున ముఖచంద్రుడు (ముఖమే చంద్రుడు) అన్నప్పుడు ఒక్క ఆహ్లాద గుణములోనే ముఖము చంద్రునితో సమానమగుచున్నది. అట్లే చైతన్యమే బ్రహ్మము అన్నప్పుడు ఆ రెండింటిలో సమానగుణము ఏది? ఆ గుణము ఏది అనగా పరమాత్మ చిత్ర విచిత్రమైన జగత్తును సృష్టించుచున్నాడు. అట్లే చైతన్యము కూడా చిత్ర విచిత్రమగు ఊహల జగత్తును (imaginary world) సృష్టించుచున్నది.

చైతన్యమునకు అనగా చేతనుడగు మానవునకు ప్రొద్దుపోక తన కన్న రెండవ వస్తువుగాని, రెండవ వ్యక్తిగాని లేనప్పుడు ఎట్లు చిత్ర విచిత్ర ఊహలతో వినోదించునో అట్లే రెండవ వస్తువు లేని అద్వితీయమైన పరమాత్మ చిత్ర విచిత్రములైన ఊహలను సృష్టించి వినోదించెను. ఈ సమస్తలోకములు ఆయన ఊహలే. ఆయన ఊహలలోని ఒక ఊహయే ఈ జీవుడు. కావున జీవునకు ఈ లోకములు ఊహలు కావు. తన ఊహలు మాత్రమే తనకు ఊహలగును గాని పరమాత్మ ఊహలు తన ఊహలు కావు. ఏలననగా, పరమాత్మ ముందు తాను ఒక ఊహయే. అనగా తాను సృష్టిలోని భాగమే. ఈ సృష్టి రెండు భాగములగ యున్నది. ఒకటి జడము లేక ‘అపరాప్రకృతి’. రెండవది చైతన్యమగు జీవుడు లేక ‘పరాప్రకృతి’. సృష్టి యనగా ప్రకృతియే. ప్ర=శ్రేష్ఠమైన; కృతి=కార్యము అనగా పని అని అర్థము. ఈ సృష్టి పరమాత్మ చేసిన శ్రేష్ఠమైన పని కావున ‘ప్రకృతి’ అనబడుచున్నది. జీవుడు ఎట్లు వినోదార్థము ఊహాలోకమును సృష్టించుటకు సంకల్పించెనో అట్లే వినోదార్థము పరమాత్మయు ఈ జగత్తును సృష్టించుటకు సంకల్పించెను. ఇచ్చట పరమాత్మలోను, జీవుడు అనగా చైతన్యములోను ‘సంకల్పము’ అను క్రియ సమానముగా యున్నది.

ఇట్లు సంకల్పక్రియ, చిత్ర విచిత్రముగా ఊహించు సామర్థ్యము మొదలగు కొన్ని పోలికలు ఉండుట వలన చైతన్యమును పరమాత్మయనినారు. సంకల్పక్రియ, ఊహానిర్మాణ సామర్థ్యములను గురించి "స ఇదం సర్వమసృజత, తదైక్షత" ఇత్యాది శ్రుతులును; వినోదార్థము ఊహా సృష్టి గురించి "ఏకాకీ న రమతే" అను శ్రుతియు చెప్పుచున్నది. ఈ కారణముల వలనే చైతన్యమును బ్రహ్మమన్నామని "ఈక్షతే ర్నాశబ్దమ్" అను బ్రహ్మసూత్రము చెప్పుచున్నది. ఇంత మాత్రమున చైతన్యము బ్రహ్మమని భ్రమించరాదు. పోలికలు లేని అంశములు అనేకములు కలవు. చైతన్యము సర్వవ్యాపకము (all pervading) కాదు. కాని పరమాత్మ సర్వవ్యాపకుడు. చైతన్యము అనగా జీవుడు సూర్యప్రతాపమునకు భయపడి శరీరమున విలవిలలాడుచున్నాడు. కాని పరమాత్మ సూర్యుడినే శాసించుచున్నది. కావున ఇది ముఖచంద్రుని వంటి “ఉపమ” (simile) అను అలంకారమేనని గ్రహించవలెను.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch